‘అందమైన’ బంగారం..!

గ్రాము బంగారం కొనడానికే సామాన్య మానవుడు తలకిందులవుతున్నాడు. అలాంటిది సిరిపుత్రికలు మాత్రం అలంకరించుకునే నగల్లోనే కాదు, ఆ బంగారాన్ని లేపనంగానూ రాసేసుకుంటున్నారు.

Published : 28 Jan 2023 23:22 IST

‘అందమైన’ బంగారం..!

గ్రాము బంగారం కొనడానికే సామాన్య మానవుడు తలకిందులవుతున్నాడు. అలాంటిది సిరిపుత్రికలు మాత్రం అలంకరించుకునే నగల్లోనే కాదు, ఆ బంగారాన్ని లేపనంగానూ రాసేసుకుంటున్నారు. అవునుమరి... అనేక లగ్జరీ బ్రాండ్‌లు కాంతులీనే మోము కోసం స్వచ్ఛమైన 24 క్యారట్ల కాంచనాన్ని సౌందర్యోత్పత్తుల తయారీలోనూ వాడుతున్నాయి.

ముత్యాలూ రత్నాలూ ఎన్ని రంగుల్లో ఎంత అందంగా ఉన్నా బంగారంలో పొదిగితేనే వాటి అందం ఇనుమడిస్తుంది. అలాగే చంద్రబింబంలా మెరిసిపోయే అమ్మాయికైనా కాస్త సౌందర్యపోషణ ఉంటేనే ఆ అందం ద్విగుణీకృతమవుతుంది. అందుకే పూర్వకాలం నుంచీ భారత్‌, చైనా దేశాలతోపాటు మరెన్నో దేశాల్లో అందం గురించి ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. అందుకోసం రకరకాల మూలికల్ని కలిపి రాసుకునేవారు. అందులోభాగంగా పచ్చని నిగారింపుకోసం అంతోఇంతో బంగారాన్నీ సౌందర్య లేపనాల్లో కలిపి రాసుకునేవారట. కాలక్రమంలో దీని ధర ఆకాశాన్నంటడంతో పసిడి వాడకం నగలకే పరిమితమైంది. కానీ కొన్ని పరిశోధనల్లో బంగారాన్ని నానో పార్టికల్స్‌ రూపంలో వాడటంవల్ల చర్మం కాంతులీనుతుందని తేలిందట. పైగా బంగారం జడపదార్థమనీ వేటితోనూ చర్యపొందదు కాబట్టి ఎలాంటి హానీ ఉండదనీ చెబుతున్నారు. దాంతో లారియల్‌, లా ప్రెయిరీ, అమాలా, క్లె డె పియావొ, బెల్లెఫాంటెయిన్‌, మెర్లె నార్మన్‌, అహావా, నెస్కో.. వంటి లగ్జరీ బ్రాండ్‌లు 23, 24 క్యారట్ల బంగారాన్ని సౌందర్యోత్పత్తుల తయారీ లోనూ వాడుతున్నాయి. టాట్చా కంపెనీ కెమీలియా పూల తైలంతో తీసుకొచ్చే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో 23 క్యారట్ల బంగారాన్ని జోడిస్తే, లారియల్‌ కంపెనీ లాకోర్‌ పారిస్‌ 24 కె గోల్డ్‌ కలెక్షన్‌ పేరుతో అనేక ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇలా మరెన్నో కంపెనీలు బంగారు రేణువుల్నీ ద్రవాన్నీ క్రీములూ లోషన్లూ మాయిశ్చరైజర్లూ లిప్‌బామ్‌లూ మాస్క్‌లూ ఐ క్రీములూ సన్‌స్క్రీన్‌లూ సబ్బుల తయారీలోనూ వాడుతున్నాయి. అందులో వాడిన బంగారం, ఇతరత్రా పదార్థాల్ని బట్టి ఇవి 8 వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయల వరకూ ఉంటున్నాయి. 

ఎలా పనిచేస్తాయి?

బంగారాన్ని నానో రేణువుల రూపంలో వాడటంవల్ల అవి చర్మకణాల్లోకి చొచ్చుకువెళ్లి, వాటిని పునరుజ్జీవింప జేస్తాయి. దాంతో ముడతలూ గీతలూ పోయి ముఖారవిందం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అలాగే పసిడిలోని అయాన్లు రక్తప్రసరణను ప్రేరేపించడంతో ముఖంమీద ఉన్న చర్మకణాల్లోని వ్యర్థ పదార్థాలన్నీ బయటకు పోతాయట. అందుకే నెలకోసారి గోల్డ్‌ ఫేషియల్‌ చేయించుకోవడం వల్ల చర్మకణాల్లో కొలాజెన్‌ ఉత్పత్తి పెరిగి వయసును కనబడనీయకుండా చేస్తుందని చెబుతున్నారు. బంగారానికి యూవీ కిరణాల్ని అడ్డుకునే శక్తీ ఉందనీ తద్వారా ఎండలోకి వెళ్లినప్పుడు మెలనిన్‌ ఉత్పత్తిని తగ్గిస్తుందన్న కారణంతోనూ గోల్డ్‌ ఫేస్‌ మాస్క్‌లెన్నో మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక, ముఖాన్ని శుభ్రం చేసే క్లెన్సర్లలోనూ దీన్ని కలుపుతున్నారు. ఎందుకంటే- ఇందులోని యాంటీ బాక్టీరియల్‌, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు చర్మంమీద ఉన్న బ్యాక్టీరియాతో పోరాడి మొటిమల్ని నివారిస్తాయట. పసిడిలోని అయాన్లూ కొద్దిపాళ్లలో ఉన్న ఖనిజాలూ ముఖంమీద ఉన్న మురికినీ ట్యాన్‌నీ తొలగిస్తాయని చెప్పే బ్లీచింగ్‌ క్రీములూ వస్తున్నాయి. చర్మకణాల్లో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచి రక్తప్రసరణ పెరిగేలా చేయడంతోపాటు అలర్జీలూ దద్దుర్లూ రాకుండానూ చేస్తుందనీ, కళ్ల కింద ఉన్న ఉబ్బును తొలగిస్తుందనీ చెప్పేవీ మార్కెట్లో ఉన్నాయి. అయితే కొందరు వైద్యులు దీనివల్ల అదనంగా వచ్చే ఫలితం ఏమీ ఉండదని చెబుతున్నప్పటికీ బ్యూటీ ఉత్పత్తుల్లో మాత్రం దీని వాడకం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అందంపట్ల ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..