అందరి బంధువయా!

కింద నుండి గట్టిగా కొడుకు మాటలు వినిపించి బాల్కనీలోకి వెళ్ళి చూసింది అమల.  కొడుకు సిద్దూ వాచ్‌మన్‌తో గొడవ పడుతున్నాడు.

Updated : 26 Mar 2023 06:56 IST

అందరి బంధువయా!

- గోటేటి శాంతి

కింద నుండి గట్టిగా కొడుకు మాటలు వినిపించి బాల్కనీలోకి వెళ్ళి చూసింది అమల.  కొడుకు సిద్దూ వాచ్‌మన్‌తో గొడవ పడుతున్నాడు. గబగబా కిందకి వెళ్ళింది.

‘‘నేనేమీ అనడం లేదు బాబూ, ఈ కార్‌ పార్కింగ్‌ వాళ్ళు నిన్న కొత్త కారు కొన్నారు. అందుకని ఇక్కడ మీ సైకిలు పెట్టొద్దంటున్నాను’’ వినయంగా చెప్పాడు.

‘‘మాకూ కారుంది, నా సైకిలు అక్కడ పట్టదు’’ నిర్లక్ష్యంగా అన్నాడు.

‘‘అలా అంటే ఎలాగ బాబూ, వాళ్ళు చెప్పమన్నారు’’ మెల్లగా అన్నాడు నరసింహ.

‘‘నాకు నువ్వెందుకు చెబుతున్నావు? నీ లిమిట్స్‌లో నువ్వుండు. మా నాన్న బ్యాంకు మేనేజర్‌ తెలుసా?’’ గొప్పగా చెప్పాడు సిద్దు.

‘‘తప్పు సిద్దూ. నరసింహని అలా అనకూడదు. వాళ్ళు చెప్పమంటే చెప్పాడు. నీ సైకిలు మన కారు పక్కనే పెట్టుకో’’ అంది అమల.

‘‘ఇదిగో మీరందరూ ఇలా అలుసు ఇవ్వబట్టే నరసింహ పెత్తనం చెలాయిస్తున్నాడు’’ అని సైకిల్‌ తీసుకెళ్ళి తమ పార్కింగ్‌లో పెట్టి, తన కోపాన్ని ప్రదర్శించడానికి సైకిలుని ఒక తాపు తన్ని తల్లి వైపు కోపంగా చూసి పైకి వెళ్ళిపోయాడు.

‘వీడేమిటి, ఇలా తయారవుతున్నాడు’ అని బాధపడింది, భర్తతో చెబుదామంటే అతను ఊళ్ళో లేడు.

సిద్దూ అమలకి ఒక్కగానొక్క కొడుకు, టెన్త్‌ క్లాస్‌ చదువుతున్నాడు. ఆ ఫ్లాట్స్‌లో సిద్దూకి నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఈ మధ్య అందరూ కలిసి క్రికెట్‌ ఆడుతుంటే నరసింహ ‘‘వద్దు బాబూ, కిటికీలకి తగిలి అద్దాలు పగిలితే ఊరుకోరు’’ అన్నాడు.

దానికి అందరూ కలిసి ‘‘మా ఇష్టం, మేము ఆడతాం. నువ్వెవరు చెప్పడానికి? వాచ్‌మన్‌వి వాచ్‌మన్‌లా ఉండు. మేం ఓనర్లం జాగ్రత్త’’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

అక్కడే ఉన్న అమల ‘‘అదేమిటి పిల్లలూ... నరసింహ తప్పేమన్నాడు?

ఆ బాల్‌ ఎవరికైనా తగిలితే ప్రమాదం కదా?’’ గట్టిగా అడిగింది.

దాంతో అందరూ మెల్లగా జారుకున్నారు. సిద్దూ మాత్రం తల్లివైపు కోపంగా చూశాడు.

*                *              *

రెండు రోజులు పోయాక ఒక రోజు ‘పాలు రాలేదేమిటీ’ అనుకుంటూ బయటకి వెళ్ళిన అమలకి ఫ్లాట్స్‌లో మిగిలిన ఇళ్ళ వాళ్ళ మాటలు వినిపించాయి.

‘‘నరసింహ తండ్రికి సీరియస్‌గా ఉందని ఫోనొస్తే రాత్రి సెక్రటరీ గారికి చెప్పి వాళ్ళ ఊరెళ్ళాడుట’’ అంటున్నాడు ఒకాయన.

‘‘అరే... అయితే పాలు కింద నుంచి ఎవరు తెస్తారు. మనమే వెళ్ళి ఎవరి ప్యాకెట్లు వాళ్ళే తెచ్చుకోవాలి’’ అన్నాడాయన.

అమల ఇంట్లోకి వచ్చి ‘‘సిద్దూ, లేచి కిందకి వెళ్ళి మన పాల ప్యాకెట్లు అక్కడ పెట్టెలో ఉంటాయి తీసుకురా... నేను నైటీలో ఉన్నాను’’ కొడుకుని లేపింది అమల.

‘‘అబ్బా నాకు నిద్రొస్తోందమ్మా... అప్పుడే లేపకు.’’

‘‘అలా అంటే ఎలా నాన్నా... నరసింహ ఊరెళ్ళాడుట’’ అన్న తల్లి మాటలకి బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంటూ కిందకి వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకొచ్చాడు.

స్నానం మధ్యలో ట్యాప్‌ తిప్పితే నీళ్ళు రావటం లేదు. ‘‘అమ్మా నీళ్ళు రావడం లేదు. సగం స్నానం అయ్యింది’’ అరిచాడు సిద్దూ.

అమల బయటికి వచ్చి ‘ఎవరికి చెప్పాలా’ అని చూసింది. అందరికీ అదే సమస్య. పైన ట్యాంక్‌లో నీళ్ళు అయిపోయాయి, ఏం చెయ్యాలి? కొందరు మగాళ్ళు వెళ్ళి ఏవేవో స్విచ్‌లు వేసి తంటాలు పడి ఒక అరగంటలో నీళ్ళు వచ్చేలా చేశారు.

అమల వంటింట్లో పట్టుకున్న నీళ్ళు ఇస్తే సిద్దూ స్నానం పూర్తి చేశాడు. గబగబా టిఫిన్‌ తిని కిందకి వెళ్ళి సైకిల్‌ తీశాడు. ఒక్క రోజుకే బాగా దుమ్ము పేరుకుంది. రోజూ అయితే నరసింహ కార్లూ బళ్ళూ సైకిళ్ళూ అన్ని తుడుస్తాడు. ‘‘అమ్మా ఒక పాత గుడ్డ పడేయ్‌’’ అని సైకిల్‌ తుడుచుకుంటుంటే చిరాకొచ్చింది సిద్దూకి. ఇంతలో తల్లి పిలిచింది ‘‘సిద్దూ మంచినీళ్ళు రావటం లేదురా... సెక్రటరీ అంకుల్‌కి చెప్పు’’ అంది.

ఆయన దగ్గరికి వెళితే ‘‘మంచినీళ్ళు ఎన్ని గంటలకి వస్తాయో తెలియదు. నరసింహ ఉంటే తను చూసుకునేవాడు. అతను ఉన్న ఈ పదేళ్ళలో ఒక్కరోజు కూడా మానెయ్యలేదు. అందువల్ల మాకు తెలియలేదు. పక్క ఫ్లాట్స్‌వాళ్ళని అడిగితే తెలిసింది... పొద్దుటే వచ్చి పోయాయట’’ అన్నాడాయన.

‘‘అయితే తాగడానికి అయిదు లీటర్ల మినరల్‌ వాటర్‌ బాటిల్‌ తీసుకురా’’

అంది అమల.

దగ్గర్లోని సూపర్‌ మార్కెట్‌కి వెళ్ళి కావాల్సినవి తీసుకుని సైకిల్‌ వెనకాల పెట్టుకుని తెచ్చాడు. లిఫ్ట్‌ దగ్గర నుంచి ఫ్లాట్‌ వరకూ మోసుకొస్తే ఆయాసం వచ్చింది.

ఇంతకుముందు నరసింహ ఊరెళ్ళాల్సి వస్తే అతని తమ్ముడిని పెట్టి వెళ్ళేవాడు. ఇప్పుడు తండ్రికి బాగా లేదు కదా ఇద్దరూ కలిసి ఊరెళ్ళారు.

మర్నాడు అర్ధరాత్రి పెద్దపెద్ద అరుపులకు అమలా, సిద్దూ ఉలిక్కిపడి నిద్రలేచి తలుపులు తీసుకుని బయటకొచ్చారు. అప్పటికే మిగతా ఫ్లాట్స్‌ వాళ్ళు కూడా బయటకి వచ్చారు. అంతా హడావిడిగా ఉంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒక ఫ్లాట్‌లో దొంగలు పడి డబ్బూ నగలూ దోచేశారు... వాళ్ళు ఏడుస్తున్నారు.

పోలీసులకి ఫోన్‌ చేస్తే వచ్చారు.

‘‘మీ వాచ్‌మన్‌ ఏడి?’’ అని అడిగారు. అతను ఊరెళ్ళాడండీ... వాళ్ళ నాన్నని హాస్పిటల్‌లో చేర్చారు...’’ అన్నారెవరో.

‘‘అదీ... వాచ్‌మన్‌ లేడని తెలిసి తెగించారు’’ అన్నారు పోలీసులు.

‘‘అతను ఎప్పుడు వస్తాడు?’’

‘‘తెలియదండి. అప్పటి వరకూ ఎవరినైనా పెడదామంటే దొరకటం లేదు’’ అన్నాడు ప్రెసిడెంట్‌.

‘‘అతను వచ్చే వరకూ జాగ్రత్తగా ఉండండి’’ హెచ్చరించి వెళ్ళారు పోలీసులు.

రెండు మూడు రోజులయ్యేసరికి సెల్లార్‌ మొత్తం ఆకులూ చెత్తా దుమ్మూ పేరుకుపోయాయి. మొత్తం ఫ్లాట్స్‌లో ఉన్న ఆడవాళ్ళు అందరూ చీపుర్లు తీసుకుని చెత్తంతా ఊడ్చారు... తెగ ఆయాసపడుతూ.

కరెంట్‌ బిల్స్‌ వచ్చాయి. ముందు ఎవరి బిల్స్‌ ఏవో విడగొట్టడానికే చాలా ఇబ్బందిపడ్డారు. మామూలుగా అయితే అందరి బిల్లులూ నరసింహ పట్టుకెళ్ళి కట్టేసేవాడు.

మర్నాడు సిద్దూ తండ్రి వచ్చాడు. జరిగిందంతా విని బాధపడ్డాడు. బ్యాంకుకి వెళదామని కారుని చూసి ‘‘సిద్దూ’’ అంటూ ఒక అరుపు అరిచాడు.

‘‘ఏమిటి నాన్నా’’ కంగారుపడ్డాడు సిద్దూ.

‘‘కొత్త కారు... చూడు ఎలా అయిపోయిందో? వాచ్‌మన్‌ లేడని తెల్సు కదా... కారు అంటే సరదా ఉంటే చాలదు... తుడవాలని తెలియదా? నరసింహ ఉంటే రోజూ తనే తుడిచేవాడు’’ అంటూ చీవాట్లేశాడు.

సిద్దూకి బాధేసింది. నరసింహ వెళ్ళినప్పటి నుంచి అన్ని విషయాల్లో ఇలాగే అవుతోంది.

ఈలోగా ఇల్లంతా ఒకటే చెడ్డ వాసన- అమ్మని ‘ఏమిట’ని అడిగాడు. ‘‘చెత్తరా, భరించలేకపోతున్నాం. నాన్న తిడుతున్నారు. ఒక కవర్లో వేస్తాను, తీసుకెళ్ళి బయట డ్రమ్‌లో వేసిరా’’ అంది.

‘‘నేనా... ఛీ.. ఛీ...’’ అన్నాడు చిరాగ్గా.

‘‘లేకపోతే నాన్నగారు వెళ్ళాలా? నేను వెళ్ళలేను కదా.’’

‘‘సరే, మాస్క్‌ పెట్టుకుంటా... ఇయ్యి’’ అని అయిష్టంగా తీసుకెళ్ళాడు.

కింద ఫ్రెండ్స్‌ కనపడ్డారు. అందరూ నరసింహ ఎప్పుడు వస్తాడో మన కష్టాలు ఎప్పుడు తీరతాయో అనుకున్నారు.

తండ్రి ఊరెళ్ళి పది రోజులు రాకపోయినా ఎవరూ పట్టించుకోలేదు, నరసింహ లేకపోతే అందరూ గందరగోళపడిపోతున్నారు. ‘ఎప్పుడు వస్తాడో’ అని ఎదురు చూస్తున్నారు అనుకున్నాడు సిద్దూ.

వారానికి నరసింహ వచ్చాడు. ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ఫ్లాట్స్‌లో మాత్రం అందరి మొహాలూ వికసించాయి. ప్రతి వాళ్ళూ అతన్ని ఆప్యాయంగా పలకరించారు. అతను కూడా ప్రతీ ఫ్లాట్‌కి వెళ్ళి పలకరించి వచ్చాడు. అతని తండ్రికి కొంచెం బాగానే ఉందిట. తమ్ముళ్ళని చూసుకోమని తను వచ్చేశాడు.

అమల వాళ్ళ ఫ్లాట్‌కి వచ్చి ‘‘అమ్మగారున్నారా?’’ అని అడిగాడు సిద్దూని.

‘‘ఆఁ ఆఁ ఉన్నారు... ఎప్పుడొచ్చావు?’’ అడిగాడు అప్పుడే నిద్రలేచిన సిద్దూ.

‘‘ఇప్పుడే బాబూ’’ ఇంతలో అమల వచ్చి ఆప్యాయంగా వాళ్ళ నాన్న ఆరోగ్యం గురించి అడిగింది. అన్నీ మాట్లాడాక ‘‘అమ్మా ఈ రోజు సంక్రాంతి... మీరైతే ముగ్గులు బాగా పెడతారు. మన ఫ్లాట్స్‌ ముందర పెట్టగలరా?’’ అడిగాడు.

‘‘ఆ దానిదేముంది... అయిదు నిమిషాల్లో వస్తాను. నువ్వు లేక అసలు పండగ కూడా ఏమీ చేసుకోలేదు’’ అంది నవ్వుతూ అమల.

అమలతోపాటు సిద్దూ కూడా తోడు వెళ్ళాడు.

అమల చక్కగా పెద్ద ముగ్గు వేసే ప్రయత్నం మొదలెట్టింది. సిద్దూ రంగులూ అవీ అందిస్తున్నాడు.

నరసింహ కూడా అక్కడే ఉన్నాడు. ఈలోగా మోటార్‌ సైకిల్‌ మీద ఇద్దరు వచ్చారు. ఒకతను దిగి సిద్దూని అడ్రస్‌ అడిగాడు. సిద్దూకి ఆ అడ్రస్‌ ఎక్కడో అర్థం కాలేదు. ఈలోగా అతను వెళుతూ వెళుతూ ఒక్క ఉదుటన కూర్చుని సీరియస్‌గా ముగ్గు వేస్తున్న అమల మెడలో గొలును గుంజుకుని... గమ్మున బైక్‌ ఎక్కేశాడు. రెండోవాడు రెడీగా ఉండి... స్పీడ్‌గా బైక్‌ని పోనిచ్చాడు.

ఇదంతా గమనిస్తోన్న నరసింహ ఒక్క అంగలో గెంతి చైన్‌ కొట్టేసిన వెనకాల వాడి చెయ్యి పట్టుకున్నాడు.

వాడు విదిలించుకుంటే కిందపడబోయి నిలదొక్కుకుని... వాడి కాలు గట్టిగా పట్టుకున్నాడు. మోటార్‌ సైకిల్‌ వెళుతోంది. అయినా నరసింహ వాడి కాలు వదలలేదు. నరసింహని వాడు కొంత దూరం ఈడ్చుకు పోయాడు. అయినా నరసింహ వాడిని వదల లేదు. మొత్తానికి వాడు కూడా కిందపడ్డాడు. నరసింహ వాడి పీక పట్టుకుని... చేతిలోని గొలుసు లాక్కున్నాడు.

నరసింహ బలం చూసి ఆశ్చర్యపోయాడు సిద్దూ.

ఈలోగా నలుగురూ పోగయ్యారు... దొంగని పట్టుకున్నారు.

అమల, సిద్దూ కూడా నిశ్చేష్ఠులై చూస్తూ ఉండిపోయారు. అసలేం జరుగుతోందో వాళ్ళకి అర్థం కాలేదు.

నరసింహ దాదాపు ఏడుస్తూ అమల దగ్గరకి వచ్చాడు. ‘‘క్షమించండి అమ్మా, నేనే మిమ్మల్ని ముగ్గులు పెట్టమని తీసుకొచ్చాను. నావల్లే ఇదంతా జరిగింది.’’

‘‘గొలుసు పోతే పోనీ, అలా పరుగెట్టావు... ఇంకా వాళ్ళు ఈడ్చుకుపొతే ఎన్ని దెబ్బలు తగిలేవో తెలుసా?’’ అంది అమల.

‘‘ఏం పర్వాలేదమ్మా. పండగపూట మీ బంగారం పోవడమా... నా ప్రాణం పోయినా పర్వాలేదు. అలా జరగనివ్వను’’ అన్నాడు అన్ని దెబ్బలు తగిలినా నవ్వుతూ.

‘‘భలేవాడివిలే... ముందు నడు. దెబ్బలకి మందు రాసుకుందువుగాని’’ అంది అమల.

ఈలోగా ఫ్లాట్స్‌లో అందరికీ విషయం తెలిసిపోయింది. పరుగుపరుగున అందరూ కిందకి వచ్చి నరసింహనీ, అమలనీ పలకరిస్తున్నారు.

‘‘స్కూల్లో కరాటే నేర్చుకుంటున్నావు కదా... నువ్వు నాలుగు తన్నకపోయావా... మీ అమ్మ గొలుసు లాక్కున్నవాడిని’’

సిద్దూని అడిగాడు ఎదుటి ఫ్లాట్‌ అంకుల్‌.

సిద్దూ సిగ్గుపడ్డాడు. సిద్దూ నాన్నతో సహా అందరూ నరసింహని ఆకాశానికి ఎత్తేశారు. పోలీసులు కూడా నరసింహని పొగిడారు- వాళ్ళు ఎన్నాళ్ళనుంచో పట్టుకోలేకపోతున్న చైన్‌ స్నాచర్స్‌ని పట్టిచ్చినందుకు.

ఆ రోజంతా సిద్దూ ఫ్లాట్స్‌లో ఉన్న తన ఫ్రెండ్స్‌కి... తాను కళ్ళారా చూసిన ఆ ఇన్సిడెంట్‌ని వివరిస్తూ- నరసింహ గురించి చాలా గొప్పగా చెప్పాడు. వాళ్ళందరి దృష్టిలో కూడా నరసింహ పెద్ద హీరో అయిపోయాడు. మర్నాడు అతని ఫొటోతో సహా ఆ వార్త పేపర్లో వచ్చింది.

ఆ సాయంత్రం ఫ్లాట్స్‌లో వాళ్ళంతా మీటింగ్‌ పెట్టుకున్నారు. నరసింహని పిలిచి తండ్రి వైద్యానికి ఎంత అయ్యిందో కనుక్కున్నారు.

‘‘యాబైవేలు వరకూ అయ్యింది సారూ’’ అన్నాడు బాధగా.

‘ఫ్లాట్‌కో వెయ్యి చొప్పున ఇద్దాం’ అని నిర్ణయించారు. అప్పటికప్పుడు అందరూ తలో వెయ్యి తెచ్చి... నరసింహ చేతికి ఇచ్చారు. సిద్దూవాళ్ళ నాన్న మాత్రం రెండువేలు ఇచ్చాడు.

ఇంతలో పరుగు పరుగున వెళ్ళి సిద్దూ అయిదు వందలు తెచ్చి ఇచ్చాడు.

‘‘అయ్యో, నాన్నగారు ఇచ్చారు బాబూ’’ అన్నాడు నరసింహ.

‘‘ఇది నా పాకెట్‌ మనీ... పర్వాలేదు తీసుకో’’ అన్నాడు సిద్దూ ప్రేమగా.

‘‘వద్దు బాబూ... మీరు చిన్న పిల్లలు’’ వెనక్కి ఇచ్చేశాడు నరసింహ.

‘‘ఏం పర్వాలేదు నరసింహా... వాడు అభిమానంతో ఇచ్చింది వద్దనకు’’ అంది అమల.

అది చూసి... ఇంకా చాలామంది పిల్లలు తమ పాకెట్‌ మనీ తెచ్చి నరసింహకి అందించారు. నరసింహకి కళ్ళనీళ్ళు వచ్చాయి.

‘‘తీసుకో నరసింహా... నువ్వు కూడా మా ఇంట్లోవాడివేగా’’ అభిమానంతో అన్నాడు సిద్దూ.

కొడుకులో వచ్చిన ఈ మార్పుకి అమల ఎంతో ఆనందించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..