Updated : 19 Mar 2023 11:01 IST

‘మీ కంపెనీ అప్పటిదాకా ఉంటే చూద్దాం’ అన్నారు!

తెలుగు కుటుంబం ఉమ్మడిగా అందుకున్న విజయం తాలూకు కథ ఇది. బాలకార్మికుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన ఓ వ్యక్తి... కుటీర పరిశ్రమొకటి స్థాపించి నిలదొక్కు కునేంతలోనే చనిపోతే... కూలిపోయిన ఆ శిథిలాల నుంచే ఒక్కో ఇటుకనూ పేర్చుకుంటూ ఆ కుటుంబం దాన్నో అంతర్జాతీయ సంస్థగానిర్మించుకుంది. అదే సీఆర్‌ఐ పంప్స్‌. తెలుగు రైతులకి కొత్తగా పరిచయం అక్కర్లేని ఈ బ్రాండ్‌ ప్రస్థానం... వైస్‌ ఛైర్మన్‌ సౌందర్‌రాజన్‌ మాటల్లో... 

ఆ మధ్య మా సంస్థకి చెందిన సాఫ్ట్‌వేర్‌ని మార్చాం. మాకున్న 20 వేలమంది డీలర్ల నెట్‌వర్క్‌... 120 దేశాల్లో కార్యకలాపాలు... దాదాపు రెండున్నరవేల కోట్ల రూపాయల టర్నోవర్‌... వీటన్నింటినీ చూడాల్సిన సాఫ్ట్‌వేర్‌ని మార్చడమంటే పాతబడ్డ ఓ భవనాన్ని పునరుద్ధరించడంలాంటిదే. ఆ పునర్నిర్మాణం తర్వాత కొత్త సాఫ్ట్‌వేర్‌తో కొత్త లావాదేవీలకి శ్రీకారం చుట్టే క్రతువు ఒకటి ఉంటుంది. ఈ సందర్భంగా జరిగే తొలి అమ్మకాన్ని మేం చాలా సెంటిమెంటల్‌గా భావిస్తాం. కాబట్టే, ఈసారి తొలి విక్రయాన్ని తెలుగునేల నుంచే మొదలుపెట్టాం... వరంగల్‌లోని సురేందర్‌రెడ్డి అనే డీలర్‌కి విక్రయించడంతో నాంది పలికాం. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది డీలర్లూ, డిస్ట్రిబ్యూటర్లూ ఉన్నప్పుడు... ఓ తెలుగు రాష్ట్రం నుంచే ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందీ అంటే... తెలుగు మా మాతృభాష కావడం ఒక్కటే కారణం కాదు. అంతకన్నా పెద్ద కథే ఉంది...

కోయంబత్తూరు చుట్టుపక్కలున్న తెలుగు వ్యవసాయ కుటుంబాల్లో మాదీ ఒకటి. ఆ నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే వెంకటాపురం అన్న ఊరు మాది. మా తాతయ్య కాలంలో ఓసారి ఊళ్ళో తీవ్ర కరవొచ్చిందట. వ్యవసాయం క్షీణించడంతో ఇల్లు గడవడమే గగనమైంది. ఎనిమిదో తరగతితో మా నాన్న గోపాల్‌ చదువు మానేసి కూలిపనుల కోసం కోయంబత్తూరు వచ్చాడు. వస్త్ర పరిశ్రమకు సంబంధించిన యంత్రాల విడిభాగాలు తయారుచేసే ఓ ఫ్యాక్టరీలో బాలకార్మికుడయ్యాడు. మూణ్ణాలుగేళ్ళు తిరక్కుండానే ఆ పనిపైన పట్టుసాధించి ఓ ఫ్యాక్టరీనీ స్థాపించాడు. పంపుసెట్లలో భాగంగా ఉండే - బావుల నుంచి నీటిని తోడే ‘ఫుట్‌వాల్వ్‌’ అనే విడిభాగాన్ని తయారుచేయడం మొదలుపెట్టాడు. తన స్థాయిలో కొత్త ఆవిష్కరణలు చేశాడు. బావిలోని నీరు ఏ అంతరాయమూ లేకుండా పైపుల ద్వారా పైకి వెళ్లేలా ‘ఫ్రిక్షన్‌లెస్‌’ ఫుట్‌వాల్వ్‌ని తయారుచేస్తే... వాటికి మంచి గిరాకీ ఏర్పడింది. అప్పటికే ఆయనకి పెళ్ళయింది. తమ ఫ్యాక్టరీలో పదేళ్ళదాకా అమ్మానాన్నలిద్దరే పనిచేశారు. క్యాస్టింగ్‌ నుంచీ మౌల్డింగ్‌దాకా ప్రతిపనీ ఇద్దరూ పంచుకున్నారు. అమ్మయితే దాదాపు 400 డిగ్రీల సెల్సియస్‌ వేడిలో నిల్చుని క్యాస్టింగ్‌ పనులు చేస్తుండేది. సొంత ఫ్యాక్టరీలో రాత్రనకా పగలనకా అలా కార్మికుల్లా శ్రమించిన ఆ ఇద్దరి కష్టంపైనే ఫ్యాక్టరీ నిలదొక్కుకుని ఓ సంస్థగా మారింది. నాన్న ఎనిమిదో తరగతే చదివినా చరిత్రపైన ఆసక్తి ఎక్కువ... ముఖ్యంగా చోళులంటే బాగా అభిమానం, వాళ్ళలోనూ రాజేంద్రచోళ చక్రవర్తి అంటే ఆరాధన. అందుకే తన సంస్థకి ‘కోయంబత్తూరు రాజేంద్ర ఇండస్ట్రీస్‌’ అని పేరుపెట్టాడు... క్లుప్తంగా ‘సీఆర్‌ఐ’ అని పిలుస్తుండేవాడు. అమ్మానాన్నలకి మేం ఆరుగురం సంతానం. మొదట మా అన్నయ్య వేలుమణి తర్వాత నేను. నాకు ఇద్దరు తమ్ముళ్లూ, ఇద్దరు చెల్లెళ్లూ. పెద్ద కుటుంబమైనా సరే... నాన్న కంపెనీ ఆదాయాన్ని ఎప్పుడూ సొంతానికి ఉపయోగించుకోలేదు. వచ్చిన ఆదాయాన్నంతా మళ్ళీ మళ్ళీ తన ఆవిష్కరణలకే వినియోగిస్తుండేవాడు. అందువల్ల పెద్దగా వెనకేసుకోలేదు. కంపెనీ స్థాపించిన పదిహేనేళ్ళ తర్వాతే సొంతిల్లు తీసుకున్నాం. మా తాత కాలం నుంచి ఎన్నో ఒడుదొడుకులని ఎదుర్కొంటున్న కుటుంబం అప్పుడే కాస్త కుదుటపడింది. కానీ ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు...

వస్తువులన్నీ దొంగిలించుకుపోయారు...

1980 ఏప్రిల్‌లో ఓ రోజు రాత్రి పదిగంటలదాకా ఫ్యాక్టరీలో పనిచేసి ఇంటికొచ్చి పడుకున్న నాన్న... మళ్ళీ లేవనేలేదు. నిద్రలోనే ప్రాణంపోయింది. హార్ట్‌ ఎటాక్‌ కారణమని తేల్చారు వైద్యులు. అటు కుటుంబం, ఇటు ఫ్యాక్టరీ రెండూ పెద్దదిక్కుని కోల్పోయి ఇరుసులేని చక్రాలయ్యాయి. పెద్ద కర్మ దాకా మేమెవ్వరం ఇంట్లో నుంచి బయటకు రాలేదు. వచ్చి... ఫ్యాక్టరీకి వెళితే ఏముంది? అడిగే నాథుడెవరూ లేరనుకుని లోపలున్న విలువైన పరికరాలన్నింటినీ దొంగిలించుకుపోయారెవరో! పాత మెషీన్‌లే మాకు మిగిలాయి. అమ్మ ఎప్పుడూ ఫ్యాక్టరీలో కష్టపడటమే కానీ... ఆర్థిక విషయాలేవీ పట్టించుకోలేదు. మా ఉత్పత్తుల్ని అప్పుగా తీసుకున్నవాళ్లు ఎవరో... వాళ్ళెంత ఇవ్వాలో... ఇతర లావాదేవీలేవీ ఆమెకి తెలియదు. ఆమెతో సహా మా అందరికీ తెలిసిందల్లా ఒక్కటే - చేతిలో చిల్లిగవ్వలేదు అని! వస్తువులన్నీ దొంగతనానికి గురికావడంతో మళ్ళీ అప్పులు చేసి కొత్త పెట్టుబడులు పెట్టాలీ అని. అంటే, మాది జీరో స్థాయి అన్నమాట అది! మా అన్నయ్య అప్పటికే ఇంజినీరింగ్‌ చేసి ఉన్నాడు. నా డిగ్రీ పూర్తయింది. తమ్ముడు సెల్వరాజు పాలిటెక్నిక్‌లోనూ మిగతా ముగ్గురూ స్కూల్లోనూ ఉన్నారు. అన్నయ్య తానే ఫ్యాక్టరీ నడుపుతానన్నాడు. నేను ఆయనకి తోడు నిలిచాను. తమ్ముడు చదువుమానేయలేదుకానీ... అమ్మ పర్యవేక్షణలో పని చేయసాగాడు. ఫ్యాక్టరీ స్థలాన్ని తనఖాపెట్టి వచ్చిన డబ్బుతో ఉత్పత్తిని ప్రారంభించాం. మాకు అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే లాభాలుండేవని చెప్పానుకదా... దాన్ని మరింత విస్తరించవచ్చన్న ఆశతో హైదరాబాద్‌లో అడుగుపెట్టాను.

సీతాఫలాలే ఆహారం...

సికింద్రాబాద్‌లోని ఓ డార్మిటరీలో తలదాచుకుంటూ... అక్కడికి దగ్గర్లోనే ఓ చిన్నగదిని అద్దెకు తీసుకుని ఆఫీసుపెట్టాను. నాన్న చనిపోయేనాటికి- ఫుట్‌వాల్వ్‌ పరికరంతోపాటూ పంపుసెట్ల తయారీ కూడా మొదలుపెట్టాడు. ఫుట్‌వాల్వ్‌ అమ్మకాలకైతే ఢోకాలేదు కానీ... అది కేవలం విడిభాగమే కాబట్టి పెద్దగా లాభాలుండవు. అందువల్ల, పంపుసెట్ల అమ్మకాలే పెంచాలని నేను భావించాను. కానీ ఆ రంగంలో అప్పటికే మార్కెట్‌లో బడా సంస్థలుండటంతో హైదరాబాద్‌లోని ఏ డీలరూ నన్ను పట్టించుకోలేదు. దాంతో హైదరాబాద్‌లోకన్నా జిల్లా, తాలూకా కేంద్రాలకి వెళ్ళి ప్రయత్నిద్దామనుకున్నాను. ఓ సెకండ్‌హ్యాండ్‌ స్కూటర్‌ కొని హైదరాబాద్‌ని కేంద్రంగా చేసుకుని విజయవాడ, కర్నూలు, కరీంనగర్‌ జిల్లాలకి వెళ్ళిరావడం ప్రారంభించాను. టిఫిన్లూ భోజనాలూ తింటే డబ్బులైపోతాయని హైదరాబాద్‌లో చవగ్గా దొరికే సీతాఫలాలే తింటుండేవాణ్ని. అప్పట్లో, కంపెనీ యజమానులెవరూ రాజధాని హైదరాబాద్‌ని దాటి జిల్లా తాలూకా కేంద్రాలకి వెళ్ళేవారుకాదు. నేను వెళ్ళడం వల్ల... అందరూ చులకనగా చూసేవారు. గంటలు గంటలు నిల్చున్నా డీలర్లు చూసీచూడనట్టు ఉండిపోయేవారు. మూడుగంటలపాటు నిల్చోబెట్టాక ‘మీ ఉత్పత్తులు మాకక్కర్లేదు’ అని చెప్పేవారు. వాళ్ళని నమ్ముకోవడం అనవసరమని నేనే గ్రామాలకి వెళ్లాను. రైతులకి రుణాలపైనే పంపుసెట్లు ఇవ్వడం ప్రారంభించాను. అలా ఓసారి నల్గొండలోని ఓ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి రైతు ఒకాయన మాటల మధ్యలో ‘ఏ మోటారైనా లోఓల్టేజీకి ఆగిపోతోంది... హైఓల్టేజీకి కాలిపోతోంది. కరెంటు ఎలా వచ్చినా పనిచేసే పంపుసెట్లు తయారుచేయండయ్యా!’ అన్నాడు. ఓ గొప్ప బిజినెస్‌ ఆలోచనని అంత సింపుల్‌గా చెప్పినందుకు... అతని చేతుల్ని నా కళ్ళకద్దుకున్నాను.

అదే మలుపు...

సిటీకి వస్తూనే మా తమ్ముడికి ట్రంకాల్‌ చేశాను. వోల్టేజ్‌ హెచ్చుతగ్గులున్నా పనిచేసే మోటార్లు తయారుచేయమని చెప్పాను. దాదాపు ఆరునెలలు కష్టపడి... దేశంలో ఎక్కడాలేని విధంగా అలాంటి పంపుసెట్లని హైదరాబాద్‌కి పంపాడు. వారంలోనే అన్నీ అమ్ముడుపోయాయి. గ్రామాల్లో- లో వోల్టేజ్‌ ఉన్నప్పుడు మిగతా పంపుసెట్లన్నీ మూగబోతే మావి మాత్రం ‘డబ్‌ డబ్‌’ అంటూ నీటిని తోడుతుంటే... రైతుల్లో కనిపించే ఆనందం అంతా ఇంతా కాదు! ఆ తర్వాత రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో డిస్ట్రిబ్యూటర్లని నియమించకుండా నేరుగా తాలూకా స్థాయుల్లోనే విక్రయాలు మొదలుపెట్టి... కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాను. అందువల్ల ఆ రెండు అంచెల్లో పెట్టాల్సిన ఖర్చు తగ్గింది. అలా ఆదా అయిన లాభాలతో మిగతా కంపెనీలకన్నా తక్కువకే మోటార్లని ఇవ్వడం ప్రారంభించాం. అమ్మకాలు రెట్టింపయ్యాయి. అప్పుడే తొలిసారి మా సంస్థకి 10 మంది ఉద్యోగుల్ని నియమించుకున్నాం. చిత్తూరులోనూ ఆఫీసు తెరిచి ఆంధ్రప్రదేశ్‌ మొత్తం విస్తరించాం. ఇక్కడ అందుకున్న విజయాలతోనే... మిగతా రాష్ట్రాల వైపు అడుగులేశాం. ఆ తర్వాత- 30 శాతం కరెంటుని ఆదాచేసే ‘ఎనర్జీ ఎఫిషియెంట్‌’ పంపుసెట్లని తయారుచేసి అతితక్కువ ధరకి ఇవ్వడంలో దేశంలోనే నంబర్‌ వన్‌ అనిపించుకున్నాం. అప్పుడే రాష్ట్రప్రభుత్వాలు బోరుబావులకి అనుమతులు ఇవ్వడం మొదలుపెట్టడంతో... మేమూ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నాం. భూగర్భంలో ఉన్నా పనిచేసే సరికొత్త సబ్‌మెర్సిబుల్‌ పంపుల్ని పరిచయం చేయడంతో కంపెనీ దశ తిరిగిపోయింది. నాన్న చనిపోయినప్పుడు ‘జీరో’లో ఉన్న మా సంస్థ... మరో పదేళ్ళకి నాలుగుకోట్ల రూపాయల టర్నోవర్‌కి చేరుకుంది.

ఎగుమతుల్లో టాప్‌!

ఓసారి యూరప్‌లో జరిగిన ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు తొలిసారి వందశాతం స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ మోటార్లని చూశాను. భూమి అడుగున ఎంత లోతున ఉంచినా సరే... వాటికి తుప్పుపట్టదు. మన రైతులకీ వాటిని అందివ్వాలనుకుని... ఖర్చు ఎక్కువైనా భరించి పూర్తి స్వదేశీ సాంకేతికతతో దాన్ని తెచ్చాం. వాటితోనే తొలిసారి విదేశీగడ్డపైన పాదం మోపాం. దక్షిణాఫ్రికాలో తొలి కార్యాలయాన్ని తెరిస్తే... అక్కడి శాంతిభద్రతల సమస్యతో వరసగా మూడేళ్లు కంపెనీ లూటీకి గురైంది. అయినా ఫర్వాలేదని కొనసాగి... ఎనిమిదేళ్ళ తర్వాత లాభాలు చూశాం. షార్జాలోనూ, బ్రెజిల్‌లోనూ బిజినెస్‌ మొదలుపెట్టాం. అన్నిదేశాల్లో సక్సెస్‌ అయినా... అమెరికా మాత్రం మాకు కొరకరాని కొయ్యగా ఉండేది. ఓ భారతీయ కంపెనీ వాళ్ళ ఉత్పత్తిరంగంలో అడుగుపెడతామంటే... నానా కొర్రీలు పెట్టి కాదనేవారు. ప్రతిసారీ ‘ఇప్పుడు కాదు పదేళ్ళ తర్వాత రండి... అప్పటిదాకా మీ కంపెనీ ఉంటే!’ అని వ్యంగ్యంగా మాట్లాడేవారు. దాన్ని సవాలుగా తీసుకుని పిడుగుపడ్డా పనిచేయగలిగే మోటార్లతో వాళ్ళనీ మెప్పించి ఎగుమతులు మొదలుపెట్టాం. వీటితో ఎగుమతుల్లో నంబర్‌వన్‌గా మారాం. వ్యవసాయానికీ ఇళ్ళకే కాదు... పరిశ్రమలూ నీటిపారుదల ప్రాజెక్టులకయ్యే భారీ మోటార్లనీ మేం తయారు చేస్తున్నాం. తెలంగాణ మిషన్‌ భగీరథ, ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు- పుంగనూరు ప్రాజెక్టుల్లో వాడేందుకు మోటార్లని సరఫరా చేశాం. ఆరేళ్ళకిందట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతుల కోసం ఉచితంగా పంపిణీ చేసిన ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’తో కూడిన ఎనర్జీ ఎఫిషియెంట్‌ పంపుసెట్లూ మేము తయారుచేసినవే. ఇలా 21 లక్షల సోలార్‌ పంపుల్ని ఇన్‌స్టాల్‌ చేశాం. వీటిగ్గాను రాష్ట్రపతి ఏటా అందించే నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డుని ఎనిమిదిసార్లు అందుకున్నాం. గత ఆరేళ్ళుగా వరసగా మేమే సాధిస్తూ వస్తున్నాం!


తర్వాతి తరం... అమ్మాయిలదే!

మా సంస్థలో అన్నదమ్ములందరం రకరకాల బాధ్యతల్లో ఉన్నా... సిబ్బంది మొత్తం అమ్మ కనుసన్నల్లోనే పనిచేసేవారు. ఆమె బతికున్నదాకా సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకుంది. ఇప్పుడు ఆమె స్థానాన్నే కాదు... మమ్మల్నీ భర్తీచేసేందుకు సిద్ధమయ్యారు మా అమ్మాయిలు. ఔను... మా అన్నదమ్ములెవరికీ మగపిల్లల్లేరు. వాళ్ళకి పెళ్ళి చేసి అల్లుళ్ళకి బాధ్యత ఇవ్వడంకన్నా... కూతుళ్ళే కంపెనీని నిర్వహించేలా వాళ్ళకి చిన్నప్పటి నుంచీ శిక్షణనిచ్చాం. సాహితీ, లక్షణా, నేహా, శహన... ఈ నలుగురూ ఇప్పటికే సంస్థలోకి వచ్చేశారు.దాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు