పేద పిల్లలకు పెద్ద సహాయం

సమాజంలో ఎంతోమంది పిల్లలు ఆర్థికంగా బాగాలేక... అవకాశాలు రాక చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు బాల్య వివాహాలే శాపంగా మారుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పేద పిల్లలకు కొందరు అండగా నిలుస్తూ..

Updated : 09 Jan 2022 01:05 IST

పేద పిల్లలకు పెద్ద సహాయం

సమాజంలో ఎంతోమంది పిల్లలు ఆర్థికంగా బాగాలేక... అవకాశాలు రాక చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు బాల్య వివాహాలే శాపంగా మారుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పేద పిల్లలకు కొందరు అండగా నిలుస్తూ.. వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు.  


రెండు వేల మంది పిల్లలకు ‘సాయం’

కోల్‌కతాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సుబ్రతా బోస్‌ 2014లో ఓ ప్రాజెక్టు నిమిత్తం సమీపంలోని తంటిపర అనే గ్రామానికి వెళ్లాడు. అక్కడ కూలీ పని చేసే వ్యక్తి తన కుమారుడి ఉన్నత చదువుకు సాయం చేయాలని కోరడంతో.. అతడి ప్రోగ్రెస్‌ రిపోర్టును పరిశీలించాడు. మార్కులు బాగానే రావడంతో కొంత డబ్బు అందించాడు. అప్పుడే బోస్‌కు ఓ ఆలోచన వచ్చింది. ప్రతిభ ఉండీ, ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేకపోతున్న పిల్లలకు అండగా నిలవాలని మరో ఆరుగురు స్నేహితులతో కలిసి ‘సయం భరతా రూరల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌’ను స్థాపించాడు. అదే గ్రామంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి 8, 9, 10 తరగతులు చదివే 85 మంది పిల్లలకు ఆంగ్లం, గణితం, సైన్స్‌ నిపుణులతో ప్రతి రోజూ ఉదయం పాఠాలు చెప్పించడం ప్రారంభించారు. అలా చదువుకున్న చాలామంది దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు కూడా. తమ ఫౌండేషన్‌లో చదువుకున్న వారు భవిష్యత్తులో మరో విద్యార్థికి సాయం చేయడం లేదా స్వచ్ఛందంగా పాఠాలు చెప్పాలనేది నిర్వాహకుల షరతు. ఆ మేరకు కొందరు పూర్వ విద్యార్థులు ప్రస్తుతం 15 మంది పిల్లలకు అండగా నిలుస్తున్నారు. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని మూడు కేంద్రాలు, ఒక రిసోర్స్‌ సెంటర్‌లో 11 మంది టీచర్లూ, 8 మంది పూర్వ విద్యార్థులూ మెంటార్లుగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు చుట్టుపక్కల 12 గ్రామాలకు చెందిన దాదాపు రెండు వేల మందికి ఫౌండేషన్‌ సాయం అందించింది. పిల్లలకు కేవలం చదువే కాకుండా స్వయం ఉపాధి పొందేలా హస్తకళలూ, అల్లికలూ, కుట్లూ తదితర వర్క్‌షాపులూ నిర్వహిస్తున్నారు.


నిరుపేదలకు అన్నీ తానై...

నిరాదరణకు గురవుతున్న కొందరు పిల్లలు అడుక్కోవడం, బాల కార్మికులుగా మారుతుండటం చూసి సునీల్‌ జోస్‌ చలించిపోయాడు. రాజస్థాన్‌ రాష్ట్రం అజ్‌మేర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడైన ఆయన నిరుపేద చిన్నారుల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఉద్ధాన్‌ సొసైటీ పేరిట కొందరు స్నేహితులతో కలిసి 50 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాడు. అక్కడితో వదిలేయకుండా వారి కోసం ప్రత్యేకంగా ఓ వ్యాన్‌ కూడా సమకూర్చాడు. ఉదయాన్నే వ్యాన్‌ ఆ చిన్నారులు ఉండే మురికివాడల్లోని ఇళ్ల దగ్గరకు వెళ్లి వారిని పాఠశాలలకు తీసుకెళ్తుంది. సాయంత్రం ఆ వ్యాన్‌ మళ్లీ పిల్లలను ఎక్కించుకొని... జోస్‌ ఇంటి దగ్గర దిగబెడుతుంది. ఆయన వారికి ట్యూషన్‌ చెప్పి రాత్రి భోజనం ఏర్పాటు చేస్తాడు. తిండితోపాటు ఆ పిల్లలకు అవసరమైన దుస్తులు, స్టేషనరీ తదితర ఖర్చంతా సొంతంగానే భరిస్తున్నాడు. సొసైటీ ఆధ్వర్యంలో నలుగురు ఉపాధ్యాయులు పేద, అనాథ పిల్లలను గుర్తించి వారికి విద్య అందించడంతోపాటు వ్యక్తిగత బాగోగులు చూస్తుంటారు. ఇందుకోసం వారు తమ విధులు ముగిసిన తర్వాత.. నిత్యం రెండు గంటలు కేటాయిస్తుండటం గమనార్హం. అంతేకాదు.. ఓ వైద్య నిపుణుడు కూడా నిరంతరం విద్యార్థుల ఆరోగ్య విషయాలను పర్యవేక్షిస్తుంటాడు.


అభాగ్యులకు అండగా...

భిక్షాటన చేసే చిన్నారులకు మంచి భవిష్యత్తు అందించే ప్రయత్నం చేస్తోందో వృద్ధ జంట. గుజరాత్‌కు చెందిన జయంతి పాటిల్‌, అరుణ దంపతులు పదిహేనేళ్లుగా వీధుల్లో యాచిస్తున్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతో పాటు వారికి పౌష్టికాహారం, వసతి కల్పిస్తున్నారు. ఉద్యోగులైన వారిద్దరూ రిటైర్‌మెంట్‌ తర్వాత సమయాన్ని సమాజానికే కేటాయించాలనుకున్నారు. ఒకరోజు కారులో వెళ్తున్న పాటిల్‌ మాసిన జుట్ట్టూ, చిరిగిన దుస్తులతో భిక్షమెత్తుకుంటున్న ఓ చిన్నారిని చూశాడు. అలాంటి పిల్లలకు ఒకరోజు కడుపు నింపితే సరిపోదనీ, చదువు చెప్పిస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడగలదనీ ఆలోచించాడు. తన ఆలోచనకు భార్య కూడా సరేననడంతో సమీపంలోని మురికివాడలకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ప్రారంభించారు. కానీ, భిక్షాటన మాన్పించి తమ పిల్లలను చదివించేందుకు వారు అంగీకరించలేదు. విద్యతో పాటు దుస్తులూ, భోజనం, పుస్తకాలూ, వసతీ.. అన్నీ తామే సమకూరుస్తామని చెప్పి మొదటి ఏడాది 45 మందిని బడిలో చేర్పించారు. దాతల సహకారంతో ఏటా రూ.20 లక్షలు వెచ్చిస్తూ.. ఇప్పటివరకూ దాదాపు 500 మందికిపైగా చదువు చెప్పించారు. పిల్లలను చదివిస్తూనే.. పెళ్ళిళ్ళూ ఫంక్షన్లలో మిగిలిపోయిన పదార్థాలనూ సేకరించి, అభాగ్యుల ఆకలి తీరుస్తున్నారీ దంపతులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..