వారికి చదువు విలువ తెలుసు!

చిన్నతనంలో చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు వారంతా. అయినా కష్టపడి చదువుకుని ఉన్నతంగా స్థిరపడ్డారు. అందుకే తమలా ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా ఉంటూ చదువుల్లో సాయపడుతున్నారు. ఇంతకీ వాళ్లెవరంటే...

Published : 20 Feb 2022 00:38 IST

వారికి చదువు విలువ తెలుసు!

చిన్నతనంలో చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు వారంతా. అయినా కష్టపడి చదువుకుని ఉన్నతంగా స్థిరపడ్డారు. అందుకే తమలా ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా ఉంటూ చదువుల్లో సాయపడుతున్నారు. ఇంతకీ వాళ్లెవరంటే...

అంగన్వాడీ కోసం గొలుసు తాకట్టు!

తమిళనాడులోని వల్లిపురం గ్రామంలోని అంగన్వాడీ గత కొంతకాలంగా పాడుబడిపోయింది. ఆరుబయట మొలిచిన పిచ్చిమొక్కలతో పాములకు ఆవాసమైంది. దాంతో పిల్లలు కూడా అక్కడకు వచ్చేవారు కాదు. ఇదంతా 2017లో సుమతీ టీచర్‌ అక్కడకు రాకముందున్న పరిస్థితి. ఆమె అంగన్వాడీ టీచర్‌గా విధుల్లో చేరాక ఆ సమస్యలన్నిటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. కానీ ఎంతకాలమైనా వాటికి పరిష్కారం మాత్రం దొరకలేదు. దాంతో తనే ఆ భవనాన్ని బాగు చేయించాలని నిర్ణయించుకుంది. తన మెడలోని బంగారు గొలుసును తాకట్టుపెట్టగా వచ్చిన రెండు లక్షల రూపాయలతో అంగన్వాడీ భవనానికి పైకప్పు బాగు చేయించింది. గోడలకు రంగులు వేయించింది. మరుగుదొడ్డి నిర్మించడంతోపాటు ఆరుబయట చెత్త తీయించి కాయగూరల సాగుకు శ్రీకారం చుట్టింది. పిల్లలకు చదువు మీద ఆసక్తిని పెంచడానికి బెంచీలూ, బొమ్మలూ, టీవీ, సీడీలూ అందుబాటులో ఉంచింది. దాంతో అక్కడ పిల్లల సంఖ్య క్రమంగా నలభైకి చేరింది. సుమతి ఆ పిల్లలందరికీ అక్కడ పండించిన కాయగూరలతో పోషకాహారం అందిస్తూ... చదువూ చెబుతోంది. అలానే ఆ స్కూలు నిర్వహణకు అయ్యే అదనపు ఖర్చునూ సుమతే భరిస్తోంది.


పీఎఫ్‌ అంతా పేదపిల్లలకే!

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా ఖందియాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన విజయ్‌ కుమార్‌ చన్సోరియా ఈ మధ్యనే రిటైర్‌ అయ్యాడు. ఆ సందర్భంగా ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాట్యుటీ మొత్తం కలిపి దాదాపు 40 లక్షల దాకా అందుకున్నాడు. అయితే ఆ డబ్బును తనకోసం కాకుండా పేద పిల్లలకు స్కాలర్‌షిప్పులకోసమూ, స్కూలు బాగుకోసమూ కేటాయించాలనుకున్నాడు. ఆ విషయాన్నే తన వీడ్కోలు సభలో చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే విజయ్‌కుమార్‌ది పేద కుటుంబం. మూడు పూటలా కడుపునిండా తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఇంటింటికీ తిరుగుతూ పాల ప్యాకెట్లు వేస్తూ, సాయంత్రం వేళ రిక్షా తొక్కుతూ పాకెట్‌మనీ సంపాదించుకునేవాడు. అలా చదువుకున్న విజయ్‌కుమార్‌ టీచర్‌ అయ్యాడు. దాదాపు 39 ఏళ్ల వృత్తి జీవితంలో అతని కుటుంబం కూడా బాగానే స్థిరపడింది. అందుకే రిటైర్‌ అయ్యాక వచ్చిన మొత్తాన్ని నిస్వార్థంగా సేవకు వెచ్చించాడు. ప్రస్తుతం ప్రతిభ ఉండి చదువుకోలేని పిల్లల్ని గుర్తించి వారి ఉన్నత చదువులకోసం చేయూత ఇచ్చే పనిలో ఉన్నాడు విజయ్‌కుమార్‌.


ఆడపిల్లల కోసం...

ఘసీరామ్‌ వర్మ.. విదేశాల్లో స్థిరపడిన గణితశాస్త్రవేత్త. తొంభైఐదేళ్ల వర్మ ఆడపిల్లల చదువుకోసం రూ.11 కోట్లు వెచ్చించాడు. ఏడాదిలో మూడునెలలపాటు సొంత రాష్ట్రమైన రాజస్థాన్‌కి వచ్చి విరాళాలు అందిస్తుంటాడు. ఇప్పటి వరకూ ఆడపిల్లల కోసం పలు జిల్లాల్లో 28 హాస్టళ్లూ, 21 కాలేజీలూ నిర్మించాడు. 18 స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ విద్యాసంస్థల్లో. వేల మంది చదువుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది అమ్మాయిలు చదువు పూర్తి చేశారంటే అదంతా వర్మ చలవే. నలభై ఏళ్లుగా పేదల చదువుకోసం కృషి చేసే వర్మ చిన్నతనంలో ఆర్థిక సమస్య వల్ల చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అందుకే తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు