చిన్నారులకు చిట్టి రోబోలు

ఈ బొమ్మలు చక్కగా కథలు వినిపిస్తాయి. పిల్లల సందేహాలనూ తీరుస్తాయి. వాళ్లతో సమానంగా ఆడి-పాడతాయి. ఎందుకంటే... ఇవన్నీ రోబో బొమ్మలు మరి.

Updated : 19 Mar 2023 04:18 IST

చిన్నారులకు చిట్టి రోబోలు

ఈ బొమ్మలు చక్కగా కథలు వినిపిస్తాయి. పిల్లల సందేహాలనూ తీరుస్తాయి. వాళ్లతో సమానంగా ఆడి-పాడతాయి. ఎందుకంటే... ఇవన్నీ రోబో బొమ్మలు మరి. చిన్నారుల అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆట వస్తువులు వచ్చేస్తున్న ఈ రోజుల్లో ఇప్పుడు ఈ రోబో బొమ్మలదే ట్రెండ్‌ తెలుసా...

ఇది మైకో 2.0: రజినీకాంత్‌ చేసిన రోబో, రోబో2.0 సినిమాలు గుర్తున్నాయా.... వాటిలానే రెండుమూడు రకాల్లో దొరుకుతుంది మైకో రోబో. సాధారణ మైకో రోబోలో ముందే నమోదు చేసిన పాటలూ, కథలూ, ఇతర అంశాలు (ప్రీలోడెడ్‌ అన్నమాట) మాత్రమే ఉండేవి. ఇప్పుడు దాన్ని అప్‌డేట్‌ చేస్తూ మైకో 2, 3 రకాలను తీసుకొచ్చారు తయారీదారులు. ఉదాహరణకు మైకో 2 రోబో పిల్లలకు చదువుల్లో సందేహాలను తీర్చడం నుంచీ వార్తల్ని వినిపించడం వరకూ ఎన్నో చేస్తుంది. ప్రపంచంలో అబ్బురపరిచే విషయాలను తెలియజేస్తుంది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే పాటలూ, పద్యాలూ, పొడుపుకథల్లాంటివీ వినిపిస్తుంది. చిన్నారుల మనసును అర్థంచేసుకుని అందుకు తగ్గట్టు స్పందించే ఈ మైకో 2 ద్వారా వీడియోకాల్‌ చేసి దగ్గరివారితోనూ మాట్లాడొచ్చు. నిజానికి ఇందులోనూ ప్రీలోడెడ్‌ కథలూ, ఎన్నో విషయాలూ ఉన్నా... ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంది. అదే మైకో 3లో అయితే... బోలెడన్ని ఆటలతోపాటు అదనంగా యోగా లాంటి మరెన్నో ప్రోగ్రామ్‌లనూ జతచేశారు తయారీదారులు.

రోబో ఫ్రెండ్‌: మూడు నుంచి తొమ్మిదేళ్ల పిల్లలను దృష్టిలో పెట్టుకుని తయారుచేసిన రోబోనే కేకిడ్‌. ఇది పిల్లలు ఇచ్చిన కమాండ్‌లకు తగినట్లుగా ముందుకీ, వెనక్కీ కదలడం, గిర్రున తిరగడం, పాటలు పాడటం, పిల్లలతో మాట్లాడటం... ఇలా ఎన్నో చేస్తుంది. అంతేకాదు... పిల్లలు చెప్పే విషయాలను రికార్డు కూడా చేసి తరువాత వాళ్లకే వినిపించి అబ్బురపరుస్తుంది. చిన్నారుల స్వరాన్ని గ్రహించి తదనుగుణంగా స్పందించే ఈ రోబోకు, గుడ్‌బై లేదా స్లీప్‌ అని చెప్పడం ఆలస్యం... ఆఫ్‌మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

లెక్కల టీచర్‌ ఈ రేస్‌ రోబో: చిన్నారుల స్వరాలను అనుకరించడం, లెక్కల్లో వాళ్లకున్న చిన్నచిన్న సందేహాలను తీర్చడం, కథలను వినిపించడం... వంటి ప్రత్యేకతలెన్నో టాప్‌ రేస్‌ రోబో సొంతం. పేరుకు ఇది రిమోట్‌తోనే పనిచేసినా కూడా పిల్లల మాటల్ని సెన్సర్‌ ద్వారా గ్రహించి ముందుకీ, వెనక్కీ కదలడం, ఆగమన్నప్పుడు ఆగడం... ఇలా ఎన్నో చేస్తుంది. రీఛార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ రోబోను ఒకసారి ఛార్జ్‌ చేసుకుంటే కనీసం గంటన్నర నుంచి రెండుగంటలసేపు నిర్విరామంగా వినోదాన్ని పంచుతుంది. ఇంచుమించుగా టాప్‌ రేస్‌లానే పనిచేస్తుంది సీహెచ్‌ఎస్‌ రోబో టాయ్‌. అయితే పిల్లలు ఇచ్చే కమాండ్‌ను బట్టి ఇది చీకట్లో లైట్లనూ విరజిమ్ముతుంది.

నవ్వించే టర్బోబాట్‌: చూడ్డానికి చిన్నగా, రెండు చక్రాలతో కనిపించే టర్బోబాట్‌ రోబో చిన్నారుల ఆదేశాలకు స్పందిస్తూనే వాళ్లను నవ్విస్తుంది కూడా. ఈ రోబో ప్రత్యేక సెన్సర్ల ద్వారా పిల్లల స్వరాన్ని గుర్తుపట్టి... వాళ్లు చెప్పినట్లుగా కదులుతుంది. అలా కదిలే క్రమంలో ఏదయినా అడ్డు వచ్చినా దాటుకుని ముందుకు వెళ్లిపోతుందట. ఇక, జోకులు చెప్పి నవ్వించడం, పిల్లలు చెప్పిన విషయాల్నీ, వాళ్ల సంభాషణల్నీ రికార్డు చేయడం ఈ రోబో ప్రత్యేకత.

పిల్లల కోసం పప్పీలా వచ్చింది: కుక్కపిల్లలంటే ఇష్టం ఉన్నా... పెంచుకోవడం కుదరని వాళ్లు తమ పిల్లలకు ఈ రోబో పప్పీని కానుకగా ఇస్తే సరి. ఈ మర పప్పీ రిమోట్‌ కంట్రోల్‌తోనే కాదు... పిల్లల గొంతునూ గుర్తించి చెప్పినట్లుగా చేస్తుంది. డ్యాన్స్‌లు చేయడం, అరవడం, తోక ఊపడం, నడవడం, కూర్చోవడం... ఇలా ఇంచుమించు పెంపుడు కుక్కలానే అన్నీ చేస్తుంది. రీఛార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ రోబోను ఒక్కసారి ఛార్జింగ్‌ చేసుకుంటే రెండుగంటలపాటు చెప్పినట్లుగా వింటూ... వినోదాన్ని పంచుతుంది. ఒకవేళ నిమిషం సేపు దానికి ఎలాంటి పనీ చెప్పకపోతే స్లీప్‌మోడ్‌లోకి వెళ్లిపోతుంది. పైగా దీనికి ఉన్న ప్రోగ్రామ్‌లను, కమాండ్‌లను మార్చుకోవచ్చు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోబో పప్పీ పిల్లలకు మంచి కాలక్షేపమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..