Updated : 22 May 2022 05:49 IST

హీరోల పిల్లలు మెచ్చిన తారలు..!

సాధారణంగా హీరోల పిల్లలు తమ తండ్రి సినిమాలు ఎక్కువగా చూస్తూ వారినే అభిమానిస్తుంటారు. అయితే కొందరు ప్రముఖ కథానాయకుల పిల్లలు మాత్రం నాన్నతోపాటు ఇతర నటుల్నీ అభిమానిస్తూ... వారిని కలుసుకుంటున్నారు. ఇంతకీ వాళ్లెవరంటే...


అలా యాక్ట్‌ చేస్తూ!

అటు క్లాస్‌నీ, ఇటు మాస్‌నీ ఆకట్టుకునే హీరో మహేశ్‌బాబుని పిల్లలు కూడా బాగానే ఇష్టపడతారు. వారిలో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ తనయుడు అభయ్‌రామ్‌ కూడా ఉన్నాడు. అభయ్‌రామ్‌కి మహేశ్‌బాబు సినిమాలంటే చాలా ఇష్టమట. వాటిలో మహేశ్‌ నటించిన ‘బిజినెస్‌మేన్‌’ బాగా నచ్చుతుందట. మహేశ్‌కోసం ఆ సినిమాని పదే పదే చూస్తుంటాడట అభయ్‌. అంతేనా, మహేశ్‌లాగా యాక్టింగ్‌ కూడా చేసి చూపుతూ ఇంట్లో మాంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడంలో ముందుంటాడట జానియర్‌ పెద్ద కుమారుడు.


అదే అయాన్‌ కోరికట!

అల్లు అర్జున్‌ తనయుడు అయాన్‌... ‘రంగస్థలం’ విడుదలయ్యాక చిట్టిబాబులా గెటప్‌ వేసుకుని డాన్స్‌ చేసిన వీడియో ఒకటి నెట్‌లో బాగా వైరల్‌ అయింది. యాక్షన్‌ సినిమాల్ని బాగా చూసే ఎనిమిదేళ్ల అయాన్‌ బాలీవుడ్‌ నటుడు, జాకీష్రాఫ్‌ తనయుడైన టైగర్‌ ష్రాఫ్‌కి వీరాభిమాని. అందుకే ఆ హీరోని ‘టైగర్‌ స్క్వాష్‌’ అని ముద్దుగా పిలుచుకోవడంతోపాటు ఇంట్లో వాళ్ల చేత తననీ అలానే పిలవమంటాడట అయాన్‌. అంతేకాదు, కొన్నాళ్ల క్రితం ‘టైగర్‌ స్క్వాష్‌, నన్ను ఒకసారి మీ ‘భాగీ3’ సెట్‌కి తీసుకెళ్లరా’ అని అయాన్‌ అడిగే ఓ వీడియోని టైగర్‌ ష్రాఫ్‌కి షేర్‌ చేశాడు బన్నీ. ‘‘తప్పకుండా అయాన్‌.. నిన్ను ‘భాగీ3’కే కాదు, నా ప్రతి సినిమా షూటింగ్‌కీ తీసుకెళతా’’నని రిప్లై ఇచ్చాడు టైగర్‌. అతని కండల్నీ, షూటింగ్‌లో చేసే ఫైట్లనీ దగ్గరగా చూడాలనేది అయాన్‌ కోరికట.


ఆ సినిమా చూసి!

రేణూ దేశాయ్‌ నిర్వహణ, దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్‌ వాలా లవ్‌’ చిత్రంతో బాలనటుడిగా పరిచయమయ్యాడు పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌. ఆపై నటించకపోయినా అకీరాకు తండ్రివల్ల ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగానే ఉంది. తండ్రి పవన్‌ కల్యాణ్‌తోపాటు నటుడు అడవి శేష్‌ అంటే అకీరాకు ఇష్టమట. ‘ఎవరు’ సినిమా చూసి శేష్‌కు అభిమానిగా మారిన అకీరా, అతడిని కలిసి తన అభిమానాన్నీ చాటుకున్నాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పంచుకుంది తల్లి రేణూ దేశాయ్‌. ఎడమచేతివాటం ఉన్న ఈ ఇద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కూడా.


న్యూయార్క్‌లో కలుసుకుని...

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది మహేశ్‌బాబు కూతురు తొమ్మిదేళ్ల సితార. ‘సర్కారు వారి పాట’తో తెరమీదకొచ్చిన సితార తన తండ్రి మహేశ్‌బాబు సినిమాలు చూస్తుంది, నటుడిగానూ అభిమానిస్తుంది. తనకి ఆలియాభట్‌ అన్నా అంతే ఇష్టమట. ఆమె ప్రతి సినిమానీ చూస్తుందట. ‘మహర్షి’ షూటింగ్‌ సమయంలో మహేశ్‌బాబుతోపాటు న్యూయార్క్‌ వెళ్లిన సితార- ఆలియా భట్‌ అక్కడే ఉందని తెలుసుకుని ఆమెని కలిసి, తన అభిమానాన్ని చాటుకుంది. దానికి ఎంతో మురిసిపోయిన ఆలియా సితారకు ముచ్చటైన గౌనును బహూకరించిందట. ఆ విషయాన్ని నమ్రత సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.


రౌడీ ప్రచారంలో భాగం!

రవితేజ కొడుకు మహాధన్‌ ‘రాజా ది గ్రేట్‌’తో బాల నటుడిగా వెండితెరపై మెరిశాడు. అంధుడి పాత్రలో నటించిన రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్‌ చేసిన మహాధన్‌ ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఆ సినిమా కోసం కర్రసాము, మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకున్న ఈ అబ్బాయికి యాక్షన్‌ సినిమాలంటే చాలా ఇష్టమట. హీరో విజయ్‌ దేవరకొండకీ వీరాభిమానినని చెబుతుంటాడు మహాధన్‌. అందుకే ఈ మధ్య తన స్నేహితులతో కలిసి విజయ్‌ని కలిశాడు. విజయ్‌ సొంత బ్రాండ్‌ అయిన ‘రౌడీ’ టీషర్టు ధరించి, మహాధన్‌ కూడా పబ్లిసిటీలో భాగమై, తన అభిమానాన్ని ఆ రూపంలో చాటుకున్నాడు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని