నగల మేళా!

ఫ్యాషన్‌ దుస్తులతోపాటూ జ్యువెలరీలోనూ కొత్తట్రెండ్స్‌ ఫాలో అవ్వాలనుకుంటున్నారా... అయితే మార్కెట్లో మెరిసిపోతున్న ఈ సరికొత్త నగల్ని ప్రయత్నించి చూడండి.

Published : 23 Jun 2024 00:33 IST

ఫ్యాషన్‌ దుస్తులతోపాటూ జ్యువెలరీలోనూ కొత్తట్రెండ్స్‌ ఫాలో అవ్వాలనుకుంటున్నారా... అయితే మార్కెట్లో మెరిసిపోతున్న ఈ సరికొత్త నగల్ని ప్రయత్నించి చూడండి. అద్భుతమైన నగిషీలతో దేవుడి ఉంగరాలూ, అదిరిపోయే డిజైన్లతో పూసల పెండెంట్లూ, ఆకట్టుకునే మోడళ్లతో రుద్రాక్షల బ్రేస్‌లెట్లూ... ఈతరం మనసును దోచేస్తున్నాయి!


దేవుళ్ల ఉంగరాలు!

మ్మమ్మల నుంచి అమ్మాయిల వరకూ అందర్నీ మెప్పించే నగలేవైనా ఉన్నాయా అంటే... అవి కచ్చితంగా టెంపుల్‌ జ్యువెలరీనే. హారాల దగ్గర్నుంచి గాజుల వరకూ ప్రతిదాంట్లోనూ కనిపించిన ఈ టెంపుల్‌ థీమ్‌- నగల ప్రియుల్ని బుట్టలో పడేస్తూ ఈమధ్య చేతి ఉంగరాల్లోకీ చేరిపోయింది. అప్పట్లో చిన్న డిజైన్లలో కనిపించే దేవుళ్ల చిత్రాలు... ఇప్పుడు చక్కటి నగిషీలూ, రత్నాల మెరుపులతో అచ్చంగా దేవుడి విగ్రహ రూపాల్లా వస్తున్నాయి. లక్ష్మీదేవీ, వేంకటేశ్వరస్వామీ, శివపార్వతులూ... ఇలా ఎందరో దేవుళ్ల రూపాలతో- వజ్రాలూ, కెంపులూ, పచ్చలూ, నీలాల రాళ్ల చమక్కుల్ని జత చేసుకుని కనువిందు చేస్తున్నాయి. ఆడవాళ్లతోపాటు మగవాళ్లకూ వీటిల్లో రకరకాల డిజైన్లు దొరుకుతున్నాయి. అనుక్షణం తమ ఇష్టదైవాన్ని స్మరించుకునేవాళ్లు- ఈ టెంపుల్‌ థీమ్‌ ఉంగరంతో ఆ దేవుడి రూపాన్ని కళ్లముందుకు తెచ్చుకోవచ్చు!


రుద్రాక్షల బ్రేస్‌లెట్‌!

గవంతుడికి ప్రతిరూపమని చెబుతూ కొందరూ, వాటిని ధరించడం వల్ల ఆరోగ్యమంటూ మరికొందరూ... ఇలా రకరకాల నమ్మకాలతో రుద్రాక్షల్ని ధరిస్తారు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని ఎంతో పవిత్రంగా భావించే ఆ రుద్రాక్షల్ని- మామూలు దారానికి కట్టుకునే బదులు విలువైన బంగారు నగల్లో తీసుకొస్తే ఎలా ఉంటుంది అనుకున్నారేమో తయారీదారులు- చిన్న చిన్న బంగారు రుద్రాక్షల లాకెట్లతోపాటూ బ్రేస్‌లెట్లనీ తీసుకొచ్చేశారు. ఈతరానికి నచ్చేలా ట్రెండీ డిజైన్లలో వీటిని తయారుచేస్తున్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్వస్తిక్‌, ఓం, త్రిశూలం లాంటి గుర్తుల్నీ బ్రేస్‌లెట్లకి జత చేస్తున్నారు. మిగతా వాళ్ల సంగతేమోకానీ దైవభక్తి ఉన్నవాళ్లకు బహుమతిగా ఈ రుద్రాక్షల బ్రేస్‌లెట్‌ని అందించారంటే... కచ్చితంగా అది వారికి అపురూపమైన కానుకే అవుతుంది!


పూసల పెండెంట్లు!

బంగారమేంటీ... రత్నాలేంటీ... పూసలేంటీ... అన్నీ నగల్లో భాగం కావాల్సిందే, అమ్మాయిల మెడని చుట్టి అందాల ఆభరణంగా మారాల్సిందేనంటూ డిజైనర్లు సరికొత్త జ్యువెలరీని తీసుకొస్తుంటారు. అందులో భాగంగా కొత్తగా డిజైన్‌ చేసినవే ఇక్కడున్న ఈ పూసల పెండెంట్లు. అందమైన బంగారు డిజైన్ల వెనక రంగు రంగుల పూసల వరసల్ని జోడిస్తూ... లాకెట్టునే చక్కని కళా చిత్రంలా తీర్చిదిద్దుతున్నారు. రాధాకృష్ణులూ, నెమళ్లూ, పువ్వులూ, చెట్లూ... ఇలా బోలెడన్ని డిజైన్లతో ఉండే ఈ లాకెట్లకు బ్యాక్‌గ్రౌండ్‌లో మెరిసే రాళ్ల పూసలు సరికొత్త అందాన్ని తీసుకొస్తున్నాయి. కొంచెం సంప్రదాయంగానూ, మరికొంచెం ట్రెండీగానూ కనిపించే ఈ పెండెంట్లని ఎక్కువగా బీడ్స్‌ హారాలకు వేసుకుంటున్నారు. అటు బంగారమూ
ఇటు పూసలూ కలగలిసిపోతూ మెరిసే ఈ నగలు- తక్కువ బంగారంతోనే ఓ చక్కని ఆభరణం చేసుకోవాలనుకునేవారికి తప్పక నచ్చేస్తాయి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..