విదేశాలకూ మన అంకురాలు!

భారత్‌లో అంకుర సంస్థలు దూసుకెళ్తున్నాయి. సముద్రగర్భంలో, గగనతలంలో... అన్నింటా ఉనికిని చాటుతున్నాయి. చిన్న ఆలోచనతో మొదలై వందలూ, వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీలుగా ఎదుగుతున్నాయి. అలాంటి వైవిధ్యమైన సంస్థలే ఇవి...

Published : 25 Mar 2023 23:32 IST

విదేశాలకూ మన అంకురాలు!

భారత్‌లో అంకుర సంస్థలు దూసుకెళ్తున్నాయి. సముద్రగర్భంలో, గగనతలంలో... అన్నింటా ఉనికిని చాటుతున్నాయి. చిన్న ఆలోచనతో మొదలై వందలూ, వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీలుగా ఎదుగుతున్నాయి. అలాంటి వైవిధ్యమైన సంస్థలే ఇవి...


సముద్రంలో సాగు...

ర్బన ఇంధనాలకు అనేక రకాలైన ప్రత్యామ్నాయాల్ని అన్వేషిస్తోంది ప్రపంచం. ఫలితమే సౌర, పవన విద్యుత్‌లాంటివి. వాటితోపాటు బయో ఇంధనం తయారీపైనా దశాబ్దాలుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. సముద్రంలో దొరికే నాచు, కలుపు నుంచి ఇంధనంతోపాటు అనేక ఉత్పత్తులు తెచ్చే ప్రయత్నం చేస్తోంది సీ6 ఎనర్జీ. 2010లో నెల్సన్‌ వడసెరీ, శ్రీశైలజ నోరి, సౌమ్య బలేంద్రియన్‌ ఈ సంస్థను స్థాపించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న ఈ సంస్థ ఐఐటీ మద్రాస్‌లో పురుడుపోసుకుంది. ‘సముద్రంలో విరివిగా
దొరికే నాచుతో ఇంధనం ఉత్పత్తి చేయొచ్చు. కాకపోతే అందుకు చౌకైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అందుకే ముందు దానిపైన దృష్టి పెట్టి సముద్రం లోతుల్లోకి వెళ్లి నాచు తేగలిగే సాంకేతికతను అభివృద్ధి చేశాô. నాచుతో రకరకాల ఉత్పత్తులూ తెస్తున్నాం’ అని చెబుతారు నెల్సన్‌. ప్రస్తుతం నాచుతో జిగురు, బయోడీగ్రేడబుల్‌ షీట్ల తయారీకి ముడి సరుకు అందిస్తున్నారు. ‘ఆగ్రోగెయిన్‌’ పేరుతో పంటలకు సేంద్రియ ఎరువుని సరఫరా చేస్తున్నారు. సొంతంగా సముద్ర జలాల్లోనే నాచును పెంచడంతోపాటు ఇతరుల నుంచీ కొనుగోలు చేస్తోంది. ఎందుకంటే ఇంధన తయారీకి పెద్ద మొత్తంలో నాచు కావాలి. టాటా క్యాపిటల్‌ లాంటి సంస్థల నుంచి ఇప్పటివరకూ రూ.210 కోట్ల పెట్టుబడులు సంపాదించిన సీ6... 20 దేశాల్లో సేవలు అందిస్తోంది. నాచుతో పశువులకు దాణా తయారుచేస్తోంది. మున్ముందు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాల్నీ చేస్తామంటున్నాడు నెల్సన్‌.


అన్నింటా డ్రోన్స్‌

వ్యవసాయం నుంచి దేశరక్షణ వరకూ దాదాపు ప్రతి రంగంలోనూ ఉపయోగిస్తున్న సాధనం... డ్రోన్‌. ఎంతో కష్టమైన పనుల్నీ తక్కువ ఖర్చులో, వేగవంతంగా చేస్తుండటంతో డ్రోన్లకు ఇటీవల కాలంలో బాగా డిమాండ్‌ పెరుగుతోంది. ఈ మార్పుని దాదాపు పదేళ్ల కిందటే ఊహించాడు అగ్నీశ్వర్‌ జయప్రకాశ్‌. చెన్నైకి చెందిన అగ్నీశ్వర్‌ టీనేజ్‌లో స్విమ్మర్‌గా జాతీయ, అంతర్జాతీయ పతకాలు గెలిచాడు. తర్వాత హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో చదువుకుని... ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా కొన్నాళ్లు పనిచేశాడు. అక్కడ యువతలోనూ, ఆధునిక సాంకేతికత విభాగాల్లోనూ వస్తోన్న మార్పుల గురించి సమాచారాన్ని సేకరించేవాడు. డ్రోన్స్‌తో వస్తోన్న, తేవాల్సిన మార్పుల గురించి లోతుగా అధ్యయనం చేసి 2015లో చెన్నై కేంద్రంగా ‘గరుడ ఎయిరోస్పేస్‌’ పేరుతో డ్రోన్ల తయారీ కంపెనీ పెట్టాడు. గనుల తవ్వకం, మ్యాపింగ్‌, వస్తు రవాణా... ఇలా 30 రంగాల్లో ఉపయోగపడే 50 రకాల డ్రోన్లను అభివృద్ధి చేసిందా సంస్థ. రక్షణ రంగంలో డ్రోన్ల తయారీకీ అనుమతి సాధించారు. వ్యవసాయ రంగానికి అవసరమైన డ్రోన్లను విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. వైద్య పరికరాల సరఫరా కోసం బెంగళూరు- ‘నారాయణ హృదయాలయ’తో ఒప్పందం కుదుర్చుకుంది ‘గరుడ’. క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోనీ దీన్లో పెట్టుబడి పెట్టడం విశేషం. కంపెనీ విలువ రూ.2000కోట్లు.


పదం పదం జోడిస్తూ...

బిట్స్‌ పిలానీ పూర్వ విద్యార్థులు స్థాపించిన సంస్థ ‘పెప్పర్‌ కంటెంట్‌’. అనిరుధ్‌ సింగ్లా, రిషభ్‌ శేఖర్‌, హిమాన్షు గోయల్‌, ఆదేశ్‌ చంద్ర దీని వ్యవస్థాపకులు. మాన్యువల్‌ తయారీ, ప్రచారం... లాంటి వాటికి రాత పని అవసరమైన సంస్థలకూ, రచయితలకూ అనుసంధానకర్తగా పనిచేస్తుందీ సంస్థ. అనిరుధ్‌కు పుస్తక పఠనం హాబీ. రచనపైన ఆసక్తితో... ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో ఇంటర్న్‌షిప్‌ కోసం కనీసం పది సంస్థలకు ఈ-మెయిల్స్‌ పంపించాడు. కానీ ఎవరి నుంచి స్పందన లేదు. చివరకో అంకుర సంస్థకు వరుస మెయిల్స్‌ పంపడంతో అవకాశం ఇచ్చారు. ప్రతిభ ఉన్నప్పటికీ చాలామందికి అవకాశాలు దొరకడంలేదని అర్థమైంది అనిరుధ్‌కి. ఇదే విషయాన్ని మిత్రులకు చెప్పాడు. వారితో కలిసి విద్యార్థి దశలోనే కంపెనీ పెట్టాడు. మార్జిన్‌ తీసుకుని రచయితలకు అవకాశాలు చూపాలనేది వీరి ఆలోచన. క్యాంపస్‌లో ఉన్నప్పుడు పదానికి 15 పైసలు చొప్పున ఇస్తామంటూ ఓ కంపెనీ ముందుకు వచ్చింది. అంత తక్కువ మొత్తానికి వేరొకరు పనిచేయరు. అందుకే మిత్రులంతా రాత్రిళ్లు పనిచేస్తూ పదిరోజుల్లో 300 పేజీల కంటెంట్‌ రాశారు. అలా రూ.26వేలు ఓ ఆటోమోటివ్‌ సంస్థ నుంచి సంపాదించారు. క్యాంపస్‌లో ఉన్నప్పుడే కంపెనీ ఆదాయం రూ.1.75కోట్లకు చేరింది. ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరంలో ఉండగానే 2017లో ముంబయి కేంద్రంగా ఆఫీసు తెరిచారు. ప్రస్తుతం గ్రాఫిక్‌ డిజైనింగ్‌తోపాటు, 44 భాషల్లో అనువాద సేవల్నీ అందిస్తోందీ సంస్థ. అమెరికాకూ విస్తరించింది. ఇప్పటివరకూ మొత్తం రూ.150కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సంస్థకు 1.25 లక్షల కంటెంట్‌ సృష్టికర్తలూ, 2500 ఖాతాదారులూ ఉన్నారు. వారిలో అమెజాన్‌, గూగుల్‌, అడోబీ, స్విగ్గీ లాంటి కంపెనీలూ ఉన్నాయి. రచయితలకు సహాయపడే పెప్పర్‌టైప్‌.ఏఐను తెచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..