నటసార్వభౌముడు!

ఎన్టీఆర్‌ నటనా జీవితం గురించి చెప్పడమంటే... లక్కపిడతల చేదతో సముద్రాన్ని తోడటంలాంటిది!

Updated : 28 May 2023 10:06 IST

ఎన్టీఆర్‌ నటనా జీవితం గురించి చెప్పడమంటే... లక్కపిడతల చేదతో సముద్రాన్ని తోడటంలాంటిది! సినిమాల సంఖ్యపరంగా ఆయన్ని మించిపోయినవాళ్ళు ఉండొచ్చు... కలెక్షన్లపరంగానూ ఆయన రికార్డులను ఎవరో ఒకరు దాటొచ్చు... కానీ వీటన్నింటినీ మించి ఆయన్ని యుగపురుషుడిగా నిలిపే అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో చూద్దామా...

ద్రాసు శోభనాచల స్టూడియో అది. అక్కడో మూల షెడ్డులో ఉండేది దర్శకుడు బీఏ సుబ్బారావు ఆఫీసు. ఆ రోజు ఎవరికోసమో ఎదురుచూస్తున్నారు ఆయన. ఆ ఎదురుచూపులు ఫలించాయన్నట్టు... ప్రత్యక్షమయ్యాడా యువకుడు. తెల్లటి లాల్చీ, పంచెతో రాజసం ఉట్టిపడుతున్నట్టున్న ఆ యువకుణ్ణి చూడగానే తన అసిస్టెంట్‌తో ఆనందంగా చెప్పాడు ‘అడుగో మన హీరో!’ అని. ఆ యువకుడు నేరుగా వచ్చి ‘సుబ్బారావుగారు మీరేనాండీ! నేను మీ ఉత్తరం అందుకుని వచ్చానండీ. నన్ను ఏ టెస్టులు చేయబోతున్నారు? స్క్రీన్‌ టెస్టా, వాయిస్‌ టెస్టా? రెండూనా?’ అని అడిగాడు వినమ్రంగా. సుబ్బారావు ఆప్యాయంగా అతని చేయి పట్టుకుని ‘నాకీ పరీక్షలపైన నమ్మకం లేదు. మిమ్మల్ని చూశాను. మీరే మా హీరో’ అన్నాడు. అతనే నందమూరి తారక రామారావు. ఎంత దాచుకుందామన్నా ఆ రోజు సుబ్బారావులో ఆనందం దాగలేదు. చక్కని రూపం, అంతకన్నా మంచి కంఠం... సినిమా పరిశ్రమకి ఓ స్టార్‌ని పరిచయం చేయబోతున్న సంతోషంలో ఉన్నాడు. వెంటనే ఎన్టీఆర్‌ చేత అగ్రిమెంట్‌ మీద సంతకం చేయించాలని తహతహలాడుతున్నాడు. కానీ ఆ ఉత్సాహానికి చిన్న బ్రేకు వేశాడు ఆయన స్నేహితుడు, ప్రసిద్ధ దర్శకుడు ఎల్వీ ప్రసాద్‌.

ఇద్దరూ కొత్తవాళ్ళు కదా..!

‘చూడండి సుబ్బారావుగారూ! మీకు ఇది తొలి సినిమా. ఈ కుర్రాడా కొత్తవాడు. అతనెలా నటిస్తాడో తెలియకుండా కథానాయకుణ్ణి చేయడం పెద్ద రిస్కు. నేను తీస్తున్న ‘మన దేశం’ సినిమాలో ఓ చిన్న పోలీసు పాత్ర ఉంది. రామారావుకి ఆ పాత్ర ఇచ్చి టెస్టు చేద్దాం’ అన్నారు ఎల్వీ ప్రసాద్‌. ఇద్దరూ కలిసి ఎన్టీ రామారావుకి విషయం చెబితే ఒక్క క్షణం ఆలోచించి ‘సరే’ అన్నాడు. అందుకోసం సిద్ధమయ్యాడు...

తొలి సీన్‌ ఇది...

అదో లాఠీఛార్జ్‌ సీన్‌. స్వాతంత్య్ర పోరాటానికై దేశభక్తులు చేస్తున్న సమ్మెను చెదరగొట్టాలి. నిజంగా పోలీసు ఇన్‌స్పెక్టరేమో అన్నంత ఠీవిగా వచ్చి నిల్చున్నాడు ఎన్టీఆర్‌. చిత్రీకరణ మొదలై ఎల్వీ ప్రసాద్‌ ‘స్టార్ట్‌’ అన్నారు. లాఠీ పట్టుకున్న ఎన్టీఆర్‌... విజృంభించాడు. అది సినిమా షూటింగ్‌ అనీ, తాను అక్కడ కేవలం నటిస్తే చాలనీ మరచిపోయి పోరాటం చేస్తున్న జూనియర్‌ ఆర్టిస్టుల్ని చితకబాదసాగాడు. కాసేపటికి ఆపి ‘ఎలా చేశాను?’ అన్నట్టు డైరెక్టర్‌ వైపు చూశాడు. ఎల్వీగారు కోపంగా ‘ఇది కేవలం నటన... అలా బాదేశావేమిటీ?’ అన్నారు. ‘సారీ సర్‌! సహజంగా ఉండాలని అలా చేశా’ అన్నాడు. ఎల్వీ ప్రసాద్‌ రీటేక్‌ చెప్పారు. ఈసారి ఎల్‌వి చెప్పినట్టే ‘నటించాడు’ ఎన్టీఆర్‌! అంతకుముందు కోపంతో అరిచిన ఎల్వీ ప్రసాద్‌ ఎన్టీఆర్‌ని చూసి సంతృప్తితో తల ఊపారు. ఇదంతా చూస్తున్న ‘పల్లెటూరి పిల్ల’ దర్శకుడు సుబ్బారావు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు! ఆ షాట్‌తోనే ఎన్టీఆర్‌ అనే మహానటుడి తెరంగేట్రం ఆరంభమైంది...

పోట్ల గిత్తతో ఢీ...

1948 ఫిబ్రవరిలో ‘మనదేశం’తోపాటే ‘పల్లెటూరి పిల్ల’ కూడా ప్రారంభమైంది. అందులో ఓ సీన్‌ ఎన్టీఆర్‌లోని సాహసానికి మచ్చుతునకగా నిలిచింది. ఓ పోట్లగిత్తని ఎదుర్కొనే సన్నివేశం అది. ముందుగా డూప్‌తో చిత్రీకరించి... క్లోజప్‌ షాట్లని మాత్రం ఎన్టీఆర్‌తో తీయాలనుకున్నాడు దర్శకుడు. కానీ ఎన్టీఆర్‌ డూప్‌ అక్కర్లేదని తానే రంగంలోకి దూకాడు. గిత్త ఈ కొత్త వ్యక్తిని చూసి రెచ్చిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన దర్శకుడు సుబ్బారావు- ‘దాన్ని వదిలేసి వచ్చేయండీ...’ అని అరిచినా ఎన్టీఆర్‌ చెవిన పడలేదు. పోరాటం ఆపలేదు. ఓ దశలో గిత్త ఎన్టీఆర్‌ని ఒక్కపెట్టున పైకెత్తి కొమ్ము విసిరింది. ఆ దెబ్బకి ఎన్టీఆర్‌ దూరంగా వెళ్ళి పడ్డాడు. పడ్డపాటుకి కుడిచేయి ఎముక విరిగింది. గిత్తకొమ్ముదాడికి కుడికన్నుకింద చీరుకుపోయి రక్తం కారసాగింది. అంత గందరగోళంలోనూ ఆ పోరాట సన్నివేశాన్ని కెమెరాలో బంధించేశాడు కెమెరామన్‌.

సినిమాలొద్దు... ఊరెళ్ళిపోతా!

ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలోని ‘మనదేశం’ సినిమా 1948 ఏప్రిల్‌లో పూర్తయింది. ఎన్టీఆర్‌ నటనని చూసి సంతృప్తి పడ్డ ఎల్వీప్రసాద్‌ ‘నీకు వెంటనే సినిమాలు రాకున్నా ఫర్వాలేదు. రోజూ స్టూడియోలకెళ్లి సీనియర్‌ నటులు ఎలా నటిస్తున్నారో, డైలాగులు ఎలా చెబుతున్నారో చూస్తూ ఉండు. బీచ్‌కెళ్ళి డైలాగులు గట్టిగా చెబుతూ ఉండు. ఆ సాధన మానొద్దు’ అని చెప్పారట. దాన్ని తు.చ.తప్పకుండా పాటించసాగాడు ఎన్టీఆర్‌. కానీ- ‘మనదేశం’తోపాటూ శ్రీకారం చుట్టుకున్న ‘పల్లెటూరి పిల్ల’ సినిమా షూటింగ్‌ నత్తనడకన సాగుతుండేది. నిర్మాత సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడంతో దర్శకుడు సుబ్బారావు నానాయాతనలు పడుతూ సినిమా చిత్రీకరిస్తుండేవారు. ఎన్టీఆర్‌ చేతిలో మరో సినిమా లేదు. దాంతో- ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఓ దశలో ‘ఇక చాలు... వ్యవసాయం చేసుకుంటాను’ అనుకుని పెట్టేబేడా సర్దుకుని రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయాడు. ఆ విషయం ఎవరో దర్శకుడు సుబ్బారావుకి చెబితే ఆయన హుటాహుటిన వెళ్ళి ఎన్టీఆర్‌కి నచ్చచెప్పి తీసుకువచ్చారు. అంతేకాదు, నాటి నుంచీ తన పరిచయస్తులనీ ఎన్టీఆర్‌కి అవకాశం ఇవ్వమని అడగసాగారు. ఎన్టీఆర్‌ని చూసిన ప్రతివాళ్ళూ ఛాన్సిస్తామనేవారు కానీ... మాట నిలబెట్టుకున్నవాళ్ళు తక్కువ. అలా ఏడాదిపాటు నానా అగచాట్లూ పడ్డాకే... ‘సంసారం’ సినిమా అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే విజయ-వాహిని వాళ్ళు ‘షావుకారు’ సినిమాని ప్రారంభించారు. చక్రపాణి కథా మాటలూ. ఎల్వీ ప్రసాద్‌కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. హీరోగా ఏఎన్నార్‌ని అనుకున్నారు కానీ... ఆయన డేట్స్‌ సర్దుబాటు చేయలేకపోయాడు. దాంతో- ఆ పాత్రకి ఎల్వీ ప్రసాద్‌ ఎన్టీఆర్‌నే ఎంచుకున్నారు. ఆ చిత్రం సెట్స్‌పైన ఉండగానే విజయావాళ్ళు ఎన్టీఆర్‌తో రెండేళ్ళ కాంట్రాక్ట్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఓ స్టార్‌ పుట్టాడిలా...

ఎన్టీఆర్‌ తొలిచిత్రం ‘మనదేశం’ 1949లో విడుదలైంది. ‘జాతీయోద్యమంపైన వచ్చిన గొప్ప చిత్రం’ అన్న ప్రశంసలొచ్చాయి కానీ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ అప్పటికే రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు కాబట్టి... ఆ అపజయం ఎన్టీఆర్‌ని పెద్దగా బాధపెట్టలేదు. ‘షావుకారు’ 1950లో విడుదలైంది. అదో క్లాసిక్‌. హీరోగా ఎన్టీఆర్‌ పాత్రోచిత నటనకి వేనోళ్ళా ప్రశంసలు లభించాయి. మరో మూడువారాలకే ‘పల్లెటూరి పిల్ల’ వచ్చింది. అది పెద్ద హిట్టయ్యింది. ముఖ్యంగా అందులో ఎన్టీఆర్‌ చేసిన పోట్లగిత్త ‘రియల్‌ ఫైటింగ్‌’ ప్రేక్షకుల్ని మరీ అలరించింది. వాల్‌పోస్టర్‌లలోనూ ఆ సీన్‌ని ప్రత్యేకంగా ముద్రించి ప్రచారం చేశారు.
ఆ సమయంలోనే విజయా చక్రపాణి ప్రేక్షకుల్ని అలరించే ఓ జానపద కథని సిద్ధంచేశారు. అదే ‘పాతాళభైరవి’.
‘పాతాళభైరవి’ ముందుదాకా ఎన్టీఆర్‌ సన్నగా కొంత సుకుమారంగానే ఉండేవాడు. కానీ- ఈ సినిమాలో ఆయన తనకంటే లావూ ఎత్తూ ఉన్న ఎస్వీ రంగారావుని ఢీకొనాలి కాబట్టి శరీరం దృఢంగా మారాలి. ఇందుకోసం నాలుగు గంటలకే లేచి కర్రసాము నేర్చుకోవడం మొదలు పెట్టాడు. మల్లయుద్ధం సాధన చేశాడు. ఒళ్ళు కండలు తిరిగి ఉండేలా కసరత్తులు చేసేవాడు. అందుకు తగ్గట్టే తిండి కూడా. అలా ఏడాది కఠోర సాధనతో ఎన్టీఆర్‌ శరీరం రాటు దేలింది. ‘పాతాళభైరవి’లోని తోటరాముడి పాత్రకి సరిగ్గా సరిపోయింది. తమిళం, తెలుగుల్లో ఒకేసారి నిర్మించిన ‘పాతాళభైరవి’ 1951 మార్చి 15న విడుదలైంది. తొలి రెండువారాలు ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. మూడోవారం నుంచి జనం పోటెత్తారు. ‘ప్రేమ కోసం వలలో పడ్డ సాహస యువకుడి’గా ఎన్టీఆర్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిరుపేదవాడైన ధీశాలి తోటరాముడి పాత్రలో యువత తమను తాము చూసుకున్నారు! ఆ సినిమాతో తెలుగునాట ఓ కొత్త స్టార్‌గా అవతరించారు ఎన్టీఆర్‌.

ఆ తర్వాత విజయ-వాహిని ఆధ్వర్యంలో ‘మల్లీశ్వరి’ మొదలైంది. ఇందులో ఎన్టీఆర్‌ది నాగరాజు అనే యువశిల్పి పాత్ర. అందుకోసం శిల్పులను ప్రత్యేకంగా రప్పించి శిల్పాన్ని చెక్కేటప్పుడు వారి చేతి కదలికలను అధ్యయనం చేశారు ఎన్టీఆర్‌. ‘ఎన్టీఆర్‌ దేహం... ఓ క్లాసిక్‌ విగ్రహం! అది దైవదత్తం. దానికి తోడు పాత్రల కోసం అతను చేసే అధ్యయనం ఎన్టీఆర్‌ని గొప్ప నటుణ్ణి చేశాయి’ అంటారు మల్లీశ్వరి దర్శకుడు బీఎన్‌ రెడ్డి! సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులూ అలాగే భావించారు!

నిర్మాతగా తొలి అడుగులు...

‘చంద్రహారం’ సినిమాతోనే విజయావాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం ముగిసి... మిగతా నిర్మాతల సినిమాల్లో నటించసాగారు ఎన్టీఆర్‌. ‘రేచుక్క’ సినిమాతో ఆయన పారితోషికం రెట్టింపు... అంటే 15 వేల రూపాయలయ్యాయి. పారితోషికం పెంచి తక్కువ సినిమాల్లో నటించడంకన్నా తగ్గించి ఎక్కువ సినిమాలు చేయాలన్నది ఎన్టీఆర్‌ పాలసీ. దానికి తోడు నిర్మాతగానూ మారితే ఇంకాస్త ఎక్కువ డబ్బు వస్తుందనుకున్నారు. కానీ- అందరూ తీస్తున్న కమర్షియల్‌ చిత్రాలు కాకుండా వైవిధ్యంగా, వాస్తవికంగా ఉండే కథలు చేయాలనుకున్నారు. అలా తమ్ముడి నిర్మాణ సారథ్యాన ‘పిచ్చిపుల్లయ్య’ సినిమా తీశారు. అదెంత విలక్షణ సినిమా అయినా ప్రేక్షకులు దాన్ని ఆదరించలేదు. అయినా వెరవకుండా మరింత వైవిధ్యమైన ‘తోడు దొంగలు’ తీశారు. 35 ఏళ్ళ ఎన్టీఆర్‌ అందులో యాభైయేళ్ళ మేనేజర్‌గా చేశారు. చక్కటి సాంఘిక చిత్రంగా ఇది రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకుంది. కానీ, బాక్సాఫీసు దగ్గర బోల్తాపడింది. సొంత సినిమాలు ఫ్లాపయినా... ‘సంఘం’, ‘వద్దంటే డబ్బు’, ‘రేచుక్క’, ‘రాజూపేద’, ‘అగ్గిరాముడు’ పెద్ద హిట్టయ్యాయి. ఇందులో ‘రాజూపేద’ ఎన్టీఆర్‌కి హీరోగా జీవితాన్నిచ్చిన దర్శకుడు బీఏ సుబ్బారావుది. అందులో చివికిపోయిన బట్టలు, చింపిరి జుట్టు, బిచ్చగాడైన పోలిగాడి పాత్రలో పూర్తి డి-గ్లామరైజ్డ్‌గా కనిపించినా ప్రేక్షకులు మనసుకి హత్తుకున్నారు. ‘అగ్గిరాముడు’లో మరోసారి ఎన్టీఆర్‌ మార్క్‌ సాహసాల హీరోగా అలరించాడు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన ‘రాముడు’ పేరున్న టైటిళ్ళన్నింటికీ ఈ సినిమానే నాంది! ఈ హిట్లతోనే తన సొంత బ్యానర్‌లో జానపద చిత్రం ‘జయసింహ’ని నిర్మించి తొలి సిల్వర్‌ జూబ్లీని సాధించారు. ఆ తర్వాతి ఏడాదే ‘మిస్సమ్మ’ విడుదలై తెలుగు సినీచరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది.

కృష్ణా...ముకుందా..!

1954లో ‘ఇద్దరు పెళ్ళాలు’ అనే సినిమా వచ్చింది. అందులో జమునతో ఓ డ్రీమ్‌ సాంగ్‌ ఉంటుంది. ఆ పాటలో ఒకటిన్నర నిమిషంపాటు ఎన్టీఆర్‌ శ్రీకృష్ణునిగా కనిపిస్తారు. అప్పటిదాకా కృష్ణుడిగా ఈలపాట రఘురామయ్యని మాత్రమే చూసిన తెలుగు ప్రజలు ‘ఎబ్బే..!’ అని ఎగతాళి చేశారట. అంతకన్నా చేదు అనుభవం గాయకుడు ఘంటసాల నిర్మించిన ‘సొంతవూరు’ సినిమాలో ఎదురైంది. అందులోని ఓ అంతర్నాటకంలో కృష్ణుడి వేషంలో కనిపించారు ఎన్టీఆర్‌. ఈసారైతే ప్రేక్షకులు పిల్లికూతలు కూసి, నానా అల్లరీ చేశారట! ఈ అనుభవం కారణంగానే ‘మాయాబజార్‌’లో శ్రీకృష్ణుడి పాత్రకి వెనకడుగేశారు ఎన్టీఆర్‌. కానీ, దర్శకుడు కెవి రెడ్డి ఆయన్ని బలవంతంగా ఒప్పించారు. ఆయన సూచన మేరకు కళాదర్శకుడు గోఖలే ఎన్నో స్కెచ్‌లు వేసి...అప్పటిదాకా కృష్ణుడి పాత్రకి వాడే సగం కిరీటం స్థానంలో పెద్ద కిరీటాన్ని డిజైన్‌ చేశాడు. వస్త్రధారణనీ మార్చాడు. అప్పటికీ ఎన్టీఆర్‌కి నమ్మకం కుదరకపోవడంతో- స్క్రీన్‌ టెస్టు చేయించారు కెవి రెడ్డి. అందుకోసం పూర్తి మేకప్‌తో, ఫుల్‌ సైజు కిరీటంతో, మెడలో వైజయంతి మాలతో, చేతిలో వేణువుతో ఎన్టీఆర్‌ మేకప్‌ గది నుంచి స్టూడియో ఫ్లోర్‌కి వస్తే... అక్కడున్నవాళ్ళందరూ మంత్రముగ్ధులై చూస్తుండిపోయారట. వారి ప్రశంసలతో నిండైన ఆత్మవిశ్వాసం సంతరించుకున్న ఎన్టీఆర్‌ ‘జగన్నాటక సూత్రధారి’గా జీవించేశాడు. అప్పటిదాకా కండలు తిరిగిన శరీరంతో ఉన్న ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడి పాత్రలో కొంత సౌకుమార్యం ఉండాలని ఆ వ్యాయామాల్ని మానేశాడు. యోగాభ్యాసం చేయడం ప్రారంభించాడు. పౌరాణిక పాత్రలు చేస్తున్నన్ని రోజులూ ఆహారంలో నియమనిష్ఠలు పాటించడం, నేలపైనే నిద్రపోవడం వంటివన్నీ ‘మాయాబజార్‌’తోనే మొదలయ్యాయి. ‘మాయాబజార్‌’ సిల్వర్‌ జూబ్లీగా నిలిచాక... అదే ఏడాది ‘వినాయకచవితి’ చిత్రంలోనూ కృష్ణుడిగా కనిపించాడు. కాకపోతే, ఇందులో భిన్నమైన కృష్ణుడు. ఆ తర్వాత ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’, ‘దీపావళి’, తమిళంలో ‘కర్ణన్‌’ వంటి సినిమాల్లోనూ కృష్ణ పాత్రల్లోని వైవిధ్యాన్ని రెండు భాషల ప్రేక్షకులు ఆస్వాదించారు. ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్‌ కృష్ణుడిగా నటించడం కాదు... కృష్ణుడే ఆ పాత్ర కోసం దిగొచ్చాడని ప్రేక్షకులు నమ్మసాగారు. 1963లో ఎన్టీఆర్‌కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. ఆ అవార్డుని అందిస్తూ నాటి రాష్ట్రపతి, భారతీయ తత్వశాస్త్రంలో నిష్ణాతుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ - ‘నేను భగవద్గీత చదువుతున్నప్పుడల్లా మీ స్వరూపమే కృష్ణుడిగా నాకు కనిపిస్తుంది’ అన్నారట! ఓ నటుడికి అంతకన్నా గొప్ప ప్రశంస ఏముంటుంది!

అదొక్కటేనా...

ఎన్టీఆర్‌ శ్రీరాముడిగా ‘చరణదాసి’ సినిమాలో ఓ కల సీన్‌లో కనిపిస్తారు. దాని నిర్మాత శంకర్‌రెడ్డి... అదే పాత్రని పూర్తి నిడివిగా తీయాలనే 1959లో లవకుశ మొదలుపెట్టారు. తెరమీద ప్రేక్షకులు ఎన్టీఆర్‌ను కాక సాక్షాత్తూ శ్రీరాముడినే చూశారు. తెలుగులో కోటి రూపాయలు ఆర్జించిన తొలి సినిమా ఇదే! ఇక ‘శ్రీవేంకటేశ్వర మహత్మ్యం’లో శ్రీనివాసుడిగా ప్రభంజనమే సృష్టించారు ఎన్టీఆర్‌. ఆయన తొలిసారి రావణుడిగా ప్రతినాయక పాత్రలో మెప్పించిన ‘భూకైలాస్‌’తో కొత్త ట్రెండు మొదలైంది. ఆ నటనా వైభవం దానవీర శూరకర్ణతో తారాస్థాయికి చేరుకుంది. కర్ణ, దుర్యోధన, శ్రీకృష్ణుడి పాత్రలతో ఎన్టీఆర్‌ను సాటిలేని నటుడిగానే కాదు... దర్శకుడిగా కె.వి.రెడ్డి, బీఎన్‌రెడ్డి, ఎల్వీ ప్రసాద్‌ సరసన నిలబెట్టింది! ఇక, భారతదేశ సినీ చరిత్రలో ఎవరూ ప్రయత్నించని రీతిలో ‘భీష్మ’ పాత్రని చేశారు. 35 ఏళ్ళలోనే పండు ముసలివాడైన భీష్ముడిగా అదరహో అనిపించాడు. అవన్నీ ఒక ఎత్తు... అటు స్త్రీ లాలిత్యాన్నీ ఇటు పురుషుల కాఠిన్యాన్నీ కలగలిపిన నాట్యాచార్యునిగా అద్భుతం అనిపించిన నర్తనశాల ‘బృహన్నల’ పాత్ర ఒక్కటీ ఒకెత్తు! దేశంలో మరే సినీనటుడు సాహసించని పాత్ర అది. ఈ పౌరాణిక పాత్రల నడుమనే ‘కలిసి ఉంటే కలదు సుఖం’లో వికలాంగుడిగా, ‘శభాష్‌ రాముడి’లో రిక్షాకార్మికుడిగా, ‘రక్తసంబంధం’లో ప్రతి తెలుగమ్మాయి కోరుకునే అన్నగా, ‘గుండమ్మ కథ’లో నిక్కరుతో వచ్చే ‘అంజి’గా... చిరస్మరణీయ పాత్రల్లో ఒదిగిపోయాడు.

సరికొత్త అవతారంలో...

1957లో మాయాబజార్‌ ఘనవిజయం తర్వాత ఎన్టీఆర్‌ సినిమాలేవీ నిర్మాతకి నష్టం తేలేదని చెబుతారు. ‘ఆయన ఫ్లాప్‌ సినిమా వసూళ్ళు... ఇతర నటుల హిట్‌ సినిమాలతో సమానం’ అన్న వాదనా ఉంది. ఆయన కూడా ఒకప్పుడు రోజుకి మూడు షెడ్యూళ్ళు చేసేవాడు. కానీ- ఎంత శిఖర సమాన నటుడికైనా వయసు అన్నది ఓ పెద్ద ప్రతిబంధకం కదా! 50వ పడిలోకి వచ్చిన ఎన్టీఆర్‌కి ఆ సమస్యే ఎదురైంది. ఏడాదికి డజన్‌ సినిమాలు చేసే ఆయన మూడు సినిమాలకే పరిమితమయ్యాడు.
మరోవైపు- కృష్ణ, శోభన్‌బాబులాంటి యువనటులు కొత్తతరం ప్రేక్షకుల్ని కట్టిపడేయసాగారు. ఆ సమయంలోనే తనని తాను కొత్తగా మార్చుకోవాలనుకున్నారు ఎన్టీఆర్‌. ఆ అవసరానికి తగ్గట్టే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది ‘ఎదురులేని మనిషి’ సినిమా! అప్పటిదాకా ‘భలే తమ్ముడు’ సినిమాలో అటూఇటూ కాలు కదపడం తప్ప ప్రత్యేకంగా ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ చేయలేదు. ‘పౌరాణిక పాత్రల కారణంగా సహజంగా తన హావభావాల్లో వచ్చిన హుందాతనం... డ్యాన్సులతో పోగొట్టుకోకూడద’న్న భావన ఆయనలో ఉండేది. కానీ- తనలోని ఆ భావనని పక్కనపెట్టి ఆ చిత్రం యువదర్శక నిర్మాతల మాటకి ఆయన తలవొగ్గారు. నాటి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ తెచ్చిన జిగేల్మనే దుస్తులూ, విగ్గుల్నీ చూసి ‘అవి తనకు నప్పవ’ని వద్దన్నా దర్శక నిర్మాతలు బలవంతంగా ఒప్పించారు. తొలిసారి బెల్‌బాటమ్‌ ప్యాంటూ, బేబీ కాలర్‌ షర్ట్‌లతో స్టెప్పులేస్తే ప్రేక్షకుల ఈలలతో థియేటర్లు దద్దరిల్లి... బాక్సాఫీసు బద్దలైంది. తన యాభైయేళ్ళ వయసులో సరికొత్త ఆహార్యంతో ఎన్టీఆర్‌ ఓ ఫ్యాషన్‌ ఐకన్‌గా మారిపోయారు! ‘ఎదురులేని మనిషి’ 1976లో వచ్చింది. ఆ తర్వాతి ఏడాది ‘అడవిరాముడు’, ‘యమగోల’ వరసకట్టాయి. 1978 నాటికల్లా ఎన్టీఆర్‌ మళ్ళీ ఏడాదికి పదిపన్నెండు చిత్రాల్లో నటించసాగారు! అప్పుడే ‘వేటగాడు’ మొదలైంది. ఆ సినిమాలో హీరోయిన్‌ శ్రీదేవి. ‘బడిపంతులు’లో ఆయనకి మనవరాలిగా నటించిన అమ్మాయితో... ఎన్టీఆర్‌ అసభ్యకరంగా చిందులేస్తున్నాడంటూ చాలామంది విమర్శించారు. కానీ... అవన్నీ ఎన్టీఆర్‌ సరికొత్త ఇమేజ్‌ ముందు కొట్టుకుపోయాయి! 1980ల్లో కమర్షియల్‌ విలువలతోపాటూ సామాజిక సందేశమూ ఉండాలనుకున్నారు ఎన్టీఆర్‌. నవతరం దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావులతో కలిసి నడిచారు. ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలి పులి’ వంటి వరస హిట్లతో తెలుగు సినిమా కలెక్షన్‌ కింగ్‌ తానేనని నిరూపించుకున్నారు. ముఖ్యంగా బొబ్బిలిపులిలోని ఆ చివరి 12 నిమిషాల డైలాగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి... షూటింగ్‌ స్పాట్‌లో ఆ ఆరుపేజీల డైలాగు పేపర్లని తీసుకున్న ఎన్టీఆర్‌... ‘షూటింగ్‌ రేపు పెట్టుకోండి’ అని చెప్పి కామ్‌గా వెళ్ళిపోయారట. అలా బయల్దేరిన ఆయన నేరుగా మెరీనా బీచ్‌కి వెళ్ళి డైలాగుల్ని నేర్చుకోవడం మొదలుపెట్టారు. బాగా చీకటి పడ్డాక డైలాగ్‌ డెలివరీపైన తనకు సంతృప్తి వచ్చాకే ఇంటికెళ్ళారట. అప్పటికి సినిమాల్లో 40 ఏళ్ళ అనుభవం ఉన్నవాడు, తిరుగులేని స్టార్‌గా రాజ్యమేలుతున్నవాడు... అయితేనేం, తాను నిత్యవిద్యార్థినని నిరూపించుకున్నాడు! తన గురువు ఎల్వీ ప్రసాద్‌ మాటల్ని అప్పటికీ పాటించారు. మర్నాడు సింగిల్‌ టేక్‌లోనే ఆ డైలాగ్‌లని చెప్పారట! ఆ సినిమా మరో సంచలన విజయం సాధించింది. దానవీర శూర కర్ణ తర్వాత ఈ డైలాగులు దశాబ్దంపాటు తెలుగు నేలని కుదిపేశాయి. ఆయన రాజకీయ రంగప్రవేశానికి బాటవేశాయి.

చివరి హిట్లు...

పాలనా వ్యవహారాల్లో తలమునకలుగా ఉన్నా సినిమాలమీది మమకారాన్ని ఎన్టీఆర్‌ వదులుకోలేక పోయారు. నటన ఆయనకి కేవలం వృత్తికాదు. అది ఆయన ఊపిరి. అందుకే- సీఎంగా ఉండీ సినిమాల్లో వేషాలేంటని ఎందరు విమర్శించినా పట్టించుకోక విశ్వామిత్రుని పాత్రతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ద్విపాత్రాభినయంతో ‘సామ్రాట్‌ ఆశోక’ రూపొందించారు. ఎంతోకాలంగా తాను ఇష్టపడ్డ ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనాథుడికి సంకెళ్లు వేసే సీన్‌ కోసం తోలుతో చేసిన గొలుసులు తెస్తే అవి వద్దని అసలైనవే తెమ్మన్నారట. 70 ఏళ్ళ వయసులో మే నెల ఎండలో... చెర్నాకోల దెబ్బలు తింటూ... నడుస్తున్న సీన్‌ చేశారు! ఒళ్ళంతా కందిపోయినా లెక్కచేయలేదు!! అప్పుడే ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రంలోనూ చేశారు. తన భార్య బసవతారకం పేరుతో నిర్మిస్తున్న ఆసుపత్రి నిర్మాణం కోసమే అందులో నటించారాయన. ‘మేజర్‌ చంద్రకాంత్‌’ పెద్ద హిట్టయ్యి, ఆ నటసార్వభౌముడి కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలిచిపోయింది!


సినిమా చేస్తే హిట్టే

న్టీఆర్‌ మొత్తంగా నటించిన చిత్రాలు దాదాపు 300 అయితే.. అందులో 156 చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకోవడం విశేషం. అంటే.. ప్రతి రెండు చిత్రాలకూ ఓ సినిమాకి శతదినోత్సవం జరిగినట్లే. అలాగే కొన్ని చిత్రాలకు ద్విశత లేదా త్రిశతదినోత్సవ వేడుకలు కూడా జరిగాయి. 1950 నుంచి 1982 వరకూ 32 సంవత్సరాల్లో 24 సంవత్సరాలు ఎన్టీఆర్‌ చిత్రాలే ఆయా సంవత్సరపు అతిపెద్ద విజయాలుగా విజయపతాకాలు ఎగురవేశాయి. అంతటి అభిమానాన్ని ఆయనపైన కురిపించారు నాటి ప్రేక్షకులు. అంతెందుకు 1954లో మొత్తంగా దాదాపు ముప్ఫై చిత్రాలు విడుదల కాగా.. ఒక్క ఎన్టీఆర్‌ సినిమాలు తప్ప మరే చిత్రమూ
శతదినోత్సవానికి నోచుకోలేదంటే అప్పట్లో ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.


కుమారులతోనూ నటించి

న్టీఆర్‌ తన తనయులు బాలకృష్ణ, హరికృష్ణలతోనూ కలిసి తెరను పంచుకున్నారు. బాలకృష్ణ -ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తాతమ్మ కల, అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దానవీరశూరకర్ణ, అక్బర్‌ సలీమ్‌ అనార్కలీ, శ్రీమద్విరాటపర్వం, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం, అనురాగదేవత, సింహం నవ్వింది, శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర... సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇక, హరికృష్ణ శ్రీకృష్ణావతారంలో బాలకృష్ణుడిగా నటించి.. ఆ తరువాత తల్లాపెళ్లామా, తాతమ్మకల, దానవీరశూరకర్ణ సినిమాల్లో తండ్రితో కలిసి తెరను పంచుకోవడం విశేషం.

మళ్లీ విడుదల ఎన్టీఆర్‌ నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫరవాలేదనించినా.. అందులో కుటుంబ నియంత్రణపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో - తాననుకున్న అంశం జనానికి సరిగా చేరలేదని పత్రికాముఖంగా ప్రకటించి మరీ సినిమాను వెనక్కి తీసుకుని - కొన్ని మార్పు చేర్పులతో మళ్లీ విడుదల చేశారు. ఇలా విడుదలైన చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఇదొక్కటే. ఈ చిత్రానికి ఎన్టీఆర్‌ ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకోవడం విశేషం.


రావణ పాత్ర ఎందుకు ఇష్టం అంటే...

పౌరాణిక గాథల్లో కనిపించే అద్భుత పాత్ర రావణుడు. పుట్టుకతో రాక్షసుడు. కానీ గొప్ప శివభక్తుడు, మహా పండితుడు, అద్భుత పరాక్రమవంతుడు. ఆ శివుణ్ని ప్రసన్నం చేసుకున్న మహా తపస్వి. దశకంఠ విరచితమైన మహాన్యాసం వల్లించనిదే ఆయన అర్చన పూర్తికాదు. వాతావరణాన్నీ రుతుక్రమాన్నీ హస్తగతం చేసుకుని తన రాజ్యాన్ని సుభిక్షం చేసుకున్న స్థితప్రజ్ఞుడు.   పట్టినపట్టు విడవని కార్యసాధకుడు. ఆయనలో లేని రసం లేదు. కుండెడు పాలలో ఒక్క విషం బొట్టు పడితే పాలన్నీ విషమైనట్లు ఇన్ని సద్గుణాలు ఉన్న రావణునిలో పర స్త్రీ వ్యామోహం అన్న ఒక్క దుర్గుణమే ఆయన నాశనానికి దారితీసింది.  రావణ సంహారంకోసం ఆ శ్రీమహావిష్ణువే మానవ అవతారమెత్తాల్సి వచ్చిందంటే రావణుడెంతటి వీరుడో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ పాత్ర నన్ను ఆకర్షించింది’ అంటూ ఓ సందర్భంలో రావణ పాత్ర తనకెందుకు నచ్చిందో చెప్పుకొచ్చారు ఎన్టీఆర్‌.


మూడేళ్లు పోరాడారు

‘శ్రీమద్వివిరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’లో అయిదు పాత్రల్లో నటించిన ఘనత ఎన్టీఆర్‌ది. ఇందులో వేమన యోగిగా మారే క్రమంలో విశ్వద అనే స్త్రీ నగ్నదృశ్యాన్ని చూసే సన్నివేశం ఉంటుంది. ఈ దృశ్యాన్ని తొలగించమని సెన్సార్‌ బోర్డు అభ్యంతరం పెట్టింది. దానికి సమాధానంగా శృంగారాన్ని చూపించడం కోసమో డబ్బు కోసమో తాను ఆ సన్నివేశాన్ని చిత్రీకరించలేదనీ, అది సందర్భానికి ప్రాణంపోస్తుందనీ ఎన్టీఆర్‌ వాదించారట. సెన్సార్‌బోర్డు అర్థం చేసుకోకపోవడంతో క్షణకాలంపాటు కనిపించే ఆ సన్నివేశం కోసం మూడేళ్లు న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించారు.


ఆ రికార్డులే వేరు

న్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో 1977లో సంక్రాంతికి విడుదలైన మరో అద్భుత కళాఖండం ‘దానవీరశూరకర్ఱ’. ఇందులో కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా మూడు పౌరాణిక పాత్రలలో నటించి ప్రపంచ చలన చిత్ర రంగం దృష్టిని తనవైపు తిప్పుకున్నారు ఎన్టీఆర్‌. ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలనూ చేపట్టి కేవలం 43 పనిదినాల్లో దాన్ని పూర్తిచేసి రికార్డును సైతం సృష్టించారు. ఒక దశలో ఈ సినిమా షూటింగ్‌ 72 గంటలపాటు విరామం లేకుండా కొనసాగిందట. ఒకవైపు నిర్వహణా బాధ్యతలు, మరోవైపు మూడు పాత్రల అభినయం, ఇంకోవైపు దర్శకత్వ బాధ్యతల్లో తలమునకలవుతూనే...ఒక్కో పాత్ర మేకప్‌ను వేసుకోవడానికీ ఆ తరువాత తీయడానికీ రెండు మూడు గంటల సమయం కేటాయించడం ఆయన పట్టుదలకూ శక్తి సామర్థ్యాలకూ ఓ తార్కాణం. ఈ సినిమాకు ఖర్చు పదిలక్షల లోపు అయితే రెండు కోట్ల రూపాయల దాకా వసూలు చేసింది. అంతేకాదు, కర్ణుడి పుట్టుకను ప్రశ్నించి అవమానించిన వారి జన్మరహస్యాలను ఎండగట్టే సన్నివేశంలో ‘ఏమంటివి.. ఏమంటివీ...’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగుల ఆడియోక్యాసెట్లు సాధారణం కన్నా పదిరెట్లు ఎక్కువగా అమ్ముడుపోవడం మరో విశేషం. ఆ ఏడాదే ‘అడవిరాముడు’, ‘యమగోల’ కూడా విడుదలై ఎన్టీఆర్‌ అభిమానులను అలరించాయి. కేవలం పది నెలల కన్నా తక్కువ వ్యవధిలో కోటి రూపాయలకు పైగా కలెక్షన్‌లు సాధించిన మూడు సినిమాలు ఒకే హీరోతో ఒకే భాషలో రూపొందడం భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి.


వరుస విజయాలతో సత్తా చాటి...

రోజుల్లో కోటికిపైగా వసూలు చేసిన దాదాపు పద్నాలుగు చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన ఘనత ఎన్టీఆర్‌ది. అందులో లవకుశ, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రతో పాటు పదకొండు సాంఘిక చిత్రాలు ఉన్నాయి. శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర నిర్మాణానికి సుమారు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయితే.. విడుదలైన తరువాత ఈ సినిమా సాధించిన వసూళ్లు దాదాపు ఆరు కోట్లు అట.

* 1977 నుంచి 1982 వరకూ ఆరేళ్ల కాలంలో - ఇతర హీరోల ఏ ఒక్క చిత్రమూ ఎన్టీఆర్‌ మొదటివారం కలెక్షన్లను చేరుకోలేకపోయాయి. అడవిరాముడు దాదాపు 25 లక్షలకు పైగా వసూళ్లతో కలెక్షన్ల సునామీని సృష్టిస్తే.. వేటగాడు,యుగంధర్‌, ఛాలెంజ్‌ రాముడు, సర్కస్‌రాముడు, సూపర్‌మేన్‌, సర్దార్‌ పాపారాయుడు, గజదొంగ, కొండవీటి సింహం, బొబ్బిలిపులి, నాదేశం, రామకృష్ణులు చిత్రాలు ఆ పరంపరను కొనసాగించాయి. బొబ్బిలిపులి అయితే తొలివారమే రూ.71,60,708 వసూలు చేసి సంచలనం సృష్టించింది.

*1963, 65, 66, 67, 69లలో ఎన్టీఆర్‌ సినిమాలు ఏడాదికి పన్నెండు చొప్పున విడుదలయ్యాయి. అంటే దాదాపు నెలకు ఒక సినిమా అన్నమాట. ఇక 1964లో అయితే ఏకంగా 16 సినిమాలు పూర్తిచేశారు.

*ఒకే ఏడాదిలో (1962) నాలుగు విభిన్న కోవలకు చెందిన చిత్రాల్లో నటించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. పౌరాణికం- భీష్మ, జానపదం  - గులేబకావళికథ, చారిత్రకం -మహామంత్రి తిమ్మరుసు, సాంఘికం -రక్తసంబంధం, ఆత్మబంధువు, గుండమ్మకథ చేస్తే అన్నీ శతదినోత్సవాలు చేసుకోవడం ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమైన రికార్డు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు