ఈ లిల్లీ... ఇరవై రోజులైనా వాడదు!

అందంగా వికసించిన పువ్వుల్ని చెట్టు నుంచి కోశాక ఒక్కరోజు మాత్రమే పరిమళాన్ని వెదజల్లుతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రెండుమూడు రోజులకు వాడిపోతాయి.

Updated : 22 Jan 2023 03:56 IST

ఈ లిల్లీ... ఇరవై రోజులైనా వాడదు!

అందంగా వికసించిన పువ్వుల్ని చెట్టు నుంచి కోశాక ఒక్కరోజు మాత్రమే పరిమళాన్ని వెదజల్లుతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రెండుమూడు రోజులకు వాడిపోతాయి. వేజుల్లోనూ, బొకేల్లోనూ, అలంకరణలోనూ అందంగా ఒదిగిపోయే ఓరియంటల్‌ లిల్లీలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. కోసిన తరవాత దాదాపు ఇరవై రోజుల వరకూ సువాసనను వెదజల్లుతుంటాయి. ఇంటిని పరిమళభరితం చేసే ఈ లిల్లీని మనింట్లో పెంచుకుందామా!

లిల్లీ... ఆ పేరు వినగానే తెల్ల మబ్బులంత స్వచ్ఛంగా, ముత్యమల్లే ముద్దుగా ఉండే సుందర సుకుమార రూపం గుర్తొస్తుంది. ఆ వెంటనే వాటి నుంచి వెలువడే కమ్మని సువాసనా తలపునకొస్తుంది. అంతేకాదు, గులాబీల మధ్యలో ఒదిగిపోయి గుబాళించే పెళ్లికూతురి పూలజడా, దేవుడి మెడలో వేసిన మాలా కళ్ల ముందు మెదులుతాయి. పూలగుచ్ఛంలోనూ వీటి స్థానం ఎంతో ప్రత్యేకం. పెంచుకుంటే ఇంటి ఆవరణకే కొత్తందాన్ని తీసుకొచ్చే లిల్లీల్లో- దళసరి రేఖలతో పూసే తెలతెల్లని లిల్లీలే మనకు తెలుసు. ఇవి మొక్కకు ఉన్నంత సేపూ, కోశాక ఒక్క రోజూ మాత్రమే పరిమళాన్ని వెదజల్లుతాయి. కానీ ఓరియంటల్‌ లిల్లీ అలా కాదు. లిల్లీ జాతిలోనే అత్యంత  పరిమళభరితమైన ఈ పూలు... మొక్క నుంచి కోశాక ఒకటి నుంచి రెండు వారాలకుపైనే తాజాగా ఉంటాయి. నీళ్లు చల్లితే మొక్కకు ఉన్నప్పుడు ఉన్నంత సువాసననూ వెదజల్లుతాయి. కారణం మిగతా వాటితో పోలిస్తే ఈ రకం లిల్లీల జీవ కణాల ఆయుష్షు అధికం కావడమే.

ఈ హైబ్రిడ్‌ రకం లిల్లీ వేడి వాతావరణాన్ని సైతం తట్టుకుంటుంది. మన దగ్గర దొరికే కాడ లిల్లీతో పోలిస్తే పువ్వు కాస్త పెద్దగానే ఉంటుంది. చలికాలంలో విరివిగా పూసే ఈ ఓరియంటల్‌ లిల్లీలు పలు రంగుల్లో ఉంటాయి. కొన్ని మిక్స్‌డ్‌ రంగుల్లోనూ లభిస్తాయి. వాటి రేకలను చూస్తే- ప్రకృతే రంగులద్దినట్టు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఓరియంటల్‌ లిల్లీలను నేలలోనైనా, కుండీలోనైనా పెంచుకోవడం చాలా తేలిక. వెల్లుల్లి మాదిరిగా ఉండే దుంపను(బల్బులు) భూమిలో పాతితే పిలక వస్తుంది. అది పెరిగి పెద్దదై మొగ్గలు వేశాక దాన్నుంచి మళ్లీ ఒకట్రెండు పిలకలు వస్తాయి. వాటిని వేరు చేసి మరో చోట నాటితే ఇంకో మొక్క పెరుగుతుంది. తక్కువ నీళ్లతోనే పెరిగే ఈ ఓరియంటల్‌ లిల్లీలకు చీడల బెడద చాలా తక్కువ. శ్రమ లేకుండా సౌకర్యంగా పెంచుకోవచ్చు. వీటిని ఇంట్లోనే పూయించుకుంటే సహజ రూమ్‌ఫ్రెషనర్‌గా పనికొస్తాయి. పలు రంగుల్లో వికసిస్తూ కంటికీ హాయినిస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో వేజ్‌లలో అందంగా అలంకరించుకోనూవచ్చు. పండుగల వేళ.. పూజా మండపానికీ, ఇంటికీ కొత్తందాన్ని తీసుకురావచ్చు. ఆత్మీయులకు స్వయంగా వీటితో ఓ బొకే చేసి ఇచ్చారంటే... మీ గుర్తుగా రోజుల తరబడి ఈ పువ్వులు వాళ్లింట్లో సుగంధాల్ని వెదజల్లుతుంటాయి. ఇంత ప్రత్యేకమైన ఓరియంటల్‌ లిల్లీలను పెంచేద్దామా మరి..?!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..