లంబోదరుడు... భక్తవరదుడు!

గణపతి ఆలయాలు ఎక్కడ ఉన్నా తమదైన ప్రత్యేకతతో భక్తజన సందోహంతో నిత్యం అలరారుతుంటాయి. లేపాక్షిలో చవితి వినాయకుడూ నెల్లూరు నగరంలో జ్యోతిరూపుడూ, విశాఖ ముంగిట సంపత్‌ వినాయగర్‌... క్షేత్రం ఏదైనా, రూపం వేరైనా... ఆ స్వామి భక్తవరదుడే! కార్యసిద్ధిని చేకూర్చే లంబోదరుడే!

Published : 16 Sep 2023 23:50 IST

గణపతి ఆలయాలు ఎక్కడ ఉన్నా తమదైన ప్రత్యేకతతో భక్తజన సందోహంతో నిత్యం అలరారుతుంటాయి. లేపాక్షిలో చవితి వినాయకుడూ నెల్లూరు నగరంలో జ్యోతిరూపుడూ, విశాఖ ముంగిట సంపత్‌ వినాయగర్‌... క్షేత్రం ఏదైనా, రూపం వేరైనా... ఆ స్వామి భక్తవరదుడే! కార్యసిద్ధిని చేకూర్చే లంబోదరుడే!

శతాబ్దాల చరిత్ర... లేపాక్షి గణపయ్య

అద్భుతమైన శిల్పసంపదతో అలరారే అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రం రాయలనాటి కళావైభవానికే కాదు, చవితి వినాయకుడి గుడికీ పేరొందింది. ఇక్కడి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే కన్పించే నాగేంద్రుడి భారీ విగ్రహం వెనుక పెద్ద రాతిమీద చెక్కిన గజాననుడు కొలువుదీరి ఉంటాడు. కూర్మగిరి కొండలుగా పిలిచే ఈ కొండల మధ్యలో వీరభద్రస్వామి ఆలయం, శివలింగం ఎంతో కాలంగా పూజలు అందుకుంటున్నాయట. ఈ ప్రాంతం మహిమాన్వితమైనదని గుర్తించిన ఆనాటి గ్రామ కోశాధికారి విరూపణ్ణ అక్కడ ప్రత్యేకంగా ఆలయం నిర్మించాలని తలచి పెనుగొండ దుర్గాధిపతిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతరాయల్ని అనుమతి కోరాడట. ఆయన అనుమతితో వీరభద్రస్వామిని ప్రధానంగా తీసుకుని కొండచుట్టూ ఏడు ప్రాకారాల్లో ఆలయాలను నిర్మించాడట. లేపాక్షి నంది కూడా ఆ వరుసలోనిదేనని అంటారు. విఘ్నాధిపతి అనుమతి లేకుండా అంతటి మహత్కార్యం జరగదు కాబట్టి తొలుత వినాయకుని విగ్రహాన్నే నిర్మించారనీ అందుకే ఆలయ నిర్మాణం ఎలాంటి అవరోధాలూ లేకుండా పూర్తవడమే కాక, శతాబ్దాలు గడిచినా చెక్కు చెదరలేదనీ భక్తుల నమ్మకం. మహా శివరాత్రి, వినాయక చవితి రోజుల్లో ఈ స్వామి వైభోగం చూసి తీరాల్సిందే. చుట్టుపక్కల ప్రాంతాలనుంచే కాక కర్ణాటక నుంచీ కూడా భక్తులు తరలి వచ్చి గజాననుడిని దర్శించుకుంటారు. ఏళ్ల తరబడి ఎండావానల్ని తట్టుకుంటూ నిక్షేపంగా నిలిచి ఉన్న ఆ క్షేత్రం లాగే లేపాక్షి గణపతిని దర్శించుకున్నవారి జీవితాలూ పది కాలాలపాటు వర్ధిల్లుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చే సందర్శకులు కూడా మొదట గణపతిని దర్శించుకున్నాకే క్షేత్రమంతా తిరిగి చూస్తారు.


జ్యోతి స్వరూపుడు!

