ఈ రైల్లో ఆపరేషన్లు చేస్తారు!

మొబైల్‌ హాస్పిటల్‌ గురించి... అదీ రైలు పట్టాలపైన దేశమంతా చుట్టొస్తున్న ధర్మాసుపత్రి గురించి విన్నారా? ఏడు బోగీలు... వాటిలో వివిధ రకాల చికిత్స ఏర్పాట్లు... నిపుణులైన వైద్యులతో కూడిన రైలు ఆసుపత్రి అది.

Updated : 21 Nov 2022 15:39 IST

ఈ రైల్లో ఆపరేషన్లు చేస్తారు!

మొబైల్‌ హాస్పిటల్‌ గురించి... అదీ రైలు పట్టాలపైన దేశమంతా చుట్టొస్తున్న ధర్మాసుపత్రి గురించి విన్నారా? ఏడు బోగీలు... వాటిలో వివిధ రకాల చికిత్స ఏర్పాట్లు... నిపుణులైన వైద్యులతో కూడిన రైలు ఆసుపత్రి అది. రైల్వేస్టేషన్లలో రోగులకు ఉచిత సేవలందించే ఈ చుక్‌ చుక్‌ బండి ఇప్పుడు తెలంగాణలోని కాగజ్‌నగర్‌లో ఆగింది. చూసొద్దాం పదండి...

అత్యవసరాలకూ, ఆధునిక వసతులకూ ఆమడ దూరంలో ఉన్న పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో ఉచిత వైద్య సేవలందించాలనే సంకల్పంతో- ముప్ఫై రెండేళ్ల క్రితం ట్రైన్‌ హాస్పిటల్‌కి శ్రీకారం చుట్టారు ముంబయికి చెందిన లాజరస్‌. ఆమె ఆలోచన నచ్చిన ఇంపాక్ట్‌ ఇండియా ఫౌండేషన్, రైల్వే మంత్రిత్వ శాఖలు- లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడుస్తున్న ఈ రైలు ఆసుపత్రికి మద్దతునిస్తూ కనీస వసతులు లేని పేదలకు సాయమందించడంలో తోడ్పడుతున్నాయి.

ఈ రైలు ఆసుపత్రిని గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఆపి రెండు నుంచి మూడు వారాలపాటు పేదలకు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తుంటారు. ఈ విధంగా ఏడాదికి పదకొండు శిబిరాలను ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా వైద్యం, శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. ఇప్పటివరకూ 25 రాష్ట్రాల్లో 224 క్యాంపులను నిర్వహించిన లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ కాగజ్‌నగర్‌లో ఆగి తెలంగాణ, ఆంధ్రా ప్రజలకు వైద్యం చేస్తోంది. అక్టోబర్‌ 12- నవంబర్‌ 2 వరకూ నిర్వహించే శిబిరంలో 22 మంది వైద్యనిపుణులు, 30 సిబ్బంది సేవలందిస్తున్నారు.

అన్ని చికిత్సలూ...

ఏడు బోగీలున్న రైల్లో ఈఎన్‌టీ, గ్రహణం- మొర్రి, కాలినగాయాలకూ, గైనిక్, దంత, మూర్చ, కంటి సమస్యలకూ చికిత్స చేస్తారు. ఇక్కడ క్యాన్సర్‌ పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. అలానే పోలియో బారిన పడిన పద్నాలుగేళ్ల లోపు చిన్నారుల వంపు తిరిగిన ఎముకలకు శస్త్రచికిత్స చేస్తారు. సమస్య తీవ్రతను బట్టి ఎవరికైనా ఆపరేషన్‌ చేయాల్సి వస్తే ఉచితంగానే ఆ సేవలూ అందిస్తారు. అందుకోసం రెండు బోగీల్లో అత్యాధునిక సదుపాయాలతో ఆపరేషన్‌ థియేటర్, పాథాలజీ ల్యాబ్, మమోగ్రఫీ, ఎక్స్‌రే యూనిట్‌లతోపాటు ఫార్మసీ కూడా ఉంది. పల్లె ప్రజలకు పట్టాలపైనే సేవలందించే ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకూ 15లక్షల మందికిపైనే వైద్యసేవలూ, సుమారు లక్షన్నర మందికి ఉచితంగా ఆపరేషన్లూ నిర్వహించారు.

ఆపరేషన్‌ చేశాక...

ఏ చికిత్స చేసినా రోగులకు కొన్ని రోజులపాటు వైద్యుల పర్యవేక్షణ అవసరం. మరి ఏడు బోగీలే ఉన్న ఈ ట్రైన్‌ హాస్పిటల్‌లో ఇన్‌పేషంట్‌ సేవలు కష్టం. అందుకే జిల్లా రైల్వే, వైద్యాధికారులూ, స్వచ్ఛంద సంస్థల సాయంతో కాగజ్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రితోపాటు మరో భవనంలోనూ వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సాయంతో నడిచే ట్రైన్‌ హాస్పిటల్‌లో వలంటీర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చి తమవంతు సాయమందిస్తుంటారు. పల్లె ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తోన్న ఈ ట్రైన్‌లో వైద్యం చేయించుకోవాలనుకునేవారు వెంట ఆధార్‌కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే 9820303974 నంబరులో సంప్రదించాలి.

- దాడి శ్రీనివాస్, ఆదిలాబాద్‌ డెస్కు

ఫొటోలు: వి.శ్రీనివాసరావు, న్యూస్‌టుడే, కాగజ్‌నగర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..