చికిత్స కోసం వచ్చారా... ఇక్కడ ఉండొచ్చు!
ఆడుతూ పాడుతూ బడికెళ్లాల్సిన పిల్లలకు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి సోకితే ఆ తల్లిదండ్రులు ఎదుర్కొనే బాధ వర్ణనాతీతం. దానికి తోడు చికిత్సకోసం నగరాలకు వెళ్లినప్పుడు నిలువనీడ లేక పేద కుటుంబాలు పడే ఇబ్బందులెన్నో.
చికిత్స కోసం వచ్చారా... ఇక్కడ ఉండొచ్చు!
ఆడుతూ పాడుతూ బడికెళ్లాల్సిన పిల్లలకు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి సోకితే ఆ తల్లిదండ్రులు ఎదుర్కొనే బాధ వర్ణనాతీతం. దానికి తోడు చికిత్సకోసం నగరాలకు వెళ్లినప్పుడు నిలువనీడ లేక పేద కుటుంబాలు పడే ఇబ్బందులెన్నో. అలాంటివారికి ఉచితంగా భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తూ అండగా నిలుస్తోంది సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్.
రెండేళ్ల మహికి క్యాన్సర్. ఆ పాపను పెద్ద ఆసుపత్రిలో చూపించమని డాక్టర్ చెప్పడంతో సిటీకి వచ్చిందా కుటుంబం. ఆసుపత్రిలో పాపకు తోడుగా తల్లి ఉంటే... తండ్రి ఫుట్‌పాత్‌మీద పడుకునేవాడు.
చిరుద్యోగి అయిన విజయ్ పరిస్థితీ ఇదే. తన ఆరేళ్ల పిల్లాడికి క్యాన్సర్ చికిత్సను చేయిస్తూ నెలల తరబడి నగరంలో ఉండడంతో- చివరకు ఉద్యోగాన్నే కోల్పోయాడు. వీళ్లు మాత్రమే కాదు... పల్లెటూళ్ల నుంచి నగరాలకు క్యాన్సర్ చికిత్సకోసం వచ్చే పేదల పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంటుంది. నిజానికి క్యాన్సర్ బారినపడిన చిన్నారులకు ఉచితంగా లేదా తక్కువ ఫీజును తీసుకుని చికిత్స చేసే ఆసుపత్రులు ఉంటాయి కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు హోటల్‌లో ఉండాలంటే బోలెడు ఖర్చు. అలాంటివాళ్లకు మేమున్నాం అంటూ చేయూతనిస్తోంది ‘సెయింట్ జ్యూడ్ ఇండియా ఛైల్డ్‌కేర్ సెంటర్’. ఆ చిన్నారుల చికిత్స పూర్తయ్యేవరకూ అన్ని విధాలుగా ఆదుకునే ఈ సంస్థను ముంబయికి చెందిన నిహాల్, శ్యామ కవిరత్నే దంపతులు పదిహేడు సంవత్సరాలక్రితం ప్రారంభించారు. యునిలీవర్ సంస్థలో కీలకహోదాలో పనిచేసిన నిహాల్ ఓసారి ముంబయిలోని టాటా మెమోరియల్ ఆసుపత్రి బయట ఎంతోమంది పేదవాళ్లు పడుకోవడం చూశాడట. ఆరాతీస్తే... వాళ్లంతా క్యాన్సర్‌బారిన పడిన పిల్లల తల్లిదండ్రులనీ, బాధితులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంటే... పెద్దవాళ్లు ఆసుపత్రి బయటే రోజులతరబడి ఉంటున్నారని తెలిసిందట. దాంతో తన తల్లి జ్ఞాపకార్థంగా ఈ సంస్థను ముంబయిలో ప్రారంభించిన నిహాల్ క్రమంగా దేశవ్యాప్తంగా పలునగరాలకు విస్తరింపజేశాడు.
ఎలాంటి సదుపాయాలు ఉంటాయంటే...
సాధారణంగా చికిత్సకోసం ఊరుగాని ఊరు వచ్చేవాళ్లకు ఉండటానికి ఓ చోటు, వేళకు మంచి భోజనం, పిల్లలకు క్యాన్సర్‌కు సంబంధించిన కౌన్సెలింగ్ వంటి సదుపాయాలన్నీ కల్పిస్తుందీ సంస్థ. రోగి ఆసుపత్రికి వెళ్లి వచ్చేందుకు వాహన సదుపాయమూ ఉంటుంది. పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటుచేసిన జ్యూడ్ కేంద్రాలకు వచ్చేవాళ్లకు ఇక్కడి సిబ్బంది వారానికోసారి నిత్యావసరాలు, పాలు, నెయ్యి, కూరగాయలు... వంటింటి సామగ్రి, స్టవ్ లాంటివన్నీ ఇస్తారు. నిద్రపోయేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు ఎవరి గదులు వాళ్లకు ఉన్నా... వంట, భోజనం చేసేందుకు మాత్రం కామన్ వంటిల్లు, భోజనశాల ఉంటాయి. ఇక, చికిత్స లేని రోజుల్లో మహిళలకోసం టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తే... మగవాళ్లకు సెల్‌ఫోన్ రిపేరింగ్ నేర్పిస్తారు. పిల్లలకూ చదువు చెప్పేందుకు ఓ టీచర్ వస్తారు. అంతేకాదు వాళ్లకు పెయింటింగ్, బొమ్మల తయారీలోనూ శిక్షణ ఇస్తారు. అన్నింటికీ మించి... క్యాన్సర్‌పైనా, ఆ చికిత్సపైనా చిన్నారులకూ, తల్లిదండ్రులకూ వచ్చే ప్రతి సందేహాన్నీ ఓపిగ్గా తీరుస్తూ... ధైర్యాన్ని పెంచుతారు.
ఎంతకాలం ఉండొచ్చంటే...
క్యాన్సర్ చికిత్స ఎంతకాలం పడుతుందనేది తెలియదు కాబట్టి పూర్తిగా నయమయ్యేవరకూ ఇక్కడే ఉండొచ్చు. ప్రస్తుతం ముంబయితోపాటూ దిల్లీ, హైదరాబాద్, వారణాసి, జయపుర, చెన్నైతో కలిపి... దేశవ్యాప్తంగా ముప్ఫై ఎనిమిది కేంద్రాలను నిర్వహిస్తోందీ సంస్థ. ఒక్కో కేంద్రంలో పన్నెండు నుంచి పదహారు కుటుంబాల వరకూ ఆశ్రయాన్ని కల్పించే ఈ సంస్థలో సిబ్బందీ అంతే అంకిత భావంతో పనిచేస్తారు. రోగుల తల్లిదండ్రులతో మాట్లాడటం, అర్హులకే వసతిని కల్పించడం, ఆ పిల్లలు ఆనందంగా ఉండేందుకు తోడ్పడటం... ఇలా ప్రతి దశలో తమ సిబ్బంది పాత్ర కీలకమని అంటారు సంస్థ నిర్వాహకులు. హైదరాబాద్‌లో అయితే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, నిమ్స్, రెయిన్‌బో, ఎల్వీప్రసాద్... వంటి ఆసుపత్రులతో అనుసంధామైందీ సంస్థ. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా దాదాపు నలబైవేలమంది చిన్నారులకు ఆశ్రయం కల్పించిన సెయింట్‌జ్యూడ్ ఎన్నో అవార్డులనూ అందుకోవడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Sangareddy: గడ్డపోతారంలో విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Hyderabad Metro: రాయదుర్గం మెట్రో... పార్కింగ్ లేదేంటో..
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!