దూర్వాయుగ్మం పూజయామి..!

సుందర సుగంధ పుష్పపత్రాలెన్నో ఉన్నప్పటికీ దూర్వాంకురాలతో పూజిస్తేనే వినాయకుడు సంతుష్టి చెందుతాడనీ సకల శుభాలూ చేకూరతాయనీ చెబుతారు పండితులు.

Published : 17 Sep 2023 00:06 IST

సుందర సుగంధ పుష్పపత్రాలెన్నో ఉన్నప్పటికీ దూర్వాంకురాలతో పూజిస్తేనే వినాయకుడు సంతుష్టి చెందుతాడనీ సకల శుభాలూ చేకూరతాయనీ చెబుతారు పండితులు. ఆ గరిక లేకుండా ఎన్ని పూలూ పత్రీ పెట్టినా పూజాఫలం దక్కదు అనీ అంటారు... ఇంతకీ వినాయకుడికి ఆ గరికపోచలంటే ఎందుకంత ప్రీతి... ఇంకా గణనాయకుడికి ఇష్టమైనవేంటీ... ఆ వివరాలన్నీ గణేశ పురాణం ఆధారంగా..!

పూర్వం ఒకనాడు దేవతలంతా సభలో ఉండగా... అతిలోకసుందరి తిలోత్తమ నాట్యం చేస్తోందట. ఇంతలో ఆమె చీరచెంగు జారిపోయింది. సభలోనే ఉన్న యమధర్మరాజు ఆమె సౌందర్యానికి పరవశుడై కౌగలించుకోవాలని లేచాడు. మరుక్షణమే, అది సంస్కారం కాదని తెలుసుకుని తలవంచుకుని వెనక్కివెళ్లిపోయాడు. అయితే, అప్పటికే స్ఖలితమైన అతడి వీర్యం భూమిపై పడింది. దాన్నించి అగ్నిజ్వాలవలే మండే అనలాసురుడు పుట్టాడు. ఆ రాక్షసుడు తన వాడివేడి కోరల నోరు తెరిచి లోకాలను భక్షించాలని ఉరికాడు. దాంతో ముల్లోకాలూ వణికిపోయాయి. దేవతలందరూ విష్ణుమూర్తి శరణు కోరారు. విష్ణువు గణేశుణ్ణి ప్రార్థించమన్నాడు.
‘విఘ్నస్వరూపుడైన గణపతిదేవా నమోనమస్తే...’ అంటూ ఆర్తితో దేవతలు స్తుతించగా గణపతి ‘బాలగణపతి’గా సాక్షాత్కరించాడు. వెంటనే... అనలాసురుడు దాడిచేయడానికి రాగా బాలగణేశుడు తన మాయాబలంతో ఆ రాక్షసుణ్ని పట్టేసి మింగేశాడు. అనలాసురుణ్ణి మింగి తాపంతో ఉన్న ఆ బాలగజాననుడి తాపోపశమనానికి ఇంద్రుడు చంద్రుని కళని ఇచ్చాడు. అందుకే అప్పటినుంచి గణేశుడికి ఫాలచంద్రుడన్న పేరు వచ్చింది. విష్ణుమూర్తి పద్మాన్ని ఇచ్చాడు. అప్పటికీ తాపం శాంతించకపోవడంతో వరుణుడు చల్లని ఉదకంతో తడిపాడట. శంకరుడు శేషుడిని ఇవ్వగా దానితో బంధింపబడిన ఉదరము కలిగినవాడై ‘వ్యాళబద్ధుడ’య్యాడు. అయినా తాపోపశమనం కలగలేదు. సరిగ్గా అదే సమయంలో 8,800 మంది మునీశ్వరులు ఒక్కొక్కరూ 21 గడ్డి పోచలను భక్తితో సమర్పించారు. అప్పుడు గణేశుడి తాపం ఉపశమించింది. అది తెలుసుకున్న దేవతలు దూర్వాంకురాలతో పూజించి గజాననుణ్ణి సంతుష్టిపరిచారు.
అప్పుడు వినాయకుడు ‘నా పూజలో ముఖ్యమైనవి ఈ గడ్డిపోచలే. ఇవి లేని పూజవల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల ఒకటి లేదా 21 దూర్వాంకురాలతో పూజచేస్తే నేను సంతుష్టుణ్ణవుతాను. దీని ఫలితం నూరు యజ్ఞాలవల్లగానీ దానాదికములవల్లగానీ ఉగ్ర తపోనిష్ఠవల్లగానీ సంపాదించే పుణ్యం కన్నా ఎన్నో రెట్లు అధికం’ అని చెప్పాడు.
గణపతికి గరికతో ఉపశమనం కలిగింది అన్న విషయంలో శాస్త్రీయ దృక్కోణం కూడా దాగి ఉంది. గరికపోచలపై పల్చని సిలికా అనే పదార్థం రక్షణకవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం. అగ్నిసంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ని మింగేయడం వల్ల లంబోదరుడి ఉదరంలో ప్రజ్వరిల్లిన అగ్నిని గరికపోచలు హరించగలిగాయి. ఈ కారణం వల్లే శాస్త్రరంగంలోనూ... ఉష్ణనిరోధక పదార్థాల్ని సిలికాతో తయారుచేస్తుంటారు.

తులసి పనికిరాదు

గణపతి పూజకు తులసిని మిగతా పత్రిలో కలిపి ఉపయోగించవచ్చు. కానీ, కేవలం తులసీదళాలతో విడిగా మాత్రం పూజ చేయకూడదు. ఈ విషయం బ్రహ్మవైవర్తపురాణంలో ఉంది. ఒకప్పుడు తులసి గోలోక నివాసిని. రాధాశాపంతో శంఖచూడుడనే రాక్షసుణ్ణి వివాహమాడింది. ఈమె పతివ్రతగా ఉండగా అతన్ని ఎవరూ చంపలేరన్న కారణంతో ఓ రోజు శంఖచూడుడి వేషంలో విష్ణుమూర్తి వచ్చి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు. అప్పుడు శివుడు శంఖచూడుణ్ణి సంహరిస్తాడు. దాంతో,  ఆమె ఆగ్రహంతో విష్ణువును శిలవైపొమ్మని శపిస్తుంది. అప్పుడు విష్ణువు ఆమె శరీరం గండకీనదిగా మారుతుందనీ తాను అందులో సాలగ్రామశిలలుగా ఉంటాననీ వరమిస్తాడు. అంతేకాదు, ఆమె తలవెంట్రుకలు తులసిమొక్కలై పరమపవిత్రాలుగా ప్రసిద్ధిపొందుతాయని చెబుతాడు. ఓసారి తీర్థయాత్రలు చేస్తూ గంగాతీరంలో ఉన్న గణపతిని చూసి మోహించి, తనను పెళ్లిచేసుకోమని అడుగుతుంది. నిరాకరించడంతో శపిస్తుంది తులసి. ‘అకారణంగా నన్ను శపించావు కాబట్టి నువ్వు నా పూజకు పనికిరావు’ అని  గణపతి ఆమెకు ప్రతిశాపమిచ్చాడట.

మట్టి ప్రతిమే శ్రేష్ఠం

వినాయకుడి పూజకు కేవలం మట్టి విగ్రహాన్నే వాడాలి. గంగలోని మట్టితో విగ్రహం చేసి వినాయకచతుర్థినాడు పూజించి మర్నాడు మళ్లీ ఆ గంగలోనే కలపాలి. ఆ విధంగా సంవత్సరానికోసారి గంగాదేవిని గౌరవించుకుంటాననీ గణపతి దేవతలతో అన్నాడట. కనుక మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తేనే కార్యసిద్ధి. చవితి మర్నాడు శుక్ర లేక మంగళవారం అయితే మాత్రం రెండోరోజు కాకుండా మూడోరోజు స్వామిని నిమజ్జనం చేయాలి. గణపతికి నువ్వులతో కూడిన లడ్డూలంటే కూడా ఎంతో ఇష్టమట. ఆంజనేయుడిలాగే, విఘ్నేశ్వరుడికి కూడా సిందూరం అంటే ఇష్టం. దాంతో పూజిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరతాయని ప్రతీతి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..