NTR: వాణ్ణి చూసి పారిపోతా...

ఆస్కార్‌ వేడుకల్లో మెరిసి అభిమానుల్ని మురిపించిన ఎన్టీఆర్‌ - ఆ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లోనూ, వార్తల్లోనూ అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితాలో నంబర్‌వన్‌గా నిలిచాడు. మరి ఎనర్జీకి చిరునామా లాంటి తారక్‌ జీవితంలో కొన్ని ఆసక్తికర విశేషాలు తన మాటల్లోనే...

Updated : 26 Mar 2023 09:01 IST

NTR: వాణ్ణి చూసి పారిపోతా...

ఆస్కార్‌ వేడుకల్లో మెరిసి అభిమానుల్ని మురిపించిన ఎన్టీఆర్‌ - ఆ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లోనూ, వార్తల్లోనూ అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితాలో నంబర్‌వన్‌గా నిలిచాడు. మరి ఎనర్జీకి చిరునామా లాంటి తారక్‌ జీవితంలో కొన్ని ఆసక్తికర విశేషాలు తన మాటల్లోనే...


మధుర క్షణం

మ్మ సినిమాల గురించి మాట్లాడేది చాలా తక్కువ. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని ఇద్దరం ఒక ప్రయివేట్‌ థియేటర్‌లో చూశాం. సినిమా మొదలయ్యేటప్పుడు అమ్మ దూరంగా వేరే వరసలో కూర్చుంది. నా పరిచయ సన్నివేశం చూశాక దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకుని హత్తుకుంది. పక్కనే కూర్చుని నాచేయి పట్టుకుని సినిమా చూసింది. అదే నాకెప్పటికీ అమేజింగ్‌ ఫీలింగ్‌.


కల్లోకి వచ్చేవి

‘నాటునాటు...’ స్టెప్పులు ఇద్దరివీ సింక్‌ అవ్వడానికి రోజుకు మూడు గంటలపాటు పదిహేనురోజులకుపైనే సాధన చేశాం.. షూటింగ్‌కి కొన్ని క్షణాల ముందు వరకూ కూడా అదే పనిలో ఉన్నాం. ఆ ప్రాక్టీసుకి ఒళ్లు హూనమైపోయేది. చెబితే నమ్మరుగానీ రాత్రిపూట పడుకున్నా ఆ స్టెప్పులే కలలోకి వచ్చేవి.


ఏడుసార్లు భోజనం

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నేనూ, చరణ్‌ ఒకే శరీరాకృతిని మెయింటెయిన్‌ చేశాం. ఆ లుక్‌లోకి రావడానికి 16 నెలలు పట్టింది. అందుకోసం రోజుకి సుమారు 3 వేల కెలొరీలు పెంచుకోవాల్సి వచ్చింది. దీనికోసం రోజుకి ఏడుసార్లు భోజనం చేశా.


అదే ఇష్టం...

నాకు పెద్దపెద్ద లక్ష్యాలేమీ ఉండవు... చిన్నతనంలో ‘ఈ స్కూళ్లేంటి? త్వరగా ఇంటికి వెళ్లిపోతే బాగుణ్ను’ అనుకునేవాడిని. పదో తరగతిలో ‘ఈ పరీక్షలు పాసైతే చాలు’ అనుకున్నా. తొలినాళ్లలో ‘ఒక్క సినిమా చేస్తే చాలు’ అనే ఆలోచనతో ఉన్నా తప్ప రెండో సినిమా వస్తుందనీ, రావాలనీ కోరుకోలేదు. కానీ ఇప్పుడు 30 వరకూ రాగలిగా. ఏదో చేయాలనే ఆరాటం లేదు. నాకున్న దాంతో సంతోషంగా బతికేయడమే నాకిష్టం.


వాళ్లని చూస్తే ఈర్ష్య

డపిల్ల ఉన్నవాళ్లని చూస్తే ఈర్ష్య వస్తుంది. అమ్మాయి పుట్టాలని ఎంతో అనుకున్నా. రెండోసారైనా పాప పుడుతుందేమోనని ఆశపడ్డా. అబ్బాయే అయ్యేసరికి నిరాశ చెందా. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న కళే వేరు. కూతురు లేదనే లోటు మాత్రం ఎప్పటికీ ఉంటుంది.


ఆ పాటే వింటా

చిన్నప్పట్నుంచీ కళలంటే చాలా ఇష్టం. నృత్యంతోపాటూ, సంగీతాన్నీ అభిమానించేవాడిని. ప్రయాణంలోనూ, ఖాళీగా ఉన్నప్పుడూ పాటలు పెట్టుకుంటా. ‘కేరాఫ్‌ కంచరపాలెం’లోని ‘ఆశాపాశం...’ పాట బాగా వింటా. చాలా లోతైన అర్థం ఉంది అందులో.


ప్రశ్నలు వేస్తాడు!

మా అభయ్‌ కొడుకు కాదు, క్వశ్చన్‌ బ్యాంక్‌. వాడికి ఏదన్నా కనిపిస్తే వెంటనే దాని గురించి ప్రశ్నలు సంధిస్తాడు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెబుతుంటా. ఒక్కోసారి వాడేం ప్రశ్నలు అడుగుతాడోనని భయం వేస్తుంటుంది. అందుకే వాణ్ణి చూసి పారిపోతుంటా. అప్పుడప్పుడూ అభయ్‌కి ప్రణతి కూడా బలైపోతుంటుంది.


తప్పక వింటా

దేనికీ తలవంచకు, ఎక్కడా చేతులు చాచకు... అని అమ్మ చెప్పిన మాటల్ని మనసులో ఉంచుకుని నడుచుకుంటా. అలానే నా భార్య ప్రణతినీ ఎంతో గౌరవిస్తా. పెళ్లికి ముందు చాలా హైపర్‌గా ఉండే నన్ను తనే మార్చేసింది. మా ఇంటి హోమ్‌మినిస్టర్ల మాట తప్పక వింటా, పాటిస్తా కూడా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..