అన్నదాతా సుఖీభవ!

ఆకలితో అలమటించేవారి బాధల్ని కళ్లారా చూసిన వీరంతా కంటతడి పెట్టుకున్నారు. వారి ఆకలి తీర్చాలని నిర్ణయించుకుని అన్నదానం చేస్తున్నారు. మానవ సేవ చేస్తూ మంచి మనసు చాటుకుంటున్న వీళ్లు ఎవరంటే...

Published : 14 Aug 2022 00:10 IST

అన్నదాతా సుఖీభవ!

ఆకలితో అలమటించేవారి బాధల్ని కళ్లారా చూసిన వీరంతా కంటతడి పెట్టుకున్నారు. వారి ఆకలి తీర్చాలని నిర్ణయించుకుని అన్నదానం చేస్తున్నారు. మానవ సేవ చేస్తూ మంచి మనసు చాటుకుంటున్న వీళ్లు ఎవరంటే...


మంచీచెడూ చూస్తూ...

కోల్‌కతాకు చెందిన దేవ కుమార్‌ ప్రతిరోజూ దాదాపు మూడొందల మంది వృద్ధులకు రెండుపూటలా భోజనం పెడుతున్నాడు. సొంతంగా రెండు అంబులెన్సులు కొన్న అతను  అవసరమైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా వైద్యమూ చేయిస్తున్నాడు. మంచి మనసుతో అభాగ్యుల్నీ తన కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్న కుమార్‌- మొదట్లో తన ఇంటి చుట్టుపక్కలా, ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్దా భిక్షాటన చేసేవారికే పెట్టేవాడు. తరవాత వారిచేత ఆ వృత్తిని మాన్పించి వాళ్ల ఇళ్లకే ఆహారం, మందులూ పంపుతున్నాడు. అలానే, ఓ గుడి కట్టి... ఉదయం, సాయంత్రం అన్నదానం చేస్తున్నాడు. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు నిత్యావసరాలు ఇస్తూ, వారు అడిగిన పనులు చేసి పెట్టే కుమార్‌ సంపన్నుడేమీ కాదు. అతని చిన్నతనంలోనే తండ్రి పక్షవాతంతో మంచానపడటంతో తల్లే కుటుంబ భారాన్ని మోసేది. మరోవైపు కుమార్‌ తమ్ముడికి మానసిక ఎదుగుదల లేకపోవడంతో వాళ్లంతా చాలానే సమస్యలు ఎదుర్కొనేవారు. తల్లి కష్టం చూడలేక చదువుకుంటూనే రకరకాల పనులు చేసేవాడు చంద్రశేఖర్‌. చదువయ్యాక ఓ దుస్తుల తయారీ సంస్థలో చిన్న ఉద్యోగంలో చేరి కుటుంబ భారాన్ని తలకెత్తుకున్నాడు. కొన్నాళ్లకి తానే సొంతంగా దుస్తుల తయారీ సంస్థను స్థాపించి ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఆ తరవాత తన తల్లిలా కుటుంబం కోసం పోరాడే వారికి అండగా నిలవాలని అన్నదానం చేస్తూ మంచీచెడులూ చూడటం మొదలుపెట్టాడు. వలంటీర్లు అన్నం పొట్లాలూ, మందులూ అందజేసినా ప్రతిరోజూ వృద్ధుల ఇళ్లకెళ్లి బాగోగులు తెలుసుకోనిదే కుమార్‌కు రోజుగడవదు.


చదివిస్తూ కడుపునింపుతూ...

పశ్చిమబంగాలోని ఆసన్‌సోల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌ ఒకసారి తన కొడుకు పుట్టినరోజును ఘనంగా చేశాడు. ఈ కార్యక్రమం అంతా అయ్యాక మిగిలిపోయిన ఆహారపదార్థాల్ని అర్ధరాత్రి వేళ చెత్తకుండీలో పడేశాడు. అంతలో ఓ ఐదారుగురు పిల్లలు చెత్తలోని ఆహారపదార్థాల్ని ఏరుకుని తినడం చూసి చలించిపోయిన చంద్రశేఖర్‌ ఆ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లి కడుపునిండా భోజనం పెట్టాడు. అంతేకాదు, అప్పట్నుంచీ కాలేజీకి క్యారియరు తీసుకెళ్లి మధ్యాహ్నంపూట క్యాంటీన్లోనూ, విద్యార్థుల దగ్గరా మిగిలింది తీసుకుని భిక్షాటన చేసే వీధి బాలలకి పెట్టేవాడు. కొన్నాళ్లకి అతను చేస్తున్న మంచి పనిని సహోద్యోగులూ, ఇతర కాలేజీలూ, ఐఐఎమ్‌ కోల్‌కతా విద్యార్థులూ మెచ్చుకోవడంతోపాటు ఆహారం సేకరించి ఇవ్వడానికి కూడా ముందుకొచ్చారు. మరికొందరేమో హోటళ్లూ, శుభకార్యాల వద్ద మిగిలిపోయినవి సేకరించి అందించేవారు. అలా వచ్చిన ఆహారాన్నంతా పేదలకు పంచేవాడు. కొన్నాళ్లకి పిల్లలకి అన్నం ఒక్కటే కాదు, చదువు కూడా ముఖ్యమని భావించిన చంద్రశేఖర్‌ ‘ఫీడ్‌’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి- పేద పిల్లలకోసం సాయంత్రం వేళ ట్యూషన్లు ఏర్పాటు చేసి, వారికి చదువు చెప్పి కడుపునిండా అన్నం పెట్టడం మొదలుపెట్టాడు. అందుకోసమని సొంత ఖర్చులతో ట్యూషన్‌ సెంటర్ల వద్దే వేడివేడిగా అన్నం వండి పెట్టేలా ఏర్పాట్లు చేశాడు. ఆసన్‌సోల్‌తోపాటు ఆ చుట్టుపక్కల రెండుమూడు గ్రామాలకొకటి చొప్పున 21 ట్యూషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసి దాదాపు 80 గ్రామాల్లోని వందల మంది పిల్లల్ని చదివిస్తూ అన్నం పెడుతున్నాడు. ఏడేళ్లుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్న చంద్రశేఖర్‌కు ఇప్పుడు పలు కార్పొరేట్‌ సంస్థలూ తోడై సీఎస్‌ఆర్‌ కింద సహకారమందిస్తున్నాయి. దాంతో ఎప్పటికప్పుడు కొత్త ట్యూషన్‌ సెంటర్లని ఏర్పాటు చేస్తూ బాలల భవిష్యత్తుకు భరోసానిస్తున్నాడు.


పల్లెపల్లెకీ వెళ్లి...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వెనకబడిన జిల్లా సోన్‌భద్ర. పంటలు పండకా, ఉపాధి పనులు దొరక్కా అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ పరిస్థితుల్ని కళ్లారా చూడటంతోపాటు కొంత కాలం తాను కూడా ఆకలి బాధను అనుభవించింది అదే జిల్లాలోని రాజ్‌పూర్‌కి చెందిన బిఫాన్‌ దేవి. ఆ తరవాత గ్రామంలో రేషన్‌ దుకాణం నడిపేందుకు ఆమె ఎంపిక కావడంతోపాటు భర్త కల్లూ యాదవ్‌కీ, ఇద్దరు కొడుకులకీ వేరే పనులు దొరకడంతో వారి పరిస్థితి కుదుటపడింది. ఆ సమయంలో ఒకసారి ఆమె ఆకలికి తట్టుకోలేక మట్టితింటున్న కొందరు పిల్లల్ని చూసి ఎంతగానో బాధపడింది. దాంతో తాము తినడానికి సరిపోగా మిగిలిన డబ్బులతో పేదల కడుపు నింపాలనుకున్న  దేవి- రేషన్‌ దుకాణంలోనే కిచెన్‌ ఏర్పాటు చేసుకుని రోటీ, అన్నం, కూరలు, స్వీటు వండి చుట్టుపక్కల పది గ్రామాల్లో ఉపాధి లేని వారికీ, యువత వలస పోగా ఇళ్ల దగ్గర మిగిలిన పిల్లలూ వృద్ధుల కడుపునింపుతోంది. అలా మూడేళ్లుగా ఒక్కరోజు కూడా మానకుండా అన్నదానం చేస్తూ చుట్టుపక్కల వారి చేత ‘రేషన్‌ చాచీ’ అని పిలిపించుకుంటున్న బిఫాన్‌ దేవి కుటుంబం ఇందుకోసం నెలకు యాభై నుంచి అరవైవేల రూపాయలు ఖర్చు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..