ఆ కష్టం రాకూడదని...

పేదరికంలో ఉండే ఇబ్బందులు అనుభవించిన వాళ్లకే బాగా తెలుస్తాయి. ఆర్థికంగా ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడిన వీళ్లంతా తమలాగా ఇతరులు కష్టపడకూడదని చేతనైన సాయం చేస్తున్నారు.

Published : 15 Jan 2023 00:03 IST

ఆ కష్టం రాకూడదని...

పేదరికంలో ఉండే ఇబ్బందులు అనుభవించిన వాళ్లకే బాగా తెలుస్తాయి. ఆర్థికంగా ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడిన వీళ్లంతా తమలాగా ఇతరులు కష్టపడకూడదని చేతనైన సాయం చేస్తున్నారు.

అందరికీ అన్నయ్య

కొందరు తల్లిదండ్రులకు- కూతుళ్ల పెళ్లిళ్లు చేయడం తలకు మించిన భారమవుతుంది. అయినా అప్పోసొప్పో చేసి ఆ బాధ్యతను నెరవేరుస్తూ ఉంటారు. అలాగే తన చెల్లికి పెళ్లి చేశాడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన బాల్‌రాజ్‌. ఆ సమయంలో పేద తల్లిదండ్రుల కష్టాలను గమనించిన అతను.. వీలైనంత మందికి
ఆ సమస్యల్ని దూరం చేయాలనుకున్నాడు. తను బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో చేరాక కొందరు స్నేహితులతో కలిసి ఓ బృందంగా ఏర్పడి ఆ ప్రాంతంలోని పేద ఆడపిల్లల అమ్మానాన్నలకు అండగా ఉంటున్నాడు. తనకొచ్చే జీతం, స్నేహితుల సాయంతో పదేళ్లుగా ఏడాదికి రెండుసార్లు వందలాది ఆడపిల్లలకు సామూహిక వివాహాలు జరిపిస్తున్నాడు. వారికి బంగారు తాళి, వెండి వస్తువులు, వంటసామానుతోపాటు- కొత్త జంట కాపురం పెట్టడానికి కావల్సిన దాదాపు వంద రకాల వస్తువుల్ని కానుకలుగా అందిస్తున్నాడు. ఎవరైనా తమ ఇంట్లో పెళ్లని సమాచారమందిస్తే వారికీ సాయపడుతుంటాడు బాల్‌రాజ్‌. అత్తారింటికెళ్లిన ఆడపిల్లలు ఆనందంగా, నిశ్చింతగా ఉండాలనే ఇదంతా చేస్తున్నానని చెబుతుంటాడు బాల్‌రాజ్‌.


సంతోషానికి చిరునామా

గురుకులం-  ఖుషియోంవాలా స్కూల్‌ (ఆనందాల బడి)... పేరు కొత్తగా ఉంది కదా. అందులో చెప్పే పాఠాలూ ఇంకా వైవిధ్యంగా ఉంటాయి. రోబోటిక్స్‌ నుంచి గార్డెనింగ్‌ వరకూ... థియేటర్‌ యాక్టింగ్‌ మొదలు హార్టీకల్చర్‌ దాకా విభిన్న అంశాల్లో అక్కడ పిల్లలకు శిక్షణ ఇస్తుంటారు. అదీ ఉచితంగా. చిన్నారులకు జీవన నైపుణ్యాలు నేర్పుతూ.. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా వాళ్లను తీర్చిదిద్దుతున్న ఈ బడి వెనక ఒక కథ ఉంది. కాన్పూర్‌కు చెందిన ఉద్దేశ్య సచన్‌ తండ్రి టైలర్‌. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు కట్టలేకపోవడంతో ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఉద్దేశ్యను స్కూల్‌ నుంచి బయటికి పంపేశారు. ఆ తర్వాత ఎలాగోలా చదువులు కొనసాగించినా... చిన్నతనంలో తనను బడి నుంచి వెళ్లగొట్టిన ఘటన ఉద్దేశ్య మనసులో అలాగే ఉండిపోయింది. పేద పిల్లలు అలాంటి అవమానాలు ఎదుర్కోకూడదని డిగ్రీ పూర్తయ్యాక ఓ ‘గురుకులాన్ని’ ప్రారంభించాడు. బడికి వెళ్లని పేద పిల్లలు..  వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడటానికి లైఫ్‌ స్కిల్స్‌ నేర్పించడం ఉద్దేశ్య లక్ష్యం. అందుకే అక్కడ ప్రత్యేకంగా సిలబస్‌, తరగతులవారీగా బోధన, రొటీన్‌ పరీక్షల వంటివేమీ ఉండవు. పిల్లల వయసూ, ఆసక్తిని బట్టి- వ్యవసాయం, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మ్యాథ్స్‌, అడ్వాన్స్‌డ్‌ క్రాఫ్ట్స్‌ వంటివన్నీ నేర్పిస్తున్నాడు. ఐదుగురు స్నేహితులతో కలిసి ఈ గురుకులాన్ని మూడేళ్లుగా నడిపిస్తున్న ఉద్దేశ్య ప్రస్తుతం 150 మంది విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూ తనకొచ్చే లక్షరూపాయల జీతాన్ని గురుకులానికి కేటాయించడంతోపాటు- ‘ఈచ్‌ వన్‌- ఎడాప్ట్‌ వన్‌’ పద్ధతిలో దాతల సాయం కూడా తీసుకుంటూ ఈ విద్యా సంస్థను నడిపిస్తున్నాడు ఉద్దేశ్య.


ఉచితంగా పెళ్లి బట్టలు

కేరళలోని కన్నూర్‌కి చెందిన సబితకి మధ్యతరగతి వాళ్ల కష్టాలేంటో బాగా తెలుసు. ఆ నేపథ్యం నుంచే వచ్చిన సబిత ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు నేర్చుకుని బొటిక్‌ ప్రారంభించింది. అక్కడికి వచ్చే కొందరు ఆడపిల్లలు తమ పెళ్లిళ్లకు లెహెంగాలూ, గాగ్రాలూ, డిజైనర్‌ చీరలూ- కొనుక్కోలేక, డిజైన్‌ చేయించుకోలేక ఇబ్బంది పడటం గమనించింది. పెళ్లి పీటలెక్కబోయే ప్రతి ఆడపిల్లా ఆ సమయంలో అందంగా ముస్తాబవ్వాలనీ, మంచి దుస్తులు ధరించాలనీ ఆశపడుతుంది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా వాటికి నోచుకోని అమ్మాయిలను దగ్గరగా చూసిన సబిత... అలాంటి వారికి పెళ్లి దుస్తులను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. తనింట్లోనే నడిపే బొటిక్‌ పక్కనే ఓ బ్రైడల్‌ స్టూడియోని ఏర్పాటు చేసింది. తన బొటిక్‌ ద్వారా వచ్చే ఆదాయంతోనే పలు రకాల లెహెంగాల్నీ, గాగ్రాల్నీ, చీరల్నీ డిజైన్‌ చేసి- పేద అమ్మాయిలు ఎవరైనా సరే వచ్చి వాటిని ఉచితంగా తీసుకెళ్లే ఏర్పాటు చేసింది. అంతేకాదు తన స్నేహితులూ, తోటి బొటిక్‌ నిర్వాహకులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. వారితో కలిసి దుస్తుల్ని సేకరించడం, డిజైన్‌ చేయడం మొదలుపెట్టింది. మూడేళ్లలో దాదాపు ఏడు వేల మంది ఆడపిల్లలకు
ఉచితంగా పెళ్లి బట్టలను అందించింది. దుస్తులతోపాటు మ్యాచింగ్‌ జ్యూవెలరీ, చెప్పులు, మేకప్‌ సామగ్రి, దుప్పట్లు, వంట పాత్రల్ని కూడా సబిత సమకూరుస్తుంటుంది. దూర ప్రాంతాల నుంచి ఎవరైనా అడిగితే.. కొరియర్‌ ద్వారా అవన్నీ పంపుతుంది. తన సేవ నచ్చి ఎవరైనా డబ్బులు ఇవ్వబోతే సబిత తీసుకోదు. బదులుగా పెళ్లికూతుళ్లకు దుస్తులు ఇవ్వమంటుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..