చైత్రం... శుభప్రదం!
తెలుగు సంవత్సరంలో తొలి మాసమైన చైత్రం... ఎన్నో పర్వదినాలకు నెలవు. వసంత నవరాత్రులూ... సీతారాముల కల్యాణం... హనుమాన్ ఆరాధనతోపాటు మరెన్నో విశిష్టతల సమాహారం చైత్రం అంటున్నాయి పురాణాలు.
మామిడాకుల తోరణాలు కట్టిన వాకిళ్లతో, ముంగిట ముత్యాల ముగ్గులతో తెలుగు సంవత్సరాదిని స్వాగతించే ఈ చైత్రంలో చేసే దేవతారాధన సకల శుభాలూ కలిగిస్తుందని అంటారు.
ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలూ కలిగిన ఈ మాసంలో పౌర్ణమి వరకూ ప్రతిరోజూ ఓ పర్వదినమేనని అనుకోవచ్చు. చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉండటం వల్లే ఈ మాసానికి చైత్రమనే పేరు వస్తే... సూర్యుడు కూడా ఈ మాసంలో మొదటి రాశియైన మేషరాశిలోనే సంచరించడం విశేషం. ఉగాది రోజున ప్రత్యేకంగా ఫలానా దేవుడిని పూజించాలని ఏ పురాణాలూ చెప్పలేదు కానీ... పార్వతీపరమేశ్వరుల్నీ లేదా లక్ష్మీనారాయణుల్నీ దర్శించుకుంటే మంచిదని ప్రతీతి. ఆ తరువాతే షడ్రుచుల ఉగాది పచ్చడిని తీసుకోవాలని అంటారు.
ఈ పచ్చడి తయారీలో వాడే షడ్రుచులు ఏడాదంతా ఎదురయ్యే సుఖదుఃఖాలకూ కష్టనష్టాలకూ సంకేతంగా భావిస్తారు.
ఆరోగ్యపరంగా చూస్తే ఈ పచ్చడిని కేవలం ఉగాది రోజునే కాకుండా శ్రీరామ నవమి వరకూ తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటన్నింటితోపాటూ పంచాంగ శ్రవణాన్నీ పర్వదినంలో ఓ భాగంగా భావిస్తారు. రాబోయే సంవత్సరంలో గ్రహాల కదలికలూ, శుభాశుభఫలితాలనూ ముందే అర్థంచేసుకుని తదనుగుణంగా రాబోయే పరిస్థితుల్ని తట్టుకునేట్లు తగు జాగ్రత్తలు తీసుకోమని సూచించడమే ఈ పంచాంగ పఠనం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
తొలి నవరాత్రులూ ఇప్పుడే...
నవరాత్రులు అనగానే మనకు దుర్గను పూజించే శరన్నవరాత్రులు లేదా గణపతి నవరాత్రులు గుర్తొస్తాయి. ఈ రెండింటితోపాటూ చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రుల్ని చేసే సంప్రదాయమూ కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఏడాదిలో మూడుసార్లు నవరాత్రులు వస్తే... తొలి వసంత నవరాత్రుల్ని ఈ చైత్రమాసంలోనే చేస్తారు. ఈ సమయంలో శక్తిస్వరూపిణి అయిన లలితా పరమేశ్వరిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ నవరాత్రుల సమయంలో రామాయణ పారాయణం, రామనామ జపాన్ని చేస్తారు.
ఎందుకంటే, రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజుల్లోనే జరిగాయని ప్రతీతి. నవరాత్రుల చివరి రోజునే శ్రీరామనవమి వస్తుంది. ఆ రోజున ఊరూవాడా సీతారామ కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించి తరిస్తారు భక్తులు. సీతారాముల కల్యాణం జరిగిన తరువాతే చాలామంది తమ ఇళ్లల్లో వివాహాది శుభకార్యాల్ని తలపెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తారు.
హనుమజ్జయంతికీ ప్రాధాన్యం
చైత్ర పౌర్ణమి నాడు వివిధ ప్రాంతాల్లో హనుమజ్జయంతిని ఎంతో వైభవంగా జరిపిస్తారు భక్తులు. బజరంగబళీ జయంతిగా పిలిచే ఈ రోజున ఉపవాసం ఉండి, హనుమంతుడిని పూజిస్తే... చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అదృష్టపౌర్ణమిగా పిలిచే ఈ రోజున లక్ష్మీదేవిని కూడా పూజించాలని చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో సత్యనారాయణస్వామి వ్రతాన్నీ చేసుకునే సంప్రదాయమూ ఉంది.
జ్ఞానప్రదాతకూ పూజలు
ఈ మాసంలో వచ్చే చైత్రశుద్ధ విదియనాడు... జ్ఞాన ప్రదాత అయిన చంద్రుడిని పూజించి నూలుపోగును సమర్పించే పర్వదినమే బాలేందు వ్రతం. ఈ రోజున చంద్రుడిని ఆరాధిస్తే... జ్ఞానంతోపాటూ సకల శుభాలూ కలుగుతాయని అంటారు. ఇక, చైత్రశుద్ధ తదియ నాడు డోలాగౌరి వ్రతం లేదా సౌభాగ్యగౌరి వత్రం చేసి పార్వతీ పరమేశ్వరులను పూజించాలని అంటారు. పలు శివాలయాల్లో చవితితో కూడిన తదియ నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడం కోసం తపస్సు చేసినప్పుడు చైత్రశుద్ధ తదియ నాడే అది ఫలించిందట. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించిందని అంటారు. మహావిష్ణువు మత్స్యావతారమెత్తి వేదాలను రక్షించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. ఇవి కాకుండా చైత్రశుద్ధ పంచమి, అష్టమి, ఏకాదశి, బహుళ త్రయోదశి... ఈ మాసం మొత్తం పర్వదినాలే కావడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్
-
India News
Death Penalty: ‘ఉరి’ విధానం క్రూరమైందా..? సుప్రీంకోర్టు ఏమంటోంది..!
-
Politics News
Rahul Gandhi: స్పీకర్‌జీ..వివరణ ఇచ్చేందుకు అనుమతివ్వండి: రాహుల్
-
Movies News
Suriya42: ‘బాహుబలి’, ‘కేజీయఫ్’ రేంజ్లో సూర్య మూవీ ఉంటుందట!
-
India News
Nitish Kumar: ‘హిందీని చంపేస్తారా’.. మండలి ఛైర్మన్‌పై నీతీశ్ ఆగ్రహం!
-
World News
Lottery: రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకుని.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి!