మీ అభిమానం బంగారం కానూ!

ఫుట్‌బాల్‌ అంటే... మనదేశంలో కేరళ, పశ్చిమ్‌బంగ వాసులకు ప్రత్యేక అభిమానం. ఇక సాకర్‌ వరల్డ్‌కప్‌ మొదలైతే ఆ రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు కదా.

Published : 03 Dec 2022 23:53 IST

మీ అభిమానం బంగారం కానూ!

ఫుట్‌బాల్‌ అంటే... మనదేశంలో కేరళ, పశ్చిమ్‌బంగ వాసులకు ప్రత్యేక అభిమానం. ఇక సాకర్‌ వరల్డ్‌కప్‌ మొదలైతే ఆ రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు కదా. అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కేరళలోని కొచ్చి జిల్లా ముందక్కముగల్‌ గ్రామానికి వెళ్లాలి ముందు. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లను చూడటం కోసమే గ్రామానికి చెందిన పీకే హారిస్‌, అతడి మిత్రులు మరో పదహారు మంది కలిసి దాదాపు పాతిక లక్షలు పెట్టి ఒక ఇల్లు కొన్నారు. మరో రెండు లక్షల దాకా ఖర్చు పెట్టి వరల్డ్‌కప్‌లో పోటీపడుతున్న దేశాల జెండాలు, ప్లేయర్ల ఫొటోలతో దాన్ని అలంకరించారు. యాభై అంగుళాల టీవీ, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేసుకుని... వాళ్లందరూ కలిసి గోలగోలగా మ్యాచ్‌లను ఎంజాయ్‌ చేస్తున్నారు. అలానే, కేరళకు చెందిన  అష్రాఫ్‌ తన భార్యకి ఫుట్‌బాల్‌ ఇష్టమని- ఆమెకు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూపించడానికి కుటుంబంతో కలిసి కారులో ఖతార్‌ బయల్దేరి వెళ్లాడు. కానూర్‌కి చెందిన ఐదుగురు పిల్లల తల్లి నాజీ నౌషీకి కూడా లైవ్‌లో మ్యాచ్‌ చూడాలని- పిల్లలతో కలిసి స్వయంగా కారు నడుపుతూ ఖతార్‌కి ప్రయాణమైంది. వీళ్లంతా ముంబై దాకా కారులో వెళ్లి అక్కడ కారుతో సహా షిప్‌ ఎక్కి దుబాయ్‌లోని జెబల్‌ అలీ పోర్ట్‌లో దిగారు. ఒమన్‌, బహ్రెయిన్‌, కువైట్‌, సౌదీ అరేబియాల మీదుగా ఖతార్‌ చేరారు. కేరళలో ఇలా ఉంటే పశ్చిమ్‌బంగలో మరోలా ఉంది... వరల్డ్‌కప్‌ ఫీవర్‌ను ప్రతిబింబించేలా ప్రత్యేక శారీలొచ్చేశాయి అక్కడి మార్కెట్‌లోకి! దక్షిణ కోల్‌కతాలోని బలరామ్‌ సాహా అండ్‌ సన్స్‌ షాప్‌ వాళ్లు బ్రెజిల్‌, అర్జెంటీనా ఆటగాళ్ల బొమ్మలతో జామ్‌ధానీ చీరలు నేయించారు వాటిలో కొన్ని చీరల్ని బ్రెజిల్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం తీసుకోవడం విశేషం. ఇక, ఆ రాష్ట్రాల్లో ఇళ్లూ, కార్లూ, రోడ్లూ, చిన్నదుకాణాల్ని కూడా పెయింటింగ్స్‌తో ఫుట్‌బాల్‌మయం చేశారు. అలా ఒక్కొక్కరూ ఒక్కోలా తమ అభిమానం చాటుకుంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..