అమ్మవారికి కల్లు నివేదిస్తారిక్కడ!

ఊరి పొలిమేరలో కనిపించే ఆలయం... శక్తిస్వరూపిణి అయిన అమ్మవారికి శక్తిని అందించేందుకు కల్లు నివేదన... ఏడాదికోసారి ఘనంగా నిర్వహించే జాతర.

Published : 12 Mar 2023 00:02 IST

అమ్మవారికి కల్లు నివేదిస్తారిక్కడ!

ఊరి పొలిమేరలో కనిపించే ఆలయం... శక్తిస్వరూపిణి అయిన అమ్మవారికి శక్తిని అందించేందుకు కల్లు నివేదన... ఏడాదికోసారి ఘనంగా నిర్వహించే జాతర... ఈ ప్రత్యేకతలన్నీ అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో కనిపిస్తాయి. ఓ భక్తుడు నిర్మించిన ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది.

పచ్చని కొబ్బరిచెట్ల మధ్య కొలువుదీరి... భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటోంది నూకాలమ్మ.
అనకాపల్లిలోని ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలూ కలుగుతాయని అంటారు. ఓ భక్తుడు నిర్మించిన ఈ గుడిలోని నూకాలమ్మకు పసుపు-కుంకుమలతోపాటు... అరిసెలూ, బూరెలూ, పొంగణాలూ, ఉలవలూ,  రాగి పిండితో చేసే ఉండ్రాళ్లూ, నువ్వులపొడి మునగాకు కూర, ఈత చెట్ల నుంచి సేకరించిన కల్లును నైవేద్యంగా సమర్పిస్తారు. సాధారణంగా ఆలయాలు ఎక్కువగా ఊరిమధ్యలో ఉంటాయి. కానీ ఈ ఆలయాన్ని క్షుద్రశక్తులు రాకుండా ఉండేందుకు ఊరి పొలిమేరలో నిర్మించారని ప్రతీతి. ఆంధ్రాతో పాటు ఒడిశా, పశ్చిమ్‌బంగ వాసులకు ఇలవేల్పు అయిన నూకాలమ్మ ఆలయం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.  

స్థలపురాణం

ఈ ప్రాంతానికి చెందిన కాకర్లపూడి అప్పలరాజు అనే వ్యక్తి ఆర్కాట్‌ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసేవాడట. అమ్మవారిమీద భక్తితో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. అప్పట్లో ఆ దేవిని కాకతాంబాదేవిగా పిలిచేవారట. అలా కాకర్లపూడి వంశస్థులే ఆలయానికి ధర్మకర్తలుగా ఉండేవారు. క్రమంగా బ్రిటిషర్లు అనకాపల్లి కోటకు విజయనగర రాజుల్ని సామంతులుగా నియమించడంతో వాళ్లంతా ఆలయాన్ని అభివృద్ధి చేశారనీ చెబుతారు. ప్రస్తుతం ఈ ఆలయానికి
వైరిచర్ల వంశీయులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అప్పటినుంచీ కాకతాంబాదేవి నూకాలమ్మగా పూజలు అందుకుంటోందని అంటారు.  

ఏడాదికోసారి జాతర

అమ్మవారిని దర్శించుకునే భక్తులకు భోజన సదుపాయాన్నీ కల్పిస్తోంది ఆలయ కార్యనిర్వాహక వర్గం. సుమారు13 సంవత్సరాల  నుంచీ కొనసాగుతున్న ఈ నిత్యాన్నదానాన్ని భక్తులు ఇచ్చే విరాళాలతోనే జరిపించడం విశేషం. ఇక, అమ్మవారికి రోజూ, పర్వదినాల సమయంలో ప్రత్యేకంగా చేసే హోమాలూ, ఇతర పూజాది కార్యక్రమాలూ కాకుండా... ప్రతి అమావాస్యకు పలు పిండివంటలనూ నివేదిస్తారు. అలాగే ఏడాదికోసారి నెలరోజులపాటు జాతరను జరిపిస్తారు. ఉగాదికి ముందు వచ్చే అమావాస్యనాడు ఆ వేడుకలకు శ్రీకారం చుడతారు. కొత్త అమావాస్యగా పిలిచే ఆ రోజున ప్రారంభించిన జాతర నెలరోజులపాటు అంగరంగవైభవంగా కొనసాగుతుంది.
ఈ వేడుకల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, పశ్చిమ్‌బంగకు చెందిన ఎంతోమంది భక్తులు పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామాల నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చే భక్తులు... వాళ్లు చెల్లించే మొక్కులు... అంతా కలిసికట్టుగా పిండి వంటలు వండుకుని దేవికి నివేదించడం.. ఇలా నెలరోజులు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.


ఎలా చేరుకోవచ్చు

నూకాలమ్మ ఆలయం అనకాపల్లిలో ఉంటుంది. అక్కడి వరకు రైలు లేదా బస్సుల్లో చేరుకుంటే... ఆలయం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విమానంలో రావాలనుకునేవారు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగాలి. అక్కడినుంచి ఆలయం దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  
పీవీ సీతారాము, న్యూస్‌టుడే, అనకాపల్లి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..