అదే మా డ్రీమ్‌రోల్‌

ఎన్నిరకాల సినిమాలు చేస్తున్నా కూడా ఫలానా పాత్రలో నటించే ఛాన్స్‌ మాకు వచ్చి ఉంటే బాగుండేది... ఆ పాత్ర చేయడమే నా కల అంటూ నటీనటులు చెప్పడం చూస్తుంటాం. అలాంటి  డ్రీమ్‌ రోల్స్‌ గురించి ఈ హీరోయిన్లు ఏమంటున్నారంటే...

Updated : 07 Jul 2024 10:09 IST

ఎన్నిరకాల సినిమాలు చేస్తున్నా కూడా ఫలానా పాత్రలో నటించే ఛాన్స్‌ మాకు వచ్చి ఉంటే బాగుండేది... ఆ పాత్ర చేయడమే నా కల అంటూ నటీనటులు చెప్పడం చూస్తుంటాం. అలాంటి  డ్రీమ్‌ రోల్స్‌ గురించి ఈ హీరోయిన్లు ఏమంటున్నారంటే...

సౌందర్యగా నటించాలి

- రశ్మిక మందన్నా

విష్యత్తులో ఎప్పుడైనా సౌందర్య బయోపిక్‌ తీస్తే గనుక అందులో నటించాలనుంది. ఎందుకంటే... సినిమాల్లోకి రాక ముందు నుంచీ సౌందర్యకీ ఆమె నటనకీ వీరాభిమానిని. చిన్నతనం నుంచీ ఆమె సినిమాలు చూస్తూ పెరిగిన నేను తన నటన నుంచి కొన్ని మెలకువలు కూడా నేర్చుకున్నా. మా నాన్న కూడా అప్పుడప్పుడూ నాతో ‘నువ్వు కొన్నిసార్లు సౌందర్యలా కనిపిస్తావు’... అనడమూ నాకు గుర్తుంది. అందుకే తన బయోపిక్‌ చేయాలనేది నా డ్రీమ్‌రోల్‌. ఆ అవకాశం వస్తుందో రాదో చూడాలి మరి.  


ప్రతికూల భావాలుండే పాత్ర  

- అనుపమా పరమేశ్వరన్‌

హీరోయిన్‌గా రకరకాల పాత్రలు చేయడం వేరు. ప్రతికూల భావాలున్న పాత్రలో నటించడం వేరు. నిజానికి నేను ‘అఆ’లో, ‘టిల్లూ స్క్వేర్‌’లో అలాంటి ప్రతికూల ఛాయలున్న పాత్రల్లో కొంతవరకూ కనిపించాను కానీ ఇంకా పూర్తిస్థాయిలో నటించాలని ఉంది. వాటిని చూసి కూడా అభిమానులు భలే చేసిందంటూ మెచ్చుకోవాలనేదే నా కోరిక. ఆ పాత్రలతోపాటు కొన్ని సినిమాలు చూసినప్పుడు అలాంటి అవకాశం నాకూ వచ్చి ఉండొచ్చు కదా అనిపిస్తుంది... ఉదాహరణకు ‘దంగల్‌’లో బబితాకుమారి, గీతా ఫొగాట్‌ పాత్రలు...‘క్వీన్‌’లో కంగనారనౌత్‌ క్యారెక్టర్‌ అలాంటివే. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.


కామెడీ పాత్ర కోసం చూస్తున్నా...

- సాయి పల్లవి

నేను నటించిన ‘ఫిదా’, ‘లవ్‌స్టోరీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘విరాటపర్వం’, ‘ఎమ్‌సీఏ’... ఇలా ఏది తీసుకున్నా అన్నీ కథా ప్రాధాన్యం ఉన్నవే. డాన్స్‌ పరంగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టినవే. అయితే నేను మాత్రం వీటన్నింటికన్నా కాస్త భిన్నంగా మంచి కామెడీ ప్రాధాన్యం ఉన్న సినిమాలో నటించే ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నా. అందులోనూ నాకంటూ పూర్తిస్థాయిలో కామెడీ పాత్ర ఉండాలనీ కోరుకుంటున్నా.


పల్లెటూరి నేపథ్యం ఇష్టం 

- శ్రీలీల

కావడానికి నేను ఈతరం అమ్మాయినైనా.. నాకు కూడా పాతతరం సినిమాలూ, పాటలూ అంటే చెప్పలేనంత ఇష్టం. ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యం ఉన్న సినిమాలను చూస్తున్నప్పుడు వాటిల్లో లీనమైపోతుంటా. నన్ను నేను ఆ పాత్రలోనూ ఊహించుకుంటా. అందుకే భవిష్యత్తులో ఒక్కసారైనా అలాంటి పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాలని అనుకుంటున్నా. అదేవిధంగా చారిత్రక చిత్రాల్లో చేయడాన్నీ ఇష్టపడతా. అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రల్లో నటిస్తుంటే సినీ అభిమానులకే కాదు.. నాకూ బోరే కదా!


రా ఏజెంటుగా...

- రితూ వర్మ

నాకే కాదు... చాలామంది హీరోయిన్లకు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ దర్శకత్వంలో నటించాలని కోరిక, కల. విచిత్రం ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే నాకు ఆ కల నెరవేరింది. ‘పెళ్లిచూపులు’ రైట్స్‌ను తమిళంలో గౌతమ్‌ సారే కొనుగోలు చేశారు. ఆ తరువాత ఆయనతో కలిసి ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాలోనూ నటించే అవకాశమూ అనుకోకుండా వచ్చిందే. అలాగే ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలతో పోలిస్తే.. ఇంకా భిన్నంగా పూర్తిస్థాయిలో యాక్షన్‌ సినిమాలో చేసే ఛాన్స్‌ ఎప్పుడొస్తుందాని ఎదురుచూస్తున్నా. కుదిరితే ఆ సినిమాలో రా ఏజెంట్‌గా నటించాలనుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..