Published : 28 Jan 2023 23:57 IST

కరణేషు మంత్రి

- యమున చింతపల్లి

‘‘ఆఒక్క టెస్ట్‌ కూడా అనుకూలంగా వచ్చి, మీ సర్జరీ త్వరగా పూర్తి అయిపోవాలని కోరుకుంటున్నాను. అంతా బాగా జరగాలని మొక్కుకున్నాను కూడా’’ అంది ఊర్మిళ నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ.

తన ఆ చర్య, ‘అర్థం కాని ఆల్జీబ్రా లెక్కలాగా’ ఉంది నాకు. నిజంగా నా మంచే కోరుకుని ఉంటే, ఉన్నట్లుండి తన నిర్ణయం ఎందుకు మార్చుకుంది... నన్ను వేధిస్తున్న ప్రశ్న, జవాబు దొరకని ప్రశ్న.

లోతుగా తన కళ్ళల్లోకి చూశాను.

స్ఫటికమంత స్వచ్ఛంగా ఉన్న ఆ కళ్ళల్లో, నామీద ప్రేమే కనపడింది. తట్టుకోలేనట్లు కళ్ళు మూసుకున్నాను.

* * * * *

మాది పెద్దలు చేసిన పెళ్ళి. మా ఇరుకుటుంబాల గురించి బాగా తెలిసినవారు మధ్యవర్తులుగా వ్యవహరించి మాకు పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. పెద్దల సమక్షంలో పెళ్ళిచూపుల కార్యక్రమం ఆరంభమయింది. పరిచయాలూ పలకరింపులతో అరగంట గడిచిపోయింది.

‘‘ఊర్మిళా, పైకి తీసుకెళ్ళి మన పూలమొక్కలు చూపించు’’ అన్నారు ఊర్మిళ నాన్నగారు. మాకు ఏకాంతం కల్పించటానికే ఆ ఏర్పాటని నాకు అర్థమయింది.

అది మా నాన్నకి కూడా అర్థమయిందనుకుంటా, ‘‘అవున్రా అబ్బాయీ, అమ్మాయితో కలిసి వెళ్ళి మొక్కలు చూసిరా’’ అని వంత పాడారు.

ఊర్మిళ లేచి నుంచుని ‘రండి’ అన్నట్లు నాకేసి చూసింది. ఇద్దరం సాయంవేళ డాబా మీదకు చేరాం.

అక్కడంతా రకరకాల మొక్కలు. ఆ మొక్కలను ప్రేమగా స్పర్శిస్తూ, వాటిని పరిచయం చేసింది. తనలోని పొందిక తను పెంచుతున్న మొక్కల్లోనూ కనపడింది. తనకు మొక్కలంటే ప్రీతని అర్థమయింది. ఊర్మిళ, సున్నితంగా వాటిని డీల్‌ చేసే విధానం ముచ్చటగా ఉంది. తనలో కృత్రిమత్వమూ బెరుకూ ఏమాత్రం కనపడలేదు. అది నన్ను ఆకర్షించింది.

తరువాత మా చదువులూ ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నాం. మామధ్య జారిపోతున్న క్షణాలూ జరుగుతున్న మాటలూ సాగిపోతున్న నీలిమబ్బులలాగా ఆహ్లాదాన్ని నింపుతున్నాయి. ఎందుకో మా నడుమ ఓ ఆత్మీయబంధం ఆ క్షణాన ఏర్పడ్డట్లు అనిపించింది.

‘‘పెళ్ళి తరువాత కూడా మీ ఉద్యోగం, కెరియర్‌లో ఎదగటానికి నా పూర్తి సహకారం ఉంటుంది’’ నా మనసులోని ఇష్టాన్ని ఇన్‌డైరెక్ట్‌గా వ్యక్తపరుస్తూ అన్నాను.

‘‘నాకు కుటుంబమూ బాంధవ్యాలూ ముఖ్యం. పెళ్ళి తరువాత ఒకవేళ ‘ఉద్యోగమా, కుటుంబమా’ అనే పరిస్థితి ఏర్పడితే నేను రెండో దానికే ఓటు వేసి మొదటిది వదులుకుంటాను. అందుకు మీరు సిద్ధమేనా’’ అంది చెక్కు చెదరని చిరునవ్వుతో ఛాలెంజ్‌ చేస్తున్నట్లు.

‘మాకు మా ఉద్యోగం, కెరియర్‌ ముఖ్యం. ఆ తరువాతే ఏ బంధాలైనా’ అన్నట్లున్న నేటి పరిస్థితుల్లో ఆమె అలా అనటం నాకు విస్మయం కలిగించింది. కాకపోతే తనకూ నేను నచ్చబట్టే కదూ ‘పెళ్ళి తరువాత’ అని మాట్లాడుతోంది అన్న ఆనందం మటుకు మనసును చుట్టేసింది.

‘‘ఏ నిర్ణయమైనా అది పూర్తిగా మీ ఇష్టం’’ ‘చేతిలో ఉన్న వజ్రం చేయిజారకూడదన్నట్లు’ ఆత్రుతగా చెప్పాను. గమ్మత్తుగా నవ్వింది.

‘ఇంకేమి మాట్లాడితే ఏమో’ అన్నట్లు మౌనం వహించాను. ఐదు నిమిషాల తరువాత

‘‘మీ అమ్మా నాన్నగారూ మనతో కలిసే ఉండాలి. వాళ్ళని మనకి అడ్డుగా అనుకోకూడదు’’ అంది మా మధ్య నిశబ్దాన్ని బ్రేక్‌ చేస్తూ.

నా వినికిడి మీద నాకే ఎందుకో డౌట్‌ వచ్చింది. కొంగుముడి పడిన మరుక్షణం, తల్లిదండ్రుల నుండి విడివడి వేరు కాపురం అంటున్న ఈ రోజుల్లో తను ఇలా మాట్లాడటం నమ్మలేకపోయాను.

‘‘వ్వాట్‌..’’ అన్నాను నా షాక్‌ని ఏమాత్రం దాచుకోకుండా.

‘‘కొడుకు పెళ్ళంటే ‘కోడలు రావటం, కొడుకు దూరమవటం’ కాదు కదా’’ అంది నాకేసి సూటిగా చూస్తూ.

నేడు నేను వింటున్నవాటికీ ఆమె వినిపించిన దానికీ సంబంధమే లేకుండా ఉంది. నాకు ఎలా రియాక్ట్‌ అవ్వాలో తెలియటం లేదు. ‘అసలు నన్ను ఇంప్రెస్‌ చెయ్యటానికి ఓవర్‌ యాక్షన్‌ చేస్తోందా’ అనే అనుమానం కూడా కలుగుతోంది.

‘‘పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం ఏర్పడటం మాత్రమేకాక రెండు కుటుంబాల మధ్య సంబంధాలు అల్లుకోవటం కూడా. అన్నట్లు... నా తల్లిదండ్రులకి కూడా మన ఇంటికి వచ్చి పోవటానికి అదే స్వేచ్ఛ అప్లయ్‌ అవుతుంది’’ అంది అక్కడ నేల మీదకు జారిన తమలపాకు తీగను తన సుతిమెత్తని వేళ్ళతో తీసి పోల్‌కి చుడుతూ.

నా అనుమానాలూ ఆలోచనలూ దాచి పెట్టుకుంటూ ‘‘మళ్ళీ టచ్‌లోకి వద్దాం’’ అని ముగించాను.

ఇంటికి వచ్చిన తరువాత జరిగింది చెప్పాను. అంతా విన్న అమ్మా నాన్నా ‘అలాంటి బంగారుతల్లిని వదులుకోకూడదు’ అని కంకణం కట్టుకున్నారు. దాంతో మా పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది.

* * * * *

'మూడేళ్ళు మూడు క్షణాలుగా గడిచిపోయాయి. ఆనందంలో మునిగి ఉన్న మనిషికి కాలం అలాగే గడుస్తుందేమో. ఊర్మిళలో ‘ఉద్యోగస్తురాలిని... సంపాదిస్తున్నాను’ అనే అహంభావం కానీ, అది అలుసుగా చూపి అమ్మానాన్నల చేత అడ్డమైన చాకిరీ చేయించుకునే మనస్తత్వం కానీ నేను చూడలేదు.

తను అమ్మానాన్నల పట్ల చూపించే ప్రేమాభిమానాలు నన్ను అబ్బురపరిచాయి. ఇప్పుడు నాకన్నా తనే ఎక్కువ అయిపోయింది. తనమీద వాళ్ళ ప్రేమ చూస్తుంటే, ఒక్కోసారి అసూయతో నాకు ఒళ్ళు మండేది.

మాకు కొడుకు పుట్టడం, నాన్న రిటైర్‌ అవ్వటం ఒకేసారి జరిగింది. అమ్మానాన్న- మనవడి ముద్దు మురిపాలతో ఆనందంగా గడుపుతున్నారు. మెటర్నిటీ లీవ్‌ అయిపోయి ఊర్మిళ తిరిగి ఉద్యోగంలో చేరే సమయం ఆసన్నమయింది.

‘‘పసివాడిని వదిలి వెళ్ళటానికి మనసు రావటం లేదు’’ అంది నా గుండెలమీద తలవాల్చి దిగులుగా.

నాకు వెంటనే- ‘ఉద్యోగమా... కుటుంబమా’ అనే పరిస్థితి వస్తే ఉద్యోగం వదిలేస్తా’ అని పెళ్ళిచూపులనాడు మా మధ్య జరిగిన మాటలలో తను చెప్పిన కండిషన్‌ గుర్తుకొచ్చింది. ‘కొంప ముంచి, బంగారం లాంటి ఉద్యోగం వదిలి వేస్తుందా పిల్లవాడి కోసం..?’ నాలో ఓ క్షణం కలవరం.

‘‘మొదట్లో అలాగే బెంగ ఉంటుంది... మెల్లగా అలవాటవుతుందిలే’’ అన్నాను ప్రోత్సహిస్తున్నట్లుగా.

తను మౌనమే సమాధానంగా ఇచ్చింది. ఏదైనా కానీ నేను మటుకు, పెళ్ళిచూపులనాడు తనకిచ్చిన మాట తప్పదలుచుకోలేదు.

* * * * *

మనవడి పెంపకం గురించి అమ్మ ఇచ్చిన భరోసానో లేదా తనకు ఆర్జనపై ఉన్న మమకారమో... ఉద్యోగం మటుకు మానలేదు ఊర్మిళ. అది చూసి- ‘ఏదో అప్పట్లో స్టైల్‌గా చెప్పింది కానీ ఈ రోజుల్లో ఉద్యోగం వదులుకునే వాళ్ళెవరు’ అనుకుని నాలో నేనే నవ్వుకున్నాను.

కానీ తను నా అంచనాలను తారుమారు చేసింది. పరుగెడుతున్న రెండేళ్ళ నా కొడుకు ‘విక్కీ’ని పట్టుకోబోయి కాలు జారి పడిపోయింది అమ్మ. నడుము ఫ్రాక్చర్‌ అయింది. అమ్మ పనులు చేయటానికి మనిషిని పెట్టాం. నాన్న తోడు ఉన్నారు. అయినా ‘‘ఇప్పుడు అత్తయ్యగారికి బాహ్యమైన సహాయంతోపాటు మానసిక తోడ్పాటు కావాలి. ఆవిడ పూర్తిగా నార్మల్‌ అయ్యేదాకా ఆఫీసుకు వెళ్ళను’’ అని లాస్‌ ఆఫ్‌ పే (జీతం నష్టం) మీద సెలవు పెట్టేసింది ఊర్మిళ. చెదరని ప్రేమతో, చెక్కు చెదరని చిరునవ్వుతో అమ్మను దగ్గరుండి చూసుకుంది.

నా ఉద్యోగంలో, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కూడా తను ఇచ్చే సూచనలు అబ్బురపరిచేవి.

ఆఫీసులో కూడా ‘డెడికేటెడ్‌ వర్కర్‌, వర్క్‌ హాలిక్‌’ అని తనకు పేరు.

‘కరణేషు మంత్రి...’ అన్నట్లు ప్రతి విషయంలోనూ తన సలహాలతో ప్రత్యేకత చాటుకునేది.

* * * * *

ఆనందంగా, సజావుగా సాగిపోతున్న మా కుటుంబంలో, అనారోగ్యపు పులి అకస్మాత్తుగా నాపై పంజా విసిరింది.

నా రెండు కిడ్నీలూ చెడిపోయాయని డాక్టర్లు నిర్ధారించారు. టెంపరరీగా డయాలసిస్‌ మీద బతుకు పొడిగింపు జరుగుతోంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (మార్పిడి) చేయక తప్పని పరిస్థితి.

‘‘బయట వాళ్ళ నుండి కిడ్నీని పొందటం చాలా కష్టం. స్వచ్ఛందంగా ఎవరన్నా ముందుకు వచ్చినా అనుమానించే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పైగా ఆర్డర్‌ ప్రకారం వెళ్ళాలి. అక్రమాల కిడ్నీ అమ్మకం ఓ రాకెట్‌ స్థాయిలో నడుస్తోందని తెలుసుగా... అందుకే కష్టంగా ఉంది. లక్‌ ఉంటే తొందరగానే దొరకొచ్చు’’ అని ఉన్న పరిస్థితిని వివరించాడు డాక్టర్‌.

కిడ్నీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అది అంత సులభం కాదని అర్థమయినకొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. ‘కిడ్నీ మార్పిడి అవసరం పెరిగిపోతోందని’ నాలో క్షీణిస్తున్న శక్తి చెపుతోంది. నాలోని కలవరం పసిగట్టో లేదా ఆరోగ్య పరిస్థితి అర్థమయ్యో ‘‘కుటుంబ సభ్యులు సహకరించి, వాళ్ళ కిడ్నీ మీకు సూట్‌ అయితే అంతకన్నా అదృష్టం మరోటి లేదు’’ అని డాక్టర్‌ సలహా ఇచ్చారు.

వెంటనే అమ్మా నాన్నా, అక్కయ్యా ముందుకు వచ్చారు. వాళ్ళ కిడ్నీ నాకు సూట్‌ కాలేదు కానీ, వారికి నాపై ఉన్న ప్రేమ మటుకు గుండెను తాకింది.

‘‘భార్య కిడ్నీ డొనేట్‌ చేసి, భర్తను దక్కించుకున్న కేసులు కూడా ఉన్నాయి. ఓసారి మీ భార్యకి కూడా పరీక్షలు జరిపితే బాగుంటుందేమో’’ అన్న డాక్టర్‌ మాట పూర్తికాకముందే- ‘‘అరె, ఇన్నాళ్ళూ ఈ విషయం నాకు తట్టనే లేదు. ఒకవేళ నేను ఇవ్వగలిగితే అంతకన్నా అదృష్టం ఏముంది’’ అంది ఊర్మిళ. వెంటనే దానికి అవసరమైన పరీక్షలు అన్నీ చేయించుకుంది.

‘‘మీ కిడ్నీ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయింది’’ అని డాక్టర్‌ ఫలితాలు వెల్లడించిన రోజు ఊర్మిళ చూపిన ఆనందం మాటల్లో చెప్పలేను.

‘‘ఇక మీకు ఢోకా లేదు. ఈ విధంగా కూడా మన ఆలుమగల అనుబంధం బలమైనదని రుజువవుతోంది’’ అని చిన్నపిల్లలా సంబరపడిపోయింది.

నాకూ నా కుటుంబసభ్యులకూ కూడా ఓ రిలీఫ్‌ వచ్చింది. చాలా రోజుల తరువాత ఇంట్లో కాస్త సంతోషకరమైన వాతావరణం నెలకొంది.

‘‘డాడీ, నువ్వు మళ్ళీ నాతో క్రికెట్‌ ఆడతావటగా, కథలు చెబుతావటగా... అమ్మ చెప్పింది’’ అన్నాడు ఐదేళ్ళ మా గారాల పట్టి ‘విక్కీ’ నా మెడ చుట్టూ చేతులు వేసి.

బహుశా ‘అమ్మా, డాడీ నాతో ఎందుకు ఆడటం లేదు... కథలు చెప్పటం లేదు’ అని విక్కీ అడిగిన తెలిసీ తెలియని ప్రశ్నలకు ఊర్మిళ వాడిని ఊరడించి, ఊరించి చెప్పి ఉంటుంది.

‘‘అవును కన్నా, ఎప్పటిలాగే నేను ఆడతాను. అమ్మ నీకు హోమ్‌వర్క్‌ చేయిస్తుంది’’ అన్నాను దగ్గరగా పొదివి పట్టుకుంటూ. మా హాస్పిటల్‌ విజిట్స్‌, ఆఫీసు ఒత్తిళ్ళతో ఈ మధ్య మేము వాడితో గడిపే టైమ్‌కు గండిపడింది.

ఈ అయిదారు నెలలుగా వాడిని పట్టించుకోవటం కాస్త తగ్గింది.

‘ఊర్మిళకీ నాకూ సర్జరీ ఎప్పుడు చెయ్యాలి... మంచిరోజు ఎప్పుడు? తరువాత రికవరీకి ఎంత టైమ్‌ పడుతుంది... ఇంటి మేనేజ్‌మెంట్‌- ముఖ్యంగా ‘విక్కీ’ని ఎలా మేనేజ్‌ చెయ్యాలి’ అనే చర్చలు మొదలయ్యాయి.

అంతలోనే ‘‘డాక్టర్‌, నా కిడ్నీ సూట్‌ అయినందుకు సంతోషమే. కానీ ఇంకేదన్నా కిడ్నీ దొరుకుతుందేమో ప్రయత్నిద్దామా’’ అని ఊర్మిళ అడగటం మా అందరినీ విభ్రమానికి గురి చేసింది.

‘‘అలాగే, ప్రయత్నిద్దాం’’ అని ముక్తసరిగా అన్న డాక్టర్‌ మొహంలో కూడా నాకు షాక్‌ కనపడింది.

మళ్ళీ కిడ్నీ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

అసలు ఉన్నట్లుండి తను ఎందుకు అలా నిర్ణయం మార్చుకుందో అర్థంకాలేదు.

‘తనకు ఏమవుతుందో’ అనే ప్రాణ భయమా? పోనీ, అదే మనసు విప్పి చెప్పొచ్చు కదా. తను నా అర్ధాంగి. తనకు ఆ చనువు ఉంది. అసలు నేను లేని లోకమే తనకు వద్దందిగా....’

విక్కీ పుట్టినపుడు తనన్న మాటలు గబుక్కున నా మదిలో మెరిసి, రొద పెట్టాయి. విక్కీ డెలివరీ అప్పుడు తనకు చాలా కష్టమయింది. చచ్చి బతికినట్లయింది.

‘‘నువ్వు లేని లోకాన్ని ఊహలో కూడా భరించలేను’’ అన్నాను తన తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా.

‘‘మీరు ఊహ దాకా అన్నా వెళ్ళారు, నేను మటుకు మరుక్షణమే ఊపిరి వదిలేస్తాను’’ అంది నా చెయ్యి గట్టిగా పట్టుకుని. అలాంటి బంధం మాది.

కానీ ఇప్పుడు ఆ నమ్మకం వమ్ము అయ్యేటట్లు ఉంది.

అసలు తన కిడ్నీ నాకు మ్యాచ్‌ కాకుండా ఉన్నా బాగుండేది... ఈ వ్యధ తప్పేది నాకు.

* * * * *

నా పక్కన చేరి, ఏవో కబుర్లూ, రైమ్స్‌ మొదలెట్టిన విక్కీ నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. అనేక ఆలోచనలతో నలుగుతున్న మనసు... చల్లని ఏసీ గదిలో కూడా సేద తీరలేకపోతోంది.

దానికి కారణం నా జబ్బు కాదు, మార్చుకున్న ఊర్మిళ నిర్ణయం.

‘ఎవరైనా వచ్చేది శ్మశానం దాకా మాత్రమే, ఆపై ఆగిపోతారు. ఎవరికి ఉండదు ప్రాణంపై తీపి? నా జీవిత భాగస్వామి అయినంత మాత్రాన, మృత్యువులో భాగస్వామి కావటానికి ఇష్టపడుతుందా... అలా ఆశించటం తప్పేమో కూడా.’’

‘‘నాన్నా, డాడీ...’’ అంటూ నా బుగ్గలు తాకుతూ, చేతులు తిప్పుతూ ఏవేవో మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు విక్కీ. సిస్టమ్‌ ముందు కూర్చుని ఆఫీసు వర్కో, ఏమో చూస్తున్న ఊర్మిళ లేచి వచ్చింది.

నా గుండెల మీద నుండి విక్కీని జాగ్రత్తగా తన చేతులతో తీసుకుని భుజాన వేసుకుంది.

నన్ను వేధిస్తున్న విషయం అడగకుండా ఆగలేని వాడిలా... గబుక్కున తన చెయ్యి పట్టుకున్నాను. నా వంక ఏమిటన్నట్లు చూసింది. అంతలోనే బిడియమో, అహమో అడ్డుపడి చటుక్కున చెయ్యి వదిలిపెట్టేశాను.

వదిలిన నా చేతిని తన చేతిలోకి తీసుకుంది. నాలో ఏదో భద్రతాభావం.

‘‘నేను కిడ్నీ ఇస్తానని అంతలోనే వెనకడుగు వేయటం మిమ్మల్ని బాధిస్తోంది కదూ’’ అంది మెల్లగా.

అది విన్న నేను ‘‘నా ప్రతి ఆలోచనా తను తెలుసుకోగలదన్న విషయం నేను మరిచానే’’ అని ఉలిక్కిపడ్డాను.

‘‘నా ప్రతి ఆలోచనా మీతో పంచుకుంటానని మీకూ తెలుసు. నేను వెనకడుగు వేయటానికి కూడా మిమ్మల్ని సంప్రదించాలి అనుకున్నాను. కానీ ఈ పరిస్థితిలో, నా ఆలోచన చెప్పి మీలో అనవసరమైన ఆందోళనకి ఊపిరిపోస్తానేమో అని భయం, బాధ, దిక్కుతోచని స్థితి...’’ తన గొంతులో ఆర్ద్రత. ఏదో అడ్డుపడుతున్నట్లు ఆగిపోయింది.

‘‘మీ వ్యథ నాకు అర్థమయింది. అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇహ చెప్పక తప్పదు...’’ మాటలు కూడదీసుకుంటూ చెప్పింది.

‘‘మీరు నా ప్రాణం... ‘నా ప్రాణం పోయినా ఫరవాలేదు, మిమ్మల్ని రక్షించుకోవటంలో’ అనుకున్నాను. అందుకే కిడ్నీ ఇవ్వటానికి సిద్ధపడ్డాను. కానీ... కానీ...’’ తన గొంతులో దుఃఖం.

తను చెప్పబోయేది నా ఊహకు అందటం లేదు. ఊపిరి ఉగ్గబట్టి వింటున్నాను.

‘‘మనిద్దరి ప్రాణం విక్కీ అండీ. ఒకవేళ నా కిడ్నీ ఇవ్వటంలో, మీరు పుచ్చుకోవటంలో ఏదైనా తేడా వచ్చి ఇద్దరికీ ప్రమాదం వాటిల్లితే... ‘విక్కీ ఏమైపోతాడో’ అనే ఆలోచన ఉన్నట్లుండి నన్ను వేధించింది. పసివాడు... ఒక వయసుదాకా అమ్మో నాన్నో ఒక్కరన్నా వాడికి అవసరం అనిపించింది.

అందుకే...’’ తన రెండు ప్రాణాలనూ రక్షించుకోవాలనే ప్రేమ వరదై ఆమె గొంతులో సుళ్ళు తిరిగింది.

తన ఆలోచన అర్థమై, నా అనుమానం మాయమై... మనసు సిగ్గుతో కుంచించుకుపోయింది.

నా చెయ్యి పట్టుకున్న తన చేతిపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాను.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు