సేవకు కదిలిన రక్షకభటులు
పోలీసులంటే... దొంగల్ని పట్టుకోవడం, శాంతిభద్రతల్ని కాపాడటం మాత్రమే కాదు అవసరమైతే సామాజిక సేవ చేసేందుకు కూడా ముందుండాలని అంటున్నారు ఈ రక్షకభటులు. ఇంతకీ వీళ్లేం చేస్తున్నారంటే...
ప్రమాదం జరిగితే కాపాడతారు
హైవేల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ. దాన్ని గుర్తించిన మహారాష్ట్ర హైవే అడిషనల్ డైరెక్టర్ జనరల్ భూషణ్ ఉపాధ్యాయ్ ‘మృత్యుంజయ్ దూత్’ పేరుతో ప్రత్యేక రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం థానే, రాయ్‌గఢ్, నాగ్‌పూర్, పుణె హైవేలలో ఉండే ఈ సిబ్బంది రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులకు ప్రాథమిక చికిత్స చేసి అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మూడు నెలల్లోనే వెయ్యిమందికి పైగా దూతలకు శిక్షణ ఇచ్చామనీ వాళ్లు ఇప్పటివరకూ 280 మందిని కాపాడారనీ చెబుతారు భూషణ్. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే గాయపడిన వారిని గంటలోపు ఆసుపత్రికి తీసుకెళ్లగలిగితే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిసినా చాలామంది పోలీసు కేసు అవుతుందనే భయంతో కాపాడేందుకు ముందుకు రారు. హైవేల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువ. దీన్ని గుర్తించాకే ఈ మృత్యుంజయ దూత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది పోలీసు యంత్రాంగం. ఇందుకోసం స్థానికుల్నీ, హైవే చుట్టుపక్కల ఉండే పెట్రోల్బంకులూ దాభాలూ దుకాణాల్లో పనిచేసేవారినీ ఎంచుకుని వాళ్లకు ప్రాథమిక చికిత్స చేయడంలో పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి బృందాలుగా ఏర్పాటు చేశారు. ఎన్జీఓల సాయంతో ప్రతి బృందానికీ ఫస్ట్ఎయిడ్కిట్తోపాటూ, ఓ స్ట్రెచర్‌ను ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స చేసి అంబులెన్స్‌కు ఫోన్‌చేసి ఆసుపత్రికి తరలించడం వీళ్ల పని. ఇది సేవా కార్యక్రమమే అయినా.. సిబ్బంది పనితీరు బట్టి వీళ్లకు సర్టిఫికెట్లూ, అవార్డులూ కూడా ఉంటాయట.
గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు
గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు తక్కువే. ఈ పరిస్థితి ఝార్ఖండ్‌లోని జామ్తారా జిల్లా నాలాలోనూ ఉంది. నేరాలు ఎక్కువగా జరిగే ఆ ప్రాంతంలో కొన్నాళ్లక్రితం డిప్యూటీ కమిషనర్ ఫైజ్ అక్ అహ్మద్ ముంతాజ్ పర్యటించినప్పుడు స్థానికుల్లో ఒకరిద్దరు చదువుకునేందుకు పుస్తకాలు కావాలని అడిగారట. ఆ మాటలు విన్న ఫైజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్పు తెచ్చేందుకు అదే మంచి అవకాశం అనుకుని స్థానిక పంచాయతీ భవనంలో లైబ్రరీని ఏర్పాటు చేశారు. దానికి మంచి స్పందన రావడంతో ప్రభుత్వ నిధులూ, కార్పొరేట్ సంస్థలూ, ఎన్జీఓల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భవనాలూ, పంచాయతీ ఆఫీసులను గ్రంథాలయాలుగా మార్చేశారు. అలా ఇప్పుడు మొత్తంగా కలిపి 118 వరకూ గ్రంథాలయాలు ఉన్నాయంటారు ఇక్కడి పోలీసు అధికారులు. అక్కడితోనే తమ పని అయిపోయిందనుకోకుండా స్థానికంగా ఉండే ఇంజినీర్లూ, పోలీసు అధికారులూ, ఉన్నత విద్యావంతులూ ఈ గ్రంథాలయాలకు వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పడం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శిక్షణ ఇచ్చేలా కూడా చేస్తున్నారు. ఒక్కో లైబ్రరీకి అరవైవేల నుంచి రెండు లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని చెప్పే పోలీసులు ఇకపైనా వీలైనన్ని లైబ్రరీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
స్టేషన్‌నే మార్చేశారు
కరోనా కారణంగా స్కూళ్లు లేకపోవడంతో మురికివాడల్లో ఉండే పేద పిల్లలు చదువుకు దూరమయ్యారనేది నిజం. ఆ పిల్లల పరిస్థితి దిల్లీలోని ఆర్కేపురం పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రాజేశ్ శర్మను ఆలోచింపచేసింది. వాళ్లకోసం ఏదయినా చేయాలనుకున్న ఈ అధికారి బాగా ఆలోచించి తన పోలీస్‌స్టేషన్‌లోని ఓ భాగాన్ని లైబ్రరీగా, తరగతి గదిగా మార్చేశారు. ఈ లైబ్రరీలో స్మార్ట్క్లాస్రూమ్తోపాటూ ఇంటర్నెట్ సదుపాయం, దాదాపు నాలుగువేల అయిదువందల వరకూ పుస్తకాలూ, రకరకాల వార్తాపత్రికలూ... ఇలా ఎన్నింటినో ఏర్పాటు చేశారు. ఒకేసారి వందమంది కూర్చునేలా రూపొందించిన ఈ క్లాస్‌రూంలో పిల్లలు కేవలం చదువుకోవడం, రాసుకోవడమే కాకుండా అప్పుడప్పుడూ కౌన్సెలింగ్‌లోనూ పాల్గొంటారు. ‘మురికివాడల్లో ఉండే పిల్లలు నేరాలు చేసే అవకాశాలు ఎక్కువ. మాదకద్రవ్యాలకూ త్వరగా అలవాటు పడతారు. అలా కాకుండా వారి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఇలా చేశా’నంటారు రాజేశ్.
Advertisement
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్