అమ్మ నుంచే నేర్చుకున్నాం

ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు అంటారు. మాతృదినోత్సవం సందర్భంగా- అలాంటి అమ్మ నుంచి తామేం నేర్చుకున్నారో చెబుతున్నారు ఈ హీరోలు.

Updated : 08 May 2022 06:12 IST

అమ్మ నుంచే నేర్చుకున్నాం

ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు అంటారు. మాతృదినోత్సవం సందర్భంగా- అలాంటి అమ్మ నుంచి తామేం నేర్చుకున్నారో చెబుతున్నారు ఈ హీరోలు.


మోస్ట్‌ మోడ్రన్‌ అల్లు అర్జున్‌

మా అమ్మ నిర్మల బేసిక్‌గా దేనికీ సర్‌ప్రైజ్‌ అవ్వదు. అది మంచి విషయమైనా చెడు విషయమైనా ఒకేలా తీసుకుంటుంది. అంతేకాదు, చాలామంది అమ్మలు తమ కొడుకులు ఆర్మీలోకి వెళతానంటే ఒప్పుకోరు. మా అమ్మ మాత్రం నేను వెళితే చూడాలనుకుంది. అందుకే ఆ నేపథ్యంలో వచ్చిన ‘నా పేరు సూర్య’ తనకి చాలా ఇష్టం. నన్ను ఎవరైనా మోస్ట్‌ మోడ్రన్‌ పర్సన్‌ ఎవరూ అని అడిగితే మా అమ్మ పేరే చెబుతా. మోడ్రన్‌ అంటే ఆధునికంగా తయారవ్వడమో, ఇంగ్లిష్‌ మాట్లాడటమో కాదు. తన ఆలోచనా విధానం చాలా మోడ్రన్‌గా ఉంటుందని అలా అంటుంటా.


అమ్మ వల్లే...రానా

మా అమ్మ లక్ష్మి చాలా స్ట్రాంగ్‌. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఆ లక్షణాలే నేనూ అలవర్చుకున్నా. ‘అరణ్య’ షూటింగ్‌ సమయంలో కంటి చికిత్సకోసం వెళితే నాకు పుట్టుకతోనే హైబీపీ అని తెలిసింది. అలానే కిడ్నీలు చెడిపోయాయనీ ఉన్నపళంగా చికిత్స మొదలుపెట్టకపోతే ఆర్నెల్లలో స్ట్రోక్‌ రావడమో లేదా ప్రాణాలు పోవడమో జరగొచ్చనీ డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆహారపుటలవాట్లన్నీ మార్చేసి చికిత్స తీసుకున్నా. ఆ సమయంలో నేనెక్కడా భయపడకుండా బాధపడకుండా మా కుటుంబ సభ్యులకీ, స్నేహితులకీ ధైర్యం చెప్పేవాడిని. అమ్మలా స్ట్రాంగ్‌గా ఉండబట్టే చాలా త్వరగా కోలుకుని మామూలు మనిషినయ్యా.


ముందుచూపు ఎక్కువ ఎన్టీఆర్‌

మా అమ్మ శాలినికి ముందుచూపు ఎక్కువ. కెమెరా ముందు భయంలేకుండా ఉండాలని చిన్నప్పుడు బలవంతంగా కూచిపూడి క్లాసులకు పంపేది.వెళ్లనని మారాం చేసేవాడిని. తర్వాత్తర్వాత ఆసక్తి కలిగి దాదాపు పన్నెండేళ్లపాటు కూచిపూడి సాధన చేసి ఎన్నో ప్రదర్శనలిచ్చా. ఇప్పుడు తెరమీద అంతబాగా డాన్స్‌ చేయడానికి ఆ అనుభవమే పనికొస్తోంది. అంతేకాదు, అమ్మకి పరిణతీ ఎక్కువే. నా చుట్టూ ఉన్న పరిస్థితుల్నీ తను పడే ఇబ్బందుల్నీ చూపిస్తూనే పెంచింది. నేను నటుడిగా నిలదొక్కుకోవడానికీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడానికీ అవన్నీ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
 


సాయంలో ముందు...విజయ్‌ దేవరకొండ

మాది చాలా సామాన్య కుటుంబం. అమ్మ కూడా పనిచేస్తేనే మా కుటుంబం నడిచేది. అందుకే నన్నూ తమ్ముణ్నీ ఆరో ఏటనే హాస్టల్‌లో చేర్పించారు. పదోతరగతి వరకూ ఇంటికీ, అమ్మకీ దూరంగానే పెరిగాం. అమ్మా నేనూ వారానికి రెండుసార్లు ఉత్తరాలు రాసుకునేవాళ్లం. అందులో అమ్మ మా కుటుంబ పరిస్థితిని వివరిస్తూ మేం అక్కడ ఎందుకు ఉండాలో పరోక్షంగా చెబుతుండేది. ‘తమ్ముడికి నువ్వే అమ్మవీ...’ అంటూ బాధ్యతగా ఉండటం అలవర్చింది. ఇప్పటికీ ఆ లెటర్లు అప్పుడప్పుడూ చదువుకుంటుంది. అమ్మ ఎవరికైనా సాయం చేయడంలో ముందుంటుంది. ఆ స్ఫూర్తితోనే లాక్‌డౌన్‌లో సేవా కార్యక్రమాలు చేశాను. ఇప్పటికీ సాయం కోరి ఎవరొచ్చినా ‘వాళ్లకి ఏదో ఒకటి చేసి పెట్టరా పాపం’ అంటుంది.


మధ్యతరగతి మనిషి నాని

మా అమ్మ విజయలక్ష్మి ఫార్మసిస్ట్‌గా పనిచేసి ఈ మధ్యనే రిటైర్‌ అయింది. నా చిన్నప్పట్నుంచీ ఇప్పటివరకూ ఓ మధ్యతరగతి ఇల్లాలిగా ఉండటానికే ఇష్టపడుతుంది అమ్మ. నేను హీరోనయ్యాక వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోమని ఎంత బలవంతం చేసినా వినిపించుకోలేదు. అంతేకాదు, ఆర్టీసీ బస్సులోనే ఫార్మసీకి వెళ్లేది. తను రిటైర్‌ అయ్యి ఇంట్లో ఉంటుంటే ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. అలానే శాంతం, సహనం విషయంలో నాది అమ్మ పోలికే. చిన్నప్పట్నుంచీ తనని చూస్తూ పెరగడంతో ఆ గుణాలు నాకూ అలవడ్డాయి. అందుకే దర్శకులు ఎన్నిసార్లు రీటేక్‌ చెప్పినా విసుక్కోకుండా ఓపిగ్గా చేస్తా. మా జున్నుగాడిని కూడా అలాగేే పెంచమని చెబుతుంటా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..