ఆటిజం... మూలమేంటో తెలిసింది!

ప్రపంచంలోని ప్రతి 68 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజం సమస్యతో బాధపడుతున్నారని ఓ అంచనా.

Published : 06 Jul 2024 23:40 IST

ప్రపంచంలోని ప్రతి 68 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజం సమస్యతో బాధపడుతున్నారని ఓ అంచనా. ఎదుటివారి మాటల్నీ హావభావాల్నీ అర్థం చేసుకోకపోవడం, మేధోవికాసం లేకపోవడం, ఉద్వేగాల్ని అదుపుచేయలేక పోవడం... ఇలా అనేక సమస్యల్ని కలిపే ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌(ఏఎస్‌డీ) అంటారు. ఈ సమస్యకి కారణాలని కనుక్కోవడంపైన పలు దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నా పెద్దగా ఫలితం లేదు. చీకట్లో చిరుదీపంలా గత ఏడాది ఓ చిన్న ముందడుగు పడింది. గర్భంలో ఉన్నప్పుడు- ముఖ్యంగా తొలి త్రైమాసికంలో- ఇతర శిశువులతో పోలిస్తే వీళ్ళలో మెదడు ఎదుగుదల చాలా వేగంగా ఉన్నట్టు గుర్తించారు. దాని నిరూపణ కోసం ఇటీవల ఓ సరికొత్త పరిశోధనకు దిగారు అమెరికాలోని క్యాలిఫోర్నియా వర్సిటీ(శాండీగో) శాస్త్రవేత్తలు. ఆటిజం చిన్నారుల, మామూలు పిల్లల రక్తనమూనాలని వేర్వేరుగా సేకరించారు. వాటి నుంచి మూలకణాలు తీసి- ప్రపంచంలోనే తొలిసారి ల్యాబులో అతిచిన్న మెదళ్ళని (మినీ బ్రెయిన్స్‌ని) అభివృద్ధి చేశారు. వాటి ఎదుగుదల వేగాన్ని అంచనావేశారు. మామూలు పిల్లల రక్తనమూనాలతో పెరిగిన మెదడుకంటే, ఆటిజం పిల్లల మెదడు 40 శాతం వేగంగా ఎదగడం గమనించారు. అక్కడితో ఆగలేదు ఈ వేగానికి మూలం మన శరీరంలోని ‘ఎన్‌డెల్‌-1’ అనే జన్యువులో ఏర్పడే లోపమేననీ తేల్చారు. ఆటిజం శోధనలో ఇదో పెద్ద ముందడుగని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..