ఎల్‌కేజీ ఫీజులకీ రుణాలిస్తున్నారు!

పాపో బాబో చదివేది ఎల్‌కేజీయే అయినా... ఫీజు మాత్రం లక్షల్లోనే ఉంటోంది. కరోనా పుణ్యమాని ఒకప్పుడు రెండుమూడు టర్మ్‌లుగా కట్టమనే స్కూళ్లూ ఇప్పుడు ఒకేసారి చెల్లించమంటున్నాయి. ఒక్కసారిగా అంత డబ్బు ఎక్కడా దొరకదు కాబట్టి... తప్పనిసరై అధికవడ్డీకి అప్పుతీసుకోవాల్సిన పరిస్థితి సగటు మధ్యతరగతి జీవిది.

Published : 12 Jun 2022 01:12 IST

ఎల్‌కేజీ ఫీజులకీ రుణాలిస్తున్నారు!

పాపో బాబో చదివేది ఎల్‌కేజీయే అయినా... ఫీజు మాత్రం లక్షల్లోనే ఉంటోంది. కరోనా పుణ్యమాని ఒకప్పుడు రెండుమూడు టర్మ్‌లుగా కట్టమనే స్కూళ్లూ ఇప్పుడు ఒకేసారి చెల్లించమంటున్నాయి. ఒక్కసారిగా అంత డబ్బు ఎక్కడా దొరకదు కాబట్టి... తప్పనిసరై అధికవడ్డీకి అప్పుతీసుకోవాల్సిన పరిస్థితి సగటు మధ్యతరగతి జీవిది. అలాంటి వేళ... ఏ వడ్డీ లేకుండా ఎవరన్నా రుణమిస్తామంటే, మన వీలునిబట్టి నెలసరి వాయిదాలతో చెల్లిస్తే చాలునంటే... ఆ మాట మనసుకెంత చల్లగా అనిపిస్తుంది! ఈ రెండు స్టార్టప్‌లు అదే చేస్తున్నాయి.

స్టార్టప్‌లు... కొన్ని రంగాల్లో

విప్లవాలే సృష్టిస్తున్నాయి. పేటీఎమ్‌ అన్న స్టార్టప్పే లేకుంటే... మొబైల్‌లోని ఒక్క మీట నొక్కుడుతో వేల రూపాయలు చెల్లించే వీలు ఉండేది కాదు. స్విగ్గీ,  జొమాటో వంటివి రాకుంటే ఇష్టమైన హోటళ్ల నుంచి కావాల్సిన ఆహారం నిమిషాల్లో గుమ్మంలోకి వచ్చే అవకాశమే లేదు. అదే సాంకేతిక విప్లవాన్ని స్కూలు ఫీజుల విషయంలో తెచ్చాయి.

ఫైనాన్స్‌ పియర్‌, గ్రే క్వెస్ట్‌ అన్న స్టార్టప్‌లు. ఈ రెండింటి ద్వారా తెలుగురాష్ట్రాల నుంచి సుమారు నాలుగు లక్షలమంది విద్యార్థుల తల్లిదండ్రులు గత ఏడాది రుణాలు పొందారు. దాదాపు వెయ్యి ప్రైవేటు స్కూళ్లు ఈ స్టార్టప్‌లతో భాగస్వాములయ్యాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే... 30 లక్షలమంది తల్లిదండ్రులూ, ఆరువేల పాఠశాలలూ వీళ్లతో కలిసి నడుస్తున్నాయి. వీటిల్లో కార్పొరేట్‌ చెయిన్‌ స్కూళ్లే కాకుండా చిన్నపాటి ప్రైవేటు బడులూ ఉన్నాయి.

ఆకర్షణీయమైన ఆఫర్లు...

‘అప్పు లక్షల్లో ఉన్నా సరే... సున్నా వడ్డీ. ఏ ఆందోళనాలేకుండా చెల్లించేలా 12 నెలల వాయిదా కిస్తీ. ప్రాసెసింగ్‌ ఛార్జీలూ ఉండవు. పైగా మీరు రుణం తీసుకున్నందుకుగాను ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు! వాటితోపాటూ పిల్లలకి ఇష్టమైన వస్తువులన్నీ కొనేందుకు ప్రత్యేక రాయితీలు. రుణం తీసుకున్నవాళ్లకి ప్రమాదవశాత్తు ఏదైనా అయితే... 20 లక్షలదాకా బీమా వసతి’ - ఫైనాన్స్‌ పియర్‌, గ్రే క్వెస్ట్‌ సంస్థల ప్రకటనలు ఇలాగే ఉంటున్నాయి. ఈ రెండు స్టార్టప్‌ల పుట్టుక ముంబయిలోనే అయినా వీటికి హైదరాబాద్‌ సహా అరవై నగరాల్లో కార్యాలయాలున్నాయి. రెండింటి పనితీరూ ఇంచుమించు ఒకటే- పాఠశాలలతో ఒప్పందం చేసుకోవడం, వాళ్ల ద్వారా ఫీజులు కట్టడానికి వచ్చిన తల్లిదండ్రుల్ని సంప్రదించడం, వాళ్ల తరపున ఏడాదిమొత్తానికి కట్టాల్సిన ఫీజుల్ని బడికి చెల్లించడం... అంతే! ఆ తర్వాతి నెల నుంచి తల్లిదండ్రుల నుంచి సులువైన వాయిదా పద్ధతుల్లో రుణాన్ని వసూలు చేసుకుంటాయి. తొమ్మిదీ, పన్నెండూ నెలల ఈఎంఐల సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి.

10 వేల నుంచి ఆరు లక్షలదాకా ఎంతైనా సరే రుణాలు అందిస్తున్నాయి. అదీ ఒక్కరోజులోనే రుణాలను ఇచ్చేస్తున్నాయి.

ఇంతకీ వీళ్లకేమిటి లాభం?

ఈ సంస్థలు తమ రుణాలకి సంబంధించిన వడ్డీని తల్లిదండ్రుల నుంచి కాకుండా ఆయా విద్యా సంస్థల నుంచే తీసుకుంటున్నాయి. మరి ఆ విద్యా సంస్థలకి వీటివల్ల ప్రయోజనం ఏమిటీ అంటే... టర్మ్‌ ఫీజులుగా ఏడాదిలో రెండు మూడు దఫాలుగా వచ్చే డబ్బుని ఈ స్టార్టప్‌లు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఏకమొత్తంగా యాజమాన్యానికి ఇచ్చేస్తాయి. దాంతో తల్లిదండ్రులిచ్చే ఫీజులపైన ఆధారపడకుండా ఆ డబ్బుని బడి అభివృద్ధికీ సిబ్బంది జీతాలకీ నిశ్చింతగా వాడుకోవచ్చు. అన్నింటికన్నా... ఫీజులు ఎక్కువున్నాయన్న కారణంగా పేద, మధ్య తరగతివాళ్లు ఈ స్కూళ్లకి దూరం కారు. అన్ని వర్గాల రాకతో అడ్మిషన్‌లూ పెరుగుతాయి. అలా తమతో ఒప్పందం కుదుర్చుకున్న బడుల్లో ఇదివరకటి కంటే పాతిక నుంచి 35 శాతం దాకా అడ్మిషన్‌లు పెరిగాయంటున్నాయి ఫైనాన్స్‌ పియర్‌, గ్రే క్వెస్ట్‌ సంస్థలు.

ఫైనాన్స్‌ పియర్‌, గ్రేక్వెస్ట్‌ రెండూ 2017లోనే ప్రారంభమైనా... రుణ వితరణ విషయంలో ఫైనాన్స్‌ పియర్‌ ముందుంది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నవీశ్‌ రెడ్డి ఇందులో సీఓఓగా ఉంటున్నారు. నవీశ్‌ తనతోపాటు చదువుకున్న రోహిత్‌ గాజ్బియే(ప్రస్తుతం సీఈఓ), సునీత్‌ గాజ్బియే, దేవి ప్రసాద్‌ బరోల్‌(సీటీఓ)లతో కలిసి ఈ సంస్థని స్థాపించారు. మొదట అన్నిరకాల రుణాలూ ఇస్తూ వచ్చిన ఈ సంస్థ ఓ సర్వే నిర్వహిస్తుండగా... స్కూలు ఫీజులు కట్టడంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిశాయట. దాంతో పూర్తిగా స్కూలు ఫీజులకి రుణాలివ్వడంపైనే దృష్టిపెట్టారు.  గత నాలుగేళ్లలో ఈ సంస్థ 22 లక్షలమంది విద్యార్థులకి రుణాలు అందించింది. తెలుగు రాష్ట్రాల్లో నారాయణ విద్యా సంస్థలు, మౌంట్‌ లిటెరా జీ స్కూలు, శ్రీ గాయత్రి ఇన్‌స్టిట్యూట్స్‌, శివాశివానీ గ్రూపు పాఠశాలల్లో విద్యా రుణాలిస్తున్నారు. గ్రేక్వెస్ట్‌ సంస్థని ముంబయికి చెందిన రిషబ్‌ మెహతా స్థాపించారు. ముందు నుంచీ స్కూలు ఫీజుల కోసం రుణాలను ఇస్తూ వచ్చిన ఈ స్టార్టప్‌ 10 కోట్ల రూపాయల దాకా ఫండింగ్‌ కూడా సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోని ఆర్కిడ్స్‌ స్కూల్స్‌, యూరో స్కూల్‌, పొదార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌తో కలిసి ఈ సంస్థ పనిచేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..