వీళ్లు... అందరి బంధువులు

‘సహాయం చేయడానికి ఉండాల్సింది డబ్బుకాదు... మంచి మనసు’ అన్న మదర్‌ థెరీసా మాటల్ని అక్షరాలా నిజం చేసి చూపించారీ ముగ్గురు వ్యక్తులు. ఒకరు ఆస్తులమ్ముతూ పేదవాళ్లకు కంటి ఆపరేషన్లు చేయిస్తే, ఇంకొకరు పిల్లల దగ్గరికే గ్రంథాలయాన్ని తీసుకెళ్తూ పుస్తకాలపైన ఆసక్తిని పెంచుతున్నారు.

Updated : 05 Mar 2023 05:02 IST

వీళ్లు... అందరి బంధువులు

‘సహాయం చేయడానికి ఉండాల్సింది డబ్బుకాదు... మంచి మనసు’ అన్న మదర్‌ థెరీసా మాటల్ని అక్షరాలా నిజం చేసి చూపించారీ ముగ్గురు వ్యక్తులు. ఒకరు ఆస్తులమ్ముతూ పేదవాళ్లకు కంటి ఆపరేషన్లు చేయిస్తే, ఇంకొకరు పిల్లల దగ్గరికే గ్రంథాలయాన్ని తీసుకెళ్తూ పుస్తకాలపైన ఆసక్తిని పెంచుతున్నారు. మరొకరు అంధుల్ని చదివిస్తూ అండగా నిలిచారు. ఇంతకీ ఎవరా ముగ్గురు?


ఉచితంగా వైద్యం!

గుముడవెల్లి ఉపేంద్రశాస్త్రి... వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఉంటారు. చిన్న రేకుల ఇంట్లో ఒంటరిగా ఉండే ఈ 78 ఏళ్ల పెద్దాయన ఇంటి ముందు... ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చిందంటే వందలాది మంది బారులు తీరతారు. ఎందుకంటే ఆ రోజున కంటి డాక్టర్లతో వైద్య శిబిరం జరుగుతుంది. ఎవరైనా సరే, వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవచ్చు. ఉచితంగా మందులూ, కళ్లజోళ్లూ ఇవ్వడమే కాదు... అవసరమైతే ప్రముఖ ఆసుపత్రుల్లో కంటి శస్త్రచికిత్సల్నీ తన డబ్బుతో చేయిస్తారు ఉపేంద్రశాస్త్రి. అలా ఇప్పటి వరకూ దాదాపు 50 గ్రామాలకు చెందిన నాలుగు వేల మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించారు. దారి ఖర్చుల్నీ ఇస్తూ వైద్యంతో పాటు ఇతర సౌకర్యాలూ అందిస్తున్నారు.  వ్యాపారంతోపాటు పౌరోహిత్యమూ చేసే ఉపేంద్రశాస్త్రికి పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తులూ ఉన్నాయి. ‘మనకు ఉన్నదాంట్లోంచి ఇతరులకూ ఇవ్వాలి’ అన్న ఆలోచనతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఊళ్లో ప్రభుత్వ పాఠశాలా, ఆలయమూ, ఆసుపత్రీ కట్టేందుకు తన స్థలాల్ని విరాళంగా ఇచ్చారు. పదేళ్ల క్రితం ఓసారి ఊళ్లో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో కంటి సమస్యలతో బాధపడుతూ, డబ్బులేక శస్త్రచికిత్స చేయించుకోలేని వారెందరినో చూశారు ఉపేంద్రశాస్త్రి. సరిగ్గా అప్పుడే ఇకపై తానే శస్త్రచికిత్సలు చేయించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచీ ప్రతి నెలా సొంత ఖర్చులతో కంటి డాక్టర్లను పిలిపిస్తూ వేలాది మంది సమస్యల్ని తీరుస్తున్నారు. ఈయన ముగ్గురు పిల్లలూ పెళ్లిళ్లు అయ్యి జీవితంలో స్థిరపడ్డారు. తండ్రి చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్లూ తోడుగా ఉండటంతో అవసరమైనప్పుడు ఆస్తులు అమ్ముతూ సేవకు ఖర్చుపెడుతున్నారు.


అంధులకోసం బడి...

‘అంధులుగా పుడితే వారి జీవితం చీకట్లోనే ఉండిపోవాలా... అందరిలా బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోలేనా’ అనుకున్నాడు వరంగల్‌కు చెందిన నలివెల కుమారస్వామి. పట్టుదలతో చదివి వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్‌ అసిస్టెంట్గా ఉద్యోగం తెచ్చుకున్నాడు. అదే ప్రాంతంలో ఉండే కల్యాణిని పెళ్లిచేసుకున్నాడు. జీవితం అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో వారిద్దరికీ పుట్టిన కూతురూ అంధురాలే కావడంతో ఎంతో కుంగిపోయారా తల్లిదండ్రులు. తమ బిడ్డలా కళ్లు కనిపించని వారికి ఏదైనా చేయాలనుకున్నారు. స్నేహితుల సాయంతో 2010లో గిర్మాజిపేటలో ‘లూయిస్‌ ఆదర్శ అంధుల పాఠశాల’ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచీ భార్యాభర్తలిద్దరూ పాఠశాల నిర్వహణ చూసుకుంటూ అంధులకు అండగా నిలిచారు. కొవిడ్‌ మహమ్మారితో కుమారస్వామి కన్నుమూశాడు. భర్త పోయిన దుఃఖాన్ని దిగమింగుకొని కల్యాణి ఈ పాఠశాల నిర్వహణ బాధ్యత తీసుకుంది. తన సంపాదనతోపాటు దాతల సాయం తీసుకుంటూ బడిని నడుపుతోంది. పదో తరగతి వరకూ ఉన్న ఈ బడిలో 25 మంది అంధులున్నారు. చదువుతో పాటూ  భోజనమూ, వసతీ అన్నీ ఉచితంగానే ఇస్తూ పై చదువులు చదవడానికి వీలైనంత సాయం చేస్తోంది ఈ బడి.


పుస్తకాలపైన ఆసక్తి పెంచాలనీ...

పుస్తకాలు చదివితే వచ్చే లాభాల గురించి చాలామందే చెబుతుంటారు. కానీ వరంగల్‌కు చెందిన ఉపాధ్యాయుడు టీవీ అశోక్‌కుమార్‌ మాత్రం చెప్పడమే కాదు, ఆ మాటను ఆచరణలోనూ చూపడానికి తనవంతు చిన్న ప్రయత్నమూ చేస్తున్నాడు. ‘ప్రేరణ’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టి మురికివాడల్లోని పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు మొబైల్‌ వ్యాన్‌ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ‘చదవడం మంచి అలవాటు అని తెలిసినా... అందుకు సరైన అవకాశమే లేకపోతే ఎలా’ అన్న సందేహంతో పుట్టింది ఈ మొబైల్‌ గ్రంథాలయం. ప్రభుత్వ పాఠశాలలూ, మురికివాడలూ, పల్లెలూ ఎంచుకుంటూ సాయంత్రాల్లో, సెలవుదినాల్లో ఈ పుస్తకాల వ్యాన్‌ బయలుదేరి పిల్లల దగ్గరికే వెళ్తుంది. అందులో పిల్లలు ఇష్టపడే నీతి కథలూ... గాంధీజీ, వివేకానంద, అబ్దుల్‌ కలాం ఇలా మహనీయుల జీవిత చరిత్రలూ... సైన్స్‌ ప్రయోగ అంశాలూ, మెదడుకు పదును పెట్టే పజిళ్ల పుస్తకాలూ.. ఇలా అన్ని రకాలవీ అందుబాటులో ఉంటాయి. పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అశోక్‌ వారికి కాసేపు వివరిస్తుంటాడు. పిల్లల్ని ప్రోత్సహించడానికి చాక్లెట్లూ, బిస్కెట్ల లాంటివి కూడా ఇస్తాడు. ఈ మొబైల్‌ గ్రంథాలయం ఇప్పటి వరకూ వందకుపైగా పాఠశాలలకూ, ఓరుగల్లులోని అనేక మురికివాడలకూ వెళ్లింది. ఈ కార్యక్రమంతోపాటు అశోక్‌కుమార్‌ 25 పాఠశాలలను ఎంపిక చేసుకొని సుమారు
రూ.2 లక్షల విలువైన పుస్తకాలను ఉచితంగా అందించాడు.

గుండు పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..