ఈ మొక్కలు ఉంటే దోమలు రావు

సాయంత్రమైతే చాలు... అప్పటివరకూ ఏ పక్కన నక్కి ఉంటాయో... సూదితో పొడిచినట్లుగా కుట్టేస్తుంటాయ్‌... బ్యాట్‌తో కొట్టినా మస్కిటో రిపెల్లంట్‌ లైట్‌ వేసినా... ఇంకా ఎక్కడో ఒకచోట మిగిలే ఉంటాయి. అందుకే ‘వీటిని పెంచుకుంటే దోమలు కుట్టవు’ అంటూ నెట్టింట్లో కొన్ని మొక్కలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అవేంటో తెలుసుకుందామా..!

Published : 14 Aug 2022 12:30 IST

ఈ మొక్కలు ఉంటే దోమలు రావు

సాయంత్రమైతే చాలు... అప్పటివరకూ ఏ పక్కన నక్కి ఉంటాయో... సూదితో పొడిచినట్లుగా కుట్టేస్తుంటాయ్‌... బ్యాట్‌తో కొట్టినా మస్కిటో రిపెల్లంట్‌ లైట్‌ వేసినా... ఇంకా ఎక్కడో ఒకచోట మిగిలే ఉంటాయి. అందుకే ‘వీటిని పెంచుకుంటే దోమలు కుట్టవు’ అంటూ నెట్టింట్లో కొన్ని మొక్కలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అవేంటో తెలుసుకుందామా..!

ఓ పక్కన వర్షాలు... మరో పక్కన దోమలు... ఇక, జనం రోగాల బారిన పడకుండా ఉండటం సాధ్యమేనా... మలేరియా, డెంగీ, జికా, ఫైలేరియా, చికన్‌గున్యా... వంటి జ్వరాలన్నీ దోమల కారణంగా వ్యాపిస్తున్నవే. సాయంకాలం కాసేపు బాల్కనీలో స్థిమితంగా కూర్చోనివ్వవు, తలుపులన్నీ మూసి టీవీ చూస్తున్నా పడుకున్నా చెవి పక్కన చేరి గుయ్‌గుయ్‌మంటూ రొద పెడుతుంటాయి. అందుకే  దోమల్ని తరిమికొట్టేందుకు యూవీ ల్యాంప్‌లూ బ్యాట్లూ రసాయన ఉత్పత్తులూ మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. వీటికి తోడుగా కొన్నిరకాల మొక్కల్నీ పెంచుకోమని సూచిస్తున్నారు ఉద్యాన నిపుణులు.

ఎందుకంటే- చెమట వాసన, మనం వదిలే కార్బన్‌డైఆక్సైడ్‌ ఆధారంగానే మనల్ని దోమలు 50 అడుగుల దూరం నుంచే గుర్తుపట్టి మరీ మీదికొచ్చి కుట్టేస్తుంటాయి. అయితే బాల్కనీలోనో లేదా ఇంట్లోనో గాఢమైన వాసన కలిగిన కొన్ని రకాల మొక్కల్ని పెంచుకోవడంతో - వాటి నుంచి వచ్చే పరిమళం కారణంగా అవి మనల్ని గుర్తుపట్టలేక దగ్గరకు రాలేవు. ఇంతకీ దోమల్ని అడ్డుకునే ఆ మొక్కలు ఏమిటంటే...

లెమన్‌గ్రాస్‌, సిట్రొనెల్లా: గడ్డిజాతికి చెందిన ఈ రెండు రకాల మొక్కలకు దోమల్ని తరిమికొట్టే లక్షణాలు ఉన్నాయట. ఈ మొక్కల ఆకుల్ని నలిపి దాన్నుంచి వచ్చే తైలాన్ని రాసుకుంటే మరింత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లోనూ తేలింది. ఆ వాసన మనకి హాయిని కలిగిస్తే, దోమలకు చికాకుని కలిగిస్తుందట. సెంటెడ్‌ జెరానియంగా పిలిచే సిట్రొనెల్లా కూడా ఇదేవిధంగా పనిచేస్తుంది. ఈ మొక్కల ఆకుల్ని టీలో వేసుకుని తాగినా రుచిగా ఉంటుందట.

లెమన్‌ థైమ్‌: సిట్రస్‌ జాతికి చెందిన ఈ మొక్కని గుమ్మం పక్కన ఉంచితే దోమలతోపాటు ఇతరత్రా కీటకాలూ లోపలికి రావట.

లెమన్‌ బామ్‌: లెమన్‌ థైమ్‌ మాదిరిగానే దీని వాసనా కీటకాలకి గిట్టదు. పుదీనా కుటుంబానికి చెందిన ఈ మొక్క కుండీల్లో త్వరగానూ ఏపుగానూ పెరుగుతుంది.

లావెండర్‌:  చలి ప్రదేశాల్లో ఎక్కువ పెరిగే లావెండర్‌ పూల వాసన దోమల్ని మాత్రమే కాదు, ఈగలూ మాత్‌లూ వంటి కీటకాలనూ రాకుండా చేస్తుందట. అందుకే ఈ మొక్కలు పెరగని ఎండిన రెమ్మల్ని తెచ్చుకుని గుమ్మాల దగ్గర వేలాడదీస్తుంటారు. దాంతో కీటకాల బెడద కొంతైనా తగ్గుతుందట. ఈ పూరెమ్మల్ని దుస్తుల మధ్యలో వేసుకుంటే చెదపురుగుల్లాంటివి చేరకుండా ఉంటాయి.

రోజ్‌మేరీ: వంటల్లో సుగంధ ద్రవ్యంగా వాడే దీని వాసన దోమలకే కాదు, క్యాబేజీ మాత్‌, క్యారెట్‌ ఫ్లైలకి కూడా పడదట. అందుకే దీన్ని వాకిలి ముందో బాల్కనీలోనో, వంటింటి కిటకీలోనో.. ఇలా దోమలు ఇంటిలోకి వచ్చే మార్గంలో పెట్టుకుంటే మేలు.

తులసి:  వంటకాల్లోనూ సలాడ్లలోనూ వాడుకునే ఆసిమమ్‌ బాసిలికమ్‌ అనే ఒక రకం తులసికి ఈగల్నీ దోమల్నీ తరిమికొట్టే శక్తి కూడా ఉంది. అందుకే దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల అన్నివిధాలా లాభమే.

క్యాట్నిప్‌ (నెపాటా కాటారియా): నెపెటాలాక్టోన్‌ అనే రసాయనంతో నిండిన ఈ మొక్కను పరిశీలించినప్పుడు- ఇతరత్రా రసాయనపదార్థాలతో రూపొందించిన మస్కిటో రిపెల్లంట్స్‌ కన్నా సమర్థంగా పనిచేసిందట. ఔషధభరితమైన ఈ మొక్క ఆకుల్ని మందుల తయారీలోనూ హెర్బల్‌ టీలోనూ కూడా వాడుతుంటారు. ఇవే కాదు, పెప్పర్‌మింట్‌, సేజ్‌, ఆలియం... వంటి మొక్కల నుంచి వచ్చే వాసనల వల్ల దోమలు త్వరగా మన ఉనికిని పసిగట్టలేవు. పైగా ఈ మొక్కలన్నీ ఔషధ విలువలున్నవీ పరిమళభరితమైనవీ కూడా. కాబట్టి వీటిని ఇంట్లో పెంచుకుంటే ఎంతో కొంత ఫలితం ఉంటుందనేది మాత్రం నిజం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..