జట్టుగా కదిలి..!

గ్రూపు అనగానే మనకి ఏ వాట్సాప్‌ గ్రూపో ఫేస్‌బుక్‌ గ్రూపో గుర్తొస్తుంది ఇప్పుడంతా! కానీ, ఇవి కేవలం వర్చువల్‌ గ్రూపులు కావు... వాస్తవ ప్రపంచానికి దగ్గరగా పనిచేసే గ్రూపులు. పరుల సాయం కోసం విభిన్నంగా పాటుపడుతున్న బృందాలు. మీరే చూడండి...

Updated : 19 Oct 2022 12:12 IST

జట్టుగా కదిలి..!

గ్రూపు అనగానే మనకి ఏ వాట్సాప్‌ గ్రూపో ఫేస్‌బుక్‌ గ్రూపో గుర్తొస్తుంది ఇప్పుడంతా! కానీ, ఇవి కేవలం వర్చువల్‌ గ్రూపులు కావు... వాస్తవ ప్రపంచానికి దగ్గరగా పనిచేసే గ్రూపులు. పరుల సాయం కోసం విభిన్నంగా పాటుపడుతున్న బృందాలు. మీరే చూడండి...


స్థలముంటే చాలు... ఇల్లు కట్టిస్తారు!

‘ఇల్లుకట్టి చూడు... పెళ్ళి చేసి చూడు’ అనే నానుడి ఊరికే రాలేదు. వాటికయ్యే ఖర్చులూ, మధ్యలో ఎదురయ్యే సమస్యలూ అలాంటివి మరి. ముఖ్యంగా- ఓ మోస్తరు కాంక్రీటు ఇల్లు కట్టు కోవాలన్నా పేదలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అందుకే స్థలం ఉన్నా ఖర్చులకి భయపడుతుంటారు... ఏళ్లనాటి ఇల్లు పాడుబడుతున్నా చేసేదిలేక చూస్తూ ఉండిపోతారు. అలాంటి నిరుపేదలకి సాయం చేస్తుంది కేరళ కాసర్గోడు జిల్లాలోని ‘వైట్‌ ఆర్మీ’ బృందం. 30 మంది భవన నిర్మాణ కూలీలు, పెయింటర్లూ, ఎలక్ట్రీషియన్‌లతో కూడిన జట్టు ఇది. ‘నిర్మాణ కూలీ’కి కూడా ఖర్చుచేయలేని పేదలు ఎవరు ఇల్లు కట్టాలనుకున్నా వీళ్లకి చెబితే చాలు. ఆదివారాలూ, ఇతర సెలవురోజుల్లో వచ్చి పనిచేసిపోతారు. ‘ఏదో తీరికున్నరోజుల్లో సరదాగా చేసిపోతార్లే’ అనుకోకండి... ఐదు ఆదివారాల్లోపు పని పూర్తిచేసిపెట్టి వెళతారు. ఆ రోజుల్లో వేకువ నుంచి రాత్రిదాకా విరామం లేకుండా పనిచేస్తారు. ఇప్పటిదాకా అలా సుమారు 200 ఇళ్లకి ఉచితంగా పనిచేశారు. ఈ ప్రాంతంలో ఓ మామూలు ఇల్లు కట్టాలన్నా కూలీలందరికీ కలిపి లక్ష తీసుకుంటారు. పునాది కూడా వేయాలంటే మరో పాతికవేలు అవుతుంది. ఆ లెక్కన వీళ్ల సేవ విలువ కోటికిపైనే ఉంటుందని చెప్పొచ్చు. ‘తొలిసారి ఓ మిత్రుడు ఇల్లుకడుతుంటే ఇలా అందరం వెళ్లి పనులు చేశాం. అక్కడ డబ్బులేవీ తీసుకోకపోవడం మాకెంతో తృప్తినిచ్చింది. ఇప్పటికీ ఆ ఆనందం కోసమే పని చేస్తున్నాం’ అంటారు ఈ ‘వైట్‌ ఆర్మీ’ సభ్యులు.


వాళ్లు సైతం!

రాజస్థాన్‌లో బాల్య వివాహాలు ఎక్కువ. భ్రూణహత్యలూ, ఆడపిల్లల్ని అనాథలుగా వదిలేయడాలూ తక్కువేమీ కాదు. వీటన్నింటికీ ఆ పేద తల్లిదండ్రులు చెప్పే కారణం ఒక్కటే... ‘వాళ్లకి పెళ్ళి చేయాలంటే చాలా ఖర్చవుతుందీ’ అని. ఆ పెళ్ళి ఖర్చును తాము భరిస్తామంటుంది ఆ గ్రూపు... సమాజం రోతగా చూసే హిజ్రాల బృందం అది. అయితేనేం, తాము కూలీనాలీ చేసి సంపాదించిన డబ్బులో నెలనెలా కొంత కూడబెట్టి ప్రతి ఏటా నిరుపేద యువతులకి పెళ్ళి చేసి పంపిస్తుంది. వాళ్లకి కట్నకానుకలూ తామే ఇస్తుంది. అంతేకాదు, ఆ తర్వాత కూడా వాళ్లకి ఏ ఆర్థిక ఇబ్బందులొచ్చినా అండగా నిలుస్తుంది. 2012 నుంచి ఈ సేవలు అందిస్తోందీ బృందం. రాజస్థాన్‌లోని భరత్‌పురా ప్రాంతంలో ఇటీవలే పది జంటలకి ఘనంగా పెళ్ళిళ్ళు చేసి వార్తల్లోకెక్కింది. ‘నట్టుబాయ్‌’ అనే హిజ్రా ఈ బృందం నాయకురాలు. ఈ పెళ్ళిళ్ళ కోసం ఆమె ఒక్కతే నెలనెలా రూ.4 వేలు పొదుపు చేస్తుందట! ‘ఆడపిల్లల్ని భారంగా చూడకండి. మీరు సాకలేకపోతే... మా బృందానికివ్వండి. మేం కంటిపాపల్లా చూసుకుంటాం’ అన్నది ఆమె బృందం నినాదం!


ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్‌లు ఇప్పిస్తారు!

ఈ బృందంలోని సభ్యులూ పెద్దగా చదువుకున్నవాళ్లు కాదు. వాళ్ల స్నేహితుడొకతను దిల్లీలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే చూడటానికి వెళ్లారట. అక్కడ కొన్ని వార్డులు మాత్రం ఎప్పుడూ ఖాళీగా ఉండటం గమనించారట. ‘ఎందుకలా ఉంటున్నాయి?’ అని అడిగితే ‘అవి పేదల కోసం కేటాయించినవి. కానీ వాళ్లెవరూ ఇక్కడికి రావట్లేదు!’ అని చెప్పారట. మరోవైపు... సర్కారు దవాఖానాల్లో బెడ్లు దొరక్క రోగులు నేలపైన పడుకునే పరిస్థితి.. ‘మరి... ఆ పేదలు ఇక్కడికి రావొచ్చు కదా. ఎందుకు రావట్లేదు?’ అన్న ప్రశ్న మొదలైంది ఆ యువకుల్లో. ‘దిల్లీ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉన్న ఈ ‘ప్రత్యేక రిజర్వేషన్‌’ గురించి అవగాహన లేకపోవడమే కారణ’మని అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచీ తమకి తెలిసిన పేదసాదలందర్నీ ఇలాంటి ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చడం మొదలుపెట్టారు. ఇందుకోసమే తమలాంటి వాళ్లందరినీ కలుపుకుని ‘ఛారిటీ బెడ్స్‌’ అనే సంస్థని ప్రారంభించారు. ఈ బృందం సేవలు నచ్చి ఒబెరాయ్‌ హోటళ్ల ఛైర్మన్‌ కపిల్‌ చోప్రా ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. 1999-2005 మధ్య దిల్లీ ప్రభుత్వం కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకి ప్రభుత్వ స్థలాలని కేటాయిస్తూ... ఎకరా ఒక్కరూపాయి లెక్కన విక్రయించింది. కాకపోతే, ఆసుపత్రి కట్టాక పేదల కోసం కొన్ని బెడ్లని అట్టిపెట్టాలని షరతు పెట్టింది. అలా అక్కడి కార్పొరేట్‌ ఆసుపత్రులు 25 శాతం బెడ్లని అట్టిపెడుతున్నాయి కానీ... దానిపైన పేదలకి అవగాహన కల్పించడంలేదు. ఆ బాధ్యత తాను తీసుకున్న ‘ఛారిటీ బెడ్స్‌’ సంస్థ పేదలకి సాయపడుతోంది. రోజూ 350 బెడ్లని వాళ్లకి దక్కేలా చూస్తోంది!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..