Updated : 26 Dec 2021 05:48 IST

అక్కడ హీరోలు.. మరి ఇక్కడ..?

వివిధ భాషల్లో ప్రముఖ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు నటులు తెలుగు తెరమీదా నటిస్తూ... ఇక్కడా తమని తాము నిరూపించుకునే పనిలో పడ్డారు. వాళ్లెవరో, ఆ సినిమాలేంటో చూద్దామా...


లంకేశుడిగా..

హిందీ సినిమాల్లో ప్రేమకథా చిత్రాల్లో ఎక్కువగా కనిపించే హీరో సైఫ్‌ అలీ ఖాన్‌. త్వరలో, తెలుగులో ప్రభాస్‌ చేస్తున్న ఆదిపురుష్‌లో లంకేశుడి పాత్రలో కనిపించనున్న సైఫ్‌ తనకు ఈ అవకాశం అనుకోకుండానే వచ్చిందని అంటాడు. ‘రామాయణంలో రావణాసురుడి వ్యక్తిత్వం గురించి తెలిసిందే. నేను అలాంటి పాత్ర చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కొన్నాళ్లక్రితం నాకు ఆ దర్శకుడు ఫోన్‌ చేసి తెలుగులో ఛాన్స్‌ ఉంది చేస్తావా అంటూ నా పాత్ర గురించి చెప్పడంతో వెంటనే ఓకే చేశా. అయితే... నా పాత్ర ఎంత ఆసక్తికరంగా ఉంటుందనేది తెరమీద చూడాల్సిందే...’నంటాడు సైఫ్‌అలీఖాన్‌ నవ్వుతూ.


పోలీసు అధికారిగా నటించి..

కాజల్‌ అగర్వాల్‌, మంచు విష్ణు అక్కాతమ్ముళ్లుగా నటించిన ‘మోసగాళ్లు’లో పోలీసు అధికారిగా కనిపించిన నటుడు ఒకప్పటి బాలీవుడ్‌ హీరో సునీల్‌శెట్టి. అతనే త్వరలో ‘గని’లో వరుణ్‌తేజ్‌తో కలిసి తెరను పంచుకోనున్నాడు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఇంత కొత్తగా ఉంటుందనుకోలేదని చెప్పే సునీల్‌శెట్టి మోహన్‌బాబు స్నేహితుడు కావడం వల్లే ‘మోసగాళ్లు’ ఒప్పుకున్నాననీ... ఆ వెంటనే ‘గని’లో అవకాశం వస్తుందనుకోలేదనీ అంటాడు. ‘మోసగాళ్లు’ షూటింగ్‌ జరుగుతున్నంత కాలం మోహన్‌బాబు ఇంటినుంచి ప్రతిరోజూ భోజనం వచ్చేది. టాలీవుడ్‌తో అనుబంధం ఆ సినిమాతో ముగిసిందనుకున్నా కానీ ‘గని’లో ఛాన్స్‌ వస్తుందని అనుకోలేదు.. చూడాలి ఇకమీద ఎలా ఉంటుందో’ అంటాడు సునీల్‌శెట్టి.


పవన్‌కల్యాణ్‌తో కలిసి...

బాలీవుడ్‌ నటుల్లో చెప్పుకోదగ్గ మరో హీరో అర్జున్‌రాంపాల్‌. బాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ గుర్తింపు తెచ్చుకున్న ఇతను... త్వరలో తెలుగులో పవన్‌కల్యాణ్‌ చేస్తున్న ‘హరిహర వీరమల్లు’లో కనిపించనున్నాడు. ఇందులో కీలక పాత్రలో నటించనున్న అర్జున్‌రాంపాల్‌ తనకు ఇది మంచి అవకాశమనీ... దీంతో పాన్‌ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోనున్నాననీ చెబుతాడు.


విలన్‌ పాత్ర నచ్చడంవల్లే..

ఎప్పుడూ హీరోగానే ఎందుకు చేయాలి... ఒక్కసారైనా విలన్‌లా నటిస్తేనే కదా ఆ పాత్ర లోతు గురించీ తెలిసేది... అనే కోణంలో ఆలోచించిన మలయాళ నటుడు ఫహద్‌ ‘పుష్ప’లో ‘భన్వర్‌ సింగ్‌ షెకావత్‌’గా తెలుగు తెరమీదా కనిపించేశాడు. ఒక పెద్ద హీరో అయ్యుండి... మరో ప్రముఖ హీరోతో పోటీపడుతూ విలన్‌ పాత్రను చేయడం నిజంగా సాహసమే కదూ అంటే... ‘రంగస్థలం’ చూశాక సుకుమార్‌ ఎంత బాగా తీశాడోనని అనిపించింది. కొన్నాళ్లక్రితం అదే దర్శకుడు నాకు ‘పుష్ప’లో భన్వర్‌ పాత్రను వివరించి... నన్ను చేయమనేసరికి ఆలోచించకుండా ఓకే చెప్పేశా. నాకు కూడా కాస్త కొత్తగా ట్రై చేయడంలో తప్పేంలేదనిపించింది మరి. పైగా విలన్‌గా చేయడం వల్ల... మన స్థాయిని అంచనా వేసుకోవచ్చుగా. ‘పుష్ప’ తరువాత కమల్‌హాసన్‌ సినిమా ‘విక్రమ్‌’లోనూ విలన్‌గా నటిస్తున్నా... ఈ ప్రయాణం బాగుంది’ అంటూ తనదైన స్టైల్‌లో నవ్వేస్తాడు ఫహద్‌.


చిరంజీవితో ఢీ కొట్టేస్తూ..

ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’ సినిమాలో ఎల్వీప్రసాద్‌ పాత్రలో కనిపించిన నటుడు గుర్తున్నాడా.. అతని పేరు జిస్సుసేన్‌గుప్తా. బెంగాలీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న జిస్సుసేన్‌కు ఎన్టీఆర్‌ కథానాయకుడులో అవకాశం రావడంతో దాన్నో గౌరవంగా భావించి నటించేశాడట. అయితే ఆ తరువాత అతనికి మరికొన్ని అవకాశాలు వరుసకట్టడంతో దక్షిణాదిన కూడా తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొదటి సినిమా తరువాత ‘అశ్వథ్థామ’, ‘భీష్మ’, ‘మ్యాస్ట్రో’ వంటి సినిమాల్లో విలన్‌గా నటించి ప్రశంసలు అందుకున్న జిస్సు త్వరలో ‘ఆచార్య’లోనూ కనిపించబోతున్నాడు. ‘శ్యామ్‌సింగరాయ్‌’ లోనూ నటిస్తున్న ఈ బెంగాలీహీరో... ఇక్కడా తనసత్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని