గణపతి ఎవరు..? విష్ణురూపమా... శివ రూపమా...

గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభి స్సీద సాదనమ్‌...

Published : 17 Sep 2023 00:14 IST

శుక్లాంబరధరం విష్ణుం... అని చదువుతాం. అంటే గణపతి విష్ణువా... శివపుత్రుడు కాబట్టి శివస్వరూపమా... గణనాథుడు కాబట్టి గణాలకు నాయకుడా...ఇంతకీ వినాయకుడు ఎవరు?

ణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభి స్సీద సాదనమ్‌... అని గణపతిని స్తుతిస్తాం. అంటే... గణపతి ఛందో గణాలకు అధిపతి, శబ్దాలకు జ్యేష్ఠరాజు, ప్రణవ స్వరూపుడు. సృష్టికి శ్రీకారం ‘ఓం’కార రూపంలో ఉద్భవించింది. అందుకే, ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా
‘గణపత్యధర్వ శీర్షం’ వర్ణించింది. గణపతి గణాలకూ విఘ్నాలకూ అధిపతి. గణములు - అనగా అక్షరములతో ఏర్పడే ఛందస్సులకు అధిపతి కనుక గణాధిపతి అనే పేరు వచ్చింది. గణపతిని వాక్కుకి అధిపతిగా వేదాలు ‘బ్రహ్మణస్పతి’ అని స్తుతించాయి. బ్రహ్మవైవర్త మహాపురాణంలో ఓచోట ‘‘గ’ శబ్దం జ్ఞానార్థమును సూచించును. ‘ణ’ శబ్దానికి ముక్తి అని అర్థం. ఈ రెంటికీ ఈశ్వరుడైన పరబ్రహ్మ కాబట్టి అతడికి గణేశుడని పేరు వచ్చింది’’ అని చెబుతాడు శ్రీమహావిష్ణువు. యోగశాస్త్రం ప్రకారం గణపతి మూలాధారస్థితుడు. శరీరంలోని షట్చక్రాలలో అన్నింటికన్నా అడుగున ఉండేది మూలాధారమే. మనం కూర్చున్నప్పుడు భూమిపై ఆధారపడే మూలస్థానము లేక ఆసనం వద్దే ఈ మూలాధారచక్రం ఉంటుంది. గణపతి మూలాధారంలో ఉంటాడని గణపత్యధర్వశీర్షం కూడా చెబుతోంది. మూలాధారంలో కుండలినీ శక్తి యోగనిద్రలో ఉంటుంది. ఈ శక్తే మహాశక్తి లేదా మూలప్రకృతి. ఈ శక్తిని మేల్కొల్పడానికి గణపతి బీజాక్షరమొక్కటే మార్గం. అంతా బాగానే ఉందికానీ... ఇంతకీ ఈ గణపతి ఎవరు... అని చాలామందిలో ఒక సందేహం. దీన్ని నివృత్తిచేసేందుకు పురాణాల్లో అనేక ఉదాహరణలున్నాయి.

హాలాహల విఘ్నకర్త!

సృష్ట్యాదిలో జగత్‌ సృష్టికి ఏర్పడ్డ విఘ్నాలను తొలగించేందుకు బ్రహ్మ దేవుడు ధ్యాననిమగ్నుడైనప్పుడు ఆ పరబ్రహ్మ ఓంకార స్వరూపుడిగా వక్రతుండుడిగా గోచరించి విఘ్నాలను తొలగించాడట. వినాయకుడి గొప్పతనాన్ని చెప్పే కథ స్కందపురాణంలో ఉంది. అందులో దేవతలు శ్రీమహావిష్ణువు ఆధ్వర్యంలో క్షీరసాగర మథనం ప్రారంభిస్తారు. మధ్యలో హాలాహలం పుట్టి సమస్త లోకాలనూ దహించి వేస్తుంటుంది. దీనికి కారణమేంటా అని అందరూ తలలు పట్టుకుంటారు.
అప్పుడు గణపతి శివుడితో... ‘ఓ మహాదేవా... నేనే ఈ విఘ్నాన్ని కల్పించాను. ఎవరైతే నిన్నూ నన్నూ పూజించకుండా పనిని ప్రారంభిస్తారో వారికి కష్టాలే కలుగుతాయి’ అని చెప్పాడు.
ఆ తరవాత... లోమశ మహర్షి మిగతా రుషులతో ఒక విషయం చెబుతాడు. అదేంటంటే... ‘గణేశుడు సాక్షాత్తు ప్రకృతి నుంచి సంభవించిన భగవంతుడు. శివుడు ఏ రూపం కలవాడో గణేశుడూ అదే రూపం కలవాడు’ అని. అంటే శివుడికీ గణపతికీ అభేదమన్నమాట.
హాలాహలం ధాటికి తట్టుకోలేక ఆఖరికి దేవతలంతా సదాశివుణ్ణి ఆశ్రయిస్తారు. అప్పుడు శివుడు వాళ్లతో... ‘క్షీరసాగర మథనం చేయాలనుకున్న మీరు నన్ను మరిచిపోయారు. కార్యం సిద్ధించడానికి నేను గణపతిని సృష్టించాను. గణపతికీ, దుర్గకీ నమస్కరించనివారికి సమస్యలు వచ్చి తీరతాయి. పనిని మొదలుపెట్టినపుడు ఎవరైతే వినాయకుణ్ణి అర్చించరో వాళ్లకీ మీలాగే ఆ పని సిద్ధించదు’ అంటాడు. అప్పుడు దేవతలంతా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు. కానీ, అసురులు మాత్రం పూజించలేదు. అందుకే, దేవతలకే అమృతం దక్కింది.

త్రిమూర్తులతో సమానంగా...

శివమహాపురాణం పద్దెనిమిదో అధ్యాయంలో- బ్రహ్మదేవుడు ‘నేను, శివుడు, విష్ణువు ముల్లోకాల్లో ఎలా పూజింపబడుతున్నామో అలాగే అందరూ గణనాథుణ్ణి పూజిస్తారు. మాలాగే గణపతి కూడా ప్రకృతినుంచి పుట్టాడు. ముందు గణపతిని పూజించాకే మమ్మల్ని పూజించాలి’ అని చెబుతాడు. వినాయక పూజా విశిష్టతను చెప్పడానికి త్రిపురాసుర సంహార సమయంలో శివుడు ఒక లీల చేస్తాడు. త్రిపురాసుర సంహరణకు వెళ్తూ గణపతి పూజ చేయడు. అప్పుడు ఆకాశవాణి ‘జగదీశ్వరా... నువ్వు వినాయకుణ్ణి పూజించనంతవరకూ త్రిపురనాశనం జరగదు’ అని చెబుతుంది. అలా లోకానికి గణపతి విశిష్టతను శివుడు చెప్పకనే చెప్పాడు. అప్పుడు శివుడు గణపతిని ధ్యానించి త్రిపురాసుర సంహారం గావిస్తాడు.
అధర్వణవేదాంతర్గతమైన ‘గణపత్యుపనిషత్‌’ కూడా
‘...త్వం బ్రహ్మా త్వం విష్ణుః త్వం రుద్రః త్వమింద్రః త్వమగ్నిః త్వం వాయుః త్వం సూర్యః త్వం చంద్రమాః...’
అని కీర్తిస్తుంది. అంటే గణపతి... బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు, అగ్ని, వాయువు, సూర్యుడు. వినాయకుడి గాయత్రీ మంత్రంలో...
విష్ణురూపాయ విద్మహే మమతాహన్తాయ ధీమహి తన్నో విఘ్నరాజః ప్రచోదయాత్‌
అని ఉంటుంది. వ్యాపించే తత్త్వం ఉన్నవాళ్లు ఇద్దరే. ఒకరు విష్ణువు... మరొకరు వినాయకుడు. ‘విష్ణువు’ అనే పదానికి అర్థం వ్యాపించేవాడు అని. విష్ణువుతో సహా లోకంలోని అన్ని గణాలకు గణపతి అధిపతి. కాబట్టి, వాళ్లిద్దరికి అభేదం. మహాగణపతినీ, ఆ స్వామి గుణాలనూ... ఆదిశేషుడుగానీ, శంకరుడుగానీ, బ్రహ్మగానీ, సరస్వతీదేవిగానీ, వేదాలుగానీ వర్ణించలేవట. ఆఖరికి తానూ వర్ణించలేనని బ్రహ్మవైవర్తమహాపురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పాడు. గణపతి ఎవరంటే... ఎవ్వరికీ చెప్పడం సాధ్యంకాదు. గణపతి ఆదిమధ్యాంతరహితుడు. త్రిమూర్తులకూ అందనివాడు. అందుకే, గణపతి ఆరాధన అత్యంత శ్రేష్ఠం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు