కల్పానికో గణేశుడు..!
భాద్రపద శుద్ధ చతుర్థి... శుభంకరుడైన గణపతి జన్మతిథి. అయితే గణేశుని అవతారానికి సంబంధించి అనేక గాథలు మన పురాణాల్లో ఉన్నాయి.
భాద్రపద శుద్ధ చతుర్థి... శుభంకరుడైన గణపతి జన్మతిథి. అయితే గణేశుని అవతారానికి సంబంధించి అనేక గాథలు మన పురాణాల్లో ఉన్నాయి. ఎందుకంటే, కల్పాలు మారినప్పుడల్లా గణపతి జన్మ విధానాలలో మార్పులు వస్తూ ఉంటాయి.
ఇది బ్రహ్మవైవర్త పురాణంలోని కథ. పార్వతీపరమేశ్వరులు వివాహానంతరం నర్మదానదీతీరంలో పుష్పశయ్యపై ఉన్నారు. అదే సమయంలో తారకాసురుడి ఆగడాలకు అల్లాడిపోతున్న దేవతలందరూ బ్రహ్మను శరణుకోరారు. దేవతలను వెంటబెట్టుకుని విష్ణువు దగ్గరకు వెళ్లాడు బ్రహ్మ. వారిని చూసి విష్ణుమూర్తి... ‘మనమంతా శివుడిని ప్రార్థిద్దాం. శివవీర్యం పార్వతీగర్భంలో ప్రవేశిస్తే, దేవదానవ నాశనకారకుడైన కొడుకు పుడతాడు. అదే నేలమీద పడితే కేవలం రాక్షస నాశకుడైన కుమారుడు జన్మిస్తాడు. కాబట్టి మనం ఆది దంపతుల రతిక్రీడకు భంగం కలిగిద్దాం’ అని చెప్పాడు.
అతడే విష్ణువు
విష్ణువు మాట ప్రకారం దేవతలు శివుని ప్రార్థించారు. అప్పుడు శివుడు వెంటనే దేవతల ఎదుట ప్రత్యక్షమవుతాడు. దాంతో శివ వీర్యం నేలమీద పడిపోతుంది. కాలక్రమంలో దాన్నుంచి కుమారస్వామి పుట్టాడు. తనకు పిల్లలు కలగకుండా చేసినందుకు దేవతలపై పార్వతి కోపించి... ‘భవిష్యత్తులో దేవతలకి సంతానం కలగకూడద’ని శపించింది. పిల్లలు లేరని బాధపడుతున్న పార్వతిని చూసి శివుడు ‘పుణ్యకవ్రతం’ చేయమని సలహా ఇచ్చాడు. ఆ వ్రతానికి విష్ణువు మెచ్చి అతిథిరూపంలో వచ్చి పార్వతిని భిక్ష కోరాడు. భిక్ష తీసుకొచ్చే సమయానికి అదృశ్యుడైపోయి, ఆమె పానుపు మీద ఇంతకుముందెపుడో శివుడు విడిచిన రేతస్సులోని ఒక కణం ఉంటే... దానిలోకి ప్రవేశించి బాలునిగా దర్శనమిచ్చాడు. అతడే వినాయకుడు.
శని చూపుతో...
పిల్లాడి పుట్టినరోజు పండుగను మహా వైభవంగా జరిపాడు శివుడు. దేవతలంతా ఆ బాలుని చూసి కానుకలిచ్చి పార్వతికి నమస్కరించి వెళ్లారు. ఆఖరున శనైశ్చరుడు వచ్చాడు. పార్వతీ పుత్రుడిని తలెత్తి చూడకుండా కూర్చున్నాడు. ఆయన్ని పార్వతి గమనించి ‘నా కుమారుడిని చూడవేం’ అని అడిగింది. ‘నాకో శాపం ఉంది. నేను దేన్నైనా చూస్తే... అది నాశనమైపోతుంది. చిత్రరథుడి కుమార్తె నా భార్య. ఆమెను నేను సరిగా పట్టించుకోవడం లేదని ఆమె నాకీ శాపం ఇచ్చింది. అందుకే ఆలయాల్లో కూడా నా విగ్రహానికి ఎదురుగా ఎవ్వరూ నిలబడకూడదు’ అన్నాడు. ‘ఫర్వాలేదు. చూడొచ్చు’ అంది పార్వతి. అమ్మవారిమాట కాదనలేక గణపతిని చూశాడు శని. వెంటనే గణేశుడి తల పగిలిపోయింది. పార్వతి హాహాకారం చేసింది. అప్పుడు విష్ణువు వచ్చి ‘నీ కొడుకుని బతికిస్తాను’ అని మాట ఇచ్చి, గరుడ వాహనంపై భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే... ఒకప్పుడు దూర్వాసుడు వైకుంఠం వెళ్లి విష్ణువును పూజించాడు. ఆయన ధరించిన పారిజాతమాల తీసుకుని వస్తూ దారిలో ఇంద్రుడికి కానుకగా ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని గౌరవించక ఏనుగు తలపైన ఉంచాడు. వెంటనే ఆ ఏనుగు మహా తేజస్సును పొంది ఇంద్రుణ్ని కిందికి పడేసి మాయమైపోయింది. దాంతో దూర్వాసుడు ఆగ్రహించి ‘విష్ణు ప్రసాదాన్నీ విష్ణుమూర్తినీ గౌరవించలేదు. నీ ఐశ్వర్యం నశిస్తుంది. విష్ణు నిర్మాల్యమైన ఈ దండను ఏనుగు తలపై ఉంచావు. భవిష్యత్తులో ఈ ఏనుగు తల శివపుత్రునికి శిరస్సుగా మారి లోకపూజ్యత పొందుతుంది’ అని శపించాడు.
ఆనాటి ఆ ఏనుగు తలను శ్రీ మహావిష్ణువు గరుడుని మూపుపై ఉంచి తెచ్చి పార్వతీపుత్రుని శిరస్సుగా అతికించాడు. అప్పటినుంచి గణపతి గజముఖుడయ్యాడు. ఇది పద్మకల్పంలో గణపతి అవతార కథ. కల్పాలు మారినప్పుడల్లా గణపతి జన్మ విధానాలలో మార్పులు వస్తూ ఉంటాయి.
శ్లో।। కల్ప భేదాద్గణేశస్య
జనిః ప్రోక్తా విధేపురా
శని దృష్టం శిరశ్ఛిన్నం
సంచితం గజమాననమ్.
శ్లో।। ఇదానీం శ్వేతకల్పోక్తా
గణేశోత్పత్తి రుచ్యతే
యత్రచ్ఛిన్నం శిరస్తస్య
శివేన చకృపాలునా.
కల్పభేదాల వల్ల గణపతి పుట్టుక, గజముఖుడిగా మారే విధానం మారుతూ ఉంటాయని బ్రహ్మే నారదునితో చెప్పాడు. శ్వేతకల్పంలో శివుని వల్ల తల తెగి గణపతి గజముఖుడయ్యాడని శివపురాణంలోని కుమార ఖండంలో చెబుతాడు. ఒకప్పుడు పార్వతి... ‘నా ఆజ్ఞ పాలించే ఒక సమర్థుడైన సేవకుడు ఎలా వస్తాడా’ అని ఆలోచిస్తూ శరీరాన్ని గట్టిగా నలుగు
పిండితో రుద్దుకుంది. తన శరీరం నుంచి రాలిన ఆ పిండితో బాలుడిని తయారుచేసి ప్రాణంపోసి, ద్వార రక్షకునిగా నియమించింది. అంతలో వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డగించాడు. దాంతో శివుడికి కోపం వచ్చి ఆ బాలుడి శిరస్సును ఖండించాడు. అది చూసి పార్వతి దుఃఖావేశాలకు లోనైంది. అప్పుడు శివుడు ‘ఉత్తర దిక్కుకి వెళ్లి ముందుగా కనిపించే ప్రాణి శిరస్సును నరికి తీసుకురండి’ అని దేవతలను ఆదేశించాడు. అలా ఆ బాలుడు గజముఖుడై సజీవుడై లేచాడు. త్రిమూర్తులు, దేవతలు ఆ బాలుడికి వివిధ వరాలిచ్చారు. ‘నువ్వు భాద్రపద శుక్ల చతుర్థినాడు పుట్టావు. ఆరోజు నిన్ను ఎవరు పూజించినా కార్యసిద్ధి కలుగుతుంది’ అని గణేశునికి శివుడు వరమిచ్చి అతడిని గణాధ్యక్షుడిని చేశాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
పవన్ పర్యటన నేపథ్యంలో.. అర్ధరాత్రి హడావుడిగా రహదారి పనులు!
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..