లాక్‌డౌన్‌లోనూ చదువులు ఆగలేదు!
కొవిడ్‌పైన పోరాటంలో వైద్య సిబ్బంది, పోలీసులూ, పారిశుద్ధ్య కార్మికులూ ప్రత్యక్షంగా పాల్గొంటే... దాని ప్రభావం పిల్లల చదువులపైన పడకుండా ఉపాధ్యాయులు పరోక్ష పోరాటం చేశారు. లాక్డౌన్ నుంచి ఇప్పటివరకూ తమ విద్యార్థుల చదువులు నిరంతరాయంగా కొనసాగేలా చూశారీ టీచర్లు.
బడి తలుపులు మూసుకోలేదు!
దేశంలో ఇంకా పాఠశాలలు తెరుచుకోని రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. 2020 మార్చి నుంచీ ఇక్కడ పాఠశాలలు మూతపడ్డాయి. చాలా చోట్ల ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నా, ఫోన్ సిగ్నల్స్ లేని మారుమూల పల్లెలూ, గిరిజన గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. అలాంటిదే పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని జోబా అత్పారా గిరిజన గ్రామం. అక్కడ ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి దీప్ నారాయణ్ నాయక్ ఒక్కరే టీచర్. మొదటిదశ ఉద్ధృతి తగ్గాక ఆయన గ్రామానికి వచ్చి చూసినపుడు పిల్లలంతా ఖాళీగా తిరగడం గమనించారు. వీరి తల్లిదండ్రుల్లో వలస కూలీలు ఎక్కువ. బడికి దూరమైతే తల్లిదండ్రులు తమతోపాటు పిల్లల్నీ తీసుకుపోతారనీ, తద్వారా చదువులకు పూర్తిగా దూరమవుతారనీ అర్థం చేసుకున్న నాయక్... తల్లిదండ్రులతో మాట్లాడి వీధుల్లోనే పాఠాలు చెబుతున్నారు. ఓ ప్రధాన వీధి- దానికి ఆనుకునే ఉండే ఓ చిన్న వీధిలో విద్యార్థులంతా ఇంటి అరుగులమీద కూర్చొని చదువుకుంటారు. ఇళ్ల గోడలమీద బ్లాక్‌బోర్డులు ఏర్పాటుచేశారు. విద్యార్థులు సామాజిక దూరం పాటిస్తూనే వీటిపైన రాస్తూ నేర్చుకునేలా వాటి మధ్య ఎడం పాటించారు. బెంగాలీ, హిందీ, ఇంగ్లిష్, లెక్కలు, సైన్స్... అన్ని సబ్జెక్టులూ నాయక్ ఒక్కరే నేర్పుతున్నారు. రెండో దశ ఉద్ధృతి సమయంలో తప్పించి ఏడాదిగా ఇక్కడ చదువులు కొనసాగుతూనే ఉండటం విశేషం. చుట్టపక్కల గ్రామాల్లో ప్రజల్ని వ్యాక్సిన్ వేసుకునే దిశగానూ ప్రోత్సహిస్తున్నారు నాయక్.
ఇల్లు వదిలి బడికి చేరి...
కరోనా మహమ్మారిని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా గతేడాది మార్చిలో లాక్డౌన్ విధించాక చాలామంది వలస కూలీలూ, చిరు వ్యాపారులూ, తాత్కాలిక ఉద్యోగులూ మెల్లగా సొంత ఊళ్లకు చేరుకున్నారు. కానీ ఉత్తరాఖండ్‌కు చెందిన ఉపాధ్యాయుడు కల్యాణ్ మన్కోటి తన ఇల్లు వదిలి 35 కి.మీ. దూరంలోని తాను పనిచేస్తున్న ఊరికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. రాబోయే కొద్ది నెలల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో... ఏం జరిగినా విద్యార్థుల చదువులకు మాత్రం ఆటంకం కలగకూడదనుకున్నారు కల్యాణ్. అందుకని బాగేశ్వర్ జిల్లాలో తానుండే అల్మోరా పట్టణం నుంచి తాను పనిచేసే చనోలీ గ్రామానికి కుమార్తెను తోడుగా తీసుకుని బయలుదేరారు. దీని కోసం జిల్లా కలెక్టరుతోపాటు, పోలీసు, వైద్య, విద్యా శాఖల అనుమతుల్నీ తీసుకున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి దాకా అదే గ్రామంలో ఉంటున్నారు. ఆ పర్వత ప్రాంత గ్రామంలో ఫోన్ సిగ్నల్స్ రావు. దాంతో ఆన్లైన్ చదువులకు అవకాశం లేదు. అందుకే ఊరి బయట పొలాల్లో పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు కల్యాణ్. ఏడో తరగతి వరకూ 75 మంది విద్యార్థులు ఉండే ఆ స్కూల్ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి పూర్వ విద్యార్థుల సహకారమూ తీసుకున్నారు. ఈ సమయంలో చదువులతోపాటు సంస్కృతిని తెలుసుకోవడం, జానపద గేయాలూ, సంగీతమూ నేర్చుకున్నారు విద్యార్థులు. ఈ విషయం గురించి ఆనోటా ఈనోటా తెలుసుకున్న మరికొందరు ఉపాధ్యాయులూ కల్యాణ్‌ను అనుసరించడం విశేషం.
పిల్లలకో యూట్యూబ్ ఛానెల్...
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా, మోదకురిచ్చి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.లలిత... చిన్నప్పట్నుంచీ భౌతికశాస్త్రం అంటే ఆమెకు బాగా ఆసక్తి. ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తిచేసి టీచర్ కావాలన్న తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. బోధనలో ప్రయోగాలకు ప్రాధాన్యం ఇస్తారు లలిత. ఆ విధంగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతేడాది లాక్డౌన్ మొదలైనపుడు పిల్లల చదువులు కొనసాగేందుకు తన వంతుగా ఏదైనా చేయాలని ఆలోచించి... యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ‘ఇంట్లోనే ఉండటంతో చాలా సమయం దొరికింది. దాంతో వీడియోలు తీయడం, ఎడిట్ చేయడం తెలుసుకున్నాను. యూట్యూబ్ ఛానెల్ పెట్టి 9-12 తరగతుల విద్యార్థులకు విద్యుత్, అయస్కాంతం, సెమీకండక్టర్లు, న్యూక్లియర్ ఫిజిక్స్... లాంటి పలు అంశాలపైన పాఠాల్ని అప్లోడ్ చేశాను. మాదిరి ప్రశ్నాపత్రాలకు జవాబులు వివరించేదాన్ని. ఇదివరకే స్కూల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌ని ఏర్పాటుచేయడంతో ఇవన్నీ సులభంగా చేయగలిగాను. ప్రభుత్వం టీవీలోనూ పాఠాలు మొదలుపెట్టినపుడు నా పాఠాలు కొనసాగిస్తూనే... పిల్లలు ఎంతవరకూ నేర్చుకుంటున్నారో ఫోన్‌చేసి తెలుసుకునేదాన్ని. సందేహాల్ని తీర్చడంలో సాయపడమని తోటి ఉపాధ్యాయులకీ చెప్పేదాన్ని’ అంటారు లలిత. మధ్యాహ్న భోజనానికి పాఠశాల ఆవరణలో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయల్ని వాడటంతోపాటు స్కూల్‌ని పలు విధాలుగా ఆదర్శంగా తీర్చిదిద్దడంతో ఈ ఏడాది జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల్లో ఒకరిగా నిలిచారు లలిత.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్