మోక్షప్రదాయకం... అష్టవినాయక దర్శనం..!
పంచారామాలూ ద్వాదశ జ్యోతిర్లింగాలూ అష్టాదశ శక్తిపీఠాల మాదిరిగానే అష్ట వినాయక క్షేత్రాలూ ఉన్నాయి. స్థలపురాణంలో వేటి ప్రత్యేకత వాటిదే. కానీ అన్నీ స్వయంభూ విగ్రహాలు కావడమే ఆ గణపతుల విశిష్టత.
పంచారామాలూ ద్వాదశ జ్యోతిర్లింగాలూ అష్టాదశ శక్తిపీఠాల మాదిరిగానే అష్ట వినాయక క్షేత్రాలూ ఉన్నాయి. స్థలపురాణంలో వేటి ప్రత్యేకత వాటిదే. కానీ అన్నీ స్వయంభూ విగ్రహాలు కావడమే ఆ గణపతుల విశిష్టత. అందుకే ఒకేయాత్రలో ఆ ఆలయాలన్నింటినీ సందర్శించుకుని మళ్లీ మొదటి క్షేత్రానికి వస్తేనే యాత్ర పరిపూర్ణమవుతుందనీ మోక్షం కలుగుతుందనీ విశ్వసిస్తారు భక్తులు. పుణె చుట్టుపక్కల ఉన్న ఆయా ఆలయాల విశేషాలు..!
మయూరేశ్వరుడు: మహారాష్ట్రలోని అష్టవినాయక యాత్రలో- పుణె జిల్లాలోని మోర్గావ్‌లో కొలువైన గణపతిని ముందుగా దర్శించాలి అంటారు. సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను హింసిస్తుంటే, మునులు దేవతలను వేడుకోగా, వినాయకుడు మయూరాసనుడై వచ్చి అతణ్ణి వధించాడట. అందుకే ఇక్కడి స్వామిని మోరేశ్వర్, మయూరేశ్వర్ అని పిలుస్తారు. బహమనీల కాలంలో నిర్మించిన ఈ ఆలయం, నాలుగు మీనార్‌లతో మసీదుని తలపిస్తుంది. అసలైన ప్రతిమ ప్రస్తుత విగ్రహానికి వెనక ఉందనీ, అప్పట్లో దాన్ని పాండవులు పూజించారనీ అంటారు.
చింతామణి గణపతి: పుణెకి 22కి.మీ. దూరంలో థేవూర్ గ్రామంలో ఉందీ ఆలయం. పూర్వం కపిల మహాముని దగ్గర భక్తుల కోరికల్ని తీర్చే చింతామణి ఉండేదట. ఓసారి ఈ ప్రాంతాన్ని పాలించే రాజు కొడుకు గుణ, ఆ మణిని అపహరిస్తాడు. అంతట ముని వినాయకుడి సాయంతో మణిని తిరిగిపొంది, కదంబ చెట్టుకింద కొలువైన గణపతి మెడలో అలంకరిస్తాడు. అప్పటి నుంచీ స్వామి చింతామణి గణపతిగా ప్రాచుర్యం చెందాడు. పేష్వాల కాలంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు.
సిద్ధివినాయకుడు: ఎనిమిది క్షేత్రాల్లో ఇక్కడ మాత్రమే కుడివైపు తొండంతో వినాయకుడు దర్శనమిస్తాడు. సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువుదీరిన ఈ లంబోదరుణ్ణి విష్ణుమూర్తే స్వయంగా ప్రతిష్ఠించాడట. ఈ ప్రాంతంలోని మధు, కైటభ అనే అసురుల సంహారంకోసం విష్ణువు వినాయకుడి సహాయం తీసుకున్నాడనీ ప్రతిగా ఆలయం నిర్మించాడన్నది స్థలపురాణం. అహ్మద్‌నగర్ జిల్లాలోని శ్రీగొండ సమీపంలో చిన్న కొండమీద ఉన్న ఈ ఆలయాన్ని తరవాత పేష్వాలు నిర్మించారు. ఇక్కడ స్వామిని కార్యసిద్ధి వినాయకుడిగా భావించి భక్తులు కొండచుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు.
మహా గణపతి: పుణెకి 50 కి.మీ. దూరంలో రంజన్‌గావ్‌లోని ఈ ఆలయంలో సిద్ధి, రిద్ధి సమేతంగా పద్మంలో వినాయకుడు దర్శనమిస్తాడు. ఈ విగ్రహానికి కింద పది తొండాలు, ఇరవై చేతులతో మహోత్కట్‌గా పిలిచే వినాయక విగ్రహం ఉందని చెబుతారు. వర ప్రభావంతో లోక కంటకుడుగా మారిన త్రిపురాసురుణ్ణి అంతమొందించేందుకు పరమశివుడు ముందు గణేశుణ్ణి పూజించాడట. ప్రతిగా ఈ ఆలయాన్ని శివుడే నిర్మించగా, తరవాత పేష్వాలు పునర్నిర్మించారట. ఇక్కడి నుంచి మళ్లీ మయూరేశ్వరుణ్ని దర్శించుకుంటే యాత్ర పూర్తయినట్లే!
గిరిజాత్మజ్ వినాయక్: లేన్యాద్రి పర్వతంమీదున్న బౌద్ధగుహల సముదాయంలో ఏకశిలాలయంలో కొలువైనవాడే ఈ గిరిజాత్మజుడు(పార్వతీ తనయుడు)... గిరిజ అంటే పార్వతి ఆత్మజ్ అంటే కొడుకు అని అర్థం. పుణెకి 90 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్లాలంటే 307 మెట్లు ఎక్కాలి. పుత్రుడికోసం దాదాపు పన్నెండేళ్లు తపస్సు చేసి, నలుగుపిండితో బాల గణపతిని చేసి, ప్రాణం పోస్తుంది పార్వతీదేవి. అందుకు గుర్తుగా ఇక్కడి ప్రతిమ రూపురేఖలు కచ్చితంగా ఉండవు. కౌమారప్రాయం వచ్చేవరకూ తల్లితో ఇక్కడే ఉన్నాడన్నది పౌరాణిక కథనం.
విఘ్నేశ్వరుడు: ఓజార్ పట్టణంలో కుకడీ నది ఒడ్డున ఉన్న ఆలయంలో రిద్ధి, సిద్ధి సమేతంగా దర్శనమిస్తాడిక్కడి గణపతి. ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుణ్ణి అంతం చేసేందుకు మునుల కోరిక మేరకు వినాయకుడు అతనితో యుద్ధంచేస్తాడు. అంతట ఆ అసురుడు స్వామితో గెలవలేక శరణు కోరతాడు. ఆపై తన పేరుమీద అక్కడే కొలువుండాలని కోరతాడు. అందుకే ఇక్కడి గణేశుణ్ణి విఘ్నహర్ వినాయక్ లేదా విఘ్నేశ్వర్‌గా పిలుస్తారు.
బల్లాలేశ్వరుడు: ఓ భక్తుడి పేరున వెలిసినవాడే పాలిలోని బల్లాలేశ్వరుడు. అయనాంతం తరవాత సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు గణేశమూర్తిపై పడేలా కట్టిన ఆలయశోభ అద్భుతమనే చెప్పాలి. పల్లిపూర్‌కి చెందిన కల్యాణ్‌సేఠ్ కొడుకైన బల్లాల్, స్నేహితులతో కలసి అడవిలోకి వెళ్లి రాతి వినాయకుణ్ణి పూజించేవాడట. రోజూ ఇంటికి ఆలస్యంగా వస్తున్న పిల్లల తల్లితండ్రులు, సేఠ్‌కి ఫిర్యాదు చేస్తారు. దాంతో అతను అడవికి వెళ్లి కోపంతో అక్కడి విగ్రహాన్ని విసిరేసి, బల్లాల్‌ను చెట్టుకి కట్టేసి కొట్టి, ఇంటికి వెళ్లిపోతాడు. అపస్మారకస్థితిలోనూ ఆ బాలుడు గణపతిని ప్రార్థించడంతో స్వామి ప్రత్యక్షమై, కట్లు విప్పి, బల్లాల్ కోరిక మేరకు అక్కడే ఉన్న రాయిలో ఐక్యమై బల్లాలేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. మొదట్లో ఉన్న చెక్క దేవాలయం స్థానంలో రాతి దేవాలయాన్ని నిర్మించారు. దీని వెనకగా ధుండి గణేశాలయం ఉంటుంది. సేఠ్ విసిరికొట్టిన విగ్రహంగా భావించి, భక్తులు ముందుగా ఆయన్నే దర్శించుకుంటారు.
వరద వినాయకుడు: పుణెకి సమీపంలోని ఖోపోలి దగ్గరలో ఉందీ ఆలయం. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన రుక్మాంగదుడనే రాజు, గ్రామంలోని వాచక్నవి అనే రుషి దర్శనంకోసం వస్తాడు. ఆ రాజును చూసి రుషిపత్ని ముకుంద మనసుపడుతుంది. రాజు తిరస్కరించి వెళ్లిపోగా, ఇంద్రుడు ఆ రాజు రూపంలో వస్తాడు. వారిద్దరి కలయికతో పుట్టినవాడే గృత్సమధుడు. పెరిగి పెద్దయ్యాక తన జన్మరహస్యం తెలుసుకుని అందరి పాపాలూ తొలగిపోయేందుకు గణపతిని ప్రార్థించగా, స్వామి స్వయంభూగా వెలసి వరద వినాయకుడుగా ప్రసిద్ధి చెందాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్