ఆ సంస్కారానికి వందనం!
సూదంటురాయిలా ఆకర్షించే వ్యక్తిత్వం... ఎన్నేళ్లు గడిచినా తొలగిపోని ప్రభావం ఎన్టీఆర్‌ది. ఆయనతో సన్నిహితంగా మెలిగినవారిని పలకరిస్తే అదే మాట చెబుతారు.
సూదంటురాయిలా ఆకర్షించే వ్యక్తిత్వం... ఎన్నేళ్లు గడిచినా తొలగిపోని ప్రభావం ఎన్టీఆర్‌ది. ఆయనతో సన్నిహితంగా మెలిగినవారిని పలకరిస్తే అదే మాట చెబుతారు. తారకరాముడితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్విగ్నభరితులవుతారు. అలాంటి కొందరి జ్ఞాపకాలివి...
అలాంటి పాలకులు అరుదు
- హెచ్.జె.దొర, విశ్రాంత డీజీపీ
సాధారణంగా అధికారం చేతులు మారిన ప్రతిసారీ అధికారుల్ని కూడా ఎడాపెడా మార్చేస్తుంటారు. ఎన్టీఆర్ అందుకు పూర్తి విరుద్ధం.గత ప్రభుత్వంలో పనిచేసిన సమర్థులైన అధికారుల్ని ఉంచేవారు. నాదెండ్ల హయాంలో నాకు ఇంటెలిజెన్స్‌లో డీఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ తిరిగి పదవిలోకి వచ్చాక నన్ను ఆ పోస్టులోనే కొనసాగించారు. పైగా నాతో ఎంతో సన్నిహితంగా ఉంటూ వ్యక్తిగత విషయాలూ పంచుకునేవారు. నాకు ఐజీగా పదోన్నతి లభించినపుడు ‘అతను అవతలి పార్టీ వ్యక్తి. మీరు నమ్మకండి’ అని చాలామంది ఎన్టీఆర్‌కు పదే పదే చెప్పేవారు. ఎందుకంటే మాది కాంగ్రెస్‌కు సన్నిహితంగా మెలిగిన కుటుంబం. నాన్నగారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యేగానూ పనిచేశారు. నీలం సంజీవరెడ్డికి అనుచరుడిగానూ ఉన్నారు. మా మావయ్య ఎంపీగా చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశాలూ, కీలక నిర్ణయాలూ మా ఇంట్లోనే జరిగేవి. అలాంటిది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడి సీఎం అయిన ఎన్టీఆర్ ప్రభుత్వంలో నేను ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండడం చాలామందికి నచ్చలేదు. కానీ ఎన్టీఆర్ నా మీద పూర్తి నమ్మకం ఉంచారు. చెప్పుడు మాటలు విని అనుమానించలేదు, తప్పుపట్టలేదు, దూరం పెట్టలేదు. ఎంతటి ఉన్నత వ్యక్తిత్వం! ఎంతమంది ఉంటారు అలాంటి పాలకులు!
స్వేచ్ఛనిచ్చారు
- మోహన్ కందా, విశ్రాంత ఐఏఎస్
ఆరేళ్ల వయసులో ‘పెళ్లి చేసి చూడు’లో ఎన్టీఆర్‌తో కలిసి నటించా. సీఎం అయ్యాక దిల్లీలో పనిచేస్తున్న నన్ను పిలిచి మరీ జాయింట్ సెక్రటరీగా అవకాశమిచ్చారు. అరవై దాటినా ఆరేళ్ల పిల్లవాడి ఉత్సాహం ఆయన సొంతం. ఆయన్ని చూస్తే ఇంకా ఇంకా పని చేయాలనే ఉత్సాహం కలిగేది. ఆయన గురించి తెలియనివారు మొండిఘటమనీ, ఎవరి మాటా వినరనీ అనుకుంటారు. అది తప్పు. ఆయన అధికారులకు పూర్తిస్వేచ్ఛనిచ్చేవారు. వయసులో తనకంటే చిన్నవారైనా మంచి మాట చెబితే తప్పకుండా వినేవారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో 49 ప్రభుత్వ రంగ సంస్థల్ని 9కి కుదించాలనుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలు రాసుకున్న ఓ కాగితాన్ని నాకు ఇచ్చి దిల్లీ సభలో ఇవ్వమన్నారు. నేను ఆ పనిచేయలేదు. తిరిగి వచ్చేటప్పుడు ఆ కాగితం గుర్తొచ్చి అడిగారు. నేను కావాలనే ఇవ్వలేదు. అది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమని ఆయనకు చెప్పినప్పుడు కోపం వచ్చింది. కానీ ఆలోచించమన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అర్థం చేసుకున్నారు. అధికారుల మాటల్ని ఆయన ఆలకించి నిర్ణయాలు మార్చుకున్న సందర్భాలు ఎన్నో.
కటౌట్లు పెట్టించారు
- నోరి దత్తాత్రేయుడు, క్యాన్సర్ వైద్యులు
కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడు రామారావుగారికి వీరాభిమానిని. అప్పుడే విడుదలైన ‘లవకుశ’ రెండుమూడు షోలు చూసేవాడిని. అలా ఎన్నిరోజులు చూసినా ఆ సినిమా చూడాలనిపించేది. ఉస్మానియాలో చదువుకుంటున్నప్పుడు తొలిసారి కలిశాగానీ, ఆయనతో కలిసి ప్రయాణిస్తానని అనుకోలేదు. బసవతారకమ్మ కోరిక మేరకు క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలనుకున్న ఆయన నన్ను అందులో భాగస్వామిని చేసి శంకుస్థాపనకు ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చినపుడు దారి పొడవునా పెట్టించిన నా కటౌట్లు చూసి షాక్ అయ్యా. ఎంతోమంది చేత కటౌట్లు పెట్టించుకున్న ఆయన నాకోసం వాటిని పెట్టించడం చూస్తే నాలోని వైద్యుడికి ఆయన ఇస్తున్న గౌరవం అర్ధమైంది. మేలు చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోని ఆయన సంస్కారానికి ఆ క్షణమే తలవంచా. ఆయన వాగ్ధాటి అద్భుతంగా ఉండడమేకాదు, మాటల్లో ఏ మాత్రం కల్మషం ఉండదు. క్యాన్సర్ నిపుణుడిగా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా... నేను కాస్త డల్ అయితే మాత్రం ఎన్టీఆర్ ఉపన్యాసాలు విని రీఛార్జ్ అవుతుంటా.
ఒక్క మాట అనలేదు
- డా.జయప్రకాశ్ నారాయణ్ లోక్‌సత్తా వ్యవస్థాపకులు
నేను ప్రకాశం జిల్లా కలెక్టరుగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌గారు ఒకసారి మార్కాపురం వచ్చారు. ఓ గవర్నమెంట్ కాలేజీలో బస ఏర్పాటు చేశాం. వేసవి కావడంతో ఆయన గదిలో ఓ కూలర్ పెట్టాం. మర్నాడు ఆయన్ని కలిసి రాత్రి బాగా నిద్రపట్టిందా అని అడిగా. ‘కూలర్ సరిగా పని చేయలేదు. తేమ ఎక్కువై జిడ్డుపట్టింది. చిన్న చిన్న పురుగులు బాగా ఇబ్బంది పెట్టి నిద్రపోనివ్వలేదు. అయినా దానికేంలే, ఇక పని మొదలుపెడదాం’ అన్నారు తప్ప ఆ అసౌకర్యానికి కాస్తయినా చిరాకు పడలేదు. ఎక్కడికెళ్లినా ఆయన పని గురించే ఆలోచించేవారు, అదే మాట్లాడేవారు. అది తప్ప ఆయనకేమీ పట్టవు. రాష్ట్రంలో పర్యటించేటప్పుడు కటిక నేల మీద పడుకోవాల్సి వచ్చినా సంతోషంగా నిద్రించేవారు. అత్యున్నత హోదాలో ఉండి కూడా పరిస్థితుల్ని అర్థం చేసుకుని అంతగా సర్దుకుపోయే మనిషిని ఎక్కడా చూడలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2
-
Rahul Gandhi: రంపం పట్టిన రాహుల్.. వడ్రంగి పనివారితో చిట్‌చాట్
-
‘మార్కెట్లో సంపద సృష్టికి ఆయనే నిదర్శనం’.. వృద్ధుడి వీడియో వైరల్
-
Guntur: సోషల్ మీడియా పోస్టింగ్ కేసు.. వరప్రసాద్‌కు బెయిల్
-
Pakistan Beggars: విదేశాల్లో 90% ‘బిచ్చగాళ్లంతా’ పాకిస్థానీలే!