హహ్హహ్హ

మా ఆవిడ నన్ను అనుమానంతో విసిగిస్తోందని స్నేహాలన్నీ మానేశా. భారత రామాయణాలు చదువుకుంటూ కృష్ణారామా అనుకోవడం మొదలెట్టా. ఇంత చేసినా పొద్దున్న తన ఫ్రెండ్‌తో ఫోనులో ‘ఇక్కడ వెలగబెట్టింది

Published : 26 Jun 2022 00:54 IST

హహ్హహ్హ

నమ్మరా..!

మా ఆవిడ నన్ను అనుమానంతో విసిగిస్తోందని స్నేహాలన్నీ మానేశా. భారత రామాయణాలు చదువుకుంటూ కృష్ణారామా అనుకోవడం మొదలెట్టా. ఇంత చేసినా పొద్దున్న తన ఫ్రెండ్‌తో ఫోనులో ‘ఇక్కడ వెలగబెట్టింది చాలక, స్వర్గంలో అప్సరసలతో కూడా తైతక్కలాడడానికి సిద్ధమవుతున్నాడే మీ అన్నయ్య’ అని చెబుతోంది. దేవుడా... ఏం చేస్తే నమ్ముతారు ఈ ఆడవాళ్లు.


డ్రీమ్‌ జాబ్‌

అధికారి: మీ కలల ఉద్యోగం ఏది?
వెంగళప్ప: అంటే ఆఫీసులో చేసేది చాలక కలల్లో ఇంకో ఉద్యోగం కూడా చేయాలా?


నమ్మకం పోయింది!

భార్య: ఏమండీ ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే అంతా మంచి జరుగుతుందండీ...
భర్త: నాకు నమ్మకం లేదు...
భార్య: ఎందుకండీ...
భర్త: మన పెళ్లికి బయలుదేరే ముందు ఇలాగే దండం పెట్టుకుని బయలుదేరా. అప్పటి నుంచి నమ్మకం పోయింది!


పెళ్లికి ముందే!

పండితుడు: అదేంటీ పెళ్లికూతురూ, పెళ్లికొడుకూ అలా ముఖాలు తిప్పుకున్నారు...
రాజేశ్‌: మొన్న ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో మాటామాటా వచ్చి గొడవపడ్డార్లెండి!


తోచిన సాయం చేయాలనీ...

భార్య: ఏవండీ ఓ వంద రూపాయలు ఇవ్వండి, పక్కింటి పిల్లాడికి ఇస్తాను...
భర్త: ఈరోజు ఆ అబ్బాయి బర్త్‌డే నా...
భార్య: కాదండీ, ఇందాక ఐదు వందల నోటు పోగొట్టుకున్నాడట. పాపం... అవి దొరకలేదు అందుకనే...
భర్త: నీది ఎంత మంచి మనసు...
భార్య: మనకు దేవుడు సాయం చేస్తే మనమూ చేయాలి కదా. ఓ గంట క్రితమే నాకు ఐదు వందల నోటు దొరికింది మరి!


జాగ్రత్తలు

పన్నునొప్పితో డాక్టరు దగ్గరికి వెళ్లాడు సుబ్బారావు. వెళ్లినవాడు గమ్మున కూర్చోకుండా అక్కడ ఉన్న పేషెంట్లందరితోనూ మాట్లాడుతూ, తన సమస్య చెబుతూ, వాళ్ల సమస్యలు వింటూ, డాక్టర్ల మీద వ్యాఖ్యానాలు చేయడాన్ని గమనించాడు డాక్టర్‌.

ఇంతలో సుబ్బారావు వంతు వచ్చింది. డాక్టరు చూసి మందులు రాసిచ్చి వాడాక రమ్మన్నాడు. మందుల చీటీ తీసుకున్న సుబ్బారావు తనదైన తరహాలో ‘డాక్టరు గారూ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి’ అని అడిగాడు.

‘రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేసుకోవాలి. ఏడాదికోసారి డెంటిస్ట్‌ దగ్గరికి వెళ్లి చూపించుకోవాలి. మూడోదీ ముఖ్యమైనదీ... అనవసర విషయాల్లో నోరు కాస్త అదుపులో పెట్టుకోవాలి...’ చెప్పాడు డాక్టరు.


ఆ పని మాత్రం చేయకండి!

(రైలు ప్రయాణంలో...)
‘మేడం... మీ డ్రెస్సు బాగుంది. దయచేసి ఎక్కడ కొన్నారో చెబుతారా... మా ఆవిడక్కూడా కొంటాను...’ అన్నాడో యువకుడు.
ఆమె కోపంగా ఓ లుక్కు ఇచ్చింది.
కాసేపటికి మళ్లీ అడిగాడు అతను.
ఈసారి... ‘అలాంటి పిచ్చి పని దయచేసి చేయకండి’ అందా యువతి.
‘ఎందుకని’ ఆశ్చర్యంగా అడిగాడా యువకుడు.
‘ఎదురుపడ్డ ప్రతి వెధవా మీ ఆవిడని పలకరించి ఆ డ్రెస్సు ఎక్కడ కొన్నారని అడిగే ప్రమాదం ఉంది’ అని సమాధానమిచ్చి వెళ్లిపోయిందా యువతి.


దేనికి విలువ?

వెంకట్రావు: ఈ లేడీస్‌కి అసలు భర్త విలువ తెలియడం లేదబ్బా.
సుబ్బారావు: ఎందుకు ఆ అభిప్రాయానికి వచ్చావు?
వెంకట్రావు: వేలు ఖర్చు పెట్టి కొన్న టీవీ, ఫ్రిజ్‌ లాంటి వాటినేమో ఒక్క గీత కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. లక్షలు కట్నం ఇచ్చి కొన్న మొగుణ్ణేమో రాచి రంపాన పెడతారు.


రహస్యం చాలు!

జడ్జి: నువ్వు మీ ఆవిడని భయపెట్టి, బెదిరించి కంట్రోల్‌లో పెట్టావంట. నిజమేనా?
సుబ్బారావు: అదా... అసలు సార్‌... నిజంగా ఏం జరిగిందంటే...
జడ్జి: సంజాయిషీలొద్దు. అసలు రహస్యం ఏంటో చెప్పు చాలు.


నేనూ వర్క్‌ ఫ్రం హోమే!

గిరి: పండక్కని మీ పుట్టింటికి వెళ్లావు. ప్రశాంతంగా ఉండకుండా అక్కడి నుంచి కూడా ఫోన్లో నాతో ఈ గొడవలు అవసరమా...
రాధ: ఏం వర్క్‌ ఫ్రం హోం మీకేనా ఏంటీ!


అలాగా!

భర్త అనేవాడు డాక్టరు, లాయరు, సైంటిస్టు, ఆఖరికి ప్రధాని అయినా సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే- సింపుల్‌గా ‘మీకేం తెలియదండీ...’ అని నిర్భయంగా చెప్పగలిగే ఏకైక జీవినే భార్య అంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..