సేవా సంపన్నులు

తోటి మనిషికి సేవ చేయడంలో ఆత్మసంతృప్తిని వెతుక్కునే సామాన్యులు మన మధ్యలోనే చాలామంది కనిపిస్తారు. అటువంటి వారే ఈ ముగ్గురూ..! వాళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో మార్గం...

Published : 29 Oct 2022 23:29 IST

సేవా సంపన్నులు

తోటి మనిషికి సేవ చేయడంలో ఆత్మసంతృప్తిని వెతుక్కునే సామాన్యులు మన మధ్యలోనే చాలామంది కనిపిస్తారు. అటువంటి వారే ఈ ముగ్గురూ..! వాళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో మార్గం... సమాజాన్ని నందనవనం చేసే ప్రయత్నం!


అనాథలకు అన్నీతానై

‘శాంతివన్‌’... ఈ బడిలోని చిన్నారుల్లో చాలామంది చిరునవ్వుల వెనక గుండెను మెలిపెట్టే విషాదానుభవాలు ఉంటాయి. వాళ్లతో మాట్లాడితే- ఆత్మీయులను కోల్పోయిన ఆ పసివారి కన్నీళ్లు మన కంట రాలుతాయి. మహారాష్ట్రలోని బీడ్‌... కరవు పీడిత ప్రాంతాల్లో ఒకటి. అక్కడ రైతుల ఆత్మహత్యలు ఎక్కువ. దాంతో ఎంతోమంది చిన్నారులు అనాథలై భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంటుంది. అటువంటి నిస్సహాయుల్ని చేరదీసి ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు దీపక్‌ నాగర్‌గొజే-కావేరి దంపతులు. బీడ్‌ జిల్లాలోని రైతు కుటుంబానికి చెందిన నాగర్‌రోజే అక్కడి పరిస్థితుల్ని దగ్గరగా చూస్తూ పెరిగారు. పైగా పద్దెనిమిదేళ్ల వయసులో బాబా ఆమ్టేని చూసి స్ఫూర్తి పొందిన నాగర్‌గోజే ఇతరులకోసం జీవించడంలోనే అసలైన ఆనందం ఉంటుందని అర్థం చేసుకున్నాడు. అందుకే ఆర్వీ గ్రామంలో ‘శాంతివన్‌’ను ఏర్పాటు చేసి అనాథలైన చిన్నారుల్ని చేరదీసి విద్యాబుద్ధుÄల్ని నేర్పుతున్నారు నాగర్‌గోజే దంపతులు. ప్రస్తుతం అక్కడ చదువుకుంటున్న దాదాపు 930 మంది విద్యార్థుల్లో మూడొందల మందికిపైగా- ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలే ఉన్నారు. వారి బాగోగులు చూసుకోవడానికి సేవారంగంలోకి వచ్చిన దీపక్‌-కావేరి దంపతులు కూరగాయలూ, ఆహార ధాన్యాలూ తమ పొలంలోనే పండిస్తూ పిల్లల కడుపు నింపుతున్నారు. దాంతోపాటు స్థానిక మహిళలకూ, రైతులకూ అండగా నిలబడుతున్నారు. ఇప్పటి వరకూ అక్కడ చదువుకుని దేశవిదేశాల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్న వారెందరో ఇప్పుడు ‘శాంతివన్‌’కు సాయమందిస్తున్నారు.


బంధంలేకున్నా బాధ్యతగా

తల్లిదండ్రులూ, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలకు నోచుకోని పిల్లలు ఏమవుతారు? కొంతమంది ఒకరకమైన నిరాశలో కూరుకుపోతారు. మరికొందరు తప్పుదారి కూడా పడతారు. కానీ, కేరళకు చెందిన రాజేశ్‌ తిరువళ్లా మాత్రం మూడొందల మందికి పైగా విధివంచితులకు ఆశ్రయం కల్పిస్తున్నాడు. చిన్నతనంలో తనకు తల్లిదండ్రుల వల్ల లభించని ప్రేమాప్యాయతలను ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులూ, అనాథలూ, వితంతువులూ, వారి పిల్లల నుంచి పొందుతున్నాడు. పసివయసులోనే కన్నవాళ్ల ప్రేమకు దూరమైన రాజేశ్‌ పదో తరగతి వరకు చదువుకున్నాడు. రకరకాల పనులు చేస్తూ చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడ్డాడు. కానీ, ఏదో వెలితి ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టేది. అదేంటో తెలుసుకుందామని ప్రయత్నిస్తున్న క్రమంలోనే తనలా ప్రేమానురాగాలకు నోచుకోలేని వాళ్లకు మమకారాన్ని పంచాలని నిర్ణయించుకున్నాడు. కాలేజీ రోజుల నుంచే సేవా కార్యక్రమాలు చేసే అలవాటు ఉన్న రాజేశ్‌- ఆదూర్‌లో ‘మహాత్మాగాంధీ జనసేవన కేంద్రం’ ప్రారంభించాడు. తాను నడిపించే కొవ్వొత్తుల పరిశ్రమ, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంతో- ఏ బంధం లేని వాళ్లని బాధ్యతగా చూసుకోవడం మొదలుపెట్టాడు.మలి వయసులో వృద్ధుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు. పిల్లల్ని చదివిస్తున్నాడు. ఆడపిల్లలకైతే తండ్రిగా మారి పెళ్లిళ్లూ చేయిస్తున్నాడు.


బాల్యం వికసించాలని

ఉపాధి లేక ఎంతోమంది వలసలు వెళుతుంటారు. ఈ క్రమంలో వారి పిల్లలు చదువులకి దూరమై... వారూ పనిబాట పడుతుంటారు. అలాంటి పిల్లల్ని దగ్గరగా చూసిన జుయిన్‌ దత్తా- ఆ చిన్నారుల బాల్యం కూలీ పనులతో మగ్గిపోకూడదనీ... బడిలో వికసించాలనీ కోరుకుంది. అందుకే మొబైల్‌ గ్రంథాలయాల స్ఫూర్తితో గుజరాత్‌లోని వడోదరలో ‘పాఠశాల’ పేరిట మొబైల్‌ పాఠశాలలను ప్రారంభించింది. వలస కార్మికుల పిల్లలకు చదువు నేర్పడం లక్ష్యంగా వాటిని ఏర్పాటు చేసిన ఆమె కొందరు వలంటీర్లతో కలిసి నడుస్తోంది. పిల్లలకు భోజనం పెట్టడంతోపాటు పుస్తకాలు కూడా ఇచ్చి... చదవడం, రాయడం నేర్పిస్తుంటుంది. లెక్కలు, ఆంగ్లం, జనరల్‌ నాలెడ్జ్‌ వంటివీ బోధిస్తుంటుంది. క్రమంగా పిల్లల సంఖ్య పెరగడం, జుయిన్‌ చేసే మంచి పనికి గుర్తింపు రావడంతో ఆ సేవల్ని మరింత విస్తరించాలనుకుంది. అందుకే హాస్టల్‌ సైతం ప్రారంభించి మూడేళ్లుగా వంద మంది పిల్లలకు అక్కడ వసతి కల్పిస్తోంది. వాళ్లతోపాటు ఫుట్‌పాత్‌లూ రైల్వేస్టేషన్ల్లూ, మురికివాడల్లోని చిన్నారులకూ కార్మికుల పిల్లలకూ వాళ్ల సామర్థ్యాలకు అనుగుణంగా జుయిన్‌, ఆమె బృందం విద్యాబుద్ధులు నేర్పిస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..