టొమాటో కూరల టేస్టే వేరు!
ఇంట్లో టొమాటోలు ఉన్నాయంటే... ఇతర కూరగాయలతో కలిపి వండేస్తుంటాం. లేదంటే పప్పూ /పచ్చడీ చేస్తాం కదూ. అవేవీ కాకుండా ఈసారి అచ్చంగా టొమాటోలతోనే ఇలాంటి కూరల్ని వండితే సరి.
ఇంట్లో టొమాటోలు ఉన్నాయంటే... ఇతర కూరగాయలతో కలిపి వండేస్తుంటాం. లేదంటే పప్పూ /పచ్చడీ చేస్తాం కదూ. అవేవీ కాకుండా ఈసారి అచ్చంగా టొమాటోలతోనే ఇలాంటి కూరల్ని వండితే సరి. అన్నం, రోటీ, పులావ్... దేనికైనా మంచి కాంబినేషన్ అవుతాయి.
టొమాటో ఇగురు
కావలసినవి: టొమాటో ముక్కలు: పెద్ద కప్పు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, సెనగపప్పు: చెంచా, మినప్పప్పు: చెంచా, జీలకర్ర: అరచెంచా, ఆవాలు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, పసుపు: పావుచెంచా, చింతపండు గుజ్జు: పావుకప్పు, బెల్లం తరుగు: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట.
మసాలా కోసం: మెంతులు: పావుచెంచా, దనియాలు: పావుచెంచా, జీలకర్ర: టేబుల్‌స్పూను, మినప్పప్పు: చెంచా, సెనగపప్పు: చెంచా, ఎండుమిర్చి: ఎనిమిది, కరివేపాకు రెబ్బలు: రెండు, ఇంగువ: చిటికెడు.
తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి... మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి వేయించుకుని ఆ తరువాత మిక్సీలో పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద మళ్లీ కడాయిని పెట్టి నూనె వేసి సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేయించుకుని కరివేపాకు, ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి వేగాక టొమాటో ముక్కలు, మూడుచెంచాల మసాలాపొడి, మిగిలిన పదార్థాలు వేసి బాగా కలిపి అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు స్టవ్‌ని కట్టేయాలి.
కుర్మా
కావలసినవి: టొమాటోలు: మూడు (పెద్దవి), నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు: చెంచా, ఆవాలు: చెంచా, దాల్చినచెక్క: చిన్న ముక్క, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, తాజా కొబ్బరితురుము: పావుకప్పు, పుట్నాలపప్పు: టేబుల్‌స్పూను, జీడిపప్పు: ఐదు, సోంపు: చెంచా, దనియాలు: చెంచా, పచ్చిమిర్చి: రెండు.
తయారీ విధానం: ముందుగా కొబ్బరితురుము, పుట్నాలపప్పు, జీడిపప్పు, సోంపు, దనియాలు, పచ్చిమిర్చి తరుగును మిక్సీలో తీసుకుని పావుకప్పు నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, దాల్చినచెక్క వేయించుకుని ఉల్లిపాయముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. అవీ వేగాక టొమాటోముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టాలి. టొమాటో ముక్కలు మగ్గుతున్నప్పుడు చేసిపెట్టుకున్న మసాలా, కప్పు నీళ్లు పోసి మరోసారి కలపాలి. కూర దగ్గరకు అవుతున్నప్పుడు కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి. ఇది అన్నంలోకే కాదు, రోటీల్లోకీ బాగుంటుంది.
సాలన్
కావలసినవి: టొమాటోలు: ఐదు, పల్లీలు: పావుకప్పు, నువ్వులు: పావుకప్పు, జీలకర్ర: చెంచా, దనియాలు: రెండు చెంచాలు, ఎండుకొబ్బరి ముక్కలు: పావుకప్పు, దాల్చినచెక్క: చిన్నముక్క, లవంగాలు: మూడు, యాలకులు: రెండు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, పసుపు: పావుచెంచా, కారం: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, చింతపండు రసం: పావుకప్పు, నూనె: పావుకప్పు.
తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి పల్లీలను వేసి వేయించాలి. అవి కాస్త వేగుతున్నప్పుడు నువ్వులు, జీలకర్ర, దనియాలు, కొబ్బరిముక్కలు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు కూడా వేయించుకుని దింపేయాలి. వీటి వేడి చల్లారాక అన్నింటినీ మిక్సీలో వేసుకుని అరకప్పు నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేయించుకుని అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, తగినంత ఉప్పు, కారం, చేసిపెట్టుకున్న మసాలా, పావుకప్పు నీళ్లు, చింతపండు రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు టొమాటోల్ని కడిగి తొడిమ భాగాన్ని తీసేసి... కూరలో వేసి కలిపి మూత పెట్టాలి. టొమాటోలు బాగా మగ్గాక దింపేయాలి. ఇది పులావ్, బిర్యానీకి మంచి కాంబినేషన్.
దాభా టొమాటో మసాలా
కావలసినవి: టొమాటో ముక్కలు: రెండు కప్పులు, ఉల్లిపాయముక్కలు: కప్పు, టొమాటో గుజ్జు: కప్పు, నూనె: పావుకప్పు, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి ముద్ద: చెంచా, పసుపు: పావుచెంచా, దనియాలపొడి: చెంచా, జీలకర్రపొడి: చెంచా, కారం: రెండు చెంచాలు, గరంమసాలా: చెంచా, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట.
తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయించుకుని ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద వేసి కలపాలి. ఉల్లిపాయముక్కలు వేగాయనుకున్నాక టొమాటో గుజ్జు, పసుపు, దనియాలపొడి, జీలకర్రపొడి, కారం, గరంమసాలా, ఉప్పు వేసి మరోసారి కలపాలి. టొమాటో గుజ్జు ఉడుకుతున్నప్పుడు టొమాటో ముక్కలు వేసి ఓసారి కలిపి మూత పెట్టాలి. టొమాటో ముక్కలు ఉడికి, కూర దగ్గరకు అవుతున్నప్పుడు కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్‌గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం