Updated : 29 Jan 2023 02:26 IST

ఆ మాటలు విని సినిమాల్లోకి వచ్చా!

మేకప్‌ ఆర్టిస్ట్‌ అవ్వాలనుకుని సినిమా ఆర్టిస్ట్‌ అయింది ‘మజిలీ’తో సినీ ప్రయాణం మొదలుపెట్టిన దివ్యాన్ష కౌశిక్‌. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో హోమ్లీ లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ‘మైఖేల్‌’తో మన ముందుకు రాబోతున్న దివ్యాన్ష తన గురించి ఏం చెబుతోందంటే...

సొంతూరు

మాది ఉత్తరాఖండ్‌. అమ్మ మేకప్‌ ఆర్టిస్టు కావడంతో దిల్లీలో స్థిరపడ్డాం. అక్కడే పదో తరగతి వరకూ చదువుకున్నా. తర్వాత ముస్సోరిలో ప్లస్‌ టూ చదివా.


అమ్మ స్ఫూర్తితో

అమ్మ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌లో పనిచేసేది. రాణీ ముఖర్జీకి వ్యక్తిగత మేకప్‌ విమెన్‌. తన స్ఫూర్తితో నాకూ మేకప్‌ ఆర్టిస్టు అవ్వాలనిపించింది. లండన్‌ వెళ్లి శిక్షణ తీసుకున్నా. అక్కడ కొంత కాలం పని చేశా.


ఫస్ట్‌ ఛాన్స్‌

ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, హీరోహోండా వంటి పెద్ద సంస్థల ప్రకటనలూ చేసే అవకాశం వచ్చింది. అవి చేస్తూ ఆడిషన్లలో పాల్గొన్నా. అప్పుడే దర్శకుడు శివ నిర్వాణ దృష్టిలో పడటంతో ‘మజిలీ’లో అవకాశమిచ్చారు.


నటనలో శిక్షణ

ఫొటో షూట్లలో నన్ను చూసిన కొందరు... ‘నీది ఫొటో జెనిక్‌ ఫేస్‌... సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా...’ అనేవారు. దాంతో నాకూ ఆసక్తిగా అనిపించి ముంబయి వెళ్లి యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ తీసుకున్నా. మరోవైపు మోడలింగ్‌ చేశా.


డబ్బింగ్‌ చెప్పుకున్నా
‘మజిలీ’లో నటనకు మంచి పేరొచ్చింది. నటిగా అన్ని రకాల పాత్రలూ చేయగలనన్న నమ్మకం వచ్చింది. ఆ సినిమాలో డబ్బింగ్‌ కూడా చెప్పుకున్నా. అందులో ‘ఏడెత్తు మల్లెలే...’ పాట ఎంతిష్టమో. కారులో వెళుతుంటే ఈ పాట పెట్టుకోవాల్సిందే.


బయోగ్రఫీ ఇష్టం

నాకు నవలలూ, బయోగ్రఫీలూ చదివే అలవాటుంది. ఆ స్ఫూర్తితోనే ఎవరిదైనా జీవితచరిత్రలో నటించాలనుంది.


ఫిట్‌నెస్‌ కోసం

స్కూల్‌లో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ ప్లేయర్ని. ఇప్పటికీ సమయం దొరికితే ఆటలాడతా. ఎలాంటి డైట్‌ పాటించను. వారంలో రెండుమూడు సార్లైనా బిర్యానీ, ఫ్రైడ్‌ చికెన్‌ తినాల్సిందే.


తెలుగు నేర్చుకున్నా

‘మజిలీ’ సినిమాలో నటించేటప్పుడు తెలుగు రాక చాలా ఇబ్బంది పడ్డా. అందుకే లాక్‌డౌన్‌లో తెలుగు నేర్చుకున్నా. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘మైఖేల్‌’ షూటింగ్‌ల్లో డైలాగులు పలకడం ఎంతో సులభమైంది. ఇప్పుడు మరో రెండు సినిమాలూ చేతిలో ఉన్నాయి.


తీరిక వేళలో

పాప్‌కార్న్‌ తింటూ నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్‌సిరీస్‌లు చూస్తా.


నచ్చిన ప్రదేశం

నాకు బాలి చాలా ఇష్టం. తీరిక దొరికితే వెళుతుంటా. వైజాగ్‌ కూడా బాగా నచ్చింది


మెచ్చిన సినిమా

బాగా నచ్చిన సినిమా ‘ఈగ’. ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూసి రామ్‌చరణ్‌కి అభిమానినయ్యా. నటిగా ఆలియా భట్‌ నాకు స్ఫూర్తి. ఆమె నటనకు పెద్ద ఫ్యాన్‌ని.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు