జై జై గణేశా..!

విఘ్నాలను తొలగించే వినాయకుడికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నా... తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్షేత్రాలకు మాత్రం విశేషమైన గుర్తింపు ఉంది. ఒక చోట స్వామి స్వయంభువుగా కొలువుదీరితే మరోచోట సిందూరలేపనంతో దర్శనమిస్తున్నాడు.

Updated : 17 Sep 2023 07:24 IST

విఘ్నాలను తొలగించే వినాయకుడికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నా... తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్షేత్రాలకు మాత్రం విశేషమైన గుర్తింపు ఉంది. ఒక చోట స్వామి స్వయంభువుగా కొలువుదీరితే మరోచోట సిందూరలేపనంతో దర్శనమిస్తున్నాడు. ఇంకోచోట సత్య గణేశుడిగా చెక్కరూపంలో కనిపిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకుంటున్నాడు.


సంపదలిచ్చే మహా గణపతి

భక్తులను కాపాడే అభయ ప్రదాతగా, కోర్కెలను ఈడేర్చే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు సికింద్రాబాద్‌లో స్వయంభువుగా కొలువుదీరిన మహాగణపతి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కీ, మదీనా మసీదుకూ దగ్గరగా కనిపించే ఈ ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలతోపాటూ శాంతి పరిమళాల్నీ వెదజల్లడం విశేషం. ఒకప్పుడు తెల్ల దొరలతో చేసుకున్న ఒప్పందం కారణంగా నిజాం పాలకుడైన సికందర్‌ఝా ఈ ప్రాంతాన్ని బ్రిటిష్‌ సైన్యానికి అప్పగించాడట. ఆ సమయంలో సైనికుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఇక్కడ ఉన్న ఓ పురాతన దిగుడుబావికి అధికారులు మరమ్మతులు చేయిస్తున్నప్పుడు ఆ తవ్వకాల్లోనే గణేశుడి విగ్రహం బయటపడిందట. దాంతో కూలీలు ఆ విగ్రహాన్ని బావి ఒడ్డున ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆ సమయంలోనే రైల్వేస్టేషన్‌ నిర్మాణమూ మొదలవ్వడంతో వేలమంది కార్మికులు ఆ పనుల్లోకి వెళ్తూ తమకు ప్రమాదాలు జరగకుండా కాపాడమంటూ స్వామిని పూజించడాన్ని ఓ ఆనవాయితీగా పాటించేవారట. అలాగే రైల్వే పనుల్ని పర్యవేక్షించే అధికారికి స్వామి అనుగ్రహంతోనే సంతానం కలిగిందట. ఇలా గణపతి మహిమల గురించి అందరికీ తెలియడంతో అభివృద్ధి, ఆశయసిద్ధి, సద్బుద్ధి, ఉద్యోగం, వివాహం, సంతానప్రాప్తికోసం స్వామిని పూజించేవారి సంఖ్య పెరిగింది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయానికి సుమారు రెండువందల సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి మూషిక వాహనం కుబేరస్థానమైన ఉత్తరంవైపు పరుగులు తీస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే ఈ స్వామిని పూజించేవారికి ధన కనక వస్తు వాహనాలకు కొదవే ఉండదని అంటారు.


సిందూర వర్ణంలో సిద్ధి వినాయకుడు!

దక్షిణ ముఖంగా కొలువుదీరి, ప్రసన్నవదనంతో దర్శనమిస్తూ... విఘ్నాధిపతిగా పూజలు అందుకుంటున్నాడు మెదక్‌ జిల్లా రేజింతల్‌లో కొలువైన సిద్ధివినాయకుడు. తెలంగాణలో ఏర్పాటైన తొలి సిద్ధివినాయక ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలో స్వామి సిందూర లేపనాన్ని పులుముకుని చిన్న కొండ ఆకారంలో కనిపిస్తూ... దూరం నుంచి చూసేవారికి ఆంజనేయవిగ్రహాన్ని తలపించడం విశేషం. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయానికి రెండు శతాబ్దాలకు చరిత్ర ఉంది. పైగా ఒకప్పుడు వివిధ క్షేత్రాల్ని కాలి నడకన సందర్శిస్తూ వచ్చిన శివరాం పంతులు అనే యాత్రికుడు... ఇక్కడకు చేరుకున్నాక మానసిక ప్రశాంతత లభించడంతో రేజింతల్‌లోనే కొంతకాలం తపస్సు చేయాలనుకున్నాడట. అలా తపస్సు చేస్తున్నప్పుడే స్వామి తన ఉనికిని తెలియజేయడంతో ఆ భక్తుడు స్వామి విగ్రహాన్ని వెలికితీసి పూజలు చేశాడనీ అప్పటినుంచే స్వామి గురించి అందరికీ తెలిసిందనీ ప్రతీతి. ఏటా పెరిగే ఈ విగ్రహం... మొదట్లో రెండున్నర అడుగుల్లోనే ఉండేదనీ ఇప్పుడు అయిదున్నర అడుగులకు పైగా ఉందనీ అంటారు ఆలయ పూజారులు. ఇక్కడ వినాయక చవితితోపాటు, పుష్య మాసంలో స్వామి జన్మదినోత్సవాలు కన్నులపండుగ్గా ఉంటాయి. అన్నింటికీ మించి ఈ ప్రాంతవాసులు ఏ శుభకార్యాన్ని తలపెట్టినా స్వామిని పూజించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. అందుకే ఈ దేవస్థానం నిత్యం భక్తుల తాకిడితో కనిపిస్తుంది.


నిమజ్జనమెరుగని.. సత్యగణేశుడు

వినాయక నవరాత్రుల్లో లంబోదరుడిని ప్రతిష్ఠించి ఆ తర్వాత ఘనంగా వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేయడం... మామూలే. కానీ, నిర్మల్‌ జిల్లా కుభీరు మండలం నిగ్వ గ్రామ సమీపంలోని పాలజ్‌ ప్రాంతంలోని గణేశుడు మాత్రం నిమజ్జనానికి వెళ్లడు. అది 1948... పాలజ్‌లో అంటువ్యాధులు ప్రబలి 30 మందికిపైగా మరణించారు. ఆ సమయంలోనే వినాయక చవితి పండగ వచ్చింది. ఊరంతా కలిసి గ్రామంలో వినాయకుడిని ప్రతిష్ఠించాలనుకున్నారు. అలాగైనా తమ కష్టం తీరుతుందని భావించారు. నిర్మల్‌ వచ్చి కొయ్య గణపతిని కొనుగోలు చేసి గ్రామంలో ప్రతిష్ఠించారు. నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజించారు. ఆ తర్వాత అంటువ్యాధులు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో విఘ్ననాయకుడిపై బలమైన నమ్మకం కుదిరింది. స్వామివారిని నిమజ్జనం చేయకుండా ఏటా పూజలు కొనసాగించాలనుకున్నారు. అందుకే.. కర్ర వినాయకుడిని గ్రామంలో శోభాయాత్రగా ఊరేగించి చివర్లో సమీపంలోని వాగునీటిని చల్లుతారు. తర్వాత విగ్రహాన్ని వచ్చే చవితి వరకు జాగ్రత్తగా భద్రపరుస్తారు. విగ్రహం కొలువై ఉండే ప్రాంగణంలో నవరాత్రులు మినహా మిగతారోజుల్లో ఎలాంటి పూజలు, కైంకర్యాలుండవు. నవరాత్రుల్లో గ్రామమంతా పనులన్నీ మానేసి స్వామి సేవలోనే తరిస్తూ... ప్రత్యేక వినాయక దీక్షలూ చేపడతారు. సత్యగణేశునిగా పేరున్న ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.

పురస్తు సురేందర్‌, నిర్మల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..