బోరిగాం... బోర్లే లేని పల్లె!

అనగనగా ఓ ఊళ్లో... కొంతకాలం కిందట ఓ రైతు తన పొలం సాగు చేసుకోవాలనుకున్నాడు. నీళ్ల కోసం ఓ బోరు వేశాడు. కానీ వెంటనే ఆ ఊరి జనమంతా వచ్చి దాన్ని మూసేశారు.

Published : 25 Mar 2023 23:23 IST

బోరిగాం... బోర్లే లేని పల్లె!

అనగనగా ఓ ఊళ్లో... కొంతకాలం కిందట ఓ రైతు తన పొలం సాగు చేసుకోవాలనుకున్నాడు. నీళ్ల కోసం ఓ బోరు వేశాడు. కానీ వెంటనే ఆ ఊరి జనమంతా వచ్చి దాన్ని మూసేశారు. ‘ఈ ప్రయత్నం మళ్లీ చేయకండి’ అంటూ కాస్త సున్నితంగా హెచ్చరించారు కూడా. ‘బోరు వేస్తే తప్పేంటీ... ఆ ఊరి ప్రజలు ఎందుకలా చేశారు?’ అంటారేమో... కానీ అది కొన్నేళ్లుగా ఆ ఊరి కట్టుబాటు మరి. బోర్లే లేని ఊరుగా పేరు తెచ్చుకున్న దాని సంగతులేమిటంటే...

కరం భూమి ఉన్న చోట కూడా బోరు వేయడం అనేది చాలా మామూలైపోయింది. ఎన్నో అడుగుల లోపలికి బోరు తవ్వినా, నీళ్లు రాకపోయినా, వాటి వల్ల భూగర్భజలాలు తగ్గిపోతాయని తెలిసినా బోర్లు వేయడం మాత్రం ఆపడం లేదు. కారణాలు ఏవైనా కానీ దాదాపు అన్ని ఊళ్లల్లో కొనసాగుతున్న పద్ధతే ఇది. కానీ తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో ఉండే బోరిగాం మాత్రం అందుకు భిన్నం. సాగుకు ఊట బావుల్నే వాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందీ పల్లె. అంతేకాదు, మామూలుగా ఆస్తి అంటే ఇల్లూ, పొలమూ మాత్రమే కానీ ఈ గ్రామంలో మాత్రం వాటితోపాటూ బావిని కూడా ఆస్తిగానే భావిస్తారు. దాదాపు 200 గడపలతో 1200 జనాభాతో ఉండే ఈ గ్రామంలో బావుల సంఖ్య ఇంచుమించు 160. చుట్టుపక్కలుండే 300 ఎకరాల భూమి సాగయ్యేది కేవలం ఈ బావుల నీటి నుంచే. అసలేంటీ ఈ బావుల ప్రత్యేకత...?

కట్టుబాటుగా అయింది...

అప్పట్లో బావుల్ని తవ్వే వ్యవసాయం చేసేవారు. కానీ తరాలు మారిన కొద్దీ కేవలం బావులే కాకుండా బోర్లు వేయడంలాంటివీ చేశారు. కొన్నాళ్లకు బోర్ల నుంచీ పంటలకు సరిపడా నీళ్లు అందకపోవడంతో ఊరి పెద్దలందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. బావులతో మాత్రమే భూగర్భజలాల్ని కాపాడుకోగలమనే ఉద్దేశంతో బోర్లు వేయడాన్ని పూర్తిగా నిషేధించుకున్నారు. దాన్నే ఊరి కట్టుబాటుగా పెట్టుకుని మూడు దశాబ్దాలుగా పాటిస్తున్నారు కూడా. వినడానికి చిన్న విషయమే కదా అనిపించినా అసలు బోర్లంటూ వేయకుండా ఒక ఊరు ఊరంతా కలిసి ముందుకు నడవడం అన్నది అంత తేలికేం కాదు. పైగా పంట చేలల్లో బోరు తవ్విస్తే రూ.లక్షలోపు ఖర్చు వస్తుంది. కానీ అదే ఈ వ్యవసాయ బావిని తవ్విస్తే దాని లోతును బట్టి దాదాపు రూ.2లక్షల నుంచి అయిదు లక్షల వరకూ ఖర్చు అవుతుందట. అయినా సరే అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకే పద్ధతిని అనుసరిస్తున్నారీ ఊరి ప్రజలు. ఒకవేళ ఎవరైనా కాదూ, కూడదూ అని బోరు వేసే ప్రయత్నం చేసినా... ఊరందరూ కలిసి అడ్డుకుంటారు. అంత నిక్కచ్చిగా ఉండబట్టే ఇన్నేళ్ల నుంచీ ఏడాది పొడవునా ఎండాకాలంలో కూడా నీటి ఇబ్బంది లేకుండా పంటలు పండిస్తున్నారు. వరి, మొక్కజొన్న, పసుపు, సోయా, కంది, కూరగాయలు... ఇలా రకరకాల పంటలు వేస్తూ లాభాలూ ఆర్జిస్తున్నారు.

డబ్బులు ఎలా?

భూగర్భజలాల్ని కాపాడుకోవడం బాగుంది కానీ అందరూ అంత ఖర్చు పెట్టలేరు కదా. అందుకే తక్కువ సాగు విస్తీర్ణం ఉన్న రైతులకు చాలా వరకూ బావులు ఉన్న ఇతర రైతులు సాయం చేస్తుంటారు. ఎప్పుడూ నీళ్లతో 150 నుంచి 200 అడుగుల లోతు ఉండే ఈ ఊట బావుల్లోంచి దూరంగా ఉన్న ప్రాంతం వరకూ పైప్‌లైన్‌ ద్వారా నీటిని చేరవేసుకుంటారు. ఎంతటి మండు వేసవిలోనైనా బావుల్లో పుష్కలంగా నీరుంటుంది కాబట్టి ఎవరికీ నీటి ఇబ్బంది రాదు. ఒకవేళ బావి తవ్వుకోవాల్సి వస్తే సొంతంగా ఖర్చు పెట్టుకోవడమో, బ్యాంకుల్లో పంట, వ్యక్తిగత రుణాల్లాంటివి తీసుకోవడమో చేస్తారు. ఊరు మొత్తానికీ తాగునీటి కోసం రెండు బోర్లూ, పది చేతిపంపులూ మాత్రమే ఉంటాయి. ఇక్కడి ప్రజలతో పాటూ ఇతరులూ కచ్చితంగా ఊరి నియమాన్ని పాటించాల్సిందే. అందుకే ప్రభుత్వం సైతం సమీపంలోని ఊట బావిలో మోటారు ఏర్పాటు చేసుకునే రెండు పడక గదుల ఇళ్లను నిర్మించింది. ఊట బావులతో నీటిని కాపాడుకుంటున్న ఈ ఊరిని శభాష్‌ అనాల్సిందే మరి!

 గుడిసె రాజేందర్‌ న్యూస్‌టుడే, లక్ష్మణచాంద


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు