అమ్మకొట్టింది
అమ్మ గోరుముద్దనీ.. చేతి దెబ్బనీ చవిచూడని పిల్లలుండరేమో. ముద్దుచేస్తూనే తప్పులు సరిదిద్దుతూ, మంచి మార్గంలో నడిపించే ప్రతి అమ్మా తన బిడ్డలకు హీరోనే.
అమ్మకొట్టింది
అమ్మ గోరుముద్దనీ.. చేతి దెబ్బనీ చవిచూడని పిల్లలుండరేమో. ముద్దుచేస్తూనే తప్పులు సరిదిద్దుతూ, మంచి మార్గంలో నడిపించే ప్రతి అమ్మా తన బిడ్డలకు హీరోనే. అలా తమని తీర్చిదిద్దే క్రమంలో అమ్మ చేతిలో దెబ్బలు తిన్న జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకుంటున్నారు కొందరు నటీనటులు.
హ్యాంగర్ విరిగింది
ఎన్టీఆర్
అప్పుడు నాకు పదకొండేళ్లు... ‘బాలరామాయణం’ షూటింగ్‌కి వెళ్లే ముందు ఏదో అల్లరి పని చేశా. ఆవేశంతో అమ్మనీ తోసేశా. దాంతో బెల్టు తెగేదాకా, హ్యాంగర్ విరిగిపోయేదాకా బాదేసింది. కాసేపటికి బయటకు పరిగెత్తి ఓ గుడి వెనక దాక్కున్నా. రాత్రంతా గుడిచుట్టూ తిరుగుతూనే ఉంది. కొన్ని గంటల తరవాత అమ్మ
వెళ్లిపోయిందేమో అనుకుని బయటకు వచ్చా- అప్పుడు కూడా పట్టుకుని కొట్టేసింది. తరవాత క్రీము రాసి బాగా ఏడ్చింది. కానీ నా అల్లరి మామూలుగా ఉండేది కాదు. ఒకరోజు ఏమీ తోచక చేతికి దొరికిన బల్బు తీసుకెళ్లి ట్రాన్స్‌ఫార్మర్‌లో పెట్టా. అంతే అది పేలిపోయి మా కాలనీలో మూడురోజులు కరెంట్ లేదు. లక్కీగా అమ్మకి ఆ విషయం తెలియలేదు. తప్పు చేసినందుకు భయమేసిందిగానీ... అమ్మకి దొరకనందుకు హ్యాపీగా అనిపించింది.
చదువు విషయంలోనే...
- అల్లు అర్జున్
స్కూల్‌లో చాలా కామ్‌గా ఉండేవాణ్ని. టీచర్లకు పెట్ స్టూడెంట్‌ని. కానీ చదువు విషయంలోనే అమ్మ చేతుల్లో ఎక్కువ తన్నులు తినేవాడిని. దేని గురించో కాదు... పరీక్షలప్పుడు అమ్మ రేపు ఏ ఎగ్జామ్ అని అడిగేది. నేనేమో అప్పటికే రాయడం అయిపోయిన సబ్జెక్ట్ తీసి అమ్మ ముందు పెట్టేవాడిని. దానికి అమ్మకి బాగా కోపం వచ్చేది. పరీక్షల్ని తేలిగ్గా తీసుకుంటావా అని కొట్టేది. ఇప్పుడు మా పిల్లల చదువు ప్రస్తావన వస్తే నాకు అదే గుర్తొస్తుంది.
పదోతరగతి వరకూ
- నాగశౌర్య
చదవడానికి అస్సలు ఇష్టపడే వాడిని కాదు. శ్రద్ధ పెడితే మంచి మార్కులు వచ్చేవి. కానీ, అస్సలు పుస్తకం తీసేవాణ్ని కాదు. పరీక్షలప్పుడు కంగారుపడిపోయి అమ్మని టెన్షన్ పెట్టేవాడిని. అందుకే బాగా కొట్టేది. పదో తరగతి వరకూ తన్నులు తిన్నా. ఏది కనిపిస్తే అది తీసుకుని కొట్టేది. కానీ, ఇప్పుడు ఆ విషయం గుర్తొస్తే ఎంత బాధపడుతుందో. పైగా, నటుడిగా నువ్వు స్క్రిప్టు చదువుతుంటే నాకెంత సంతోషంగా అనిపిస్తుందో అంటుంటుంది.
ప్రేమలేఖ రాశా
- సాయి పల్లవి
ఏడో తరగతిలో ఉన్నప్పుడు మా క్లాస్‌లో ఒక అబ్బాయి నాకు బాగా నచ్చాడు. అతని మీద అభిమానం ఏర్పడింది. ఆ విషయం చెప్పాలని ఒకరోజు ప్రేమలేఖ రాశా. కానీ, అది అతనికి ఎలా ఇవ్వాలో తెలియక పుస్తకంలో పెట్టుకున్నా. అనుకోకుండా ఆ లేఖ అమ్మ కంట పడింది. దాంతో చెప్పలేనంత కోపం వచ్చి నన్ను చితక్కొట్టేసింది. అమ్మ కొట్టడం అదే మొదలూ, చివరా. ఇప్పటి వరకూ మళ్లీ తనకి కోపం తెప్పించే పనులు చేయలేదు.
పాట పాడితే...
- అడవి శేష్
చిన్నప్పుడు బాలయ్య బాబు వల్ల తన్నులు పడ్డాయి. అప్పుడు నాకు ఎనిమిదేళ్లు. వైజాగ్‌లో ఉండేవాళ్లం. ఒకరోజు స్కూలు నుంచి ఇంటికొస్తుంటే ఓ కాలేజీ దగ్గర పాట ఒకటి వినిపించింది. ఆ పాట నాకు బాగా నచ్చి పాడుకుంటూ ఇంటికొచ్చా. అది విన్న అమ్మ- తన చేతిలో ఉన్న పళ్లెంతో తల మీద గట్టిగా కొట్టింది. ఆ గుర్తు ఇప్పటికీ ఉంది. ఆ పాటేంటంటే... ‘టాప్‌హీరో’లో ‘బీడీలు తాగండి బాబులూ... తాగి స్వర్గాన్ని తాకండి బాబులూ...’. ఆ తరవాత ఇంకోరోజు అదే సినిమాలోని ‘ఓ ముద్దు పాప హే ముద్దు పాప... ’ పాడుతూ ఆడుకుంటున్నా. అదీ అమ్మ చెవిలో పడింది. మళ్లీ ఉతికి ఆరేసింది. అప్పట్నుంచీ సినిమా పాటలు పాడటం మానేశా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ.. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్: రష్మిక
-
Yuvagalam: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా
-
MS Swaminathan: దేశ ‘వ్యవసాయం తలరాత’నే మార్చి.. 84 డాక్టరేట్లు పొంది!
-
AIADMK: మళ్లీ ఎన్డీయేలో చేరం.. అన్నామలైని తొలగించాలని మేం కోరం: అన్నాడీఎంకే
-
USA: అమెరికా పిల్లలకి ‘లెక్కలు’ రావడం లేదట..!
-
MS Swaminathan: దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది: కేసీఆర్