ఒకే ఆలయంలో ముప్ఫై మూడు రూపాల్లో గణపతిని చూడాలనుకుంటే నెల్లూరు వెళ్లాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నడిబొడ్డున ఉంటుంది దాదాపు డెబ్భై ఏళ్ల క్రితం నిర్మించిన జ్యోతి వినాయక మందిరం. ఇక్కడ మూలవిరాట్టుగా మాత్రమే కాక పార్వతీ తనయుడు మరో 32 రూపాల్లో కొలువుదీరి భక్తుల్ని చల్లగా చూస్తుంటాడు. నగర పౌరులు ఎవరింట్లో ఏ శుభకార్యమైనా దానికి స్వామి ఆశీస్సులు ఉండాల్సిందేననుకుంటారు. ఇక్కడి గర్భాలయంలో మూలవిరాట్టు జ్యోతివినాయకుడిగా పూజలందుకుంటున్నాడు. అందుకే ఈ ఆలయంలో అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూ అజ్ఞాన తిమిరాన్ని పారదోలుతుంటుంది. కొత్త వాహనం కొన్నా, కాసు బంగారం తీసుకున్నా భక్తులు ముందుగా వెళ్లి స్వామికి పూజలు చేయిస్తారు. ఇక అన్నప్రాసనతో మొదలుపెడితే పరీక్షలూ ఉద్యోగాల ఇంటర్వ్యూల వరకూ... ఏదీ జ్యోతి వినాయకుని సమక్షంలో విన్నవించుకోకుండా ముందడుగు వేయరు. సాధారణంగా బాల గణపతి నుంచి సంకటహర గణపతి వరకూ వినాయకుడి రూపాల్లో ముప్ఫై రెండిటిని విశిష్టమైనవిగా భావిస్తారు. ముఖాల సంఖ్యా, చేతుల్లో ధరించే విభిన్న ఆయుధాలూ, మొత్తంగా మూర్తి స్వరూపాలను బట్టి ఒక్కో గణపతి రూపానికీ ఒక్కో పేరుంటుంది. ఒక్కో రూపాన్నీ ఒక్కో తిథినాడు కొలవడమూ ఆనవాయితీ. బాలారిష్టాలు తీరాలంటే బాల గణపతినీ, మనశ్శాంతి లేనివాళ్లు హేరంబ గణపతినీ, అప్పుల బాధతో బాధపడేవాళ్లు రుణవిమోచన గణపతినీ... ఇలా భక్తులు తమ కోరికకు తగిన గణపతి రూపాన్ని ఎంచుకుని పూజిస్తుంటారు. జ్యోతి వినాయకుడి గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాకారంలో ఇటువంటి 32 విగ్రహాలను దర్శించుకోవచ్చు.


విశాఖ వాసుల ఆరాధ్యదైవం

విశాఖ నగరం అనగానే గుర్తొచ్చే దేవాలయాల్లో ఆశీలుమెట్టలో వెలసిన సంపత్‌ వినాయగర్‌ ఆలయం ఒకటి. ‘ఎస్‌జీ సంబంధం అండ్‌ కో’ అనే సంస్థ యజమానులు వాస్తు దోష నివారణకూ, నిత్య పూజలు చేసుకోవడానికీ 1962లో ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆ తర్వాత వారికి బాగా కలిసిరావడంతో తరచూ ఆరాధనా కార్యక్రమాలు పెద్దయెత్తున నిర్వహిస్తుండేవారట. ఐదేళ్ల తర్వాత కంచి కామకోటి పీఠానికి చెందిన పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి తన స్వహస్తాలతో గణపతి యంత్రాన్ని ఈ దేవాలయంలో ప్రతిష్ఠించారని చెబుతారు. నాటినుంచి ఈ దేవాలయ ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. ఎక్కడెక్కడినుంచో భక్తులు వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. రోజూ ఉదయం గణపతి హోమం, సాయంత్రం అభిషేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఆలయం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో ఆ తోవన వెళ్లేవారికి దేవుణ్ణి దర్శించుకోవడం అలవాటుగా మారడమే కాక పరీక్షలకు వెళ్లేవారూ, కార్యార్థులై వెళ్లేవారూ ఈ వినాయకుడిని దర్శించుకుంటే కోరిక నెరవేరుతుందన్న నమ్మకం బలపడడంతో ఆలయ సందర్శనం ఆనవాయితీగా మారింది. దాంతో విశాఖవాసుల ఆరాధ్యదైవంగా మారిపోయాడు సంపత్‌ వినాయగర్‌. ఇక, గణపతి నవరాత్రుల సందర్భంగా అయితే ఆలయం భక్తుల సందడితో కళకళలాడిపోతుంది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు