వేదవ్యాస ఆలయం... ఆధునిక గురుకులం!
చోళుల కాలంనాటి శిల్పకళా శైలి... నిరంతరం వెలిగే అఖండజ్యోతి... వేదాలూ, ఉపనిషత్తులకు సంబంధించిన గ్రంథాలయం... ఇవన్నీ ఒక్కచోట కనిపించే ఆధ్యాత్మిక ధామమే వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం. భక్తుల భాగస్వామ్యంతో నిర్మించిన ఈ జ్ఞాన మందిరంలో వేదవ్యాసుడు పూజలు అందుకుంటున్నాడు.
విశాలమైన ప్రాంగణంలో...
అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన వేదవ్యాస జ్ఞాన మందిరం యాభైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో కనిపిస్తుంది. ఆధునిక గురుకులంగా పిలిచే ఈ మందిరంలో గురువైన వేదవ్యాసుడు పూజలు అందుకుంటున్నాడు. కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహించే పల్నాడు జిల్లా అమరావతికి సమీపంలోని వైకుంఠపురం గ్రామంలో ఉందీ ఆలయం.
నిర్మాణం ఇలా...
ఒకప్పుడు ఇక్కడ ఎందరో మహర్షులు తపస్సు చేసి జ్ఞానసిద్ధిని పొందారని ప్రతీతి. అలాంటి పవిత్రమైన ఈ ప్రాంతంలో వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రాన్ని నిర్మించారు భవఘ్ని స్వామీజీ. భవఘ్ని ఒకప్పుడు చిన్నపిల్లల వైద్యుడు. తండ్రి మరణానంతరం కాశీలోని గంగానదిలో చితాభస్మం కలపడానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణాన్ని చూసి... తాను తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇంకేదో ఉందని అనుకున్నారట. ఆ అన్వేషణలో భాగంగా అనేక పుస్తకాలనూ చదివిన భవఘ్నిని షిరిడీ సాయిబాబా వాక్కులూ ఆకర్షించాయి. గీతాబోధనను తన జీవితంలో భాగం చేసుకున్న ఈ స్వామీజీ అనేక ప్రాంతాల్లో తాను తెలుసుకున్న విషయాలను చెప్పడం మొదలుపెట్టారు. ఆ తరువాత భవఘ్ని ఆరామం పేరుతో ఆశ్రమాన్ని నిర్మించుకుని...వేలమందికి గీతాసారాన్ని బోధించేవారు. అక్కడే ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు.
ఇంటింటికీ ఇటుకల్ని పంపించి...
ఈ క్షేత్ర నిర్మాణంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో వేదవ్యాస సేవాదళం పేరుతో సభ్యుల్ని సిద్ధం చేశారు. ఈ సభ్యులంతా ఇటుక సమర్చన పేరుతో ఆలయ నిర్మాణానికి అవసరమైన ఇటుకల్ని చుట్టుపక్కల గ్రామాల్లోని ఇళ్లలో ఇచ్చి అయిదురోజులపాటు పూజలు చేయించారు. ఇలా దాదాపు రెండు లక్షల ఇటుకల్ని భారతదేశంతోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, దుబాయ్, జర్మనీ, హాంకాంగ్... తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయులకు పంపించారు. ఆలయాల్లోనే కాదు మసీదులూ, చర్చిల్లోనూ వాటికి ప్రార్థనలు చేయించారు. ఎందరో మఠాధిపతుల్నీ, పీఠాధిపతుల్నీ సంప్రదించారు. అదే విధంగా గంగ, యమున, తుంగభద్ర, కృష్ణా, స్వర్ణముఖి, గోదావరి, పెన్నా, నర్మదా, కావేరి ఇలా అనేక పవిత్ర నదుల నుంచి నీటినీ, ఇసుకనూ ఆలయ నిర్మాణంలో ఉపయోగించడం విశేషం.
ధ్యానమందిరం, గ్రంథాలయం...
వేదవ్యాసుడు కొలువైన ఈ మందిరంలో దాదాపు నాలుగు వందలమంది భక్తులు కూర్చుని వేదమహర్షికి చేసే పూజల్ని చూడొచ్చు. ఆధ్యాత్మిక ప్రసంగాలకీ, ధ్యానం చేసేందుకూ ప్రత్యేక ఆడిటోరియం ఉంటుంది. మందిరంలోని సెల్లార్‌లో వేదవ్యాసుల జీవితగాథను వర్ణించే చిత్రాలతోపాటూ... జీవితగాథనూ, సత్సంగాలనూ అన్ని భాషలలో వీక్షించేలా ఆడియో విజువల్ గది కూడా ఉంటుంది. ఇక, వేదవ్యాసుడు వర్గీకరించిన వేదాలూ, ఉపనిషత్తులూ... ఇతర అష్టాదశపురాణాలకు సంబంధించిన గ్రంథాలన్నింటినీ ఇక్కడున్న గ్రంథాలయంలో చదువుకోవచ్చు. అఖండజ్యోతి నిరంతరం వెలిగే ఈ మందిర విమానగోపురం 90 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ వేదవ్యాసుడిని దర్శించుకోవడమే కాకుండా గీతాపఠనం, గీతా సాధనలో వచ్చే సందేహాలనూ భవఘ్ని మహర్షిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు.
వేదవ్యాస ఆలయం... ఆధునిక గురుకులం!
సెలవుల్లో పిల్లలకోసం సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని అందించేలా ‘సంప్రదాన్’ (జ్ఞానాన్ని అందించడం) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్నీ ఏర్పాటుచేయనున్నారు. అలాగే వ్యాస యువసేన పేరుతో దేశవిదేశాల్లోని యువత కోసం ప్రతి శనివారం వీడియోకాల్ ద్వారా సత్సంగ కార్యక్రమాన్నీ నిర్వహిస్తారు స్వామీజీ. ఇన్ని సేవలతో ఏర్పాటుచేసిన ఈ మందిరంలో ఫిబ్రవరి ఒకటిన వేదవ్యాసుల విగ్రహ, కలశ ప్రతిష్ఠ చేయనున్నారు. అంతకన్నా ముందుగా జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకూ మహా కుంభాభిషేక మహోత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా.
ఇలా చేరుకోవచ్చు
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో ఉంటుందీ క్షేత్రం. గుంటూరు వరకూ రైలు, బస్సుల్లో చేరుకుంటే.. అక్కడినుంచి ఆలయానికి వెళ్లేందుకు బస్సులూ, ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. వైకుంఠపురంలో దిగితే కాలినడకన ఆలయానికి చేరుకోవచ్చు.
పెనికలపాటి రమేష్, ఈనాడు, గుంటూరు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
India News
Navjot Singh Sidhu: జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..!
-
World News
NATO: తుర్కియే గ్రీన్ సిగ్నల్... నాటో కూటమిలోకి ఫిన్లాండ్!
-
Movies News
Pathaan: ‘బేషరమ్ రంగ్’ వివాదం.. ఇప్పుడు స్పందించిన దర్శకుడు.. ఏమన్నారంటే?
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Bhagwant Mann: అమెరికాలో భగవంత్ మాన్ కుమార్తెకు బెదిరింపులు..?