వీళ్ళకేదీ వృథా కాదు!

నేలమీద సిగరెట్‌ పీక కనిపిస్తే పెద్దగా పట్టించుకోం. ఇంట్లో ఆహారం మిగిలితే చెత్తబుట్టలో పడేస్తాం. ఎక్కడైనా చికెన్‌ వ్యర్థాల్ని చూస్తే ముక్కు మూసుకుని వెళ్ళిపోతాం!  కానీ ఈ సంస్థలు వాటితోనే అద్భుతాలు చేస్తున్నాయి.

Updated : 05 Mar 2024 17:07 IST

నేలమీద సిగరెట్‌ పీక కనిపిస్తే పెద్దగా పట్టించుకోం. ఇంట్లో ఆహారం మిగిలితే చెత్తబుట్టలో పడేస్తాం. ఎక్కడైనా చికెన్‌ వ్యర్థాల్ని చూస్తే ముక్కు మూసుకుని వెళ్ళిపోతాం!  కానీ ఈ సంస్థలు వాటితోనే అద్భుతాలు చేస్తున్నాయి. తమదైన ఆవిష్కరణలతో అబ్బురపరుస్తున్నాయి. కాకపోతే ఇవన్నీ కేవలం లాభాపేక్షతో చేసినవి కాదు... వాటి వెనక ఎంతో పర్యావరణ స్పృహ ఉంది. ఎలాగో చూడండి...


కాలుష్యం ‘పీక’ నొక్కుతున్నారు!

సిగరెట్‌తో క్యాన్సర్‌ సహా పలు రోగాలు వస్తాయని మనకు తెలుసు! కానీ సిగరెట్‌ పీకవల్ల కూడా పర్యావరణానికి అంతేస్థాయి ప్రమాదం ఉందంటాడు నమన్‌ గుప్తా. సిగరెట్‌ పీకలో ఉండే దూదిలాంటి ప్లాస్టిక్‌- సెల్యులోజ్‌ అసిటేట్‌ భూమిలో కలిసిపోవడానికి కనీసం 14 ఏళ్ళు పడుతుంది. అంతేకాదు, ప్రతి పీకా అరలీటరు భూగర్భ జలాన్ని కలుషితం చేస్తుంది. అందుకే ఈ సిగరెట్‌ పీకల్ని రీసైక్లింగ్‌ చేయడానికి సరికొత్త పద్ధతిని కనిపెట్టాడు నమన్‌ గుప్తా. ఇందుకోసం ‘కోడ్‌ ఎఫర్ట్స్‌’ అన్న స్టార్టప్‌ని ప్రారంభించాడు. ఆ సంస్థ ద్వారా దేశంలోని 250కి పైగా జిల్లాల నుంచి సుమారు రెండువేల మంది కార్మికుల ద్వారా రోజూ వెయ్యి కిలోల సిగరెట్‌ పీకల్ని సేకరిస్తున్నారు. వాటి నుంచి పొగాకు, సన్నటి కాగితం, దూదిలాంటి ప్లాస్టిక్‌(సెల్యూలోజ్‌ అసిటేట్‌)ను వేరు చేస్తున్నారు. పొగాకును సూక్ష్మజీవుల సాయంతో ఎరువుగా మారుస్తున్నారు. సన్నటి పేపర్‌ను ప్రత్యేక రసాయనాలతో పల్ప్‌గా మార్చి... 250 జీఎస్‌ఎం మందంలో పేపర్‌లని తయారుచేస్తున్నారు. వాటితో కవర్లూ, లెటర్‌హెడ్లూ వంటివి రూపొందిస్తున్నారు. చివరగా దూదిలాంటి ప్లాస్టిక్‌- సెల్యూలోజ్‌ అసిటేట్‌ని బొమ్మలు, తలగడలు, ఇతర అలంకరణ వస్తువుల్లో నింపే ప్లాస్టిక్‌ స్టఫింగ్‌గా వాడుతున్నారు. ఇప్పటిదాకా 250 కోట్ల సిగరెట్‌ పీకలను ఇలా ప్రాసెస్‌ చేసిందా సంస్థ. అంటే సుమారు 125 కోట్ల లీటర్ల నీరు కాలుష్యం కాకుండా అడ్డుకుందన్నమాట!

వీఎస్‌ఎస్‌ఎస్‌ ప్రసాద్‌, హైదరాబాద్‌


పాడైన ఆహారంతో...

అంకిత్‌ అలోక్‌ బగారియా, అభి గావ్రి... ఇద్దరూ ఐఐటీ-రూర్కీలో చదువుకున్నవారు. చివరి ఏడాదప్పుడు వీళ్ళు ఆహార వ్యర్థాలని సద్వినియోగం చేయడం గురించి ఆలోచించేవారట. ఎందుకంటే- ప్రపంచంలో ఏటా 130 కోట్ల టన్నుల ఆహారం వృధాగాపోతోందని విన్నారట. ఆ సమస్యకు పరిష్కారంగా మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి పేదలకు పంచేవాళ్ళ గురించి వీళ్ళు విని ఉన్నారు. కానీ ఇద్దరూ సైంటిస్టులు కదా! ఇంకొంచెం కొత్తగా ఆలోచించారు. వృధా ఆహారంతో ఓ జీవశాస్త్ర అద్భుతాన్ని ఆవిష్కరించారు. వీళ్ళు కనిపెట్టిన పద్ధతి ప్రకారం - వృధా ఆహారాన్ని సేకరించి, దాన్ని ప్రాసెస్‌ చేసి ‘బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై’(బీఎస్‌ఎఫ్‌) అన్న కీటకానికి ఆహారంగా పెడతారు. లార్వా దశలో ఈ ఆహార వ్యర్థాల్ని తినడం మొదలుపెట్టే బీఎస్‌ఎఫ్‌ కీటకం ఎదిగేకొద్దీ దాన్ని ఎరువుగా మారుస్తుంది. అంతేకాదు, వాటిని తినడం ద్వారా తనలో అతిస్వచ్ఛమైన మాంసకృత్తుల్ని(ప్రొటీన్‌) తయారుచేసుకుంటుంది. ఆ ప్రొటీన్‌ చేపలూ, రొయ్యల సాగుకే కాదు... కోళ్లూ, పశువుల పెంపకంలోనూ బలవర్థక ఆహారంగా ఉపయోగపడుతుంది. ఆ ఎరువులూ, ప్రొటీన్‌ తయారీ కోసమే ‘లూప్‌ వార్మ్‌’ అన్న స్టార్టప్‌ని స్థాపించారు అభి, అంకిత్‌లు.  చేపల సాగు, కోళ్ళ ఫారాలకి ఆహారాన్ని సరఫరా చేసే సంస్థలకి ఈ ప్రొటీన్‌ని అందిస్తున్నారు. ఆహార వ్యర్థాల్ని తినే కీటకాల సాయంతో ఇలా ప్రొటీన్‌ తయారుచేయడం మనదేశానికి కొత్త! అందువల్లే, ఈ స్టార్టప్‌కి అటు కర్ణాటక, ఇటు కేంద్రప్రభుత్వాలు ఇటీవల కోటి రూపాయలు ఆర్థికసాయం చేశాయి.


చికెన్‌ వ్యర్థాలతో వస్త్రాలు!

పట్టు, పత్తి మాత్రమే కాదు అరటి నార, కొబ్బరి, ఆఖరికి గుర్రపు డెక్కతో కూడా ఇప్పుడు వస్త్రాలు చేస్తున్నారు. అలాంటిది- చికెన్‌ వ్యర్థాలతో ఎందుకు చేయకూడదు...? అన్న ఆలోచన వచ్చింది ముదిత, రాధేశ్‌ దంపతులకి. ‘అసలు ఆ చికెన్‌ వ్యర్థాలతోనే ఎందుకు చేయాలి?’ అని అడిగితే... ‘ఏ చికెన్‌షాపు చుట్టుపక్కల చూసినా మాంసం వ్యర్థాలే పడి ఉంటాయి కాబట్టి. వాటితో దుర్వాసనే కాదు, ఎన్నోవ్యాధులూ ప్రబలుతుంటాయి. చుట్టుపక్కలున్న భూమీ, నీరూ కాలుష్యమవుతుంటాయి.’ అంటారు ఇద్దరూ. అందుకే- ఆ వ్యర్థాలతో- ముఖ్యంగా కోడి రెక్కలతో సరికొత్త నూలుపోగుని కనిపెట్టాలనుకున్నారు. ఈ ఆలోచన వచ్చినప్పుడు రాధేశ్‌ రాజస్థాన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో పీజీ చేస్తుండేవాడు. తన ప్రాజెక్టులో భాగంగా రెండేళ్లలోనే ఊలుకన్నా మన్నికైన, వెచ్చనైన, మెత్తనైన నూలుపోగుని తయారుచేయగలిగాడు. అలా తయారుచేసినదానితో తాను మాత్రమే లాభపడాలనుకోలేదు. రాజస్థాన్‌లోని గిరిజన మహిళలకి ఆ నూలునిచ్చి శాలువాలూ, క్విల్ట్‌లూ, మఫ్లర్‌ల వంటి రకరకాల వస్త్రాలని నేయడం నేర్పాడు. అలా తయారైనవాటిని ప్రదర్శనల్లో పెట్టి వాళ్ళకి ఉపాధి చూపిస్తున్నాడు. ఈ వస్త్రాల కోసం తన భార్యతో కలిసి ‘ముదిత అండ్‌ రాధేశ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌’ స్టార్టప్‌ని ప్రారంభించాడు! గత నాలుగేళ్ళలో ఐదొందల టన్నుల చికెన్‌ వ్యర్థాలని ఇలా నూలుగా మార్చి ఆ మేరకు కాలుష్యాన్ని అడ్డుకున్నారట ఈ దంపతులు. ఈ స్టార్టప్‌కి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే స్వచ్చతా స్టార్టప్‌ అవార్డు కూడా అందించింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..