ఆయనతో ప్రయాణమే... ఓ పాఠం!

సుకుమార్‌... తెలుగు సినిమా అగ్ర దర్శకుల్లో ఒకరు. సినిమాల్లోకి రాకముందు అధ్యాపకుడిగా విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. దర్శకుడిగా మారాకా దాన్ని కొనసాగిస్తున్నారు

Updated : 11 Feb 2024 11:33 IST

సుకుమార్‌... తెలుగు సినిమా అగ్ర దర్శకుల్లో ఒకరు. సినిమాల్లోకి రాకముందు అధ్యాపకుడిగా విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. దర్శకుడిగా మారాకా దాన్ని కొనసాగిస్తున్నారు. దర్శకులుగా వస్తోన్న ఆయన శిష్యులే అందుకు నిదర్శనం. కెరీర్‌లో శుభారంభం చేసిన వీళ్లంతా తమ గురువు గురించి ఏం చెబుతున్నారంటే...


అయిదు కథలిచ్చారు...

పల్నాటి సూర్య ప్రతాప్‌

‘ఆర్య’ నుంచి ‘నేనొక్కడినే’ వరకూ అన్నయ్యతో పనిచేశా. తన ఆలోచనా విధానానికీ ముగ్ధులమైపోతాం. నేర్చుకోవడానికీ బానిసలమైపోతాం. నాకు అయిదు కథలు చెప్పి వాటిని తెరకెక్కించమన్నారు. వాటిలో ముందు ‘కుమారి 21 ఎఫ్‌’ని తీసుకున్నా. తర్వాత తనతో చర్చిస్తూ కథని సినిమా స్థాయికి అభివృద్ధి చేశా. ‘కుమారి 21 ఎఫ్‌’ తర్వాత అన్నయ్య ‘రంగస్థలం’ చేస్తుంటే... స్క్రీన్‌ రైటర్‌గా చేశా. ఆపైన ‘పుష్ప-1’కి పనిచేశా. ఆ తర్వాతే ‘18 పేజెస్‌’ తీశా. నాకు చెప్పినవాటిలో మరో మూడు కథలున్నాయి. తరువాత చేయబోయేది అద్భుతమైన యాక్షన్‌ స్టోరీ. ఆ కథని తిరిగి ఇవ్వమని చాలాసార్లు అడిగితే, సమస్యేలేదన్నా. మామధ్య అంత సాన్నిహిత్యం, ప్రేమా ఉన్నాయి.


బాధ్యతతో కూడిన భయం...

శ్రీకాంత్‌ ఓదెల

సర్‌ దగ్గర పదుల సంఖ్యలో అసిస్టెంట్లు ఉంటారు. జూనియర్‌, సీనియర్‌ అన్న తేడా లేకుండా అందరినీ సినిమాలో భాగం చేస్తారు. ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ సినిమాలకు పనిచేశా. ఆయన చాలా పెద్దహిట్‌లు అందించారు. స్క్రీన్‌ప్లేకి తిరుగులేదు. కానీ ఇప్పటికీ ఒక సీన్‌ రాయాలన్నా, తీయాలన్నా వంద రకాలుగా ఆలోచిస్తారు. ప్రేక్షకుడికి నచ్చుతుందా లేదా అని భిన్న కోణాల్లో చూస్తారు. ఇంత అనుభవం వచ్చాక ఆయన ఏం తీసినా తెరమీద అద్భుతంగానే అనిపిస్తుంది. సర్‌ మాత్రం ప్రతి సీన్‌ బాధ్యతతో, భయంతో తీస్తారు. ప్రేక్షకుణ్ని దృష్టిలో పెట్టుకోవడం అనేది నేను ఆయన్నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠం. ‘దసరా’ సినిమా రాసేటప్పుడూ, తీసేటప్పుడూ అదే పాటించా!  


అర్ధరాత్రి సినిమా చూసి...

చంద్రశేఖర్‌ టి.రమేష్‌

‘జగడం’ నుంచి సుకుమార్‌గారితో పనిచేస్తున్నా. 24 గంటలూ, 365 రోజులూ ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. డబ్బింగ్‌, ఎడిట్‌ దశల్లోనూ కథని బలోపేతం చేయడానికి చూస్తారు. మలయాళ సినిమా ‘కప్పెలా’ రీమేక్‌ అవకాశం వచ్చిందని చెప్పి, అభిప్రాయం అడిగా. అప్పటికి పుష్ప-1 రచనలో బిజీగా ఉన్నారు. సాయంత్రం విషయం చెబితే... ‘స్క్రీన్‌ప్లే బాగుంది చెయ్యి. మిగతా విషయాలు మధ్యాహ్నం మాట్లాడదాం’ అని వేకువన మూడింటికి మెసేజ్‌ వచ్చింది. ఆ సినిమానే ‘బుట్టబొమ్మ’గా తెరకెక్కించా. ప్రస్తుతం పుష్ప-2కి పనిచేస్తున్నా. ఆయన నాకు ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌.


చర్చలతో మెరుగయ్యా...

కార్తీక్‌వర్మ

సర్‌ని కలిసి ఓ కథ వినిపిస్తే నచ్చలేదు. కానీ నేను చెప్పిన విధానం నచ్చి ఇంకో కథ ఉంటే చెప్పమన్నారు. అదే ‘విరూపాక్ష’. ‘కథ బాగుంది. స్క్రీన్‌ప్లే మీద వర్క్‌ చేయాలి. నేనా పనిచేస్తా. నిర్మాతగానూ ఉంటా’ అన్నారు. ఏడాది పాటు ఆయనతో డిస్కషన్లలో కూర్చున్నా. తర్వాత సినిమా పరిధి పెరిగిందని నిర్మాతనీ ఆయనే పరిచయం చేశారు. సినిమా చూశాక ‘వెరీ ప్రౌడ్‌, ఎగ్జైటెడ్‌...’ అని మెచ్చుకున్నారు. అయిదేళ్ల ప్రయాణంలో ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. అందువల్లే నా ఆలోచనా స్థాయి పెరిగి డైరెక్షన్‌ బాగా చేశానేమో! ఆయన శిష్యులు పరిచయమయ్యాక ఆలోచనలు పంచుకునేందుకు మంచి టీమ్‌ దొరికింది.


ఎంబీఏ పూర్తిచేయమన్నారు

బుచ్చిబాబు సానా

‘100% లవ్‌’ నుంచి ‘రంగస్థలం’ వరకూ నాలుగు సినిమాలకు సర్‌ దగ్గర డైరెక్షన్‌, రైటింగ్‌ విభాగాల్లో పనిచేశా. ఏ ఫిల్మ్‌స్కూల్‌ ఇవ్వని అనుభవం, విజ్ఞానం అక్కడ దొరుకుతుంది. ఏదైనా నిర్మొహమాటంగా అడగొచ్చు. ఏ లెన్స్‌ ఎందుకు వాడారో, స్క్రిప్టులో ఒక సీన్‌ ఎందుకు వెనక పెట్టారో అన్నీ వివరించేవారు. చర్చలు జరిగేటప్పుడు బెటర్‌మెంట్‌ కోసం అభిప్రాయాలు చెప్పాలి. అందుకోసం బాగా చదవడం అలవాటైంది. ఇంటర్‌లో ఆయన విద్యార్థిని. ఎంబీఏ చేస్తున్నప్పుడు అసిస్టెంట్‌గా చేరతానని అడిగితే.. ఎంబీఏ పూర్తయ్యాకే కనిపించమన్నారు. ‘రంగస్థలం’ సమయంలో ‘ఉప్పెన’ కథని చెబితే.. బాగుందని చెప్పడంతోపాటు ఆ సినిమా నిర్మాణంలోనూ భాగమయ్యారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..