ఇక్కడ పిల్లల్ని రాముడికి ఇచ్చేస్తారు!

పచ్చని కొబ్బరిచెట్ల మధ్య... ఎత్తైన రాజగోపురాలతో కనిపిస్తుంది గొల్లల మామిడాడలోని కోదండరామచంద్ర స్వామి దేవాలయం. చిన్న భద్రాద్రిగా పిలిచే ఈ ఆలయాన్ని ఇద్దరు రామభక్తులు నిర్మించారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న ఈ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలూ కలుగుతాయని అంటారు.

Updated : 26 Mar 2023 06:53 IST

ఇక్కడ పిల్లల్ని రాముడికి ఇచ్చేస్తారు!

పచ్చని కొబ్బరిచెట్ల మధ్య... ఎత్తైన రాజగోపురాలతో కనిపిస్తుంది గొల్లల మామిడాడలోని కోదండరామచంద్ర స్వామి దేవాలయం. చిన్న భద్రాద్రిగా పిలిచే ఈ ఆలయాన్ని ఇద్దరు రామభక్తులు నిర్మించారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న ఈ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలూ కలుగుతాయని అంటారు.

సువిశాలమైన ప్రాంగణంలో... అద్భుతమైన శిల్పకళా సంపదతో భక్తులను ఆకట్టుకుంటుంది గొల్లల మామిడాడ కోదండరామచంద్రస్వామి దేవాలయం. కాకినాడ జిల్లా, పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో తుల్యభాగ నదీ తీరంలో ఉంటుందీ ఆలయం. తూర్పు-పశ్చిమ గోపురాలతో కనిపించే ఈ గుడిలో సర్వాలంకారభూషితుడైన రాముడు- సీత, లక్ష్మణ, హనుమ సమేతంగా దర్శనమిస్తాడు.

స్థలపురాణం

ఒకప్పుడు ఈ ప్రాంతంలో మామిడిచెట్లు ఎక్కువగా ఉండేవట. అందువల్ల ఈ ప్రాంతాన్ని మామిడి వాడగా పిలవడంతో క్రమంగా అదే మామిడాడగా మారిందనీ... యాదవులూ ఎక్కువగా ఉండటం వల్ల గొల్లల అనే పేరు వచ్చి చేరిందనీ... అదే ఇప్పుడు గొల్లల మామిడాడ అయ్యిందనీ ప్రతీతి. ఈ ప్రాంతానికి చెందిన అన్నదమ్ములైన ద్వారపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డిలు రామభక్తులు కావడంతో స్వామికి ఆలయాన్ని కట్టించాలనుకున్నారట. అలా తలాకొంచెం స్థలాన్ని కేటాయించి 1889లో చిన్న ఆలయాన్ని నిర్మించి అందులో కొయ్యతో చేసిన సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తుల తాకిడి పెరిగి... కొందరు ఆలయ అభివృద్ధికీ సాయం చేయడంతో... తూర్పు-పడమర దిక్కున రెండు ఎత్తైన రాజగోపురాలను నిర్మించారు ఆలయ నిర్వాహకులు. తూర్పు గోపురం 160 అడుగుల ఎత్తులో తొమ్మిది అంతస్తులతో ఉంటే... పశ్చిమగోపురం 210 అడుగుల ఎత్తులో పదకొండు అంతస్తులతో కనిపిస్తుంది. మరికొన్నేళ్లకు గర్భాలయంలోనూ దేవతామూర్తుల విగ్రహాలనూ పునఃప్రతిష్ఠించారని చెబుతారు ఆలయ బాధ్యతల్ని చూస్తున్న ద్వారపూడి వంశస్థులు.

ఆకట్టుకునే అద్దాల మండపం

ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా బాలగణేశుడిని దర్శించుకున్నాక గర్భాలయంలో లక్ష్మణుడూ - హనుమంతుడూ సమేత సీతారామచంద్రమూర్తి విగ్రహాలనూ పూజిస్తారు. ఆ తరువాత ఈ ప్రాంగణంలోనే ఉన్న దాసాంజనేయస్వామి ఉపాలయాన్నీ చూడొచ్చు. స్వామి దర్శనానంతరం ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే అద్దాల మండపానికి వెళ్లొచ్చు. ఇక్కడ రామాయణ విశేషాలను శిల్పాల రూపంలో ఆవిష్కరించిన వైనం భక్తులను ఆకట్టుకుంటుంది. అదే విధంగా ఎత్తైన ఆ గోపురాలనూ భక్తులు ఎక్కొచ్చు. ఇక... ఇక్కడ చైత్ర, శ్రావణ, కార్తిక, ధనుర్మాసాల్లో విశేష పూజా కార్యక్రమాలనూ, ప్రతి గురువారం రాముని వ్రతాలనూ నిర్వహిస్తారు. ముఖ్యంగా చైత్రమాసమంతా స్వామిని తులసి ఆకులతో పూజిస్తే... సీతామాతకు కుంకుమార్చనను నిర్వహిస్తారు.

కల్యాణం కమనీయం

స్వామికి ఏడాది మొత్తం చేసే పూజలు ఒకెత్తయితే... శ్రీరామనవమినాడు అంగరంగవైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణం మరొకెత్తు. దీన్ని చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు. భద్రాద్రిలో మాదిరి ఇక్కడా సీతారాముల కల్యాణాన్ని ఆరుబయటే నిర్వహిస్తారు. ముత్యాల తలంబ్రాలనే పోస్తారు. శ్రీరామ నవమికి కొన్ని రోజుల ముందే... ధాన్యాన్ని గోటితో వలిచే క్రతువుకు శ్రీకారం చుట్టి కోటి తలంబ్రాలను సిద్ధంచేస్తారు భక్తులు. కల్యాణం అయ్యాక ఆ తలంబ్రాలను భక్తులకు పంచిపెడతారు. సంతానం లేనివాళ్లూ, మనసులో ఏదయినా సంకల్పం పెట్టుకున్నవాళ్లూ ఆ తలంబ్రాలను ఇళ్లకు తీసుకెళ్లి పరమాన్నం లేదా పాయసం తయారీలో వాడతారట. అదేవిధంగా సీతారాముల కల్యాణం జరుగుతున్న సమయంలో కొందరు భక్తులు ఏడాదిలోపు పిల్లల్ని స్వామికి కానుకగా ఇచ్చేస్తారట. కల్యాణం అంతా పూర్తయ్యాక ఎంతోకొంత డబ్బును చెల్లించి మళ్లీ తమ పిల్లల్ని తీసుకుంటారట. ఇలా చేస్తే పిల్లలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారని భక్తుల నమ్మకం.  

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం కాకినాడ జిల్లా, పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో ఉంటుంది. కాకినాడ నుంచి 25 కి.మీ., రాజమహేంద్రవరం నుంచి 45 కి.మీ.దూరంలో ఉంటుందీ ఆలయం. కాకినాడ లేదా రాజమహేంద్రవరం వరకూ రైలు లేదా బస్సులో చేరుకుంటే... అక్కడి నుంచి ఆలయానికి వెళ్లేందుకు బస్సులూ, ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి.

ఆరుమిల్లి శ్రీనివాసు, న్యూస్‌టుడే, పెదపూడి మండలం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..