Published : 03 Jul 2022 00:44 IST

ఒక్క మేకూ లేకుండా... కేరళ కొయ్య నౌకలు!

కాగితం పడవలు చేయడం మనకొచ్ఛు కాస్త ఆసక్తి ఉండి కొంత సాధనా చేస్తే చేతిలో పట్టేంత చిన్న నౌకను చేయగలమేమో. కానీ కేరళకి చెందిన ఈ కళాసీలు ఏకంగా రెండొందల అడుగులు పొడవున్న కొయ్య నౌకల్ని చేయగలరు. అందుకే, వీళ్ల నౌకల్ని ప్రపంచంలోనే అతిపెద్ద హస్తకళావస్తువుల (హ్యాండీక్రాఫ్ట్‌)ని చెబుతుంటారు. ఈ ఏడాది ఖతార్‌లో జరుగుతున్న ‘ఫిఫా ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌’ ఉత్సవాల్లో ఇలాంటి ఓడని ప్రత్యేక ప్రదర్శనగా పెడుతున్నారు!

నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌కి ఈసారి చాలా ప్రత్యేకతలున్నాయి. ‘సాకర్‌ సూపర్‌స్టార్‌’గా ప్రసిద్ధిచెందిన అర్జెంటీనా ఆటగాడు లయొనల్‌ మెస్సీకి ఇదే చివరి పోటీ కావడం ఓ విశేషం అయితే... ఈ క్రీడలకి తొలిసారి ఓ మధ్యప్రాచ్యదేశం ఆతిథ్యం ఇవ్వడం మరో ప్రత్యేకత. అందుకే, ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రపంచానికి తమ సంస్కృతీ సంప్రదాయాలని చాటాలనుకుంటోంది ఖతార్‌. అందులో భాగంగానే కేరళలో కొయ్యతో చేసిన ఓ భారీ నౌకని ప్రదర్శనగా ఉంచాలనుకుంటోంది. ఖతార్‌ సంస్కృతిని చాటడానికి మనదేశంలో తయారుచేసిన ఓడని ప్రదర్శించడమేంటీ అనుకుంటున్నారు కదా..! రండి చూద్దాం...

కేరళలోని కోళిక్కోడు(ఒకప్పటి కాలికట్‌) నౌకాయానానికి ప్రసిద్ధి చెందిన నగరం. క్రీస్తు శకం ఏడో శతాబ్దం నుంచీ అరబ్బు దేశాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి కేరళ సుగంధద్రవ్యాలని తీసుకెళ్లడం మొదలుపెట్టారు. వాళ్లకి ఇక్కడి స్థానికులు ‘ఉరు’ అనే భారీ ఓడలు తయారుచేసి ఇస్తుండేవాళ్లు. కాలక్రమంలో ఈ స్థానికులు ‘మరక్కాయర్‌’లుగా పట్టం కట్టుకుని దక్షిణాదిలోని సముద్ర వ్యాపారం మొత్తాన్నీ తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. వీళ్ల హవా పోర్చుగీసులు వచ్చేదాకా నిరాటంకంగా సాగింది. పోర్చుగీసులు వీళ్లని అణగదొక్కి... కేవలం వృత్తి పనివాళ్లుగా మిగిల్చారు. అలా ఈ కుటుంబాలవాళ్లందరూ ‘మాప్పిళ్ల కళాసీలు’ అన్న పేరుతో కోళిక్కోడుకి దగ్గర నేత్రావతీ నది తీరంలోని బేపూర్‌ గ్రామానికే పరిమితమయ్యారు. అయినా నౌకలకి గిరాకీ తగ్గలేదు. ముఖ్యంగా- అరబ్బుదేశాల వాళ్లు వీటిని కొనడం మానలేదు. పూర్వకాలంలో తమ సుగంధద్రవ్యాల వ్యాపారానికి దన్నుగా నిలిచి సంపద సృష్టికి ఉపయోగపడినందువల్ల కావొచ్ఛు.. అక్కడి రాజకుటుంబాలు ఈ ఓడల్ని తమ సంస్కృతిలో భాగంగానే చూస్తున్నాయి. అక్కడి వ్యాపారులూ సముద్రాలపైన తేలియాడే రెస్టరంట్‌లుగానూ విలాసాల ఓడలుగానూ వాడేందుకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఏర్పాటుచేసే ప్రదర్శనకి ప్రత్యేకంగా ‘ఉరు’ నౌకని చేయించి తీసుకెళ్తున్నారు!

ఎలా చేస్తారబ్బా... 

భారీ కొయ్యనౌకలను తయారుచేయడం ప్రపంచానికేమీ కొత్తకాదు. అమెరికా, ఐరోపా దేశాలెన్నో 19వ శతాబ్దంలో మూడువందల అడుగులకన్నా పొడవైన నౌకల్ని తయారుచేయడం మానేశాయి. అయితే, ఆ నౌకల్లో ఇనుము వంటి లోహాలనీ భారీగా వాడేవారు. కానీ ఈ కేరళ నౌకల్లో కనీసం చిన్న మేకుగా కూడా ఇనుముని వాడరు. ఇక్కడికి దగ్గర్లోని నీలాంబుర్‌ అడవుల్లోని టేకు, చింత చెట్ల కొయ్యదుంగలతోనే ఓడక్కావాల్సిన భారీ చెక్కల్ని తయారుచేసుకుంటారు. వాటికి పనస పలకల్ని(ప్లాంక్స్‌) చుట్టి... ప్రత్యేకంగా పేనిన కొబ్బరి తాళ్లతో కుట్టేస్తారు. ఇందుకోసం 200 అడుగుల ఓడకి వాటి చెక్కలపైన ఐదువేల రంధ్రాలు చేసి... రెండున్నర వేల కుట్లు వేయాలన్నది ఈ మాప్పిళ్ల కళాసీల లెక్క. అలా కుడుతూ... వంపులతో కూడిన ఓడ కిందిభాగాన్ని తయారుచేస్తారు. ఆ వంపులే ఈ ‘ఉరు’ ఓడల ప్రత్యేకత అని చెబుతున్నారు ఆధునిక నౌకా నిర్మాణ నిపుణులు. సునామీలాంటి భారీ అలలనైనా సరే... ఈ వంపులు నిభాయించగలవని విశ్లేషిస్తున్నారు వాళ్లు. కేవలం కుట్ల కోసమనే కాదు... ఇతర అవసరాలన్నింటికీ తాళ్లనే వాడతారు ఇందులో. వాటిపైన వీళ్లే ప్రత్యేకంగా తయారుచేసిన చేపనూనె రాసి ఎండబెడతారు. ఆ నూనె దాదాపు వందేళ్లయినా సరే... తాళ్లు ఊడిపోకుండా కాపాడుతుందట!

మాప్పిళ్ల కళాసీలు తయారుచేసే ఈ ఓడల్లో ఇంత ప్రత్యేకత ఉండబట్టే- కేరళ పర్యటక సంస్థ కూడా ఈ ఏడాది నుంచి తమ పర్యటక ప్రదేశాల జాబితాలో బేపూర్‌ గ్రామాన్నీ అధికారికంగా చేర్చింది. పర్యటకులకి అక్కడి సంప్రదాయ నౌకానిర్మాణ కేంద్రాలతోపాటూ మాప్పిళ్ల కళాసీల జీవనాన్నీ పరిచయం చేస్తోంది!


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని