గ్రీన్‌హౌస్‌కీ సౌర ఫలకాలు!

ఎండ మరీ ఎక్కువ అవసరం లేని పంటల్ని గ్లాస్‌హౌసుల్లో పండించడం తెలిసిందే. అలాగే వ్యవసాయక్షేత్రాల్లోనూ సోలార్‌ ప్యానెల్స్‌ను పెడుతున్నారు. అయితే వీటివల్ల పంటలకోసం కేటాయించే నేలభాగం కొంత తగ్గుతుంది.

Published : 25 Mar 2023 23:44 IST

గ్రీన్‌హౌస్‌కీ సౌర ఫలకాలు!

ఎండ మరీ ఎక్కువ అవసరం లేని పంటల్ని గ్లాస్‌హౌసుల్లో పండించడం తెలిసిందే. అలాగే వ్యవసాయక్షేత్రాల్లోనూ సోలార్‌ ప్యానెల్స్‌ను పెడుతున్నారు. అయితే వీటివల్ల పంటలకోసం కేటాయించే నేలభాగం కొంత తగ్గుతుంది. ఈ రెండు సమస్యలకీ పరిష్కారంగా కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు పారదర్శక సోలార్‌ షీట్లను కర్బన పదార్థంతో రూపొందించారు. అయితే కర్బన పదార్థంతో తయారయ్యే ఈ షీట్లు ఆక్సీకరణ ప్రక్రియ వల్ల త్వరగా పాడై విరిగిపోతాయి. అలా కాకుండా వీటికి ఎల్‌-గ్లుటాథియోన్‌ అనే రసాయనాన్ని పూతగా పూశారట. ఆపై వీటిని గోధుమ, పెసలు, బ్రకోలీని పెంచే గ్రీన్‌హౌసులమీద పరిచారట. మరో గ్లాస్‌ హౌస్‌కి అక్కడక్కడా సాధారణ సౌర ఫలకాలను అమర్చారట. అయితే శాస్త్రవేత్తలు ఊహించని విధంగా పారదర్శక సౌర ఫలకాలు అమర్చిన గ్లాస్‌హౌసులోనే పంట దిగుబడి మామూలు వాటికన్నా ఎక్కువగా వచ్చిందట. ఎందుకంటే కర్బన ఫలకాలమీద ఎల్‌-గ్లుటాథియోన్‌ పూత పూయడంతో అవి మొక్కలకు హాని కలిగించే యూవీ కిరణాలను అడ్డుకున్నాయనీ దాంతో మొక్కకు అవసరమైన మేర మాత్రమే ఎండ తగిలిందనీ చెబుతున్నారు. ఈ విషయాన్ని నిర్ధరించుకునేందుకు వాళ్లు అనేకసార్లు పరిశీలించగా- అవే ఫలితాలు వచ్చాయట. అంటే- గ్రీన్‌హౌసుల్లోని పంటలకైనా ఆ మాత్రం ఎండ కూడా అక్కర్లేదని తెలిసింది అంటున్నారు. కాబట్టి గాజుతో పోలిస్తే పారదర్శక సౌరఫలకాల వల్ల శక్తిని సంగ్రహించడంతోపాటు పంట దిగుబడినీ పెంచుకోవచ్చనేది శాస్త్రవేత్తల అభిప్రాయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు