Updated : 28 Jan 2023 23:41 IST

పాట కోసం అప్పులు చేశా!

జానపదాల్ని ఊపిరిగా భావిస్తూ పెరిగిన పిల్లాడు... కుర్రాడయ్యాక సినిమా కలలు కన్నాడు. తన గొంతులోని మాధుర్యాన్నీ, పాటలోని మట్టివాసననీ మెచ్చుకుంటూనే.. అవకాశాలు అడిగేసరికి ‘రేపు రా’ అన్నవాళ్లే అందరూ. అలా రోజులు కాస్తా, సంవత్సరాలయ్యాయి. అయినా పాటపైన పట్టునీ ప్రయత్నంలో పట్టుదలనీ విడవలేదా యువకుడు. చివరకు లక్ష్యాన్ని సాధించాడు. బెంగాల్‌ టైగర్‌, గరుడవేగ, తాజాగా ధమాకాతో తెలుగు సినిమా పాటల వనంలో ప్రత్యేక వృక్షంగా నిలిచాడు సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో. ఆ ప్రస్థానం అతడి మాటల్లోనే...

అవి 2021 చివరి రోజులు... రవితేజ గారి నుంచి ఫోన్‌. ‘ఏం చేస్తున్నావ్‌.. ఓసారి రా’ అంటే.. వెళ్లి కలిశాను. ‘బెంగాల్‌ టైగర్‌కి ఎంత మంచి పాటలు ఇచ్చావ్‌... ఆ విజయంతో ఎక్కడో ఉండాల్సిన వాడివి, అక్కడే ఆగిపోయావ్‌...’ అని నీమీద నమ్మకంతో ‘ధమాకా... ఇస్తున్నా ఇరగదీసెయ్‌’ అన్నారు. ఆయనలా అనేసరికి నా కళ్లు చెమ్మగిల్లాయి. ఆయనిచ్చింది అవకాశం కాదు, పునర్జన్మ. ఇప్పటివరకూ పదికిపైనే సినిమాలకు పనిచేశా. హిట్‌లు అందించినా తగిన గుర్తింపు రాలేదన్న వేదనతో ఉన్నా. నా మొదటి సినిమా ‘నువ్వా నేనా’ 2012లో వచ్చింది. అందులో ‘వయ్యారీ బ్లాక్‌బెర్రీ ఫోనులే..’ యూత్‌లోకి బాగా వెళ్లిన పాట. రెండో సినిమా కెవ్వు కేకలో ‘బాబు ఓ రాంబాబు...’, 2015లో ‘బెంగాల్‌ టైగర్‌’ ఆల్బమ్‌ మొత్తం హిట్‌. ఆ సినిమా పాటలు నేను చేశా, రీ రికార్డింగ్‌ మణిశర్మ గారు చేశారు. దాంతో ఆ విజయం ఎవరికీ చెందకుండా పోయింది. తర్వాత గరుడవేగలో.. నే చేసిన ఏకైక పాట ‘డియ్యో డియ్యో డిషక డిషక’ సినిమాకే చాలా ప్లస్‌ అయ్యిందన్న ప్రశంసలు అందుకున్నా. హిట్‌లు వచ్చినా కెరియర్‌ని చక్కదిద్దుకోలేక పోవడానికి నా మొహమాటం, ముక్కుసూటి తనం కూడా కారణాలే. అలాంటి సమయంలో రవిగారు పిలిచేసరికి దేవుడే దిగి వచ్చాడనిపించింది. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకూడదని.. నా టీమ్‌ దాదాపు ఏడాదిపాటు దీనికోసం అహర్నిశలు కష్టపడింది. ఈ సినిమా పాటలు మరో దశాబ్దంపాటు ప్రజలు వినాలీ, పాడాలీ అన్న లక్ష్యంతో పనిచేశాం. దర్శకనిర్మాతలు నన్ను ఒప్పుకోవడమే గొప్ప అనుకుంటే... నా ట్యూన్‌లు విన్నాక నేను మామూలుగా చేసే బడ్జెట్‌కి పదింతలిచ్చారు. మామూలుగా సినిమాకి ట్రైలర్‌, టీజర్‌ లాంటివి ముందు వస్తాయి. ఈ సినిమాకి మాత్రం పాటని రిలీజ్‌ చేశారు. అదే ‘జింతాక్‌, జింతాక్‌’. మిగతా పాటలూ అంతే జాగ్రత్తతో చేసి మొత్తం ఆల్బమ్‌ హిట్‌ అయ్యేట్టు చేశా. సినిమా రూ.100కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ విజయంలో పాటలదీ కీలకపాత్రని చెబుతుంటే రవి గారికి మనసులోనే దండం పెట్టుకుంటుంటా. నా పాటల్లో సహజత్వం, మట్టివాసన ఉంటాయని రవితేజ చెబుతారు. అందుకే ఛాన్స్‌ ఇచ్చారనుకుంటా. సంగీత దర్శకుడిగా నా ప్రస్థానం మొదలుపెట్టి పదేళ్లవుతున్నా, సినిమా ప్రయత్నాలు మాత్రం 20 ఏళ్ల కిందటే మొదలయ్యాయి.

డిగ్రీలోనే పాటల రచయిత...

మాది ఖమ్మం జిల్లా గార్ల బయ్యారం. నాన్న మంగ్యా, అమ్మ మాంగ్ని. వ్యవసాయ కుటుంబం. నాకో అన్నయ్య, అక్క. పదో తరగతి వరకూ ఊళ్లోనే చదువుకున్నా. ఖమ్మం అంటే ఉద్యమాల గడ్డ. నేనూ విద్యార్థి, ప్రజా ఉద్యమాల్ని దగ్గరుండి చూశా. కొన్నింటిలో భాగమయ్యా. అందరికీ స్వరం నుంచి సంగీతం పుట్టుకొస్తే మాకు మాత్రం పదంతో వస్తుంది. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే పాటలు రాసేవాణ్ని. పోటీల్లో వాటినే పాడేవాణ్ని. ప్రకృతిని చూసి పులకరించి కవితలు రాసేవాణ్ని. అమ్మాయిల్ని చూసినా అంతే... ఏవో పదాలు నోటికి వచ్చేస్తాయి. స్నేహితులు ప్రేమలేఖల కోసం కవితలు రాయించుకునేవారు. డిగ్రీ ఖమ్మంలో చదివా. ఆ టైమ్‌లో ఒక టీవీ ఛానెల్‌ వాళ్లు వరంగల్‌లో పాటల పోటీలు పెడితే వెళ్లా. వాళ్లు నా పాట విని... ‘సినిమాల్లో ప్రయత్నించు’ అన్నారు. వాళ్లలా చెప్పేసరికి వంద రూపాయలు పట్టుకుని స్నేహితుణ్ని తీసుకుని ఖమ్మంలో రైలెక్కి 2002లో హైదరాబాద్‌ వచ్చా. అప్పటికే 50 వరకూ పాటలు రాసుకున్నా. ఆరోజు సాయంత్రానికి స్నేహితుడు తిరిగి వెళ్లిపోయాడు. నేను రాత్రికి ఇక్కడే ఉండిపోయా. దర్శకుడు తేజ కొత్తవాళ్లకి అవకాశాలు ఇస్తారని ఆయన ఆఫీసు అడ్రెస్‌ తెలుసుకుని అక్కడికి వెళ్లా. ఆ టైమ్‌లో బయట పెద్ద వర్షం... నేను ఆయన ఆఫీసు ఎదురుగా ఓ చెట్టు కింద నిల్చొన్నా... సూర్యనారాయణ రాజు అని.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నన్ను పిలిచి ‘ఏంటి ఇంత వర్షంలో... చేతిలో ఏంటా కాగితాలు సినిమా కథా’ అని అడిగారు. ‘లేదు సర్‌, పాటలు’ అన్నా. కార్లో కూర్చోబెట్టుకుని పాటలు పాడమన్నారు. పాడి వినిపించాను. ఆయనకి బాగా నచ్చాయి. నన్ను మరో వ్యక్తికి పరిచయం చేశారు. ఆయనా విని ‘అవకాశం ఉంటే చెబుతాను టచ్‌లో ఉండ’మన్నారు. వాళ్లలా చెప్పాక తిరిగి ఊరెళ్లిపోయా. నెలకోసారి వచ్చి కలిసేవాణ్ని. అప్పుడే దర్శకుడు ఎన్‌.శంకర్‌ ‘ఆయుధం’ సినిమా తీస్తుంటే.. కలవమని చెప్పారు. నా పాటలు బావున్నాయని మెచ్చుకుంటూనే ఆర్నెల్ల్ల తర్వాత కనిపించమన్నారు శంకర్‌ గారు. ‘తప్పించుకోవడానికేమో’ అనుకున్నా. సరే ఆర్నెల్లు ఆగి వద్దామనుకుని ఊరెళ్లిపోయా. అప్పటికి డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నా. ఆర్నెల్ల తర్వాత వెళ్తే.. శంకర్‌ మాట్లాడారు. రాజశేఖర్‌ హీరోగా ‘ఆయుధం’ మొదలైంది. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీత దర్శకుడు. నన్ను ఆయనకి పరిచయం చేశారు. ఏదైనా పాట పాడమంటే.. ‘ఓయ్‌ రాజు కన్నుల్లో నువ్వే..’  పాట పాడి వినిపించా.. ట్యూన్‌తో సహా. పదాలు బావున్నాయి. ట్యూన్‌ కూడా బావుంది,. వేటూరి గారిచేత పాట పూర్తిగా రాయిద్దామని మాట్లాడుకుంటున్నారు. నేను బిక్క మొహం వేసి చూసేసరికి.. ‘సరే నువ్వే రాయి.. కానీ చాలా మెరుగవ్వాలి’ అన్నారు. 20 రోజులు షెల్టర్‌ ఇచ్చి.. ఎన్నో మార్పులు చేర్పులుచేసి పాట పూర్తిచేయించి రూ.5వేలు పారితోషికం ఇచ్చారు. ఆ ఆల్బమ్‌లో ఆ పాట సూపర్‌ డూపర్‌ హిట్‌. ఇంకేం అవకాశాలు వరస కట్టేస్తాయనుకున్నా. కానీ అలా జరగలేదు. డిగ్రీ పూర్తవగానే హైదరాబాద్‌ వచ్చి అవకాశాల కోసం తిరిగేవాణ్ని. దర్శక నిర్మాతలు ‘రేపురా, మాపురా’ అంటే నిజమేననుకుని రాత్రిళ్లు ఏ బస్‌ షెల్టర్‌లోనే తలదాచుకుని చెప్పిన టైమ్‌కి వెళ్లేవాణ్ని. ‘మళ్లీ వచ్చావా’ అన్న వాళ్ల చూపులు మొదట్లో నాకర్థమయ్యేవి కాదు. ఏదో ఆశ నన్ను వాళ్ల చుట్టూ తిరిగేలా చేసేది. సమయానికి తిండి ఉండేది కాదు. ఫంక్షన్‌ హాళ్లూ, హోటళ్ల దగ్గరకు వెళ్లి ఏమైనా మిగిలితే ఇవ్వమని వాచ్‌మెన్‌లను అడిగి ఆకలి తీర్చుకునేవాణ్ని. రోజూ 25 కి.మీ. దాకా తిరిగేవాణ్ని. ఓపికా, సత్తువా తగ్గితే ఇంటికి వెళ్లిపోయేవాణ్ని. రైలు టికెట్‌ తీయక ఎన్నోసార్లు టీసీల చేత దెబ్బలు తిన్నా. అలా దాదాపు రెండేళ్లు తిరిగా.

సినిమాలు వద్దనుకుని బీఎడ్‌ చేశా..

దర్శకుడు సంపత్‌ నంది.. ‘ఆయుధం’కి డైలాగులు రాశాడు. అక్కడ మా మధ్య స్నేహం కుదిరింది. తను సినిమా కథలు చెప్పినప్పుడు తోచిన సలహాలూ, సూచనలూ ఇచ్చేవాణ్ని. ‘ఇక్కడ పాట ఉంటే బావుంటుంది. ఈ డైలాగు ఉంటే బావుంటుంది’ అని చెబుతూనే కొన్ని మాటలూ, పాటల లైన్లూ చెప్పేవాణ్ని. దర్శకుడిగా తన మొదటి సినిమా ‘ఏమైంది ఈ వేళ’కు, సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. కానీ వారం తర్వాత కారణం చెప్పకుండా తప్పించారు. చాలా బాధేసింది. తన ‘రచ్చ’ సినిమాకీ సహకారం అందించా. అందుకు ‘థ్యాంక్స్‌’ కార్డు కూడా పడింది. కానీ నాకేమీ ఒరగలేదు. నా వాలకం చూసి ‘తోటి వాళ్లంతా ఉద్యోగాలు చేస్తుంటే నువ్వేంది గాలి తిరుగుళ్లు తిరుగుతున్నావ్‌’ అని కోప్పడ్డారు నాన్న. ఆ టైమ్‌లో ఎడ్‌సెట్‌ రాశా. రాజమండ్రిలో బీఎడ్‌ సీటు వస్తే అసంతృప్తితోనే వెళ్లా. అక్కడ క్లాసులో అడుగుపెట్టాక నలభై మంది అమ్మాయిలూ, నలభై మంది అబ్బాయిలూ... వాళ్ల కేరింతలూ, చప్పట్లూ.. ఎంతో హ్యాపీగా ఉన్నారందరూ. తోటివాళ్లంతా సంతోషంగా ఉంటే నేనెందకు బాధపడటం అన్న ఆలోచనతో నాలో మార్పు వచ్చింది. బీఎడ్‌ తర్వాత సోషల్‌ టీచర్‌గా పనిచేశా. తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎం.ఎ. ఇంగ్లిష్‌ చేశా. కానీ నిరంతరం సినిమానే గుర్తొచ్చేది.

అలా మొదటి అవకాశం

‘ఏమైంది ఈ వేళ’కి ఎం.ఎస్‌.కుమార్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. అప్పుడు నా ట్యూన్లు విన్నారు. ఆయన ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా ‘నువ్వా నేనా’ చేస్తున్నప్పుడు దర్శకుడు నారాయణ గారితో మాట్లాడి అవకాశం ఇప్పించారు. కెవ్వు కేక, జోరు, ఇలా ఎలా.. సినిమాలకి పనిచేశాక నా స్నేహితుడు సంపత్‌ నంది ‘బెంగాల్‌ టైగర్‌’ ఛాన్స్‌ ఇచ్చాడు. అప్పుడే రవితేజ గారు మెచ్చుకుని మరో సినిమాకి అవకాశం ఇచ్చారు కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాల్లో ‘నక్షత్రం’ ఒకటి. దర్శకుడు కృష్ణవంశీ పిలిచి ఆ సినిమాకి ఒక పాట చేయమన్నారు. ఒక్క పాట చేయడం ఇష్టంలేకపోయినా ఆయన మాట కాదనలేక ఓ ట్యూన్‌ వినిపించా. అది మెలోడీ. ‘నేను ఫోక్‌ కోసం పిలిచా.. అయినా ఇదీ కావాలి. మరో ఫోక్‌ సాంగ్‌ కూడా చెయ్యి’ అన్నారు. ఆ రెండూ ఇచ్చాక పాటలన్నీ నన్నే చేయమన్నారు. రీరికార్డింగ్‌కీ అవకాశం ఇచ్చారు. గైడెన్స్‌ ఇచ్చి మరీ చేయించారు. నేను ఆర్‌ఆర్‌ చేసిన మొదటి సినిమా అది. అనుకున్నంత విజయం సాధించకపోయినా.. ఆర్‌ఆర్‌ చేయలేదన్న లోటుని తీర్చింది.

నా బడ్జెట్‌ తక్కువే అయినా పాటకు ఎవరు సూటవుతారో వాళ్లనే పిలిచి పాడించాను. శంకర్‌ మహదేవన్‌, నకాశ్‌ అజీజ్‌, అద్నన్‌ సమీ, విజయ్‌ ప్రకాశ్‌, శ్రేయా ఘోషాల్‌... లాంటి ప్రఖ్యాత గాయకులతోనూ పాడించా. వారికి పారితోషికం ఇవ్వడానికి అప్పులూ చేశా. వీళ్లలో చాలామంది డబ్బులు తిరిగి ఇవ్వాలని చూసినా, ఏరోజూ తీసుకోలేదు. డబ్బు వస్తుంది, పోతుంది... కానీ పాట చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే అలా చేసేవాణ్ని. ఇప్పటివరకూ అయిదారు పాటలు రాశాను. చాలా పాటలు పాడాను కూడా. పాట అనుకున్నప్పుడే పదాలూ, ట్యూన్‌, సరిపోయే దరువు కూడా వచ్చేస్తాయి. నేనేదో సాధించానని ఇవన్నీ చెప్పట్లేదు. నాలా అవకాశాలు దొరక్క కష్టపడుతున్నవాళ్లెందరో ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్లకి నా కథ స్ఫూర్తి కావాలి. వాళ్ల కలలూ ఏదో ఒక రోజు నిజం కావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్పా. ఎందుకంటే అవి వారి కలలు మాత్రమే కాదు, వారి తల్లిదండ్రులూ, భార్యాపిల్లలూ, స్నేహితులూ... అందరివీ!


పేరెందుకు ప్రత్యేకమంటే..

నాన్న ఏడో తరగతి వరకూ చదివారు. పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. సైన్స్‌పైన మక్కువ ఎక్కువ. ఆయనకు సిసిరో, గెలీలియో లాంటి పాశ్చాత్య తత్వ, శాస్త్రవేత్తలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే నాకు భీమ్స్‌ సిసిరోలియో అని పేరు పెట్టారు. సినిమాల్లో ప్రయత్నిస్తున్నానంటే బంధువుల్లో ఎవరూ నాకు పిల్లనివ్వడానికి ముందుకురాలేదు. అది వాళ్ల తప్పుకాదనుకోండీ. సంగీత దర్శకుణ్ని అయ్యాక చాలామంది పోటీపడ్డారు. కానీ నేను ఓసారి చూసి నచ్చిన మా పక్క ఊరు అమ్మాయి మృదులని పైసా కట్నకానుకల ప్రసక్తిలేకుండా పెళ్లి చేసుకున్నా. పాటలు చేయడానికి డబ్బులు సరిపోక చాలాసార్లు తన నగలు తాకట్టు పెట్టేవాణ్ని. పదేళ్లుగా నాతోపాటే ఎంతో ఓపిగ్గా విజయం కోసం వేచి చూస్తూ వచ్చింది. మాకో అమ్మాయి, అబ్బాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..